Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagaloka yagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతులిత బంధం

గతసంచికలో ఏం జరిగిందంటే...http://www.gotelugu.com/issue153/435/telugu-serials/atulitabandham/atulita-bandham/

 

 “ఈ భూ ప్రపంచకంలో పెళ్ళి చేసుకుని ఎవడైనా సుఖ పడ్డాడా చెప్పు గోవిందూ!” నవ్వు దాచుకుంటూ అంది ఐశ్వర్య.

“ఏయ్...” నెత్తి మీద మొట్టింది మధు...

“మిస్సమ్మ నేనూ చాలా సార్లు చూసాను కాని, నువ్వు చెప్పేది నిజమా? ఊరికే జోక్ చేస్తున్నావు కదా?” అంది నవ్వేస్తూ.

ఐశ్వర్య ముఖం గంభీరంగా మారింది.

“మొట్ట మొదటి సారి నేను టెన్త్ చదివేటప్పుడు నా క్లాస్ మేటు మంగ పెళ్ళి పేరుతో ఓ మోసగాడి కుట్రకి బలి అయి పోవటం చూసాను. ముంబై లో జాబ్ చేస్తున్నాడని వాడికిచ్చి చేసారు., పెళ్ళైన  మూడో నెలలో అరబ్బు షేకులకి అమ్మేశాడు దాన్ని... ఎప్పుడూ నవ్వుతూ ఉండే మా మంగ ఎవ్వరికీ కనబడకుండా మాయమైపోయింది. బ్రతికుందో లేదో ఇప్పటికీ తెలియదు.

ఇక మా అక్కయ్య సంగతి తెలుసు కదా... తన అపరాధం లేకుండా ఎయిడ్స్ కి ఆహారమైపోయింది. వాడూ ఇప్పుడు ఇవాళో రేపో అన్నట్టు ఉన్నాట్ట... మన వార్డెన్ పద్మలత గారిని భర్త వదిలి వెళ్ళిపోయాడు. ఎందుకు ఏం తప్పు చేసిందని? మగవాళ్ళ దౌష్ట్యానికి మన ఆడవాళ్ళు బలి చేయబడుతున్నారు. అందుకే నాకు పెళ్ళి  పేరుతో చేయబడే ఈ దోపిడీ అంటే చాలా అసహ్యం వేస్తోంది.  పెళ్ళి చేసుకోకూడదని ఏనాడో నిర్ణయం చేసుకున్నాను  నేను...ఓయ్ మధూ...  నువ్వు విన్నది నిజమే...” అలాగే తనవైపు చూస్తున్న మధూ చేయి పట్టి కుదిపింది ఐశ్వర్య.

“మరి... ఆ కార్తీక్ తో...”

“పిచ్చి మధూ... ప్రేమకీ పెళ్ళికీ సంబంధం ఏముంది? నా చదువు అయ్యాక అతనితో సహజీవనం చేయాలని అనుకుంటున్నాను...”

“ఏమిటీ? సహజీవనమా!?” కీచుగా అరిచింది మధు.

అవునన్నట్టు తలూపింది ఐశ్వర్య.

“ఐశూ, నీకేమైనా మతి పోయిందా? అది ఏ సంప్రదాయం చెప్పు? ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు? సమాజం పట్ల నీకు అవగాహన లేదే, అసలు నీది  సరియైన నిర్ణయమే  కాదు ఐశూ... టూ మచ్ చేయకు...”

“కాదు మధూ... ‘సహజీవనం’ అనేది చక్కటి ఏర్పాటు. ఇద్దరిలో ఎవరికీ ఎవరి మీదా హక్కులు, అధికారాలు ఉండవు. ఆ జీవితం బోర్ కొట్టినప్పుడు వెళ్ళి పోయి వేరేగా బ్రతకవచ్చు... నా ఆర్ధిక స్వేచ్చ కూడా నాకు ఉంటుంది... కార్తీక్ అంటే నాకు ప్రేమే... కాని అతడిని బంధించే అధికారం నాకు లేదు. అతని ఐడియాలు కూడా ఇవే... అందుకే ఈ ప్రపోజల్ నాకు బాగా నచ్చింది. ఇంకెంత? మూడు నెలలు... పరీక్షలు అవగానే, మా కోసం ఫ్లాట్ తీసుకుంటానని అన్నాడు...” మురిపెంగా చెప్పింది ఐశ్వర్య.

మధుబాల కనుల ముందు ‘ఇదిగో, ఈ నిప్పు కణికతో ఆడుకుంటాను, ఎర్రగా అందంగా ఉంది కదా...’ అని అంటున్న అమాయకపు బాలిక కదలాడింది, ఐశ్వర్య రూపంలో...

“ఐశూ... నీ ఆలోచన చాలా దారుణంగా ఉంది... పాశ్చాత్య నాగరికత నుంచి మనం దిగుమతి చేసుకునేవి ఇవా? వాళ్ళ కష్టపడే తత్త్వం, క్రమశిక్షణ... ఇవి చూసి నేర్చుకోవాలి. అంతే కాని ఇలాంటివి ... ఉహు, నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఐశూ... కావాలంటే నేను కార్తీక్ తో మాట్లాడతాను...” నచ్చజెప్పబోయింది.

“మధూ... ఇటు చూడు, నేను ఆనందంగా ఉండటమే కదా నీకు కావలసింది?”

“అవును... నా నెచ్చెలి ఎప్పుడూ ఆనందంగా ఉండాలి...”

“ఇదిగో ఈ జీవన విధానమే నాకు ఆనందం కలిగించేది అర్థమైందా? పిచ్చి మొద్దు... అలా భయపడిపోకే... అయినా ఇంకా సమయముంది కదే... ముందు బాగా చదువుకోవాలి. అందుకే పరీక్షలు అయ్యే వరకూ కార్తీక్ ని కలవదలచుకోలేదు...” గట్టిగా చెప్పేసింది ఐశ్వర్య.

అయోమయంగా చూసి, దేవుడికి తన నేస్తాన్ని కనిపెట్టి ఉండమని మనసులోనే గాఢంగా వేడుకుంది మధుబాల.

***

అన్నట్టుగానే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కార్తీక్ ని కలవలేదు ఐశ్వర్య. ఆమె నిగ్రహానికి అబ్బుర పడినది మధుబాల. కార్తీక్ అంటే ఎంతో ప్రేమ ఉన్నా, తన భవిష్యత్తు అంటే ఇంకా ప్రేమ కలిగిన ఆ అమ్మాయిని చూసి శ్లాఘించ లేకుండా ఉండలేకపోయింది మధుబాల.

ఆఖరి పరీక్ష అయిన తరువాత కాలేజీ దగ్గరకు కారు తీసుకుని వచ్చాడు కార్తీక్. మధుబాలను అతనికి పరిచయం చేసింది, ఐశ్వర్య.

“మధు గారూ, ప్లీజ్ జాయిన్ అజ్ ఫర్ లంచ్...” ఆహ్వానించాడు, కార్తీక్.

అతనితో మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తున్న మధుబాల వెంటనే అంగీకరించింది. కార్తీక్ చామన చాయలో ఉన్నా అందగాడే అనుకుంది. ఐశ్వర్యను చూడగానే అతని కళ్ళలో మెరిసిన  మెరుపులు మధుబాలకు సంతృప్తిని కలిగించాయి.

‘ఐశ్వర్య చేతిని వదిలి పెట్టడు... వీరి బంధం మూడు ముళ్ళ బంధం అయ్యేలా చూడాలి’ అని గట్టిగా అనుకుంది. మధు ఉన్నందు వలన పెద్దగా ఏమీ మాట్లాడకుండా డ్రైవ్ చేయసాగాడు కార్తీక్. అతనితోనూ, మధూతోనూ తానే గలగలా మాట్లాడసాగింది ఐశ్వర్య.

హోటల్ దగ్గర కారు ఆగగానే కార్తీక్ పక్కనే ముందు సీట్ లో కూర్చున్న ఐశ్వర్య లేడి పిల్లలా చక్ మని దిగింది. డోరు తెరిచి, మధు చేయి పట్టి దింపి, నడిపించింది. ఆ స్టార్ హోటల్ యొక్క హొయలు చూస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ ఐశ్వర్యను అనుసరించింది మధు. వెనకాలే కార్తీక్ కూడా వచ్చాడు.

చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో ముగ్గురూ ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. రోటీ, పనీర్ కర్రీ ఆర్డర్ చేసాడు కార్తీక్ ముగ్గురికీ.

అతన్నే పరిశీలనగా చూస్తున్న మధుబాల ఉన్నట్టుండి “కార్తీక్, నేను మీతో కొంచెం మాట్లాడాలి...’ అని అనటంతో ఉలిక్కి పడింది ఐశ్వర్య. “ఏయ్...”  అంటూ వారిస్తున్నట్టుగా ఆమె చేయి నొక్కింది.

“చెప్పండి మధూ! మాట్లాడండి...” ప్రోత్సాహ పూర్వకంగా నవ్వాడు కార్తీక్.

“మా ఐశ్వర్య మీద మీకు ఎలాంటి ప్రేమ?”

జవాబు చెప్పలేనట్టు చూసాడు కార్తీక్...

“మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఐశ్వర్యను చూడగానే ‘ఈమె నాది’ అనిపించింది. తను నాకు కావాలి... ఆమెతో నా జీవితం చాలా హాయిగా ఉంటుంది... తాను నవ్వితే పన్నీటి జల్లు... అలిగితే ఎడారిలో ఎండల సెగలు...” ఇంకా ఏదో చెప్పబోతున్న అతనితో, “మరైతే, పెళ్ళే చేసుకోవచ్చు కదండీ?” అంది మధుబాల.

“పెళ్ళి! ఆ చట్రం లో బంధింపబడటం నాకు ఇష్టం లేదు...” దృఢంగా అన్నాడు కార్తీక్.

“అంటే... ఎంత కాలం కలిసి ఉంటారు?” సూటిగా అతన్నే చూస్తూ అన్నది మధుబాల, వారిస్తున్న ఐశ్వర్యను పట్టించుకోకుండా..

“ప్రస్తుతం మాకిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగం ఉన్నాయి. అయితే అవి ఇప్పుడే కాదు,  ఎల్లకాలం ఉంటాయనే ఆశిస్తున్నాను... ఇద్దరం స్వేచ్చా జీవులమే... మా ఇంట్లో కూడా నా పెళ్ళికి తొందర చేస్తూనే ఉన్నారు చాలా కాలంగా... అయితే, నా జీవన విధానం, మనసులోని ఆలోచనలు వేరేగా ఉన్నాయి. నేను పెళ్ళికి పరమ వ్యతిరేకిని. బంధాలు, బాధ్యతలు ఇష్టం లేదు. చాలా చిన్నదైన ఈ జీవితాన్ని పూర్తిగా  ఆనందించటానికే నేను ఇష్టపడతాను. ఐశ్వర్యకు కూడా నా అభిప్రాయాలు నచ్చాయి. అందుకే ఇద్దరం...”

అతని మాట పూర్తి కాకుండానే అంది మధుబాల... “కానీ ప్రపంచం మిమ్మల్ని గౌరవంగానే చూస్తుంది అనుకుంటున్నారా?”

“చూడండి మధూ, మా జీవితాలు మా ఇష్టం... ఈ ప్రపంచంతో మాకు సంబంధం లేదు...” తినటం పూర్తి చేసి మంచి నీళ్ళు తాగుతూ అన్నాడు కార్తీక్.

“ఐశ్వర్యా, ఇది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం... అతను మగవాడు. ఒక స్త్రీగా నువ్వే ఎక్కువ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది...” నచ్చ జెబుతున్నట్టు అన్నది మధుబాల.

“అంతా నీ భ్రమ మధూ... ఈ ప్రపంచం నేను బాధల్లో ఉన్నప్పుడు తోడు రాలేదు... నా జీవితంతో దానికి సంబంధం లేదు... మేమే దాన్ని వెలి వేస్తాం...”

పసి పాపను చూసినట్టు ఐశ్వర్య వంక చూసిన  మధుబాల, నిస్సహాయంగా లేచింది.

“అదేమిటి, మీరు ఏమీ తినలేదు...” నొచ్చుకున్నాడు, కార్తీక్.

“ఇట్స్ ఆల్ రైట్... సయించటం లేదు... నేను వస్తాను...”

“ఉండు మధూ, నేనూ వచ్చేస్తున్నాను... కార్తీక్, మళ్ళీ కలుద్దాం. బై...” మధుని అనుసరించింది ఐశ్వర్య.

“ఉండండి, నేను డ్రాప్ చేస్తాను...” అని కార్తీక్ పిలుస్తున్నా వినకుండా, వెను దిరిగి చూడకుండా బయటకు వచ్చేసింది మధుబాల.

నిస్సహాయంగా ఆమెతో వచ్చిన ఐశ్వర్య అప్పటికే ఆటో ఎక్కేసిన మధు పక్కన చతికిలబడింది.

***

బీరువా తాళాలు వేసి వెనక్కి తిరిగిన అమల గుమ్మంలో నిలబడిన అమ్మాయిని చూసి, “ఎవరమ్మా?” అని అడిగింది ఆదరంగా... తమ క్లబ్ సహాయం కోరి వచ్చే అనాధలకు లోటు లేదు మరి.

“అమల గారు మీరే కదండీ? నేను మీతో మాట్లాడటానికి వచ్చాను... లోపలికి రావచ్చా?” మెల్లగా అడిగింది.

రమ్మని తల ఊపి, కూర్చోమన్నట్టు ఎదురుగా ఉన్న కుర్చీ చూపించింది అమల. సన్నగా పొడుగ్గా ఉన్న ఆ అమ్మాయి ముఖంలో ఏదో వేదన కదలాడుతోంది. ఆ వేదనలో కూడా చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి.

“ఎవరమ్మా నీవు? నీ పేరు?” బెల్ కొట్టింది అమల అడుగుతూనే.

“నా పేరు మధుబాల అండీ. ఇక్కడే డిగ్రీ చదువుతున్నాను. ఐ మీన్ ఫైనల్ పరీక్షలు రాసాను. ఐశ్వర్య నా స్నేహితురాలు...”

“ఐశ్వర్య? ఓహ్, తనా? మా రూప టీచర్ కదా... చెప్పమ్మా, ఏం కావాలి నీకు?” బాయ్ తెచ్చిన చల్లని మంచి నీటి గ్లాసును మధు ముందుకు జరుపుతూ ఆప్యాయంగా అన్నది అమల.

దాహంగా అనిపించటంతో గ్లాసు ఎత్తి ఆ నీళ్ళను గడగడా తాగేసింది మధుబాల. తర్వాత గొంతు సవరించుకుంది.

“మీకు తెలుసా? మీ మరిది కార్తీక్, ఐశ్వర్య ప్రేమించుకున్నారు!” అంది ఆమె ముఖ కవళికలను గమనిస్తూ.

“ప్రేమా?” తేలికగా అన్నది అమల.

“కార్తీక్ ఈజీ గోయింగ్ టైపు మధుబాలా... అతనిది ప్రేమ కాదు... ఐశ్వర్యను డ్రాప్ అవమని నా మాటగా చెప్పు...” అంది...

“నాకు అర్థం కాలేదు... అతన్ని గురించి మీరే ఇలా చెబుతున్నారు?” ఆశ్చర్యంగా అన్నది మధుబాల.

నిట్టూర్చింది అమల. “ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది ఒకదారి అన్న సామెత విన్నావు కదా... మొదటి నుంచీ కార్తీక్ ది అదో దారి. మా వారికీ ఇతనికీ దాదాపు పదిహేను సంవత్సరాల తేడా ఉండటం వలన వాడు నాకు మా రూప లాగే నా సంతానమని అనిపిస్తాడు. మా అత్తగారు, మామ గారూ కార్తీక్ కలిసి విడిగా ఉంటారు. చాలా కాలం తర్వాత కలిగిన సంతానం కావటం వలన మా మావగారు బాగా గారాబంగా పెంచారు కార్తీక్ ని. దాంతో వాడికి  చిన్నప్పటి నుంచీ ఆడింది ఆట, పాడింది పాటా అయింది. చదువైన వెంటనే మంచి జాబ్ వచ్చింది. సర్కిల్ పెరిగింది. దాంతో హైక్లాస్ అలవాట్లు కూడా అబ్బినాయి. మేము ఎంత వారించినా, నివారించాలని ప్రయత్నించినా మా మాట వినడు. తన జీవితం తనదీ అంటాడు. మా అత్తగారు వాడి  కోసం లిటరల్ గా బెంగ పెట్టుకున్నారు. వాడిని పెళ్ళికి ఒప్పించే బాధ్యత నా మీద పెట్టారు కూడా. కాని కార్తీక్ ఎవరి మాటా వినడు... ‘లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్ మెంట్’ అన్నది అతని నినాదం. అంటే తినటం, తాగటం, తిరగటం... ఇదే...”

“మరి... ఐశ్వర్య...”

“నేను ఆమెతో కూడా మాట్లాడాను మధూ... వీళ్ళ చనువును గ్రహించిన వెంటనే ఆమెకు  వీడి గురించి విపులంగా చెప్పాను కూడా... ఆమె వెనక్కి తగ్గటం లేదు... ఆరు నెలల క్రితం వరకూ చిన్న గువ్వ పిల్లలా బిడియంగా ఉండేది... ఇప్పుడు రాజహంసలా ఆత్మ స్థైర్యంతో తిరుగుతోంది... ఇట్స్ ఓకే... అది వాడిని చూసి వచ్చిన ధీమా అని నాకూ తెలుసు. నిజం చెబుతున్నాను, ఐశ్వర్య వాడిని పెళ్లాడితే, వాళ్ళిద్దరూ కలిసి జీవితాన్ని పంచుకుంటే నాకన్నా సంతోష పడే వాళ్లు ఎవ్వరూ ఉండరు. వాళ్ళమ్మా నాన్నలకి కూడా నిశ్చింత. కాని ఇద్దరూ వినటం లేదు కదా!” అంది అమల.

“ఆఖరి ఆశ కూడా అడుగంటింది అమల గారూ... మీరేదైనా పరిష్కారం చూపిస్తారని అనుకున్నాను... కాని...” దిగులుగా ఓ నిట్టూర్పు విడిచింది మధుబాల.

“నాకో ఆశ ఉందమ్మా! ఇద్దరి మధ్యనా ఉన్న బంధం బలీయమై అది పెళ్ళికి దారి తీసినా తీయవచ్చును కదా... అందుకే ఇప్పటికి ఏమీ మాట్లాడవద్దు... మనం మాట్లాడినా ఫలితం ఉండదు... జరిగేది జరగనీ...” గంభీరంగా చెప్పింది అమల.

 “ఐశ్వర్యను ఎప్పుడూ ద్వేషించకండి, ప్లీజ్... దానికి అజ్ఞానపు పొరలు కమ్మేశాయి...” నీళ్ళు నిండిన కనులతో వేడుకుంది మధుబాల.

“ఛ ఛ ఎంత మాట! మా బంగారం మంచిదా ఏమిటి? ఐశూ చాలా మంచి పిల్ల... కాక పోతే స్వతంత్ర భావాలు ఎక్కువ. ముందు ముందు వాళ్ళే తెలుసుకుంటారు లేమ్మా... నాకా నమ్మకం ఉంది... కళ్ళు తుడుచుకో... ఇదిగో వేడిగా కాఫీ తాగమ్మా...”

ఆవిడ ఆప్యాయతకు చలించి పోయింది మధుబాల.

విస్ఫారిత నేత్రాలతో ముగ్ధురాలై ఆమెనే చూస్తూ కాఫీ తాగింది.

“ఐశ్వర్య చాలా అదృష్టవంతురాలు మధూ... ఎవరికి  వారే తమ తమ స్వార్థం చూసుకుంటున్న ఈ రోజుల్లో, స్నేహం పేరుతో  అవసరార్థం మనుషుల్ని వాడుకుంటున్న ఈ రోజుల్లో... తనకి  నీలాంటి చెలిమి కలిమిని పంచే స్నేహితురాలు ఉండటం ఆ పిల్ల చేసుకున్న పుణ్యమే... ఇదిగోమ్మా నా కార్డు... నువ్వు ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు... సరేనా?” మధు భుజం తడుతూ అన్నది అమల.

“చా...చాలా చాలా ధన్యవాదాలక్కా...” అప్రయత్నంగా అన్నది మధుబాల.

“అక్క! ఎంత కమ్మని పిలుపు ! ! థాంక్స్ రా... ఐశూ తో పాటు నువ్వూ ఇప్పుడు నా చెల్లెలివే... చీకటి పడుతోంది... వెళ్లిరా అమ్మా...” గుమ్మం వరకూ వచ్చి సాగనంపింది అమల.

**

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali