Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasa darahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

రాజస్థాన్ అందాలు చూద్దాం రారండి ( ఆరవ భాగం) - కర్రానాగలక్ష్మి

                                                                                        జోధ్ పూర్

జోధ్ పూర్ రాజస్థాన్ లోని రెండవ పెద్ద పట్టణం . ఈ నగరం చూసిన తరువాత మన మనసులలోయెన్నో యేళ్లు నిలిచిపోయే నగరం యిది . రాజస్థాన్ సాంప్రదాయానికి , కళలకి పుట్టినిల్లని అనిపించక మానదు . ఆడామగా చిన్నా పెద్దా అందరూ సాంప్రదాయక దుస్తులు ధరించి కనిపిస్తారు . మనదేశంలో పాశ్చాత్య పోకడలు సోకని యేకైక నగరం యిదేనేమో అని అని పించక మానదు . ప్రతీ యిల్లూ యెర్రరాతి రాజస్థానీ సాంప్రదాయక డిజైనులతో కట్టినవే . రాజస్థానీ వారి సొంతమైన దాల్ బాటీ , చుర్మా , కచోడీలలో రకాలు యిక్కడవున్నంత రుచిగా మరెక్కడా వుండవు . అలాగే రాజస్థాన్ హస్తకళలకు సంభందించిన వస్తువులు జోధ్ పూర్ లోనే కొనుక్కోవాలి ముఖ్యంగా కర్రతో చేసిన కిటికీలు ( ఝరోకా) చాలా ప్రాముఖ్యతను పొందేయి . ఇక్కడ షాపింగు కోసమే ఒక రోజు ఖాళీగా వుంచుకోవాలి . కాయగూరలనుంచి తీసిన రంగులతో చేసే అద్దకాలపనులకి , రాజస్థాన్ కి మాత్రమే సొంతమయిన " బాందిని " , గోటా పత్తి ( చిన్న చిన్న మెరిసే బట్టని  ఆకుల ఆకారంలో కట్చేసి డిజైనులుగా అమరుస్తారు ) . కోటా చీరలకి యిక్కడ షాపింగ్ చెయ్య వలసిందే . వెండి , దంతం , ఒంటె యెముకలు , ఒంటె చర్మం , కర్ర లతో చేసిన వస్తువులకు ఈ వూరు ప్రసిధ్ది . ఊరి గురించిన వివరాలు రాయకుండా షాపింగు గురించి రాస్తోందేమిటా అని అనుకుంటున్నారా ? ఆడదాన్నిగదా ? సరే మరి చారిత్రిక వివరాల్లోకి వెళదాం . జోధ్ పూర్ రాజస్థాన్ లోని మార్ వార్ ప్రాంతానికి చెందినది  జై పూర్ ని పింక్ సిటీగా పిలిచినట్లే జోధ్ పూర్ ని నీలి నగరం ( బ్లూ సిటీ ) అని అంటారు . ఇప్పుడే కాదు రాజుల కాలం నుంచి కూడా జోధ్ పూర్ ముఖ్య వ్యాపార కేంద్రంగా వ్యవహరింపబడు తోంది .

చరిత్రకు అందిన వివరాల ప్రకారం ఈ ప్రాంతం 11 వ శతాబ్దం నుంచి గుజ్జర్ వంశానికి చెందిన పరిహార్ రాజుల ఆథీనం లో వుండేది . 1459 లో రావు జోధా రాథోడ్ జోధ్ పూర్ ను నిర్మించి రాజధానిని మాండోర్ నుంచి మార్చేడు . జోధ్ పూర్ ని " సన్ సిటి " అని కూడా వ్యవహరిస్తారు " దీనికి రెండు కారణాలు ప్రాచుర్యం లో వున్నాయి . ఒకటి సంవత్సరమంతా సూర్యకాంతి పడే నగరం కాబట్టి , రెండో కారణం ఈ నగరాన్ని పరిపాలించిన రాజులు సూర్యవంశానికి చెందిన వారవటం వలన , రాజులు ప్రజలు కూడా సూర్యుని పూజించనిదే వారి దైనందిన పనులు మొదలు పెట్టేకపోవడం కారణాలుగా చెప్తారు . 1540 నుంచి 1556 వరకు ఈ ప్రాంతం ఆఫ్ఘన్స్ చేతుల్లో వుండి తిరిగి ఆఖరు హిందూ చక్రవర్తి గా పిలువబడే హేమూ అధికారం లో వచ్చి , అతని మరణానంతరము మొఘల్ చక్రవర్తుల చేతుల్లోకి వెళ్లి  ఔరంగజేబు అనంతరం మరాఠుల పరిపాలనలోనూ , అనంతరం ఆంగ్లేయుల పాలనలోను వున్న జోధ్ పూర్ యెప్పుడూ యుధ్దాల తోనూ , మేవాడ్ రాజులతో అంతఃకలహాలతోనూ గడిచిందనే చెప్పుకోవాలి . భారత పకిస్థాన్ వేర్పాటు సమయంలో యీ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న హన్వంత్ సింగ్ పాకిస్థాన్ వైపు మొగ్గు చూపగా సర్దార్ వల్లభాయి పటేల్ చొరవతో భారతదేశం లో తన సామ్రాజ్యం వినీలం చెయ్యడానికి వప్పుకున్నాడు . 1956 లో రాజస్థాన్ రాష్ట్రం యేర్పడ్డప్పుడు ఈ మార్ వార్ ప్రాంతం రాజస్థాన్ లో చేర్చబడింది .

జోధ్ పూర్ లో దర్శనీయ స్థలాలు -----

1) మెహరాన్ ఘడ్ కోట
2) ఉమైద్ భవనం
3) జస్వంత్ థాడా
4) బాలాసమండ్ సరస్సు
5) కెలానా సరస్సు

6) ఘంటా ఘర్

1) మెహరాన్ ఘడ్ కోట-------

మిహిర్ అంటే సూర్యుడు అని గఢ్ అంటే నివాసము అని అర్ధం , మిహిరగఢ్ కాలక్రమేణా మెహరాన్ గఢ్ అయిందని అంటారు . 1460 లో రావు జోధా 410 అడుగుల యెత్తులో నిర్మించిన కోట . భారతదేశం లోని అతి పెద్ద కోటలలో ఒకటిగా లెక్కించే కోట యిది . భారత దేశ చరిత్రలో ఈ కోట చూసినన్ని యుధ్దాలు మరే కోట చూసి వుండదేమో ? కలహాలతోనూ , అంతఃకలహాలతోనూ అతలా కుతలమయిన కోట . కోటను రక్షించుకొనే క్రమంలో రాజులు వీరమరణం పొందగా రాణులు సతీ సహగమనం చేసుకోడం తో ఈ కోటలో నెత్తుటి మరకలు యెప్పుడూ ఆరలేదు అంటే అతిశయోక్తి కాదు . ఇన్ని యుధ్దాలను  యెదుర్కున్నా కోటకు  కొన్ని ఫిరంగుల గుర్తులు తప్ప వేరే క్షతి కలుగలేదు అంటే ఆ నిర్మాణం యెంత పటిష్ఠమైనదో మనకి తెలుస్తుంది . కోట చుట్టూరా పటిష్ఠమైన గోడ గోడ చుట్టూరా కందకం యిది దుర్భేధ్యమైన కోట అని చెప్తున్నట్టుగా వుంటుంది . మెలికలు తిరిగిన కొండ దారిలో ఈ కోట చేరుతాం . మొదటి గేటుకి పక్కగా వున్న రెండో గేటు చేరుతాం . అక్కడ జైపూర్ రాజులతో జరిగిన యుధ్దంలో జైపూర్ సైనికులు ప్రయోగించిన ఫిరంగి గుళ్ల వల్ల యేర్పడ్డ చిహ్నాలను చూడొచ్చు . అంతస్తులలో నిర్మించిన ఈ కోట చూడ్డానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది . ఒక వైపునుంచి కోట పై భాగానికి చేరడానికి లిఫ్టు సౌకర్యం వుంది . మేము లిఫ్టులో పైకి వెళ్లి , కిందకి దిగుతూ కోటను చూసేము . నడవడానికి వోపిక లేని వారు లిఫ్టులో పైకి వెళ్లి తిరిగి లిఫ్టు ద్వారా కిందకు రావడం చేస్తూ వుంటారు .

ఈ కోట సంరక్షణాభారం పురాతత్వశాఖ ఆధ్వైర్యంలో వుంది . వీరు కోటను పెద్ద పెద్ద వారి వివాహాలకు గాను అద్దెకు యిచ్చి నిర్వాహాణా వ్యయం సంపాదిస్తున్నారు . బాలీవుడ్ నటి "శిల్పా షట్టి " వివాహ వేదిక ఈ కోటేనట . దీని వలన కోట , మ్యూజియంల రక్షణ కు కావలసిన సొమ్ము చేకూర్చుకో గలుగుతున్నారు . 
ఈ కోటకి యేడు ద్వారాలు వున్నాయి . ముఖ్యంగా " జయపోల్ " , " ఫతేపోల్ " , దేఢ్ " కంగ్రా పోల్  " , " లోహ పోల్  " ల గురించి ముఖ్యంగా వివరిస్తారు . మిగతావి మామూలుగా వేరే ప్రదేశాలకి వెళ్లే మార్గాన్ని సూచించే విధంగా వుంటాయి . ఢిల్లీగేటు , అజ్మీరీగేటు యిలా , కాని " జయపోల్ " జైపూర్ ,బికనీరు మీద సాధించిన విజయానికి చిహ్నం గా మహారాజా మాన్ సింగ్  , ఫతేపోల్ మొఘలులపై సాధించిన విజయానికి చిహ్నంగా మహారాజా అజయ్ సింగ్ నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది , కంగ్రా పోల్ మీద జైపూర్ సైనికుల ఫిరంగుల దాడికి గురైన గోడను దానిపై కల ఫిరంగి గుళ్ల చిహ్నాలను చూడొచ్చు , యిక లోహ పోల్ యిది ఈ కోట యొక్క చివరి ద్వారం . దీని పైన 1843 లో మహారాజా మాన్ సింగ్ మరణానంతరం సహగమనం చేసిన అతని సతులు  చేతి ముద్రలు కలిగి వుంటాయి .ఈ కోటలో మిగతా కోటలలో వలె శీష్ మహల్ , దివానీ ఖాస్ , దివానీ ఆమ్ , రాణీ మహల్ మొదలయిన చూడదగ్గ ప్రదేశాలతో పాటు మ్యూజియంలు చూడదగ్గవి . ఇందులో చక్కని శిల్ప కళ తో వుండే మోతి మహల్ , ఫూల్ మహల్ , శిలహ్ ఖానా , దౌలత్ ఖానా వీటిని చూడ్డానికి రెండుకళ్లు చాలవు . కోటంతా చూసుకొని పై అంతస్తు చేరుకుంటే అక్కడ నుంచి కనిపించే దృశ్యాలు అహ్లాదకరంగా వుంటాయి . మనుషులని కిందకు తోసెస్తుందా అన్నంత గాలి చుట్టూరా కనిపించే ప్రకృతి అందం ఒకవైపు మరో పక్క పంచలోహ నిర్మితమైన " కిల్ కిలా " ఫిరంగి ఒకయెత్తు . తిరిగి కిందకి వచ్చేటప్పుడు మరో వైపునుంచి ఒక గదిలోంచి మరో గదిలోకి వెళుతూ ఒక్కోగదిలో ఒక్కో అద్భుతాలను వీక్షిస్తూ మ్యూజియం చేరుకుంటాం . పల్లకీలు , వుయ్యాలలు , రాజుల రాణుల దుస్తులు , కవచాలు , డాలులు , కత్తులు , తుపాకులు , ఫిరంగులు మొదలయిన వాటిని చూస్తూ వుంటే మనకు కాలక్రమేణా యుధ్దాలలో వుపయోగించిన ఆయుధాలను గురించి అవగాహన కలుగుతుంది . యేనుగులపై రాజులను వూరేగించడానికి వాడే అంబారీలను కూడా యిక్కడ భద్రపరిచేరు .  

ఈ కోటను పరిపాలించిన రాజులు వారి భార్యల , పిల్లల వివరాలు , వారు చేసిన  యుధ్దాలు , వారి తరవాత సింహాసనం అధిష్టించిన వారి వివరాలు కాలానుసారంగా వివరించే రాతలు హిందీ , ఆంగ్ల భాషలలో ప్రతీ విభాగంలోని వుంచడం తో సందర్శకులకు యెంతో వుపయుక్తంగా వుంది . రాజులకు యితర రాజుల ద్వారా అందిన బహుమతులు , వాటి వివరాలు కూడా  యిక్కడ ప్రదర్శన లో వున్నాయి . ఆయుధాల ప్రదర్శనాగారంలో ముఖ్యంగా సందర్శకులను ఆకట్టుకొనేవి అక్బరు కత్తి , తైమూరు కత్తి . మార్వార్ జోధ్ పూర్ కి చెందిన సాంప్రదాయక చిత్రాలు యెన్నో యీ మ్యూజియం లో సందర్శకులను మంత్ర ముగ్ధులను చెయ్యక మానవు . వాటికి వుపయోగించిన ప్రాకృతిక రంగుల గురించి , చిత్రంచిన కాలం గురించి చదివితే యిన్ని వందల సంవత్సరాలుగా రంగులు చెక్కు చెదరకుండా వున్నాయి అంటే ఆశ్చర్యం కలుగక మానదు . టర్బన్ గేలరీ చిన్నా పెద్దా అందరినీ ఆకర్షిస్తుంది . మొగవారు తలపాగా ధరించడం అనేది అనాదిగా వస్తున్న మనదేశపు సాంప్రదాయం గా చెప్పుకోవాలి . కాల క్రమంలో యీ అలవాటు తగ్గి పెళ్లికి మాత్రం పరిమిత మయ్యింది  . తలపాగా కట్టుకునే అలవాటు మన తెలుగు వారికి కూడా వుండేదని మనలో  యెందరకి తెలుసు ? కుటుంబం యెక్క మర్యాద మగవాడి తలపాగా పైన ఆధారపడి వుండేది . అలాగే తలపాగా బట్టి వారి స్థితి గతులను అంచనా వేసేవారు . తలపాగాకి అయిదు గజాలకు తక్కువ కాకుండా వుండే రంగురంగుల బట్టని వుపయోగిస్తారు . రాజస్థాన్ , పంజాబు , హరియాణా , గుజరాత్ , మహారాష్ట్ర , లలో యిప్పటికీ తలపాగా వాడకం మనకు కనిపిస్తూ వుంటుంది . ఒక్కొక్క రాష్ట్రం వారు ఒక్కొక్క పధ్దతిని పాఠిస్తూ వుంటారు . పూర్వకాలం  పండుగలకు , వుత్సవాలకు , పెళ్లిళ్లకు వాడే రకరకాల తలపాగాలు యిక్కడ ప్రదర్శనలో వుంచేరు . ఆ తలపాగాలను చూడగానే వాటిని కనుక్కోవాలనే కోర్కె మగవారిలో కలగడం సహజం .         ఈ కోటలో మరో ఆకర్షణ రావు జోధ మాందోరు నుంచి జోధ్ పూర్ కి రాజధానిని మార్చినప్పుడు అక్కడి నుండి పరిహర్ రాజుల కులదేవి అయిన ఛాముండా దేవి విగ్రహాన్ని కూడా తరలించి యీ కోటలో మందిర నిర్మాణం చేసి ప్రతిష్టించేరు .

ఈ కోటలో " కీరత్ సింగ్ కి ఛత్రి " వుంది . " ఛత్రి " అంటే సమాధి , కీరత్ సింగ్ అనే సిపాయి శతృరాజులను యీకోటలోపల ప్రవేశించనివ్వకుండా యుధ్ద సమయంలో నియంత్రించి వీరమరణం పొందేడట , అతని వీరత్వానికి గుర్తుగా అతని పార్థివ శరీరాన్ని కోటలోనే సమాధి చేసేరు అప్పటి రాజులు .

2) ఉమైద్ భవనం-------- 

1928లో నిర్మాణం మొదలుపెట్టి 1943 లో పూర్తి చెయ్యబడిన రాజభవనం . మహారాజా సవాయి జైసింగ్ -2 కి చెందిన ఈ భవనం  ప్రపంచం లో అతి పెద్ద నిజభవనాలలో ఒకటిగా లెక్కిస్తారు . మహారాజా జైసింగ్ -2 తన నివాసార్ధం మొత్తం 347 గదులుతో నిర్మించుకొన్న  భవనం . దీనిని " చిత్తార్ భవనం " అని కూడా అంటారు . ఈ ప్రదేశంలో వున్న చిత్తార్ కొండను కొట్టి దాని రాళ్లని యీ నిర్మాణానికి వుపయోగంచడం వలన యీ భవనాన్ని " చిత్తార్ భవనం " గా కూడా పిలువడం జరుగుతోంది . ఈ భవన నిర్మాణానికి  " ఇసుకరాయి "  పాలరాతి లో మేలురకమైన " మఖరానా మార్బుల్ " ని వుపయోగించేరు . బర్మా నుంచి చెప్పించిన మేలురకమైన టేకు తో  కిటికీలు దర్వాజాలూ  చేయించేరు . 300 మంది ఒకే సారి కూర్చొని భోజనం చెయ్యగలిగేటట్లు  పెద్ద హాలు అందులో పెద్ద భోజనాల బల్ల ను నిర్మించేరు . ఈ భవనం ప్రపంచం లోనే అతి పెద్దదైన " నిజభవనం " గా పేరు పొందింది .  ఈ నిర్మాణం జరిగిన కొన్ని సంవత్సరాలకు రాజరికాలు పోవడంతో యీ భవనం లో కొంత భాగం మ్యూజియం గా మార్చబడింది . 1971 లో సగభాగం  తాజ్ హొటల్ కు యిచ్చి మిగతాభాగం లో ప్రస్తుతం యీ భవన యజమాని అయిన మహారాజా ఉమైద్ సింగ్ తన పరివారంతో నివసిస్తున్నారు . 

3)జస్వంత్ థాడా ----

అందంగా తీర్చిదిద్దిన పెద్ద వుద్యానవనం వనంలో వున్న పెద్ద భవనం . అతి పలుచని పాలరాతి పలకలతో నిర్మించబడ్డ అందమయిన భవనం . సూర్యుని కిరణాల వేడి లోపలి గదులలోకి యే ఆటంకం లేకుండా ప్రవేశించ గలిగేట్టు కట్టిన భవనం యిది .  మహారాజా సర్ధార్ సింగు 1899 లో తన తండ్రి అయిన మహారాజా జస్వంత్ సింగ్ జ్ఞాపకార్ధం నిర్మించిన సమాధి స్థలం . మార్వార్ రాజుల సమాధులు పలుచని పాలరాతి పలకలతో యెంతో అందంగా కట్టినవి యిక్కడ వున్నాయి . రాజా జస్వంత్ సింగ్ ఆత్మ సాయంత్రం తరవాత వుద్యానవనంలో తిరుగుతూ వుంటుందని స్థానికుల వాదన . చాలా మంది ఆత్మని చూసేమని కూడా చెప్తూ వుంటారు . ఆ ఆత్మ మంచిదని , యెవరికి కీడు చెయ్యదని కూడా అంటారు .

4) బాలాసమండ్ సరస్సు------

బాలాసమండ్ సరస్సు జోధ్ పూర్ మాందోరు రోడ్డు మీద జోధ్ పూర్ కి సుమారు అయిదు కిలో మీటర్ల దూరంలో వుంది .ఒక కిలోమీటరు పొడవు , 50 మీటర్ల వెడల్పు , 15 మీటర్ల లోతు వున్న యీ సరస్సును 1159 లో మాందోరు పట్టణానికి కావలసిన నీటి సరఫరా కై అప్పటి రాజైన మహారాజా బాలక్ రావు పరిహార్ నిర్మించేడు . ఈ సరస్సు చుట్టూరా పూల వుద్యానవనం పెంచి అందులో వివిధ రకాలను పండ్ల తోటలను వేయించేడు . ఈ సరస్సు చుట్టూరా వున్న వుద్యానవనం మంచి సంరక్షకుల చేతులలో అందాలను సంతరించుకొని అనేక పూల , పండ్ల జాతులకు , పక్షులకు , నక్క మొదలయిన జంతువులకు నివాసస్థానంగా మారింది .

5) కెలానా సరస్సు------

ఈ సరస్సు జోధ్ పూర్ కి పడమరగా యెనిమిది కిలోమీటర్ల దూరంలో వుంది . ఈ ప్రదేశం లో భీమ్ సింగ్ , తాఖత్ సింగ్ ల చే నిర్మింపబడ్డ భవనాలను పడగొట్టి 1872 లో మహారాజా ప్రతాపసింగ్  ఈ సరస్సుని నిర్మించేడు . ఈ సరస్సు 82 చదరపు కిలోమీటర్ల వైశాల్యము కలిగి జోధ్ పూర్ చుట్టుపక్కల గ్రామాలకు మంచినీటిని అందిస్తోంది . చుట్టూరా లావా రాతి కొండలు , దట్టమయున అడవులు వుండడం తో శీతాకాలంలో సైబీరియన్ కొంగలు యీ సరస్సుకి వస్తాయి . ఈ సరస్సుకు నీరు " హాథీ నహర్ " నుంచి వస్తుంది  . ఇందులోని నీరు " తాఖత్ సాగర్ " , ఉమైద్ సాగర్ లకు చేరుతుంది .

6) ఘంటా ఘర్-------

1880 నుంచి 1911 వరకు జోధ్ పూర్ ను పరిపాలించిన మహారాజా సర్ధార్ సింగ్ యీ ఘంటస్థంబాన్ని నిర్మించేడు . ప్రజలందరకీ కనిపించాలని వూరి మధ్యలో కట్టించేడు . ఊరికి మధ్యగా వుండడంతో మెల్ల మెల్లగా క్రయవిక్రయాలకి కూడలిగా మారింది . సర్ధార్ బజారుగా పిలువబడుతోంది . ఈ మార్కెట్టు రాజస్థాన్ హస్త కళలకు సంభందించినవి చవుకగా లభించే ప్రదేశం గా చెప్తారు , అది నిజమేనన్నట్లుగా అక్కడ కనిపించే రాష్ట్రేతులు యెక్కువగా కొనుగోళ్లు చేస్తూ కనిపిస్తూ వుంటారు . సూది నుంచి వజ్రాల వరకు అన్నీ యిక్కడ లభ్యమౌతాయని స్థానికులు చెప్తారు . 

జోధ్ పూరు కోటలు , సమాధులు చూస్తే నాకు ముందుగా " రాజుల సొమ్ము రాళ్ల పాలు " అనే సామెత గుర్తొచ్చింది . రాజుల దర్పం , వాళ్ల విలాసవంతమైన జీవనవిధానం వాటితో పాటు భరోసా లేని వారి బ్రతుకు , పతి తో పాటు సశరీరంగా అగ్ని ప్రవేశం చేసిన సతులు యివన్నీ కూడా నాలో " చావు బ్రతుకు యివి రెండే సత్యాలు , మధ్యలో వున్నదంతా మాయ " అనే వైరాగ్యం చిన్నగా కదలాడింది . అదీ క్షణం మాత్రమే , మరునాడు మా ప్రయాణం " మౌంటు ఆబు  "  వైపు సాగింది .

పై సంచికలో  " మౌంటు ఆబు  " గురించి చదువుదాం , అంత వరకు శలవు .

మరిన్ని శీర్షికలు
avee - ivee