Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> జీవన సమరం

jeevanasamaram

"తాతయ్యా! ఇక్కడున్నారా! మీ కోసం ఇల్లంత వెతికి వస్తున్నాం. బామ్మ  షాపింగ్ కెళ్ళింది. రాను కనీసం 4,5 గంటలు పట్టొచ్చు, మీరేంటీ ఇక్కడ?" అంటూ నా దగ్గరకొచ్చారు, శైలేష్ , సుమ --నా కొడుకు పిల్లలిద్దరూ. నేనంటే వాళ్ళకు చాలా ప్రేమ.

"హమ్మయ్య! బామ్మ బయటి కెళ్ళిందా? "అంటూ ఊపిరి పీల్చుకుంటున్న నన్ను చూసి " తాతయ్యా! మీరేమీ అనుకోకపోతే ఒక మాట అడుగుతాం, బామ్మంటే మీకెందుకింత భయమ. ఏనాడూ బామ్మ మాటకు ఎదురు చెప్పరు? ఆమె ఏదంటే అదే అంటారూ..."కుతూహలంగా అడిగింది మనవరాలు.

వారలా అడగ్గానే నా గత జీవితం అంతా నా కళ్ళ ముందు సినిమా రీలులా తిరిగింది. మా అమ్మా నాన్న గారూ, అక్కలు బాబాయిలూ అంతా గుర్తొచ్చి బాధతో నా కళ్ళ నుంచీ నీరు కారసాగింది. " సో సారీ! తాత గారూ! మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాం" అంటూ ఇద్దరూ నా చేతులు పట్టుకున్నారు.

నేను కాస్తంత గొంతు సవరించుకుని " లేదర్రా! అప్పుడప్పుడూ ఇలా గతం నాకు గుర్తొచ్చి బాధేస్తుంటుంది. మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటూనే ఉన్నాన్న్రా ! ఇలా కూర్చోండి! చెప్తాను.అంటూ మొదలెట్టాను. గతం గుర్తు చేసుకుంటూ.

--‘ అమ్మా నాన్నా నాకు పెట్టిన పేరు అనంత సుందర రామయ్య. మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. మా ఇంట్లో ఇలా నేను ఒక్కడ్నే మద్రాసు వెళ్ళి చదువుకున్న వాడ్ని.ఈ రోజు నా జీవితం ఇంత అశాంతిగా ఉండటానికి కారణం నేను మోజు పడి , అమ్మా నాన్నల మనస్సుకు కష్టం కలిగించి , అందం ఊబిలో దిగి, ప్రేమ ప్రవాహంలో కొట్టుకు పోయి, చేసుకున్న నా వివాహ ఫలితమే. నేను మద్రాసు లో చదువుతుండగానే గుండు సూదులు తయారు చేసే కంపెనీ లో ఉద్యోగం వచ్చింది. చదువు అర్ధాంతరంగా ముగించి దాన్లో చేరాను, స్నేహితుల సలహాతో. మంచి ఉద్యోగిగా పేరు కూడా తెచ్చుకున్నాను. మా మేనేజరు దృష్టిలో పడ్డాను. ఆ తర్వాత ఆయన కూతురి వలలోనూ పడ్డాను. అదీ నా స్వయం కృతమే! ఆ రోజు నాకింకా బాగా గుర్తే! ఆ రోజున మానేజర్ మోహన రావు నన్ను తన  ఇంటికి ఆహ్వానించాడు. పై అధికారి పిలిచినందున  బావుండదని వెళ్ళాను.

" రా రా సుందర్! కూర్చో " అంటూ స్వాగతించాడు.

ఆయన భార్యను పిలిచి " చూడు ! చూడామణీ! ఇతడు మన వైపు వాడే ! ఆంధ్రుడు. పేరు సుందరం, మన కంపెనీ లో కొత్తగా ఉద్యోగంలో చేరాడు." అని పరిచయం చేశాడు.

"చిన్న సవరణండీ! నా పూర్తి పేరు అనంత సుందర రామయ్య! మా ఇంట్లో అంతా సుందరం అని పిలవటాన నేను నా పూర్తి పేరు మరిచే పోయాను. ఇప్పుడు ఉద్యోగంలో చేరాక పూర్తి పేరు సంతకం పెట్టాల్సి రావటాన గుర్తుకు వస్తున్నది " అన్నాను ఏదో మాట్లాడాలి గనుక.

" భలే సరదా మనిషివోయ్! మా ఇంటి కొచ్చినందుకు చాలా సంతోషం! అప్పుడప్పుడూ వస్తుండు, మా అమ్మాయి ఏదో కొనాలని బయటికెళ్లింది" అంది ఆయన భార్య చూడామణి. కొంత సేపు పిచ్చా పాటీ మాట్లాడి వారిచ్చిన ఫల హారాలు సేవించి వెళ్ళాను.

ఒక ఆది వారం రోజు మానేజర్ గారి ఆహ్వానం మేరకు మళ్ళీ వారింటి  కెళ్ళాను. ఒక అందమైన సుందరాంగి తలుపు తీసే సరికి భయంగా "ఇది మేనేజర్ మోహన రావు గారి ఇల్లేనాండీ!" అని అడిగాను ఒక అడుగు వెనక్కేసి. అంద మైన  ఆరడుగుల నవ యువకుడ్ని ఎదురుగా చూసిన ఆ యువతి కూడా భయం గానే ," అవునండీ! మీరెవరు ?" అంది సిగ్గు పడుతూ.

" నన్నుసుందర రామయ్యంటార్లెండి. నేను మేనేజర్ మోహన రావు గారి ఆహ్వానం మేరకు వారి గృహాన్ని పావనం చేయను వచ్చాన్లెండి . వార్నికాస్త పిలుస్తారూ?" అన్నాను తమాషాగా నవ్వుతూ, నా నవ్వే నాకు మరింత అందం చేకూరుస్తుందం టారంతా.

నా నవ్వుకు తమాయించుకుని " అయ్యో! కాస్తేలా పిలుస్తామండీ! పూర్తిగానే పిలుస్తాను, కాస్తంత రావడం కుదరదు గాండీ!" అంటూ నాకు రిటాక్ట్ ఇచ్చి లోపలికి తుర్రుమంది ఆ నవ యువతి.

నా మాట నాకే అప్పగించినందుకు తడబడ్డాను. నెమలి కంఠం రంగు పట్టు పరికిణీ, లేత నీలం రంగు జాకెట్, ఆకాశం రంగు పమిట, బారెడు వాలు జడ ముందుకు వాలి, చివర బంగారు జడ కుచ్చులు మోకాల్ని తాకుతుండగా జడలో తురిమిన మల్లెలు ముందుకు చూసి ఫక్కున నవ్వి పలకరించగా నిరుత్తరుడనై చూస్తూ ఉండి పోయాను. ఆ యువతి నవ్వు నన్ను పడేసింది. అలా ఎంత సేపు ఉన్నానో కానీ, మేనేజర్ మోహన రావు గారు వచ్చి "ఏమోయ్! సుందరం! అలాగే నిలబడి పోయావ్ ! రారా లోపలికి."అంటూ ఆహ్వానించాక లోపలి కెళ్ళి కూర్చున్నాను ఒద్దిగ్గా.

ఇంతలో  రెండు వెండి గ్లాసులతో వచ్చిందా అందాల రాసి మళ్ళీ. "సుందరం! ఇదో ఈమే మా ఏకైక కుమార్తె ' సుందరి" అని పరిచయం చేశాడాయన. నా ఒళ్ళు ఒక్క మారు జలదరించింది.  ' ఏంటీ సుందరా!' అనుకున్నా లోలోపల.' అందానికి తగ్గ పేరు, నా పేరుకు జోడీ!" అని కూడా.

" తాగవోయ్! నిమ్మ మజ్జిగ. మా సుందరి మహ బాగా తయారు చేస్తుంది ఈ మజ్జిగ. ఎండలో పడి వచ్చావు గదోయ్ ! అందుకే చల్లని నిమ్మ మజ్జిగ " అంటూ గ్లాస్ అందించారు మోహనరావు గారు.

ఆ సుందరి వైపు తల వంచుకునే  దొంగ చూపులు చూస్తూ మజ్జిగ మెల్లగా  సిప్చేస్తున్న నాతో," ఏమోయ్! మజ్జిగ వేడిగా ఉందేంటి ! అలా సిప్ చేస్తున్నావ్ "అన్నారు మోహన రావు గారు. కిసుక్కున నవ్విందా సుందరి. ఆ నవ్వు నా మనస్సును మరింతగా దోచేసింది.

" లేదు లేదు సార్! చల్లగానే ఉన్నై" అంటూ గబ గబా ఒక్క గుటకలో తాగేసి గ్లాస్ అందించాను ఆమెకు. నవ్వుతూ గ్లాసులు  అందుకుని లోపలికి వెళ్ళింది సుందరి. ఆమె  వెనక్కు తిరగటంలో ఆమె బారు జడ గిర్రున తిరిగి నా ముఖానికి జడ కుప్పెలు తగిలాయి. ఆ స్పర్శకే నా ఒళ్ళు పులకరించింది.  చూడామణి బయటికి వచ్చి " ఏం నాయనా! మా సుందరి ఇబ్బందేం పెట్ట లేదుగా? కొంచెం చిలిపిదిలే. ఒక్కటే కావటాన కాస్త గారాబం అంతే, మరొక్క పది నిముషాల్లో వంటైపోతుంది. నీవూ, ఆయనా మాట్లాడుతుండండి." అంది కొంగుకు చేతులు తుడుచుకుంటూ.

"అదేం వద్దండీ! ప్రతి సారీ భోజనం అదీ వద్దు. ఊరికే రమ్మన్నారు గదాని వచ్చానంటే!" మొహమాటంగా అంటున్న నన్ను చూసి, "అదేంటోయ్! మనమంతా ఒక్కటేగా ఆంధ్రులం, అందరం కలిసి భోజనాలు చేస్తూ బోలెడన్ని కబుర్లు చెప్పుకోవచ్చు" అంది చూడామణి .

" రోజూ పిలవకుండా వారానికో మారే పిలుస్తూన్నామనేమోనే అమ్మా!" అంది సుందరి, నన్ను కవ్విస్తూన్నట్లు సుందరంగా నవ్వుతూ. ఇహ ఊరుకో తలచ లేదు నేను, మామూలు గానే నేను కాస్తంత హాస్య ప్రియుడ్ని " రోజూ ఒక్క పూట ఏ మాత్రం కుదరదు. రెండుపూటలానూ.."  అన్నను సీరియస్ గా. అంతా గల గలా నవ్వేశారు.

"ఓహో ఐతే వారాలకు ఎక్కువా వజ్రాలకు తక్కువానూ.."  అని సుందరి అనగా,

"కాదు కాదు" అతిధులకు ఎక్కువా  అభ్యాగతులకు తక్కువానూ.." అన్నాను,  చిన్న తనంలో మా బామ్మ దగ్గర నేర్చుకున్న సామెతలూ, తెలుగు పదాలూ గుర్తు చేసుకుంటూ.." బాబోయ్ బాగానే బాణాలు పరస్పరం విసురుకుంటున్నారే ! ఇహ నేం కాల క్షేపానికేం తక్కువ కాదులేవే సుందరీ! " అంది చూడా మణి. మెల్ల మెల్లగా పరస్పరం మా చూపులూ  నవ్వులూ, మాటల బాణాలూ ఎక్కువ కాసాగాయి. మమ్మల్ని చూస్తూ పెద్దలిద్దరూ గుంభనంగా నవ్వుకో సాగారు. ఆ నవ్వుల వెనక ఉన్న అసలు రహస్యం అప్పట్లో నాకు అర్ధమై చావలేదు. ఇదో ఇప్పుడిలా. ఒక్క నిట్టూర్పు విడిచాను వ్యర్ధంగా.

అలా మేమిద్దరం వారం వారం వాళ్ళింట్లోనే కలుస్తూ, పరస్పర ఆకర్షణకు లోనౌతుండగా, మా అమ్మా నాన్నాల వద్ద నుండీ 'వివాహం చేసుకోమనీ, అమ్మాయిలను  చూస్తున్నామనీ ఉత్తరాలు రాసాగాయి.' సుందరం! ఒక మారు వచ్చిపోరా! మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, నీ వివాహం జరిగితే మా బాధ్యత తీరుతుంది ' అని ఉత్తరాల మీద ఉత్తరాలు రాయగా రాయగా ,

"ఈవారం నేను మా ఊరు వెళుతున్నాను. రావట్లేదు సార్" అని ఆ ఆది వారం ఇంటికి ఆహ్వానించిన మోహన రావుతో చెప్పాను.

"అదేంటోయ్, ఏదైనా అత్యవసర కార్యమా ఏం?" అని అడిగాడాయన.

"ఔను సార్! మా వాళ్ళు  పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. మాది ఉమ్మడి కుటుంబం, మా ఇంట్లో  పెళ్ళికి నేనొ క్కడ్నే మిగిలి పోయాను, నా కంటే చిన్న వాళ్ళైన మా బాబాయ్ ల పిల్లలందరికీ కూడా పెళ్ళిళ్ళై కొందరికి పిల్లలు కూడానూ. నేనొక్కడ్నే చదివి ఉద్యోగానికై బయటికి వచ్చిన వాడ్ని, మా బాబాయ్ కొడుకొక్కడున్నాడు, నాకైతే వాడికీ చేసే స్తారు. అందుకే ఇంట్లో వారు చాలా తొందర చేస్తున్నారు. వెళ్ళక తప్పదు సార్! అందుకే ఒక వారం పాటు సెలవు మంజూరు చేయమని  మీకు సెలవు అర్జీ కూడా పంపాను. " అన్నాను ముఖ మాటంగా.

" చెప్పావు కాదేం! శలవుకేం కానీ, ఈ వారం మహాబలిపురం వెళ్ళాలనుకున్నాం గా! అమ్మాయి బాధ పడుతుందని అందుకూ.." అన్నా డాయన.

"ఔననుకోండీ ! కానీ మా నాయన గారు  పెళ్ళి సంబంధాల గురించీ, పిల్ల తల్లి దండ్రులను రమ్మని కోరారుట, తప్పదు సార్! మా నాయన గారి  మాట పోతే  బావుండదు. నేను వచ్చాక  మరో వారం వెళ్ళవచ్చు." అన్నాను మెల్లిగా.

" ముందు నీవు అమ్మాయితో మాట్లాడు. సాయంకాలం ఓ మారు ఇంటికిరా! సుందరికి చెప్పకుండా వెళితే అది నీవు వచ్చేవరకూ అన్నం కూడా ముట్టదోయ్ ! బహు పెంకిది." అని ఆయన నన్ను  ఇరికించాక నాంకిక తప్ప లేదు. ఆ రాత్రి వాళ్ళింటికి మోహన రావు గారే  వెంట పెట్టుకు వెళ్ళాడు ఆఫీస్ అయ్యాక.

"మన వాడు మానేజర్ ను బాగా తైర్లో ముంచాడురోయ్ .."

"కాకేం ఎర్రగా బుర్రగా ఉన్నాడాయె! ఈ మానేజర్ కు ఒక కూతురుండి ఉంటుంది , ఈ అప్పనెవురు వదులుకుంటారు?"

" ఐతే ఆయన కూరుత్ను ఈ అప్పకిచ్చి పెళ్ళి చేస్తారంటావా?"

" కావచ్చు, లేకపోతే వెంటపెట్టుకు వెళతాడా! మనుషుల్ని కసురుకునే ఈయన ఈ అప్పని దగ్గరకు తీయటం, వెనుక అదే రహస్యం " అని వెనుక నుంచీ తోటి ఉద్యోగులు అంటున్నమాటలు నా చెవిన పడకపోలేదు.

నా గుండేలో కలకలం రేగింది.' ఔను సుందరి చాలా అందగత్తె. మాట కారి, ఈయనేమో మా మానేజర్, ఈయనతో బంధుత్వం కుదిరితే నాకు మంచి ప్రెమోషన్ కూడా రావచ్చు, జీతం బాగా పెరగ వచ్చు. ఎవరో నాయన గారు కుదిర్చిన ముక్కూ మొహం  ఎరగని  పిల్లను చేసుకునే కంటే ఈ సుందరిని వీళ్ళు ఇస్తానంటే ఎందుకు చేసుకో రాదు? కానీ నా అదృష్టం ఎలా ఉందో, ఊరి కెళితే నాయన గారికి విషయం చెప్పాలి.' అనుకుంటూ వారింటికి వెళ్ళా ను.

"ఏమోయ్ ఏదో ఆలోచనలో ఉన్నట్లున్నావ్? ఇబ్బంది పెడుతున్నామా!" అంటూ ఇంట్లో అడుగు పెడుతూ అడిగాడు మోహనరావు.

" అదేం లేదు సార్!" అంటూ లోనికి వెళ్లాను. "చూడామణీ! అమ్మాయ్ సుందరీ!ఎవరొచ్చారో చూడండీ." అన్న మోహన రావు పిలుపుకు బయటికి వచ్చిన వారిద్దరూ ఆశ్చర్య పోయారు.

"అరే! సుందరం ! రావోయ్ రారా!"  అని చూడామణీ ,

" ఓహ్! మీరా!" అని సుందరి పలకరించగానే,

" నేను మీరానూ కాను, రాధనూ  కాను. కేవలం అనంత సుందర రామయ్యను " సీరియస్ గా అన్నాను. అంతా నవ్వేశారు.

“భలే నవ్విస్తారండీ మీరు" అంది సుందరి నవ్వుతూ. "ఏమ్మా! మద్రాసుకు రానే రాను..అంతా అరవ గోల తాత గారి ఊరెళ్ళి పోతానని మొరాయించావుగా! ఇప్పుడే మంటావ్?." అన్న మోహనరావుతో,

" నాకేం తెల్సు ఇక్కడ సుందర చతురుడున్నాడని" అంది సుందరి తమషాగా తల త్రిప్పి, చూపుల బాకులు నా మీదకు విసురుతూ, నయనానందంగా నవ్వుతూ. ఆ నవ్వు, ఆ చతురత  నన్నెక్కడికి తీసుకు పోతుందో తెలీని నేను మాత్రం హాయిగా మురిసి పోయాను.

ఎలాగైతేనేం నన్ను మా ఊరు వెళ్ళకుండా ఆపారు ఆ ముగ్గురూనూ. ఆ ఆది వారం అంతా కల్సి సరదాగా మహాబలిపురం వీక్షించను వెళ్ళాం.

ఈ యాత్ర మా మధ్య అదేదో తెల్సుకోలేని బంధాన్ని ఏర్పరచింది.

మండపాలు, గోపురాలు, లైట్ హౌస్, బిగ్ రాక్ వున్న ప్రాంతం. అవన్నీ చూసే సమయానికి అంతా అలసి పోయాం.

"అయ్యా! సుందరం! మేమిక నడవ లేం, మీరిద్దరూ వెళ్ళి చూసి రండి, మేమిక్కడే కూర్చుంటాం" అని పెద్ద వారిద్దరూ అక్కడి లైట్ హౌస్ వద్ద క్రిందనే కూర్చుండి పోయారు.

అక్కడి నుంచి నేను చెలరేగి పోయి సుందరికి పాండవ రథాలు, అతి సుందరమైన  సీ షోర్ టెంపుల్ చూపాను. అంతకు ముందు మా ఆఫీస్ స్టాఫ్ తో రెండు మార్లు వచ్చి ఉండటాన నాకవన్నీ కొట్టిన పిండే!." చూడు సుందరీ! ఇక్కడ ఈ విష్ణుమూర్తి దేవాలయం ప్రధానమైంది. పల్లవ రాజు ఈ దేవాలయాన్ని సముద్రం నుండి వచ్చే కోత నుండి శిలా సంపదని రక్షించడం కోసమే కాక విష్ణు ప్రీతి కోసం నిర్మించాడు. ఈ దేవాలయ నిర్మాణం జరిగాక సముద్ర కోత తగ్గిందని చరిత్ర కారులు అంటారు. ఇది ఇక్కడి ప్రసిధ్ధ మహిశ మర్దని మందిరం, చూడూ ఈ కృష్ణ మండప శిల్ప కళ ఎంత బావుందో! ఆ శిల్పుల శక్తి సామర్ధ్యాలు  అమోఘమైనవి కదూ!"  అంటూ సుందరికి అన్ని వివరించి చెప్పాను.

ఇద్దరూ పక్కపక్కనే నడుస్తూ ఆ శిల్ప సంపద గురించీ మాట్లాడుకుంటూ లైట్ హౌస్ దగ్గరి కొచ్చారు. సుందరి  మెట్లెక్కేప్పుడు ఆసరాగా నా చేయి పట్టుకో సాగింది. నాలో విద్యూత్ తరంగాలు ప్రవహించ సాగాయి. దూరం నుంచీ మా ఇద్దరినీ చూస్తూన్న మోహన రావు, చూడా మణీ ఏదో మాట్లాడుకోడం చూసాను. దగ్గరికి రాగానే " ఎంత బావుందయ్యా ! మీ జంట. మా దృష్టే తగిలేట్లుంది. " అంది చూడామణి.

"ఆగాగు, ముందు సుంద రం మనస్సు తెల్సుకోనీ" అని మెల్లిగా అన్నాడు మోహన రావు.

అందరం కల్సి, కబు ర్లాడుకూంటూ, జోక్స్ చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ఇంటి వద్ద నుంచీ చుడా మణి చేసి తెచ్చిన గారెలూ, లడ్డూలూ, పులి హోర కడుపు నిండా తిన్నాక," ఇహ బీచ్ ఒక్కటే మిగిలింది సార్! అది చూసేస్తే మనం మద్రాసు బయల్దేర వచ్చు, పొద్దు గూకే వరకూ ఉండటం ఎందుకూ!" అన్న నా మాటలతో అంతా లేచి, ఖాళీ ఐన సంచీలు భుజాలకు తగిలించుకుని నడుస్తూ మహా బలిపురం  బీచ్ వద్ద కెళ్ళాం. బీచ్ చాలా అందమైనది. సాయం కాలం చల్లగాలిని  ఆస్వాదిస్తూ అందరం కాసేపు నడిచి , అక్కడ దొరికే గవ్వలతో చేసిన వస్తువులు  సుందరి సలహా మేరకు చాలానే కొనుక్కుని, తిరుగు ప్రయాణమయ్యాం. 

ఆ మరుసటి  శుక్రవారం నా శలవు అర్జీ ఇవ్వను ఆఫీస్ రూంలో ఉన్న మోహన రావు గారిని కలిసేందుకు వెళ్ళాను. "రావోయ్ రా! కూర్చో ఏంటీ శలవు కోసమేనా!"

"అవును సార్! గత వారం వెళ్ళనందుకు మా వాళ్ళకు చాలా కోపం వచ్చే ఉంటుంది. ఈ వారమన్నావెళ్ళక తప్పదు. ఒక వారం పాటు శలవిస్తారా!" ఇబ్బందిగా చేతులు నులుముకుంటూ అడిగాను.

 "సేలవుదేముంది కానీ, మేమూ మా అమ్మాయి సుందరికి పెళ్ళి చేయాలను కుంటున్నామయ్యా! నీ ఎరికలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్దూ." అన్నాడు మా బాస్.  

" అయ్యో నాకేం తెలుస్తాయిసార్! ఎటూ మాఊరు వెళుతున్నాకదా! మావాళ్ళనడుగు తాను. మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. మా బాబాయ్ లూ అంతా ఒక ఇంట్లో లాగానే ఉంటాం, పక్క పక్కనే, ఇంకా మా నాయన గారి తరఫునా చాలా మంది బంధుబలగం ఉన్నారు. తప్పక అడుగుతాను సార్! సమాచారం సేకరించే వస్తాను, మరి నా వారం శలవు విషయం " అన్నాను మళ్ళీనీ.

 " అబ్బా శలవు శలవూ అంటూ పీక్కు తింటావేమయ్యా!! నీకెట్లా చెప్పాలో అర్ధం కావట్లేదయ్యా! అది సరే వారం కాక పోతే శలవు పది దినాలు తీసుకో! ముందుగా నీవు మా అమ్మాయి సుందరి  గురించీ నీ అభిప్రాయం చెప్పు." అని నిలదీశాడు .

" మీ అమ్మాయి కేమండీ అందమైనదీ, మాట కారీ, మంచి మనస్సు కలది. ఏకైక ముద్దుల బిడ్డ " అంటున్న నన్ను ఆపి,

" అవన్నీ కాదయ్యా! నీవు మా అమ్మాయిని పెళ్ళి చేసుకుంటావా!?  “అని నేరుగా అడిగేశాడు మోహనరావు. 

   ఆ ప్రశ్నతో బెంబేలెత్తి పోయాను. నేను ఊహించని, ఆశించని  ఆఫర్ !. సుందరిని తలంచుకోగానే నామనస్సు పులకరించింది. గుండె నిండా తీయని తలంపులు నిండి పోయాయి. చదువు లేకపోతేనేం? చక్కని అందం నా స్వంతమవుతుందా! ఐనా నాయన గారికి చెప్పకుండా వివాహ  విషయంలో తాను నిర్ణయాలు తీసుకోడం సబబు కాదు. ఏం చేయాలబ్బా! ఈయన్నే నాయన గారితో మాట్లాడమంటే సరి. ఏమైనా వారే ప్రస్తావించినపుడు సుందరిని వదులుకోడం అవివేకమే!' అనే ఊహలతో అయో మయంలో పడ్డాను, ఆరడుగుల, బంగారు రంగు, రింగుల జుత్తూ అందగాడిని, నవ యవ్వన యువకుడినైన నన్ను  ఆయన తన కుమార్తెకు అడగడం లో తప్పేముందీ అనిపించింది ఆ క్షణంలో నాకు .

"ఏమయ్యా! సుందరం మా అమ్మాయి నచ్చక పోతే చెప్పేయి ఫరవా లేదు. మా మామగారు ఎలాగూ ఏవో సంబంధాలు చూస్తూనే ఉన్నారు. మమ్మల్ని పిల్లను తీసుకుని బొబ్బర్లంక రమ్మనీ , పెళ్ళి చూపు లు ఏర్పాటు చేస్తామనీ ఒకటే ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. వెళదామనుకుంటున్నాం,  ఐనా తెలిసిన వాడివి గనుక నిన్ను అడుగుదామని అడిగాను, పైగా ఎవరో ముక్కూ మొహం, తెలీని వాళ్ళకు గారాబంగా పెంచుకున్న ఒక్కగానొక్క పిల్లను ఇవ్వను ఆలో చిస్తున్నా మంతే" అని చెప్పాడు మోహన రావు . 

" అలా కాదు సార్ వివాహ విషయం నేను ఎలా నిర్ణయం తీసుకుంటాను చెప్పండి. పెద్దలు మా నాయన గారూ, అమ్మా, బాబాయిలూ ఉన్నారు, వారంతా చర్చించుకుని నిర్ణయించాల్సి ఉంది. వారి నిర్ణయమే నా నిర్ణయం అవుతుంది సార్!" " అన్నాను ముఖమాటంగా .

" అది సరేనయ్యా సుందరం! నీకు ముందుగా మా కుటుంబం గురించీ కొంచెం  చెప్తాను విను. అంటూ ఆయన చెప్పిన మాటలేవీ నాకు చెవి కెక్క లేదు. సుందరి నా స్వంత మైతే ఎంత బావుంటుందో ఊహించుకుంటూ ఉండి పోయాను. చివరగా అయన చెప్పిన ఆస్థుల గురించిన మాట వినిపించి,

" ఆస్థుల గురించిన ప్రస్థావన ఎందుకు సార్! ఏదైనా నిర్ణయం మా నాయన గారిదే. మాకూ ఆస్థి పాస్థులున్నాయి. మీరు మీకు ఇష్టమైతే మా నాయన గారిని సంప్రతించండి సార్!"

"అది సరేనయ్యా సుందరం! నీ ఉద్దేశ్యం చెప్తే బావుంటుంది. మీ వాళ్ళు అంగీకరిస్తే నీవు కాదంటే అప్పుడు మేమేం చేయాలయ్యా?"

" అలా ఉండదు సార్! సుందరి వంటి అందమైన అమ్మాయిని ఎవ్వరూ వదులుకోరు , " అన్నాను కాస్తంత సిగ్గు పడుతూనే. " అబ్బా! ఈ మాట నీ నోటి వెంట చెప్పించను ఎంత సేపు పట్టిందయ్యా నాకు. మంచిది, నీకు మీ నాయన గారి పైనా, మీ పెద్దల పైనా ఉండే గౌరవానికి నాకెంతో సంతోషంగా ఉంది. నీ ఉద్దేశ్యం ప్రకారం మీ వాళ్ళకు ఉత్తరం వ్రాస్తాను. తర్వాత నేను వచ్చి మాట్లాడతాను. సరా!"

" ఐనా మీరు మీ అమ్మాయి ఉద్దేశ్యం కూడా తెల్సుకుంటే బావుంటుందేమో సార్! కానీ నేను ఈ వారం వెళ్ళక పోతే  మా నాయన గారు చాలా బాధ పడతారు. నేను చదువు కుంటానంటే నా కోసం కరిణీకం కూడా మా బాబాయ్ గారి పిల్లలకు ఇచ్చి నా కోరిక మేరకు నేను ఉద్యోగం చేసుకోను ఇంత దూరం పంపారు. వారిని బాధ పెట్టి నేనేం చేయలేను సార్! అంతే కాదు నేను వెళ్ళే వేళకు  వారు గానీ  ఏ సంబంధమైనా ఖాయం చేసి ఉన్నా కాదనలేను" ఎంతో స్థిరంగా చెప్పాను వారికి, ఒక విధంగా తొందర చేసినట్లే.  ఆఫీసు కాగానే  మా బాసు  ఇంటికి వెళ్ళాను. " రావయ్యా! రారా! నీ కోసమే ఎదురు చూస్తున్నాం. భోజనం వడ్డిస్తున్నరు, తింటూ మాట్లాడుకుందాం రావయ్యా!"  అని బలవంతాన భోజనానికి కూర్చోబెట్టాడు.

" చూడూ సుందరం! మీ ఇద్దరికీ కొంత స్నేహమైంది, సుందరి నిన్ను తప్ప మరొకర్ని చేసుకోను ఇష్ట పడటం లేదయ్యా! పసిది. అది బాధ పడుతుంటే మేం ఉండలేము. నీవు మీ ఊరి చిరునామా ఇవ్వు. మేమూ నీతో పాటే బయల్దేరుతున్నాం. నీవు మీ ఊరెళ్ళు. మేము మా ఊరెళ్ళి మా మామ గార్ని తీసుకుని వస్తాం, అన్ని విషయాలూ  మీ వాళ్ళతో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకుంటాం. మీ నాయన గారూ, మీ ఇంటి పెద్దలూ అంగీకరిస్తే నీకేం అభ్యంతరం  లేదుగా! " అని అడిగాడు. తల వంచుకునే అంగీకారంగా తల ఊచాను. కానీ లోపల్లోపల  ఏమవుతుందోని  భయంగానే ఉంది.’  ఒక వేళ నాయన గారు ఏదైనా సంబంధం ఖాయం చేసేసి మాట ఇచ్చేసి ఉంటే, అప్పుడు ఏం చేయాలి’  ఆలోచనలతో ఏమీ పాలు పోక సరిగా భోజనం చేయలేక పోయాను.

భోజన పళ్ళెంలో చూపుడు వేలుతో అటూ ఇటూ గీతలు గీస్తున్ననన్ను గమనించిన చూడామణి " నాయనా! భోజనం సరిగా చెయ్యి, ఆ తర్వాత ఆలోచిద్దాం, ఏందయ్యానీవు ! భోజనాల దగ్గరా  ఈ మాటలన్నీ పాపం పిలగాడు అయోమయంలో పడ్డాడులా ఉంది సరిగా భోజనం చేయలేక పోతున్నాడు. కానీవయ్యా! నాకు మాత్రం ఆ బ్రహ్మ మీ ఇద్దరికీ వ్రాసి పెట్టి నట్లు అనిపిస్తున్నది. లేక పోతే ఇంత కాలంగా మా బిడ్డ సుందరి ఎవ్వరితో చనువుగా ఉండిందీ లేదు, ఇష్ట పడిందీ లేదు. పసిది. మీ ఇద్దరికీ స్నేహం  కుదరటం అంతా దైవానుగ్రహమే. పైగా మీ వాళ్ళుమాత్రం నీ మనస్సు కాదని మరో సంబంధం ఎలా చేస్తార్లేవయ్యా! నీవంటే మీ వాళ్ళకు ప్రాణమన్నావు కదా!" అంటూ ఓదార్చి భోజనం  అడిగడిగీ  వడ్డించారు చూడామణి. 

మోహన రావు, చూడామణి ల ఆలోచన ప్రకారం అంతా బయల్దేరి రైల్వే స్టేషన్ కెళ్ళాం. ప్రయాణమంతా సుందరి, నాతో గలగలా మాట్లాడుతూనే ఉంది. మా నవ్వులూ , చనువూ చూసి మోహన రావు దంపతులు సంతోషించారు. 

*************

ఇంట్లో అడుగు పెట్టగానే ఇంటిల్లి పాదీ నన్ను చూసి సంతోషించారు, చుట్టు ముట్టారు." రారా సుందరం! నీ కోసం ఎంతో కాలంగా కళ్ళళ్ళో వత్తులు వేసుకుని  ఎదురు చూస్తున్నాం రా! " అంటూ తల నిమురుతూ తల్లీ, వళ్ళంతా చల్లని చూపులతో తడిమి చూస్తున్నతండ్రీ , బాబాయిలూ, పిన తల్లులూ, అత్తా, మామా, వారందరి సంతానం షుమారుగా యాభై అరవై మంది చుట్టూ మూగి తమ సంతోషం వ్యక్త పరిచారు. చాలా కాలం తర్వాత నా రక్త సంబంధీకుల ప్రేమ వానలో తడిసి ముద్దైనాను. 'వీరందరికీ తానంటే ఎంత ప్రేమ! ఇలాంటి వారికా తాను ఇంత కాలం దూరంగా ఉంది ' అని నా మనస్సు విలవిల్లడింది.

వారికి తాను మహాబలిపురంలో సుందరి సాయంతో కొన్న పూసల  హారాలూ,  గాజులూ, బొమ్మలూ అందరికీ ఇచ్చాను." మేమంటే నీకెంత ప్రేమరా !" అంటూ  చిన్న పెద్దా అవి తీసుకుని సంతోషించారు. స్నాన పానాదులయ్యాక , " రా సుందరం! మీ నాయన గారు, అమ్మా! నీ కోసం ఎదురు చూస్తున్నారు.." అంటూ పెద్ద బాబాయ్ కృష్ణ మొదలు పెట్టాడు.

"ఏం చేయను బాబాయ్! శలవు దొరికింది కాదు." అంటూ మొదటి సారిగా పెద్దల ఎదుట అసత్యం చెప్తూ సిగ్గుతో తల వంచుకున్నాను, మనస్సు  రోదిస్తున్నా.

" సరే కానీ జరిగి పోయిందానికి జగడాలెందుకు. జరుగవలసినది  చెప్పు అన్నయా ! " అంది మేనత్త మాలతి.

" నాయనా సుందరం! గత వారం నీవు వస్తావని ఎంతో ఎదురు చూశాం , నేనిచ్చిన మాట ప్రకారం ఒక సంబంధం వారు మన కోసం వచ్చారు. 

ముగింపు వచ్చేసంచికలో...

మరిన్ని కథలు
devunivaram