Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

వంశీ పైడిపల్లితో ఇంటర్వ్యూ

interview with vamshi pidipalli
అప్పుడు నాగ్ చేసింది... నాకూ న‌చ్చ‌లేదు - వంశీ పైడిప‌ల్లి
 
మున్నా - హిట్టేం కాదు.. ఫ్లాప్‌! కానీ అందులో కొన్ని షాట్స్ చూస్తే.. భ‌లే తీశాడ్రా డైరెక్ట‌రు అనిపిస్తుంది. టెక్నిక‌ల్‌గా మ‌నోడు సౌండే.. అని ముద్ర వేసేశారు. ఆ కుర్ర డైరెక్ట‌రే... వంశీపైడిప‌ల్లి. బృందావ‌నంతో మ‌రో షాక్ ఇచ్చాడు. ఒట్టి మాస్ సినిమాలే తీస్తాడ‌నుకొంటే.. ప‌క్కా ఫ్యామిలీ చూసేలా ఓ సినిమా తీశాడు. దాంతో హిట్ల ప్ర‌యాణం మొద‌లైపోయింది. ఫేస్ ఆఫ్ అనే హాలీవుడ్ సినిమాని ఎవ‌డుగా మ‌ల‌చి, మ‌న ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టుగా ఆ క‌థ‌ని ఆవిష్క‌రించిన విధానం చూస్తే.. ముచ్చ‌టేసింది. ఆ సినిమాతో వంశీ మాస్ డైరెక్ట‌ర్ అయిపోయాడు. అయితే ఊపిరితో మ‌రో షాక్ ఇచ్చాడు వంశీ. భావోద్వేగాలు నిండిన ఓ క‌థ‌ని ఎంచుకొని.. కొత్త ప్ర‌యాణం మొద‌లెట్టాడు. ఈ శుక్ర‌వారమే ఈచిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా వంశీతో చిట్ చాట్‌..

* హాయ్‌..
- (న‌వ్వుతూ) హ‌లో..
 
* సినిమా సినిమాకీ గ్యాప్ ఎక్కువ తీసుకొంటారు.. కార‌ణం ఏమిటి?
- ప్ర‌త్యేక‌మైన కార‌ణాలేం లేవు. నా ప్ర‌తీ సినిమా కొత్త‌గా ఉండాలి. ప్ర‌త్యేకంగా క‌నిపించాలి అనుకొంటా. మున్నా, బృందావ‌నం, ఎవ‌డు.. ఇలా ఏ సినిమా తీసుకొన్నా... ప్ర‌తీ చిత్రం దేనిక‌దే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. అందుకే సినిమా సినిమాకీ గ్యాప్ క‌నిపిస్తుంటుంది.
 
* ఇన్‌ట‌చ్‌బుల్స్ సినిమాని తెలుగులో తీయాల‌న్న ఆలోచ‌న ఎందుకొచ్చింది?
-  సాధార‌ణంగా నాకు ట్రాజ‌డీ క‌థ‌లంటే ఇష్టం ఉండ‌దు. అలాంటి సినిమాల్ని అస్స‌లు చూడ‌ను. కానీ... ఓసారి మా బ్ర‌ద‌ర్ ఈ సినిమాని బ‌ల‌వంతంగా చూపించాడు. కాసేపు చూశానో లేదో... నేనూ క‌థ‌లో భాగ‌మైపోయాను. ఇలాంటి సినిమా నేనెందుకు తీయ‌కూడ‌దు అనిపించింది. ఇదే క‌థ‌ని తెలుగులోనూ చెప్పాల‌ని ఆ క్ష‌ణ‌మే డిసైడ్ అయ్యాను. 
 
* రొమాంటిక్ హీరో నాగార్జునని వీల్‌ఛైర్‌లో కూర్చోబెట్టించ‌డం సాహ‌సం కాదా?
- ఇన్‌ట‌చ్‌బుల్స్ చూస్తున్న‌ప్పుడు ఆ పాత్ర‌లో నాకు క‌నిపించింది నాగార్జున మాత్ర‌మే. ఆయ‌నే ఇలాంటి సాహ‌సాలు చేయ‌గ‌ల‌రు??  ఆయ‌న లేక‌పోతే ఊపిరి సినిమానే లేద‌నుకొన్నా. విచిత్రంగా.... ఆయ‌నా ఈ సినిమాని తెలుగులో ఎవ‌రైనా రీమేక్ చేస్తే బాగుంటుంది అనుకొంటున్నార్ట‌. అదే స‌మ‌యంలో నేను ఆయ‌న్ని క‌లుసుకోవ‌డం డెస్ట‌నీ.  నిన్నే పెళ్లాడ‌తా త‌ర‌వాత నాగార్జున సార్ అన్న‌మ‌య్య సినిమా చేస్తున్నారంటే.. నాకూ న‌చ్చ‌లేదు. ఆయ‌నెందుకు, ఇలాంటి సినిమా ఒప్పుకొన్నారు?  అనిపించింది. కానీ అన్న‌మ‌య్య సినిమా చూశాక‌... షాకైపోయాను. ఊపిరి చూశాక కూడా అంద‌రికీ అదే ఫీలింగ్ క‌లుగుతుంద‌ని నా న‌మ్మ‌కం. 
 
 
* కార్తి పాత్ర‌కు ఎన్టీఆర్‌ని అనుకొన్నారు క‌దా?
- అవును.. ఎన్టీఆర్‌కి ఈ క‌థ బాగా న‌చ్చింది. నాగ్‌తో చేయ‌డానికి చాలా ఉత్సాహ‌ప‌డ్డాడు కూడా. న‌న్ను నాగ్ ద‌గ్గ‌ర‌కు పంపింది కూడా త‌నే. కానీ... ఎన్టీఆర్ కాల్షీట్లు ఎడ్జ‌స్ట్ చేయ‌లేక‌పోవ‌డంతో కార్తీని తీసుకోవాల్సివ‌చ్చింది. కార్తీ త‌న పాత్ర‌కు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశాడు. ఈ సినిమా కోసం అత‌ను ప‌డిన శ్రమ అంతా ఇంతా కాదు. ఓ అసిస్టెండ్ డైరెక్ట‌ర్‌లా ప‌నిచేశాడు. ఓ హీరో... అంత డౌన్ టూ ఎర్త్ ఉండగా నేను చూడ‌డం మొద‌టిసారి. హ్యాట్సాఫ్ టూ కార్తీ.
 
* ఎవ‌డు కోసం ఫేస్ ఆఫ్‌.. ఇప్పుడు ఇన్‌ట‌చ్‌బుల్స్ హాలీవుడ్ ప్ర‌భావం మీపై చాలా ఉన్న‌ట్టుంది?
- స్ఫూర్తి తీసుకోవ‌డంలో త‌ప్పులేదు. జీవిత‌మంతా స్ఫూర్తే. నిజానికి ఎవ‌డు కోసం వ‌ర్క్ చేస్తున్న‌ప్పుడు నాపై ఫేస్ ఆఫ్ ప్ర‌భావం పెద్ద‌గా లేద‌నే చెప్పాలి. ఫేస్ ఆఫ్ కంటే ముందే త‌మిళంలో పుతియ ముగ‌మ్ అనే సినిమా వ‌చ్చింది. అదీ.. ఇలా మెహం మార్చుకొన్న హీరో క‌థే. కానీ అంత‌గా పాపుల‌ర్ అవ్వ‌లేదు. అలాగంటే.. ఈ సినిమా చూసి ఫేస్ ఆఫ్ తీశార‌నుకోవాలి. 
 
 
* టోట‌ల్‌గా ఈ ఊపిరి జ‌ర్నీని విశ్లేషించుకొంటే ఏమనిపిస్తుంది?
- నేను చేసిన మూడు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అవేం లేక‌పోతే ఇప్పుడు ఊపిరి లేదు.  నా ప్ర‌తి సినిమా నా ఎదుగుద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డింది. కానీ.. ఊపిరి స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌. ఈసినిమా చేస్తూ ఎంతో నేర్చుకొన్నా. ప్ర‌తీ క్ష‌ణం స్ఫూర్తి పొందా. నాగ్‌, కార్తీ లాంటి మంచి మిత్రుల్ని ఈ సినిమా ద్వారా సంపాదించుకొన్నా. ద‌ర్శ‌కుడిగా న‌న్ను నేను.. స‌రికొత్త‌గా చూపించుకోగ‌ల అవ‌కాశం ఈ సినిమా ఇచ్చింది.
 
* ఈ సినిమా హిందీ రైట్స్ క‌ర‌ణ్‌జోహార్ ద‌గ్గ‌రున్నాయి. ఆయ‌న మిమ్మ‌ల్ని హిందీలోనూ రీమేక్ చేయ‌మంటే...
- త‌ప్ప‌కుండా చేస్తా. ఆ అవ‌కాశాన్ని నేనెందుకు వ‌దులుకొంటా.
 
* అఖిల్‌తో ఓ సినిమా చేస్తున్నార‌ట‌..
- అది చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంది. ఊపిరి విడుద‌ల‌య్యాకే త‌దుప‌రి సినిమా గురించి ఆలోచిస్తా.
 
* ఓకే.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ...

- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
oopiri  movie review