Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే...http://www.gotelugu.com/issue154/437/telugu-serials/atulitabandham/atulitabandham/

‘సప్తగిరి నిలయం’ లో ఫ్లాట్ నంబర్ వన్నాట్ వన్.

పసుపు పూసిన గడపకు ఎర్రని కుంకుమ బొట్లూ, తెల్లని సున్నపు బొట్లూ మెరిసిపోతున్నాయి. ఆ ముంగిట చక్కగా తీర్చిదిద్దిన రంగుల రంగవల్లి సోయగాలు చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు ఎవ్వరికీ...

 “ఇదిగో అనూ... ఈరోజు ఉగాది పండగ... ఈరోజు మనం ఎలా ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటాము. నీకు తెలియనిదా? ఈరోజు ఏం చేస్తున్నావు స్పెషల్స్  చెప్పు?” గుమ్మానికి మామిడి తోరణాలు కడుతూ అన్నాడు, విశ్వనాథం. దిగులుగా చూసింది అన్నపూర్ణ.

“ఏమిటోయ్ నీ బాధ? ఊ??” దగ్గరగా వచ్చి అనునయించాడు.

“ఇద్దరు అబ్బాయిలూ చెరో దేశంలోనూ ఉన్నారు... ఎప్పుడో కాని రారు... మనిద్దరమే ఇక్కడ బిక్కు బిక్కు మంటూ....” ఆవిడ కళ్ళల్లో నీళ్ళు జలపాతాలై ఉరికాయి.

“పిచ్చి అనూ... ఎందుకింత బాధ? వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు వెదుక్కుంటూ వలస పోయారు. కాదని అనటానికి మనమెవ్వరం ?  ఎప్పటికైనా నాకు నువ్వూ, నీకు నేనూ... అంతే...” తగ్గు స్వరంతో చెబుతూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.

“కాని... కాని...”

“నాకు తెలుసు అనూ... కన్న కడుపు వాళ్ళ కోసం ఎంత కలవరిస్తుందో నాకు తెలుసు. రెక్కలు వచ్చిన పక్షుల కోసం తల్లి దండ్రులు బాధ పడటం అర్థ రహితం. వాళ్ళు ఎక్కడున్నా, క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకోవటం ఒక్కటే మన కర్తవ్యం. నాకు ఆకలేస్తోంది అమ్మా, అన్నపూర్ణమ్మా!”

“అయ్యో... ఉండండి... ఉగాది పచ్చడికి అన్నీ సిద్ధం చేసేసాను, మీరు కొద్దిగా కలిపేస్తే, నైవేద్యానికి పాయసం, పులిహోర తయారు చేసాను. దేవుడికి కాస్త నైవేద్యం పెట్టేసి మీకు పెడతాను... సరేనా... రండి...” అంటూ వంటింట్లోకి దారి తీసింది అన్న పూర్ణ.
అప్పటికే దూసిన వేప పువ్వుల నుండి రెక్కలు వేరు చేసి, తీసి ఉంచిన కొత్త చింత పండు రసంలో వేసాడు విశ్వనాథం. లేత కొబ్బరి చిప్పలోంచి కొబ్బరిని తీసి సన్నగా తరిగి ఆ ముక్కలు కలిపాడు. అరటి పండు చక్రాలుగా చేసి వాటినీ, పచ్చి మామిడి కాయను చిన్నగా ముక్కలు కోసి వాటినీ, కొత్త బెల్లాన్ని తురిమి ఆ తురుమునూ కలిపాడు. అర స్పూను  ఉప్పు, కారం వేసాడు. వాటిని చెంచాతో కలిపి వెండి గిన్నెలో రెడీ చేసాడు.

ఈలోగా వెండి గిన్నెల్లో నైవేద్యం పెట్టి, దేవుడి దగ్గర ఉంచింది అన్నపూర్ణ. ఉగాది పచ్చడిని కూడా అక్కడ పెట్టి ఇద్దరూ కలిసి పూజ చేసుకున్నారు.

పట్టు చీర కట్టుకుని, ముక్కుకు మూడు రాళ్ళ ముక్కు పుడకతో, పచ్చని ముఖానికి మరింత పచ్చగా మెరిసేలా పసుపు పూసుకుని, నొసట పావలా కాసంత కుంకుమ బొట్టు పెట్టుకున్న తన అన్నపూర్ణ సాక్షాత్తూ ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి లాగానే అనిపించింది విశ్వనాథం కళ్ళకి. ఆమె కనులలో ఎప్పుడూ ధారలా కురిసే వాత్సల్యం ఆ అపార్ట్ మెంట్స్ లో అందరికీ పిన్నిని చేసేసింది. తనూ ఆమెతో పాటుగా బాబాయ్ అయిపోయాడు. పన్నెండు అపార్ట్మెంట్ లున్న ఆ భవనంలో అందరికీ తలలో నాలుకలా ఉంటారు దంపతులు ఇద్దరూ... ఇద్దరు కొడుకులూ ఉద్యోగాలు విదేశాల్లో చేసుకుంటూ, దూరంగా ఉన్నారు. ఎప్పుడైనా రావటమే... ఇద్దరూ ఒకేసారి రావటమూ అరుదే... ఎంతగా వారానికోసారి స్కైప్ లో మాట్లాడుతున్నా, మనవలను చూపించి వాళ్ళ ఆట పాటలను గురించి వివరించినా తమ ఇద్దరికీ తృప్తిగా అనిపించదు.

క్రిందటి ఏడాది తాను రిటైర్ అయిన వెంటనే పిల్లలు ఇద్దరూ తమ దగ్గరకు వచ్చేయమని అడిగారు. పర్మనెంట్ గా ఉండటం కోసం కాదు కాని ఓ సారి వెళ్లాలని అనిపించి ఇద్దరూ వెళ్లి రెండేసి నెలలు అమెరికాలో పెద్దబ్బాయి దగ్గరా, లండన్ లో చిన్నబ్బాయి దగ్గరా ఉండి  వచ్చారు.  కాని వారివి బిజీ జీవితాలు. తల్లి దండ్రులతో కూడా కలిసి గడపలేనంత ఉక్కిరి బిక్కిరి జీవితం, ఉద్యోగ బాధ్యతలూ... అదీ గాక, అక్కడి శీతల వాతావరణం పడని  అన్నపూర్ణకు బాగా జబ్బు చేసింది. వైద్యుల సలహా మేరకు తిరిగి భారత దేశానికి వచ్చేసారు.

“పిన్నీ... నాకు పూర్ణం బూరెలు కుదరటం లేదు... కొద్దిగా మా ఇంటికి వచ్చి చూపెట్టరూ?” ఎదురింట్లో ఉంటున్న జయంతి వచ్చింది.
నవ్వి, “సరే, మీ బాబాయ్ కి టిఫిన్ పెట్టి వస్తాను పావు గంట తర్వాత...” అని చెప్పి పంపింది ఆమెను. “నాకూ తినాలని ఉందోయ్ పూర్ణాలు!” ఆశగా అన్నాడు విశ్వనాథం.

“చాల్లెండి, అరగవు. మళ్ళీ మీరే అవస్థ పడతారు... అయినా జయంతి మీకు ఎలాగూ పంపుతుంది కదా, ఒక్కటి పెడతాలెండి...” అంది నవ్వుతూ.

“ఒక్కటా? ఒక్కటేనా? సరే... ముందు త్వరగా నాకు పచ్చడీ, ప్రసాదం పెట్టేయ్...” అన్నాడు విశ్వనాథం.

“అమ్మమ్మా... నాకు జుట్టు చిక్కు తీసి, జడ గంటలతో పెద్ద జడ వేయవూ?” చేతిలో జడ గంటలతో వచ్చింది పై అపార్ట్మెంట్ లో ఉంటున్న పదేళ్ళ అపర్ణ.

“సరేరా... ఇదిగో ఉగాది పచ్చడి పట్టు... మీ తాత గారు చేసారు... బహు కమ్మగా ఉంటుంది...” అంటూ చెంచాతో ఆ పాప చేతిలో కాస్త వేసింది, అన్నపూర్ణ.

తనూ ప్రసాదం తిని, ఆ పాపకు జడేసి పంపించి, పక్క ఫ్లాట్ కి బయలు దేరింది.

“అక్కడే ఉండి పోక త్వరగా వచ్చేయ్... ఈలోగా నేను కవి సమ్మేళనం చూస్తాను...” ఉత్సాహంగా టీవీ ఆన్ చేసాడు విశ్వనాథం.

***

 “హాయ్ మధూ! ఎలా ఉన్నావే?”

ఫోన్ లో ఐశ్వర్య గొంతు వినగానే మైమరచి పోయింది మధు బాల.

“ఐశూ, నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఎక్కడున్నారు మీరిప్పుడు?” ఆరాటంగా ప్రశ్నించింది.“జైపూర్ లో ఉన్నాం మధూ... నీ

ఉద్యోగ ప్రయత్నాలు ఎంత వరకూ వచ్చాయి? ఇప్పుడు మీ ఊరి లోనే ఉన్నావా?”

“అవును ఐశూ... అన్నయ్య పెళ్లి అయింది. నాకూ సంబంధాలు చూస్తున్నారు నాన్నగారు. కొన్ని ఉద్యోగాలకు అప్లై చేసాను హైదరాబాదు లోనే... పెళ్ళికి తొందర లేదని చెప్పినా నాన్న గారు వినటం లేదు...”

“పోనీ లేవే, చేసేసుకో, ఓ పనై పోతుంది... హైదరాబాద్ సంబంధం అయితే బెటరు... నీ ఉద్యోగానికి వీలుగా ఉంటుంది కదా... నాకూ ఒక ఇంటర్వ్యూ వచ్చింది వచ్చే వారం. అప్పటికి తిరిగి వస్తాను...”

“హాపీగా ఉన్నావా ఐశూ?” మధు గొంతు వణికింది.

“చాలా చాలా సంతోషంగా ఉన్నాను మధూ... కార్తీక్ నాకు సరైన భాగస్వామి. ఒక్క పెళ్ళి అన్న బంధం లేదు అంతే, సమస్త బంధాలు ఉన్నాయి మా మధ్య... చాలా ప్రేమిస్తాడు నన్ను. నిజంగా హాపీగా ఉన్నాను...” పరవశంగా చెప్పింది ఐశ్వర్య.

“పోన్లే, అంతకన్నా కావలసింది ఏముంది? నువ్వు హైదరాబాద్ వచ్చాక ఫోన్ చేయి. వచ్చి కలుస్తాను.”

“సరే మధూ... ఇక ఉంటాను...” ఫోన్ డిస్కనెక్ట్ చేసింది ఐశ్వర్య...

“ఎలా ఉంది నీ ఫ్రెండ్?” ఐశ్వర్యను దగ్గరకు లాక్కుంటూ అన్నాడు కార్తీక్.

“బాగుంది... ఊ., ఇప్పుడు చెప్పు... హైదరాబాద్ తిరిగి వెళ్ళాక మన ప్రోగ్రాం ఏమిటి?”

“ఏముందీ? సెలవైపోవచ్చింది కదా, తిరిగి నేను జాబ్ లో చేరటం, నువ్వు ఉద్యోగంలో చేరటం...”

“అది కాదు కార్తీ... మనం ఎక్కడ ఉంటాము?”

“మా ఫ్రెండ్స్ కి చెప్పాను కదా, మంచి ఫ్లాట్ తీసుకుంటారు మన కోసం... కావలసినవి అన్నీ కొనుక్కుందాం...” ఆమె ముంగురులు సవరిస్తూ అన్నాడు కార్తీక్.

“నేనంటే నీకు ఇష్టమా?” జవాబు తెలిసినా మురిపెంగా మళ్ళీ అడిగింది ఐశ్వర్య...

“చాలా...” తమకంగా అన్నాడతను చేతి వేళ్ళతో సరాగాలు ఆడుతూ...

“థాంక్ యు కార్తీ... ఐ లవ్ యూ సో మచ్... ఈ ఆనందం ఎప్పుడూ ఉండాలి... ఉంటుంది కదూ?”

ఝంఝామారుతంలా ఆమెను కమ్ముకు పోతూ అన్నాడు, “ఐ లవ్ యు టూ డార్లింగ్... ఎప్పుడూ ఉంటుంది... నిన్ను చూసిన క్షణమే నీ వశమై పోయింది నా మనసు... మన నిర్ణయానికి మనం బాధ పడే రోజు రాకూడదు, రానివ్వను...”

ఏదో చెప్పబోతున్న ఐశ్వర్య పెదవులను తన పెదవులతో మూసేసి, లైట్ ఆర్పేసాడు.

***

ఇంటర్ వ్యూ కోసం అని సిటీకి వచ్చి తన హాస్టల్ కే వచ్చింది మధు బాల. ఒకటి రెండు రోజుల కోసం తమ వార్డెన్ సహకారంతో అక్కడ ఉండటం అమ్మాయిలకు పరిపాటే.

ఆమెను చూడగానే ఆనందంగా ఆహ్వానించింది పద్మలత.

“మధ్యాహ్నం ఇంటర్ వ్యూ ఉంది మేడమ్. అయిపోతే సాయంత్రం వెళ్ళిపోతాను. లేక పోతే రేపటి వరకూ ఉంటాను. ఇవిగో మీ ఛార్జెస్...” పర్స్ తీయబోయింది.

“అయ్యో, ఒక్క రోజుకు ఎందుకు తల్లీ, వద్దు...” వారించి, గెస్ట్ రూమ్ చూపింది పద్మ లత.

“ఐశూ ఎలా ఉంది మధూ?” అని అడిగింది.

“బాగానే ఉంది మేడమ్... ప్రస్తుతం జైపూర్ లో ఉంది...” చెప్పింది మధు బాల.

“అతన్ని ఒకటి రెండు సార్లు చూసాను. బావుంటాడు... పెద్ద పొజిషన్ లోనే ఉన్నాడు కదూ?”

“అవును... కానీ....” మధు బాల గొంతులో దిగులు చోటు చేసుకుంది.

“ఐశ్వర్య తీసుకున్న నిర్ణయమే మంచిదనిపిస్తూ ఉంటుంది నాకు...” అన్నది పద్మ లత. ఆశ్చర్యంగా చూసింది మధుబాల.“అవునమ్మా... మన దేశంలో పెళ్ళి అనేది ఇప్పుడు ఒక వ్యాపారం అయి పోయింది. మనం వర కట్నం ఇవ్వాలి, బానిసలుగా చాకిరీ చేయాలి. వాళ్లకి పిల్లల్ని కనివ్వాలి. సమానత్వం అనేది లేదు. ఉద్యోగం చేస్తే జీతమంతా పువ్వుల్లా అతడి దోసిట్లో పోయాలి. అతనికి కావలసినప్పుడల్లా పడక సుఖాన్ని అందివ్వాలి. మనకి మూడ్ ఉన్నా లేకున్నా, ఆరోగ్యం సరిగ్గా ఉన్నా లేకున్నా బలవంతంగా అదొక హక్కు లాగా దాంపత్య సుఖాన్ని అనుభవించి తీరతాడు మొగుడు... కట్టు బానిసల్లే అతనికీ, అతడి తరఫు వారికీ ఊడిగం చేయాలి. ఈ వివాహ విధానం కన్నా ఐశ్వర్య ఎంచుకున్న జీవన విధానం నాకు నచ్చింది. సహ జీవనంలో బంధాలు, కట్టుబాట్లు ఉండవు కదా... ఎవరి వ్యక్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకోవచ్చు అనిపిస్తోంది...” తన జీవితంలో పొందిన చేదు అనుభవాలను నెమరు వేసుకుంటూ అన్నది పద్మ లత.
“మేడమ్ మీరు...”

“మీకందరికీ  తెలుసు కదా, నేను సింగిల్ ఉమన్ని. చాల కాలం అయిందమ్మా నేను అతన్నుంచి విడి పోయి. నరక యాతన పడి దాన్నుంచి విముక్తిని పొందాను. ఇదిగో ఈ ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉన్నాను. అతను మరొక పెళ్ళి చేసుకున్నాడు...” ఏ భావమూ లేకుండా నిర్లిప్తంగా చెప్పింది పద్మలత.

“కానీ, మీరెందుకు శిక్ష అనుభవించాలి? అతడు హాయిగా ఉన్నాడుగా?” కోపంగా అన్నది మధు బాల.

“ఇది జవాబు లేని ప్రశ్న మధూ... అతడు అదృష్టవంతుడు అంతే... ఆ జీవితం నాకు వద్దని అనుకున్నాను కనుక నేనూ అదృష్టవంతురాలినే... పదేళ్ళ క్రితం నాకూ ఒక కార్తీక్ దొరికి ఉంటే నేనూ ఐశ్వర్య మార్గమే పట్టి ఉండే దాన్నేమో... ఆ నరక ప్రాయమైన అనుభవాలను తలచుకుంటే చాలు, జీవితం మీదనే విరక్తి వస్తుంది తెలుసా? థాంక్ గాడ్! అయామ్ రిలీవ్డ్ ఫ్రం దట్ హారిబుల్ పెయిన్! ఒక చిన్నారిని అడాప్ట్ చేసుకోవాలని ఉంది...అమ్మను అయి, ఒక పాపకు జీవితాన్ని ఇవ్వాలని ఉందమ్మా...” కావాలనే ‘అనాథ’ అన్న మాట వాడని పద్మ లత ఉన్నత వ్యక్తిత్వానికి మనసు లోనే వందనాలు అర్పించింది మధు.

“మేడమ్. మీకు ఉద్యోగంలో సమస్యలు ఎదురు కాలేదా? ఒంటరి జీవితం గడుపుతున్నప్పుడు మీ స్నేహితులనో, బంధువులనో చూసినప్పుడు మీరేదో కోల్పోతున్నారన్న భావన కలగదా?”

“లేదు, అలాంటి భావనలకు దూరమై చాలా కాలమైంది మధూ... నాలోని అమ్మ మాత్రం కలవరిస్తూ ఉంటుంది బిడ్డ కోసం. ఇక ఉద్యోగంలో సమస్యలా? చాలానే ఎదుర్కొన్నాను.  ఉద్యోగంలోంచి బదిలీ అవకుండా ఇక్కడే ఉండాలంటే నా శరీరాన్ని లంచంగా అడిగారు నా పై ఆఫీసర్లు చాలా మంది. వాళ్ళ సంగతి అంతా విపులంగా నా ఉన్నతాధికారులకు వివరణ ఇస్తూ ఉత్తరాలు రాస్తాను. మా డిపార్ట్మెంట్ రూల్స్, రెగ్యులేషన్స్, వాటిల్లోని  ‘లా’ నాకు చాలా నేర్పించాయి.  నేను నేర్చుకున్న ఆత్మ రక్షణ విద్యలూ నాకు బాగా పనికి వచ్చాయి.  ఎట్ లీస్ట్ నన్ను నేను ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నాను.”

“మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి మేడమ్ !” ఆరాధనగా అన్నది మధుబాల.

“ఎవరి జీవితాలు వారికే పాఠశాలలమ్మా! అనుభవాలు అన్నీ నేర్పుతాయి. ఆ, వెళ్లి టిఫిన్ చేసి, కాసేపు విశ్రాంతి తీసుకుని, ఇంటర్ వ్యూకి  ప్రిపేర్ అవ్వమ్మా...”

“థాంక్ యు మేడమ్”

***

జైపూర్ నుంచి తిరిగి రాగానే హాస్టల్ కి వచ్చి తన కొద్దిపాటి సామాను తీసుకుని కార్తీక్ తో పాటుగా అపార్ట్మెంట్ కి వచ్చేసింది ఐశ్వర్య. అప్పటికి మళ్ళీ తమ ఊరికి వెళ్ళింది మధుబాల.

ఇంటికి కావలసిన సామాన్లు, వంట పాత్రలు, సరుకులు అన్నీ కొనుక్కున్నారు ఐశ్వర్య, కార్తీక్ కలిసి షాపింగ్ చేసి. ఇల్లంతా నీట్ గా సర్దుకున్నారు. ఒక రెండు రోజుల్లో తన బట్టలు తీసుకుని వచ్చేస్తానని ఇంటికి వెళ్ళాడు కార్తీక్.

తన ఇల్లు చూసుకుంటుంటే ఎంతో ఆహ్లాదంగా, హాయిగా  అనిపిస్తోంది ఐశ్వర్యకి. ఎంత బాగుందీ జీవితం? ఎంత చక్కని ప్రేమికుడు కార్తీక్?  ఇన్నాళ్ళకి తనకి ఒక ఇల్లు, తనదైన ఇల్లు... హాయైన జీవితం... రేపటి ఇంటర్వ్యూ బాగా చేస్తే ఉద్యోగంలో కూడా జాయిన్ అయిపోవచ్చు...
మధూ కూడా ఇంటర్వ్యూ బాగా చేసానని చెప్పింది. అదీ సిటీకి వచ్చేస్తే అబ్బ... చక్కగా మళ్ళీ కలుస్తూ ఉండవచ్చు...

హుషారుగా స్నానం చేసి తేలిక పాటి నైట్ డ్రెస్ వేసుకుని, అన్నం తిని ప్రశాంతంగా నిద్ర పోయింది ఐశ్వర్య.

***

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్