చిత్రం: ఊపిరి
తారాగణం: అక్కినేని నాగార్జున, కార్తి, తమన్నా, ప్రకాష్‌రాజ్, అలీ, జయసుధ తదితరులు.
సంగీతం: గోపీ సుందర్
ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్
నిర్మాణం: పి.వి.పి. సినిమా
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
నిర్మాత: పరమ్.వి.పొట్లూరి
విడుదల తేదీ: 25 మార్చి 2016
క్లుప్తంగా చెప్పాలంటే
ఓ యాక్సిడెంట్లో కాళ్ళు చచ్చుబడిపోతాయి కోట్లకు అధిపతి అయిన విక్రమ్ ఆదిత్య (నాగార్జున)కి. అక్కడినుంచి అతను వీల్ ఛెయిర్‌కి పరిమితమవుతాడు. కేర్ టేకర్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తే, అందులో శ్రీను (కార్తీ) సెలక్ట్ అవుతాడు. శ్రీను ఓ దొంగతనం చేసి, జైలుకి వెళ్ళి పెరోల్‌పై విడుదలైన వ్యక్తి. కానీ శ్రీనుని సెలక్ట్ చేసుకుంటాడు విక్రమ్. అక్కడినుంచి విక్రమ్ ఆదిత్య జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి. దొంగ అయిన శ్రీను, విక్రమ్ ఆదిత్యను చూసి మారాడా? విక్రమ్ ఆదిత్యకి శ్రీను ఎలా ఉపయోగపడ్డాడు? వీరి జీవితాల్లో వీరి కలయిక ఎలాంటి మార్పులు తెచ్చింది? అనేవి తెరపై చూస్తేనే బాగుంటుంది.
మొత్తంగా చెప్పాలంటే
నాగార్జున ఎంచుకునే సినిమాలు ఒక్కోసారి అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. కమర్షియల్ విజయాల గురించి ఆలోచించకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ముందుండే నాగ్ని అభినందించి తీరాలి ఎవరైనా. ఓ కమర్షియల్ హీరో సినిమా అంతా వీల్ ఛెయిర్‌కే పరిమితమైతే, ఇంకో హీరో అతన్ని డామినేట్ చేస్తుంటే.. అన్న ఆలోచననే ప్రముఖ హీరోలెవరూ చేయరు. నాగ్ చేశాడు. మెప్పించాడు. ఖచ్చితంగా నాగ్ ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఈ చిత్రంలోనిదే. విక్రమ్ ఆదిత్య పాత్రలో నాగ్ అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు.
కార్తీని సినిమా నటుడిగా కాకుండా మన ఇంట్లోనో, పక్కింట్లోనో వుండే కుర్రాడిలా భావిస్తాం. తెరపై ఏ పాత్రలో అయినా కార్తీ అలా ఒదిగిపోయాడు. ఈ సినిమాలోనూ అంతే. తెరపై శీను పాత్ర తప్ప, కార్తీ కనిపించడనడం అతిశయోక్తి కాదు. విక్రమ్ ఆదిత్య పీఏగా తమన్నా నటన ఓకే. గ్లామరస్‌గా కనిపించి నువిందు చేసింది. జయసుధ, ప్రకాష్‌రాజ్ తదితరులంతా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అనుష్క, శ్రియ స్పెషల్ అప్పీయరెన్స్ బాగుంది. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు.
వీల్ ఛెయిర్‌కే పరిమితమవ్వాల్సి వస్తుందని ఓ పెద్ద హీరోని ఒప్పించడంలోనే దర్శకుడు సగం సక్సెస్ అయ్యాడు. కథ, కథనాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమా అంతా ఎంటర్టైనింగ్గా మలచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. డైలాగ్స్ బాగున్నాయి. కొన్ని సరదాగా, కొన్ని ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్. సంగీతం బాగుంది. పాటలు తెరపై చూడ్డానికీ బాగున్నాయి. ఆర్ట్, కాస్ట్యూమ్స్ సినిమాకి అవసరమైన రిచ్‌నెస్‌ని తెచ్చాయి. ఎడిటింగ్ బాగుంది. సెకెండాఫ్‌లో కాస్త అవసరం అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఓకే. నిర్మాణపు విలువలు చాలా చాలా బాగున్నాయి.
ఫస్టాఫ్ సరదా సరదాగా సాగిపోతుంది. కాస్త ఎంటర్టైన్మెంట్, ఇంకొంచెం ఎమోషన్, అక్కడక్కడా గ్లామర్ ప్లస్ రొమాన్స్ ఓవరాల్‌గా ఫస్టాఫ్కి వంకలేం పెట్టలేం. సెకెండాఫ్‌లో సినిమా కాస్త స్లో అవుతుంది. కానీ, అది అర్థం చేసుకోదగ్గదే. క్లయిమాక్స్‌ని బాగా డీల్ చేశాడు దర్శకుడు. వీల్ ఛెయిర్‌కే పరిమితమైనా తాను తెరపై నిండుగా కనిపిస్తాననీ, తన హుషారులో ఏమాత్రం జోరు తగ్గదని సినిమా రిలీజ్‌కి ముందే నాగార్జున చెప్పాడు. అదే నిజమయ్యింది. వీల్ ఛెయిర్లోనూ నాగ్ యాక్టివ్‌గా కనిపించడం సినిమాకి పెద్ద ప్లస్. నాగ్ తన అభిమానుల్ని ఏమాత్రం డిజప్పాయింట్ చెయ్యడు. కార్తీ స్ట్రెయిట్‌గా తెలుగులో చేసిన తొలి సినిమా కావడం కూడా ఇంకో ప్లస్ పాయింట్. తమన్నా గ్లామర్ సరే సరి. ఓవరాల్‌గా సినిమా ఓ మంచి ప్రయత్నం మాత్రమే కాదు, కమర్షియల్గానూ వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే
నాగ్, కార్తీ ఈ సినిమాకి నిజమైన 'ఊపిరి'
అంకెల్లో చెప్పాలంటే: 3.5/5
|