Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

అతులిత బంధం

గతసంచికలో ఏం జరిగిందంటే...http://www.gotelugu.com/issue152/431/telugu-serials/atulitabandham/atulitabandham/

ఆ సాయంత్రం మెస్ లో టీ తాగి వచ్చేసరికి ఆగకుండా మ్రోగుతున్న మొబైల్ ని  ఆన్సర్ చేసింది ఐశ్వర్య ‘ఇదెవరి నంబరో’ అనుకుంటూ...
“హలో” అనగానే అవతలనుంచి...

“హాయ్ ఐశ్వర్యా, నేను కార్తీక్ ని...” అని వినిపించింది.

ఒక్క క్షణం ఉలిక్కి పడి, వెంటనే తేరుకుంటూ, “హా, చెప్పండి...” అంది మెల్లగా.

“పార్టీకి తీసుకు వెళతాను... రెడీ గా ఉంటారా?”

“నిన్ననే చెప్పాను కదండీ, నాకు ఇంటరెస్ట్ లేదు...”

“ఐశూ... ప్లీజ్...”

అతను అలా చనువుగా ‘ఐశూ’ అంటుంటే ఐశ్వర్యకు ఒళ్ళు జలదరించింది... ఒక రకమైన మైకం ఆవహించింది...

“ఏమిటీ చనువు?” అంది చిరుకోపంతో..

“మరి మీరు నా అందమైన ఫ్రెండ్ కదా... అలా పిలవాలనిపించింది...”

“నేను... నేను ఫోన్ పెట్టేస్తున్నాను....”

“ఓహ్, నో... పెట్టేయకు ఐశూ... నన్ను మాట్లాడనీ... ఆరోజు రూప గదిలో నిన్ను చూడగానే ఫ్లాట్ అయిపోయా... ఇంతవరకూ నా జీవితంలో ఎవరినీ చూసి ఇంతగా ఇంప్రెస్ అవలేదు నేను... నా క్లాస్ మేట్స్, కొలీగ్స్... చాలా మంది ఆడపిల్లలనే చూసాను... కాని వాళ్ళల్లో ఎవరికీ లేని స్నిగ్ధత్వం నీలో ఉంది...  అందుకే... అందుకే... నీతో స్నేహం పెంచుకోవాలనే ఇంతగా తాపత్రయ పడుతున్నాను... ఐ లైక్ యు... గెట్ రెడీ... ఐ విల్ పిక్ యు అప్... ప్లీజ్...” మార్దవంగా అతను చెబుతూ ఉంటే ఇదివరకెన్నడూ ఎరగని ఒక అపురూపమైన  భావన కలిగింది ఐశ్వర్యకు...ఒక పురుషుడు ఒక సౌందర్య రాశిగా తనను గుర్తించి, తన అందాన్ని శ్లాఘిస్తున్నాడు... తన ప్రమేయం లేకుండానే ఆమె బుగ్గలు ఎర్రని గులాబీలయ్యాయి. కనులు అరమోడ్పులయ్యాయి.

“మర్చిపోకు... ఒక్క అరగంటలో వస్తున్నాను... మంచి డ్రెస్ వేసుకు రెడీ కావాలి... సరేనా?” అతని కాల్ డిస్కనెక్ట్ అయింది... ఐశ్వర్య మనసు మాత్రం కనెక్ట్ అయిపోయింది.

***

తన పుట్టినరోజుకు కొనుక్కున్న ఆకాశనీలం మీద వెండి జరీ వర్క్ చేసిన డ్రెస్ వేసుకుంది ఐశ్వర్య.  తమ రూము బాల్కనీలోని కుండీలలో పెంచుతున్న గులాబీలలో పసుపు రంగు గులాబీ పువ్వు ను త్రుంచి జడలో పెట్టుకుంది. కాస్త ప్రత్యేకంగా తయారై, క్రిందికి వచ్చి గేటు దగ్గర నిలబడింది అతని కోసం ఎదురు చూస్తూ...

‘అతను రమ్మనగానే వెళ్లిపోవటమేనా? నిన్ననేగా మధూతో మగాళ్ళతో స్నేహమేమిటి అన్నావు?’ బుద్ధి మందలించటం మొదలు పెట్టింది.
‘చస్ స్నేహితుడు ఇప్పుడు అతను నాకు. స్నేహితుడయ్యాక అతడు మనవాడే...’ మనసు మెత్తగా బుద్ధిని మందలించింది.
మరో పది నిమిషాల్లో కార్తీక్ కారు మెత్తగా వచ్చి గేటు ముందు ఆగింది. అతను దిగి ఫ్రంట్ డోర్ తెరిచాడు ఎప్పటిలాగే... అయితే ఎప్పటిలా ముడుచుకుపోకుండా విరిసిన దరహాసంతో ఠీవి గా కారెక్కి కూర్చుంది ఐశ్వర్య.

“ఐశూ... యు ఆర్ లుకింగ్ లైక్ యాన్ యాంజిల్...” ప్రశంసగా చూసాడు కార్తీక్ డ్రైవ్ చేస్తూనే ...

“థాంక్స్ అండీ...” అంది స్వల్పంగా సిగ్గు పడుతూ...

“నిజంగా నువ్వు చాలా బావుంటావు తెలుసా? ఐ లైక్ దిస్ గ్రేస్!” అన్నాడు కన్నార్పకుండా ఆమెనే చూస్తూ...

“ప్లీజ్, కాస్త రోడ్డు కూడా చూడండి... అనవసరమైన ప్రమాదాలు జరిగిపోగలవు!” చిరునవ్వుతో హెచ్చరించింది ఐశ్వర్య.

“నిజంగా థాంక్స్, నా స్నేహాన్ని, ఆహ్వానాన్ని కూడా మన్నించి నాతో వస్తున్నందుకు...” మనస్ఫూర్తిగా చెప్పాడు కార్తీక్.

“నాకే ఆశ్చర్యంగా ఉంది అసలు మీ స్నేహాన్ని ఎలా అంగీకరించగలిగానా అని!” స్వగతంగా అన్నది ఐశ్వర్య.

“అదేమిటి ఐశూ? నేను అంత పాపిష్టి వాడినా?” చిన్నబుచ్చుకున్నాడు కార్తీక్.

“అహ  అదికాదు... అంతరాలని చెరిపివేసేదే అసలైన స్నేహం అని నాకు తెలుసు... కాని... మీ ఆహ్వానమో, నా మనసు చేసిన చిత్రమో కాని, నేను మీతో వస్తున్నాను... అదే నాకు ఆశ్చర్యంగా ఉంది అంటున్నాను... అంతే...”

ఈసారి ఏమీ మాట్లాడలేదు కార్తీక్. మౌనంగా డ్రైవ్ చేస్తూ ఉండిపోయాడు.

“అయామ్ సారీ, మిమ్మల్ని నొప్పించా?”

“నో..నో... నాటెటాల్, ఇన్ ఫాక్ట్, మనసులో అనిపించిన భావనను ఉన్నదున్నట్టు చెప్పటం నాకు నచ్చింది...కొన్ని భావనలకు లాజిక్కులూ, కారణాలు ఉండవు కదా?” చిరునవ్వుతో అన్నాడు కార్తీక్.

కార్తీక్ ఎప్పుడూ ఒక పక్కగా పెదవిని వంచి నవ్వుతాడు... ఆ వంపు, నవ్వినప్పుడు గడ్డం మీద పడిన చిరు సొట్ట ముచ్చటగా అనిపించింది ఐశ్వర్యకి.

‘హోటల్ వినోదిని’ పోర్టికో లో కారు ఆగగానే, అక్కడి స్టాఫ్ కారును హాండ్ ఓవర్ చేసుకున్నారు.

“రా ఐశూ... మన వాళ్ళు అంతా వచ్చేసి ఉంటారు...” కారు దిగి అటుగా వచ్చి ఫ్రంట్ డోర్ తెరిచాడు. యువరాణీ లా దిగింది ఐశ్వర్య... మనసులో మాత్రం ‘పాలెస్ లా ఉంది... ఇలాంటి హోటల్ ని ఇంతవరకూ ఎప్పుడూ చూడలేదు...’ అనుకుంది.

గ్లాస్ డోర్స్ తెరవగానే పరిమళ భరితమై చుట్టేసింది శీతలపవనం. సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ వాతావరణాన్ని ఫీల్ అవుతూ, కార్పెట్ మీద అడుగులు మెత్తగా పడుతూ ఉండగా, ఆ లాంజ్ లోని మెత్తని సోఫాలను, ప్రతీ కార్నర్ లోనూ అందంగా అమర్చిన తాజా రోజాపూల అలంకరణను, సన్నగా వినిపిస్తున్న పాశ్చాత్య సంగీతాన్ని గమనిస్తూ,  షాండిలియర్ దీపాల వెలుగులో నవవధువులా మెరిసిపోతున్న ఆ హోటల్ అందాలను పరికిస్తూ, అతన్ని అనుసరించింది, ఐశ్వర్య.

‘అభినయ’ రెస్టారెంట్ వైపు నడిచాడు కార్తీక్. అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్న కొలీగ్స్, మిత్ర బృందం ఒక పదిమంది వరకూ ఉన్నారు.
“ఏమిటిది కార్తీక్ ఇంత ఆలస్యమా? మా కళ్ళు కాయలు కాస్తున్నాయి...” అన్నది ఓ అమ్మాయి. చామన చాయకు ఒక ఛాయ తక్కువ ఉన్నా చాలా యాక్టివ్ గా ఉన్నది ఆమె.

“గంట నుంచీ పడిగాపులు పడి ఉన్నాం బాస్...” నవ్వాడు మరో అతను.

“హే, హూ ఈజ్ దిస్ డాల్?” సంభ్రమంగా ఐశ్వర్యను చూస్తూ అడిగింది మరో తెల్లని అమ్మాయి. మిగిలిన అబ్బాయిలంతా బహుశా కార్తీక్  టీం మేట్స్ కాబోలు,  నవ్వుతూ చూస్తున్నారు.

“దిస్ ఈజ్ ఐశ్వర్య మై ఫ్రెండ్... ఐశ్వర్యా, దీజ్ ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్... ఈమె పేరు సోఫియా. ఇదిగో ఈమె నేహా... ఇతను సాహిల్... హి ఈజ్ లక్కీ... దిస్ గై ఈజ్ అమర్...” పరిచయాలు కావించాడు కార్తీక్.

“ఇదిగో, ఈ సాహిల్ కి ఒక ప్రాజెక్ట్ నిమిత్తం అమెరికా పంపిస్తోంది మా కంపెనీ... ఆ సందర్భంగా నేను వీళ్ళందరికీ డిన్నర్ ఏర్పాటు చేసాను...” వివరించాక, అప్పటికే రిజర్వ్ చేసుకున్న పెద్ద టేబుల్ చుట్టూ అందరూ కూర్చున్నారు.

అందరినీ ఛాయిస్ అడిగి ఎవరికి  కావలసినవి, వాళ్లకి ఆర్డర్ చేయసాగాడు కార్తీక్... ఐశ్వర్య వైపు తిరిగి, “నీకు ఏం కావాలి ఐశూ?” అని అడిగాడు ఆప్యాయంగా.

“నీ ఛాయిసే నా ఛాయిస్ కార్తీక్...” ముందే తన టీం మేట్స్ ముందు బహువచనం వాడవద్దు అన్న కార్తీక్  మాటలను గుర్తు తెచ్చుకుంటూ చిరునవ్వుతో చెప్పింది, ఐశ్వర్య.

“దట్స్ గుడ్...” అని చెబుతూ, తనకీ, ఐశ్వర్యకి రోటీలు, వెజ్ కోఫ్తా కర్రీ, నూడిల్స్ ఆర్డర్ చేసాడు కార్తీక్. సోఫియా, నేహా ఇద్దరూ ఐశ్వర్యతో చాలా స్నేహంగా మాట్లాడసాగారు. కబుర్ల మధ్య డిన్నర్ చివరి అంశానికి వచ్చారు. ఎవరికి  కావాల్సిన డెజర్ట్ వారికి ఆర్డర్ ఇచ్చాడు కార్తీక్. తనకీ ఐశ్వర్యకీ మాత్రం కాఫీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చాడు.

ఆ చల్లని వాతావరణంలో, ప్రశాంతమైన ఆ పరిసరాలలో కార్తీక్ పక్కనే కూర్చుని చల్లగా ఆ ఐస్ క్రీమ్ తినటం, ఆ ఫ్లేవర్... అలాగే ఐశ్వర్య మనసులో నిలిచిపోయాయి మధుర క్షణాలై... ఎప్పటికీ ఈ నిమిషాన్ని మాత్రం మరువలేను... అనుకుంది మనసులో... ఒక చిన్న మమతాంకురం మొలకెత్తింది హృదయ క్షేత్రంలో...

బిల్ చెల్లించి, “సో, యు ఆర్ లీవింగ్ టుమారో... సాహిల్.. మిస్సింగ్ యు... మూడునెలలు ఎంతలో గడుస్తాయిలే... హోమ్ సిక్ నెస్ పెట్టుకోక, చక్కగా ఎంజాయ్ చేసి రా... హావ్ అ వెరీ నైస్ ట్రిప్...” అని సాహిల్ ని హగ్ చేసుకున్నాడు కార్తీక్... మిగిలిన వాళ్లకి చేయి ఊపి, ఐశ్వర్యతో, “వెళదామా?” అన్నాడు... తలూపి, మిగిలిన వారికి తానూ చేయూపి, అతనితో బయలుదేరింది, ఐశ్వర్య. తిరిగి వస్తున్నప్పుడు కారులో ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు కాని, మౌనమే మధుర సంగీతమై ఇద్దరి మనసులనూ అలరించినట్టు తోచింది...హాస్టల్  గేటు దగ్గర కారాపి, ఆమె దిగబోతుంటే, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, ఒక సారి నొక్కి వదిలేసాడు కార్తీక్. ఆ స్పర్శ తనకెన్నో చెప్పినట్టే  అనిపించింది ఐశ్వర్యకి. చేయి ఊపి గేటు తెరచుకుని లోపలికి  వెళ్ళిపోయింది.

***

ఆ రాత్రికి మధుబాల అక్కలు ఇద్దరూ కూడా వచ్చారు. వారం రోజుల తర్వాత, అనంత రామయ్యను డిశ్చార్జ్ చేసారు.  మొదటి సారి అటాక్ రావటం వల్ల మరో సారి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా బీపీ కంట్రోల్ లో ఉండాలని చెప్పారు డాక్టర్లు.

“గిరీ, నీ పెళ్ళితో పాటుగా మధూకి కూడా చేసేస్తే... నా బాధ్యత తీరుతుందేమో అనిపిస్తోందిరా...” భార్య స్పూనుతో తాగిస్తున్న జావను తాగుతూ అన్నాడు అనంతరామయ్య.

“వద్దు నాన్నా, చెల్లాయిని చదువుకోనీండి. ఉద్యోగం చేస్తే దానికి కాస్త ఆర్ధిక స్వాతంత్ర్యం ఉంటుంది. లేకపోతే మా బతుకుల్లాగే తయారవుతుంది...” చెప్పింది మధూ పెద్దక్క వైజయంతి మాల.

“అవున్నాన్నా, అది చదువుల సరస్వతి... దాని భవిష్యత్తును పాడు చేయవద్దు...” చంటి దాన్ని ఒడిలోకి తీసుకుంటూ తానూ అక్కను బలపరచింది చారుశీల.

అప్పటికే వారం రోజుల పైగా కాలేజీ మానేయటంతో అక్కలతో పాటుగా తానూ సిటీకి బయలుదేరింది మధుబాల, తల్లికీ, అన్నకూ వెయ్యి జాగ్రత్తలు చెప్పి. నానమ్మ కాళ్ళకు నమస్కరించి ఆశీర్వచనాలు తీసుకుంది.

***

హాస్టల్ రూమ్ కి రాగానే ఐశ్వర్యలో వచ్చిన మార్పు మధుబాలకు సుస్పష్టంగా గోచరించింది.  గదిలోకి రాగానే ఖరీదైన సెంటు వాసన నాసికాపుటాలకు సోకింది.  ఐశ్వర్య బెడ్ పక్కన  అర నిండా ఖరీదైన కాస్మెటిక్స్ ఉండటం గమనించింది. బట్టల స్టాండు మీద విప్పిన కొత్త డ్రెస్ ఉంది. ఏం జరిగి ఉంటుందో లీలగా అర్థమౌతుంటే, కించిత్ భయం కలిగింది మధుబాలకు. ఆదమరచి నిదురపోతున్న ఐశ్వర్య ముఖంలోని వింత కాంతిని చూస్తుంటే ముచ్చటగా అనిపించింది.

అలికిడికి కనులు విప్పిన ఐశ్వర్య   “ఎప్పుడు వచ్చావే?”  అంది, లేచి  గట్టిగా కౌగలించుకుంటూ. “ఇప్పుడే కాని, ఇదేంటే తలుపులు దగ్గరికి వేసి మరీ పడుకున్నావు? లోపల గడియ పెట్టుకోవద్దూ?” అంది మధు బాగ్ లోని వస్తువులన్నీ తీసి సర్దుతూ.

“ఉదయమే లేచానే. కాసేపు చదువుకొని మళ్ళీ పడుకున్నాను. ఈరోజు టెస్ట్ ఉంది మనకి. నువ్వు రాయక్కరలేదులే... ఆ ఇంతకీ మీ నాన్నగారికి ఎలా ఉందే?”

“ఫర్లేదు ఐశూ... గండం తప్పింది ప్రస్తుతానికి. నా గురించి దిగులు పడుతున్నారు...”

“ఊ...” నిట్టూర్చింది ఐశ్వర్య, తన తల్లిదండ్రులు మనసులో మెదలగా.

“ఏమిటే ఇవన్నీ? ఆ డ్రెస్ ఎప్పుడు కొన్నావు? అసలు డబ్బులు ఎక్కడివీ?” అడిగింది మధుబాల.

“అదంతా పెద్ద కథ. నువ్వు ఫ్రెష్ అయి రా... టిఫిన్ తింటూ చెప్పుకుందాం... నేను ఆల్రెడీ స్నానం కూడా చేసేసాను...” అంది ఐశ్వర్య.
తలపంకించి, బట్టలు తీసుకొని, రెస్ట్ రూమ్ వైపు నడిచింది మధుబాల.

***

“సో... కార్తీక్ ని ప్రేమిస్తున్నావా? అతనే అవన్నీ నీకు ప్రెజెంట్ చేసాడా?”

“అవును మధూ... కార్తీక్ లో ఏదో ఆకర్షణ ఉంది... అది నన్ను అతడి వైపు లాగేస్తోంది... నేను తట్టుకోలేక  అటే వెళ్ళిపోతున్నాను...”
“కానీ... ఐశూ... నీ చదువు?”

“చదువుకేమైందే, చక్కగా చదువుకుంటాను...”

“వివాహం విద్య నాశాయ - అన్నారు పెద్దలు... నీకు తెలియదా?”

మధూ అన్న మాటలు మెదడుకు అందగానే ఫక్కున నవ్వింది ఐశ్వర్య.

“అంటే ఏమిటి? ఇప్పుడు నేను కార్తీక్ ని పెళ్ళి చేసేసుకుంటానని అనుకుంటున్నావా?”

“ఇప్పుడు కాకపోతే వచ్చే ఏడాదైనా చేసుకుంటావు కదా... ప్రేమలో పడితే ఊబిలో పడినట్టే అని ఎక్కడో చదివాన్లే... మనసంతా అతడి మీదనే ఉంటే, చదువు అటకెక్కించేస్తావని నా భయం... మన అంతస్తులు ఎలాంటివో, నీకూ తెలుసు కదా... పెళ్ళి అనేది జీవితంలో స్థిరపడినాక చేసుకుంటేనే మంచిది...”

“అమ్మా మధుబాలా, నా ప్రేమకూ చదువుకూ ఎలాంటి సంబంధమూ లేదు... నేను చక్కగా శ్రద్ధ పెట్టి చదువుకుంటాను. నా గోల్స్ నేను మరచిపోను...మంచి ఉద్యోగం సంపాదించుకుంటాను.  సరేనా? తర్వాత మరో విషయం... అసలు నేను పెళ్ళే చేసుకోను!”
మధుబాల కళ్ళు పెద్దవయ్యాయి.

“ఏమిటీ, పెళ్ళి చేసుకోవా? అదేమిటే?”

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్