Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunaluguyugalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనంవెంకటవరప్రసాదరావు

sahiteevanam

ఆముక్తమాల్యద 

భూదేవికి వరాహస్వామి వినిపించిన మాలదాసరి కథను విష్ణుచిత్తులవారికి వినిపించాడు శ్రీహరి. సంకీర్తనాసేవను  మించిన సేవ ఏదీ లేదు అని తెలుసుకున్నభూదేవి సంకీర్తనామార్గాన్ని ప్రపంచంలో బోధించడానికి గోదాదేవిగా అవతరించింది అని తెలిపాడు. గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, తన సేవలో ఆమె కోరిక తీరుతుందని సెలవిచ్చాడు. స్వామి ఆజ్ఞ ప్రకారం విష్ణుచిత్తులవారు గోదాదేవిని వెంటబెట్టుకుని శ్రీరంగానికి వెళ్ళాడు.  

చని కాంచె న్విరజాభిధాంతర  వపు స్సహ్యోద్భవాతీర నం
దన వాటీవలయద్రుమావళి దళాంతర్దృశ్య  పాపాళి భం
జన చాంపేయసుమాయమాన విషమ స్వర్ణావృతివ్రాత ర
శ్మి నభస్పృక్ఛిఖరాళి దీపకళికాశృంగంబు శ్రీరంగమున

శ్రీరంగానికి వెళ్ళిన విష్ణుచిత్తులవారు అల్లంత దూరంనుండే శ్రీరంగదేవాలయశిఖరాలను చూశాడు. విరజ అని మరొక పేరు కలిగిన, సహ్యపర్వతాలలో ఉద్భవించిన కావేరీనదీ తీరములో, నందనవనములవంటి వనములలోని చెట్ల ఆకులమధ్యనుండికనిపించే, పాపములు అనే తుమ్మెదలను భంగపరచే పెంగపూవులవంటి,విషమసంఖ్యలో ఉండే, ఆకాశానికి ఒరుసుకుంటున్నట్లు ఎత్తుగా ఉండే దేవాలయ శిఖరాలను చూశాడు. వైకుంఠానికి చుట్టూ ఒరుసుకుని ప్రవహించే దివ్యనది విరజానది.శ్రీరంగమును చుట్టి ప్రవహించే నది కావేరి. కావేరికి విరజ అని మరొకపేరు ఉన్నది అని అతిశయోక్తిగా అంటున్నాడు, విరజకు మరోపేరు కావేరి అనకుండా. తుమ్మెదలకు సంపెంగపూల పరిమళము మింగుడుపడదు, కొరుకుడుపడదు, సహించదు. పాపములు అనే తుమ్మెదలకు శ్రీరంగశిఖరప్రభలు సహించవు, పాపులకు శ్రీరంగశిఖర ప్రభలు సహింవు, సంప్రాప్తించవు. పుణ్యాత్ములకు మాత్రమే ఆ ప్రాప్తం, అదీ చమత్కారం.శ్రీరంగదేవాలయ శిఖరాలు సంఖ్యలో ఏడు, కనుక విషమసంఖ్య అంటున్నాడు.


 చోళీహల్లకచితకచపాళపాళీ

భవద్విపంచీస్వన భృంగాళీ కవేరదుహితృ

రాళీధ్వను లెసఁగుగాడ్పు

వ్రతివడ యుడిపెన్

 అది చోళ సామ్రాజ్యం. అక్కడి స్త్రీల కొప్పులలో కూర్చిన ఎర్ర కలువలకు బారులు తీరి  ముసురుకుంటున్న  తుమ్మెదలు  చేస్తున్న రొద (అక్కడి అందగత్తెలు చేస్తున్న) వీణా నాదంలా ఉన్నది. కావేరీ నదిలోని హంసల మధుర కూజితములు వినిపిస్తున్నాయి.ఆ నదిమీదినుండి వీస్తున్న చల్లనిగాలి వ్రతనిష్ఠలు, నియమాలు కలిగిన విష్ణుచిత్తులకు మార్గాయాసాన్ని తీర్చింది. అఘమర్షణసూక్తములసహితముగా స్నానం చేసి, బ్రహ్మయజ్ఞము మొదలైన నిత్యానుష్ఠాన విధులను తీర్చుకుని, స్నానముచేసి, సర్వాలంకృతయైన తన కుమార్తెను వెంటబెట్టుకుని భాగవత సమూహము సేవిస్తుండగా స్వామిని దర్శించుకొనడానికి వెళ్ళాడు. ఆ సనయానికి రంగనాథుని సేవించడానికి వచ్చిన దేవతలను అడ్డుకొని, యిది మీకు సమయము కాదు, వెళ్ళండి అని, విష్ణుచిత్తులవారికి స్వామి దర్శనానికి అనుమతిని 

యిచ్చాడు చండుడు అనే ద్వారపాలకుడు!రత్నాలు తాపడంచేసిన అరుగుమీద పరచిన బంగారు తివాచీమీద కూర్చున్న విష్వక్సేనుల దర్శనం చేసుకున్నాడు విష్ణుచిత్తులవారు. తెల్లతామరలవంటి కన్నులున్న స్వామి ఆ స్వామి.శ్రీహరియొక్క రాజముద్ర ఉన్న ఉంగరాన్ని, బెత్తాన్ని ధరించి ఉన్నాడు. ఆయనకు రెండుప్రక్కలా గజముఖులైన వందమంది సేవకులు సేవిస్తున్నారు. సూత్రవతీదేవితో కూడి ఉన్న ఆ స్వామిని విష్ణుచిత్తులవారు సేవించారు. ఆయనకూడా విష్ణుచిత్తులవారిని భక్తితో సేవించాడు, సాక్షాత్తూ రంగనాథునికి మామగారు కాబోతున్నాడు కదా మరి!

 

ఆ తరువాత ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బలను ఎరుగని బంగారు కొండవంటి వినతాసూనుడిని,గరుత్మంతుడిని దర్శించుకున్నాడు. ఆ గరుడుని రెక్కల ఈకల కాంతులు నీరెండలో సూర్యుని కాంతిలా మిలమిలలాడిపోతున్నాయి. వేదాత్మకుడైన గరుడుడిని వినయముగా, భక్తిగా సేవించాడు విష్ణుచిత్తులవారు. ఆయనకూడా ఈయనను నమస్కరించి సేవించాడు. అనంతరం స్వామివారి సన్నిధికిచేరి అనేకవిధాలుగా దివ్య స్తోత్రములతో స్వామిని కీర్తించాడు.

 

విధిగృహాక్షయవిత్తసేవధికి శరణు 

చిరకృతేక్ష్వాకుపుణ్యరాశికిని బ్రణుతి

ధనపతి భ్రాతృకుల దేవతకు జొహారు 

నతమృడాదిక సుమనస్సునకు నమస్సు

బ్రహ్మదేవుని యింటిలోని అక్షయమైన నిధికి శరణు, ఇక్ష్వాకుమహారాజు పుణ్యరాశిని శాశ్వతము 
చేసిన మహానుభావునకు ప్రణుతి, కుబేరుని సోదరుడైన విభీషణుని కులదేవతకు జోహారు,
శివుడు మొదలైన దేవతలచే నమస్కరింపబడే నీకు నమస్సులు అని స్వామిని కీర్తించాడు 
విష్ణుచిత్తులవారు.  
 
కొలుతు సర్వేశు సర్వాత్మకుని ననంతు 
నప్రకాశు నభేద్యు సమస్తలోక 
సముదయాధారు నణుసమూహములకును న
ణీయు నిన్ను ననాధారు నిత్యు సత్యు 
 
సర్వేశ్వరుడిని, సర్వాత్మకుడిని, అనంతుడిని, దృష్టికి అందని దివ్యతేజుడిని, భేదింప 
శక్యముగాని అణువుకన్ననూా సూక్ష్మమైన పరిమాణము గలవాని, తనకంటూ ఎవరూ ఆధారము 
లేని సర్వాధారుడిని, నిత్యుడిని, సత్యుడిని, నిన్ను కొలిచెదను స్వామీ అని పొగిడాడు.
స్వామి కరుణ ఒలుకుతున్న కడగన్నులతో విష్ణుచిత్తులవారిని చూచి, కుశలప్రశ్నలు వేశాడు.
తమ కరకంకణ ధ్వనులతో తన పాదములకు కుసుమాంజలులు సమర్పించే నారీరత్నముల
శిరోరత్నంలాగా దివ్యప్రభలతో మెరిసిపోతున్న 'ఆముక్తమాల్యద'పై పడింది స్వామి చూపు!
 
దీనిచూపు పైకి లేవడం వలననే కదా, మన్మథునికి బిరుదైన ధ్వజము దొరికింది అనుకున్నాడు 
స్వామి, ఆమె కన్నులు చేపలలాగా ఉన్నాయి, మన్మధుని ధ్వజము మీనధ్వజము కదా!
దీని లతవంటి నడుము ఊగాడడం వలననే కదా వసంతునికి భూమి మీద కాలు పెట్టడానికి 
సందు దొరికింది అనుకున్నాడు స్వామి, లతలు తీగలు పచ్చపచ్చగా ఉంటేనే కదా వసంత 
ఋతువుకు పట్టు! దీని వక్షోజముల పెంపుచేతనే కదా రతీదేవి యొక్క కిన్నెరవీణా నాదానికి 
వన్నె కలిగింది అనుకున్నాడు స్వామి, ఆ కిన్నెరవీణ గుండ్రని దిమ్మకు ఈ వక్షోజముల 
పోలిక ఉండడం వల్లనే ఆ వీణకు ఆ నాదం అని! దీని ముఖపద్మము వికసించడం వల్లనే 
కదా, పద్మములు వికసించి సరస్వతీదేవి వాహనమైన హంసకు నెలవు దొరకడం అనుకున్నాడు 
స్వామి, హంసలకు పద్మములు నివాసస్థలాలు అని ఐతిహ్యం! దీని మేఘములవంటి కేశములు 
దట్టంగా అలుముకోవడంవల్లనే కదా నెమళ్ళకు మేఘములను చూసి మోహము, ఆనందము 
కలగడం అనుకున్నాడు స్వామి! మెట్టతామరలవంటి దీని పాదములవలననే కదా, తామరల 
తేనెలు తుమ్మెదలకు దొరకడం అనుకున్నాడు స్వామి! యిలా గోదాదేవి అందచందాలకు,
లావణ్యానికి స్వామి మోహపరవశుడై, తాళలేక ఆమె స్థానంలో ఒక మాయాకన్యకను ఆమెలాగే 
ఉంచి, ఆమెను తన అంతఃపురానికి చేర్చాడు! అర్చకులచేత విష్ణుచిత్తులవారికి, ఆ మాయా
గోదాదేవికి తీర్థ ప్రసాదాలు ఇప్పించి, వారి బసకు వెళ్ళడానికి ఆనతిచ్చాడు, ఆశీర్వదించి.
 
విష్ణుచిత్తులవారు తమ పల్లకీలో కుమార్తెను కూర్చొనబెట్టి బసకు వెళ్లి, పల్లకీ తెరను తొలగించి 
చూడగా గోదాదేవి లేదు, మాయాగోదాదేవి మాయమైంది! ఎంత అన్యాయం చేశాడు రంగడు,
నా కుమార్తెను అపహరించాడు, సభ్యులందరూ నా గతి చూడండి మొఱ్ఱో అని చేతులు పైకెత్తి 
దుఃఖజలధిలో మునిగి ఆర్తనాదాలు చేస్తూ స్వామిని నిందించాడు.              
 
శివుఁడు విరించి వాసవుఁడుఁ జెప్ప నశక్తులు గొల్చినట్టి వా
రవుట నిరంకుశుండ నని యక్కట పాడిఁ దొఱంగఁ జెల్లునే?
భువనము లెల్ల నీవయినఁ బొంత దయానిధి యమ్మ లేదె? భా
గవతులు లేరె నా కొరకుఁగా వహియించుకొనంగఁ గేశవా!
 
శివుడు, బ్రహ్మ, దేవేంద్రుడు నీ సేవకులు కనుక న్యాయము చెప్పలేరు, నిన్ను తప్పు పట్టలేరు 
బహుశా. నేను నిరంకుశుడిని, నన్ను హద్దుల్లో పెట్టేవారు ఎవరూ లేరు అని దారితప్పడం 
ఏమన్నా పద్ధతా? ప్రపంచాలన్నీ నీవేనేమో కానీ, నీ ప్రక్కనే దయానిధియైన అమ్మ ఉన్నదికదా,
భాగవతులు ఉన్నారు కదా నా పక్షం వహించడానికి, నిన్ను నిలదీయడానికి అని ఆక్రోశించాడు. 
 
నెట్టన యల్ల లచ్చి యల నీళయు భూసతి యుండ నీకు నీ 
నెట్టిక సీలపై మనసునిల్చుట కేమనవచ్చు? వెఱ్రి యౌ 
నట్టుగఁ బేద నన్నుఁ బరిహాసము సేఁతకుఁ దక్క వింతచూ
పెట్టిది? దిద్దు నెవ్వఁ డిల నేఱులవంకలు వారిడొంకలున్  
 
నీకోసం నిరంతరమూ సిద్ధంగా ఆ లక్ష్మి, ఆ నీళాదేవి, ఆ భూదేవి ఉండనే ఉన్నారే, నీకు 
ఈ చిగురు మీద మనసు పడ్డది అంటే ఏమనాలి? ఈ పేద బాపడిని వెఱ్ఱివాడిని చేయడానికి,
పరిహాసము చేయడానికి కాకుంటే, నీకు ఈ బాలికపై చూపు పడడం ఏమిటి? వాగులు, వంకల 
వంకర టింకర వర్తనలు సరిదిద్దడానికి ఎవరుంటారు గనుక? అని యిలా పరి పరివిధాల 
వాపోతున్న ఆ అమాయక భాగవతుడిని చూసి స్వామి జాలిపడ్డాడు తనే. గడుసుగా ' ఏమయ్యా 
నీకేమైనా ముదిమితో మతి తప్పిందా ఏమిటి? నీ బిడ్డను యింట్లోనే భద్రంగా ఉంచుకుని 
నన్ను అంటావేమిటి? నేనే అలుసైనానా నీకు? ఇంకోసారి నీ బసలో చూసుకో పో! అప్పుడూ 
కనబడకుంటే నన్ను నిందించు కావాలంటే' అన్నాడు. చల్లని మాట చెప్పావు స్వామీ, నీకు 
విజయమగుగాక, మంగళము కలుగు గాక అని తన బసకు వెళ్లి కుమార్తెను క్షేమంగా కనుగొన్నాడు 
విష్ణుచిత్తులవారు. నా తల్లీ! మళ్ళీ నిన్ను చూశాను కదా అని బిడ్డను దగ్గరకు తీసుకుని వెన్ను 
నిమిరాడు ప్రేమగా!
 
యిక రంగనాథుడు తాళలేకపోయాడు. సరస్వతీ బ్రహ్మలను, గౌరీ రుద్రులను ఆ పిల్లను నాకు 
యిమ్మని అడగండి అని చెప్పి విష్ణుచిత్తులవారి దగ్గరకు పంపాడు. వారు విష్వక్సేనులను 
వెంటబెట్టుకుని, విష్ణుచిత్తులవారి బసకు వచ్చి వధువును యిమ్మని అడిగారు. ఆయన 'నేను 
ధన్యుడిని అయ్యాను, భృగువు, సముద్రుడు ఎంతటి ధన్యులో, నేను అంతటి ధన్యుడిని!
యియ్యదగిన సంబంధమే! కానీ బిడ్డను మోసుకొచ్చి యిచ్చాడుఅని లోకులంటారు, స్వామిని 
మా గ్రామానికి తరలివచ్చి నా బిడ్డను పెండ్లియాడుమని చెప్పండి, మీరు చెపితే వింటాడు 
అన్నాడు. వారు వెళ్లి స్వామితో అలానే చెప్పారు. స్వామి సంతోషంగా ఒప్పుకుని, 
గరుడవాహనం మీద, యితర దేవతలందరూ తమతమ వాహనాలమీద వెంటరాగా 
విల్లిపుత్తూరుకు తరలివెళ్ళాడు పెండ్లికుమారునిగా. విశ్వకర్మ నిర్మించిన దివ్యభవనంలో 
మగపెళ్ళివారు విడిది చేశారు.   
 
శర్వాణీ వాణీ ముఖ
గీర్వాణీకోటి జానకీరఘుకులరా
ట్పూర్వాచరిత వివాహా
ఖర్వ సుగీతములు పాడగా విభవమునన్ 
 
పూర్వము జానకీరఘురాముల వివాహ సందర్భములో గానముచేసిన శుభప్రదమైన గీతాలను 
మరలా ఈ వివాహ సందర్భములో గానము చేశారు పార్వతి, సరస్వతి మొదలైనవారు.
గోదారంగనాథుల వివాహము కన్నులపండువుగా జరిగింది. విధివిధానముగా వివాహక్రియ 
జరిగింది. వధూవరులు ముత్యాల తలబ్రాలు పోసుకున్నారు. ఆ సమయములో గోదమ్మ 
చివుళ్ళవంటి వ్రేళ్ళు తగిలి స్వామికి ఒళ్ళు చెమర్చింది. నీలిమేఘమువంటి ఆ దేహము 
చెమర్చి, చెమట బిందువులు వర్షపు బిందువులలాగా కురిశాయి, ముత్యాలు వడగండ్లలాగా 
మెరిశాయి!    
 
ఇంతి దోయిట సేసఁబ్రా లెత్తుచోట 
గుబ్బపాలిండ్లక్రేవ గ్రక్కున మురారి 
కన్నువేయుటఁ గల లజ్జ గదుర బాహు
లెత్తక కరాగ్రములన పై కెగురఁజల్లె 
 
స్వామితలమీద పోయడానికి గోదాదేవి దోసిళ్ళలో తలబ్రాలు తీసుకుని చేతులు పైకెత్తింది.
ఉదుటున బహిర్గతములైన ఆమె కుచములమీద స్వామి కన్ను పడింది. ఆమెకు లజ్జ కలిగి,
బాహువులు పైకి ఎత్తకుండానే చేతివ్రేళ్ళ కొసలతో తలబ్రాలను పైకి వెదజల్లింది. ఏ చిన్ని 
రహస్యమూ రాయల కనులకు కనబడకుండా ఉండదు.    
 
లలనచే నిష్ఠతో లాజలు వేల్పించి / శార్ఙ్గి మెట్టించెను సప్తపదులు 
తెఱవఁ గూడి యరుంధతీదర్శనముఁ జేసె / బ్రహ్మరుద్రాది గీర్వాణకోటి 
యర్పించు నుడుగర లనుకంపఁ గైకొని / యనిచె బ్రసాదభాజనుల జేసి 
యాత్మపట్టణమున కతివైభవంబున / నతివఁదోడ్కొని విజయంబుచేసి 
 
సహ్యకన్యా తటోద్యాన చందనద్రు
కుంజముల నీలకుంతలఁ గుస్తరించి 
కంతుసామ్రాజ్య మేలించి కరుణఁ జిత్త
మొలయ జగములఁ బాలించు చున్నవాడు 
 
గోదాదేవితో హోమములో లాజలు వ్రేల్పించాడు స్వామి. సప్తపదులు త్రొక్కించాడు.
ఆమెతో కలసి అరుంధతీ దర్శనము చేసుకున్నాడు. బ్రహ్మ, రుద్రుడు మొదలైన కోట్లాది 
దేవతలు సమర్పించిన కానుకలను, చదివింపులను ప్రేమగా పుచ్చుకున్నాడు. తన 
అనుగ్రహానికి వారిని పాత్రులుగా చేసి సాగనంపాడు. తన పట్టణానికి, శ్రీరంగానికి 
వైభవముగా తన ఇల్లాలిని తోడ్కొని ప్రవేశించాడు. ఆ నీలవేణిని, గోదాదేవిని కావేరీ 
నదీతీరములోని శ్రీ చందనవృక్షముల పొదరిండ్లలో లాలనగా మన్మథసామ్రాజ్యానికి 
మహారాణిని చేసి, నిరత సురతక్రీడలలో ఓలలాడించి, దయగా ఈ జగములను తాను
ఆ రంగనాథుడు పాలిస్తున్నాడు నాటినుండీ!
 
స్కందసరస్తటీరమణ కందర చందన కుందవాటికా
మందసమీరలోల వనమాలిక! నిర్మలదివ్యవిగ్రహా
స్పందివిభాధరీకృత నభస్స్ఫుటకాళిక! వల్లవాంగనా
బృందమనోభిమాన ధృతి భేదన!  పేశల వంశవాదనా!
 
స్వామిపుష్కరిణీ దరులయందున్న మనోహరమైన గుహల యందలి హరిచందన 
వృక్షముల, మొల్లల సమూహములనుండి వెలువడుతున్న మందపవనములతో 
కదలాడుతున్న వనమాలికను ధరించినవాడా! నిర్మలమైన దివ్యమైన చలింపని 
నల్లని మేని వర్ణముచేత ఆకాశపు నీలిమను ధిక్కరించేవాడా! గోపికల మనసులలోని 
అభిమానమును, ధీరత్వమును భేదించినవాడా! మృదుతరమైన వేణువాదనము 
చేయువాడా!
 
వాలినిర్భేదనా! వారిజాతేక్షణా!
శైలకన్యాస్తుతా! శార్ఙ్గ చంచద్భుజా!
ఫాలద్రుక్పద్మభూపాకభేదిస్ఫుర 
న్మౌళిమాణిక్యరుఙ్మండితాంఘ్రిద్వయా!
 
వాలిని సంహరించినవాడా! తామరలవంటి కనులు గలవాడా! పార్వతీదేవిచేత 
స్తుతింపబడినవాడా! శార్ఙ్గధనుస్సును ధరించి కదలాడుతున్న భుజమును 
కలిగినవాడా! శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు నీకు నమస్కరిస్తున్నపుడు వారి 
శిరస్సులందలి మణులకాంతులచేత ప్రకాశిస్తున్న పాదములు గలవాడా! 
యిది కృష్ణరాయలు అనుపేరుగల నాచేత రచింపబడిన ఆముక్తమాల్యద 
గ్రంథమందలి హృద్యమైన పద్యముల ఆరవ ఆశ్వాసము, సకలమూ సంపూర్ణము 
అని రాయలవారు ఆముక్తమాల్యదను వేంకటేశ్వరుని శ్రోతగా చేసుకుని 
ముగించాడు.
 
తెలుగుసాహిత్యసరస్వతి కంఠసీమలో మేలి ముత్యాలమాల ఆముక్తమాల్యద.
నా పరిమితమైన సాహిత్య పరిచయముతో, నా శక్తికి అందినమేరకు, అమ్మదయ 
నామీద ప్రసరించినమేరకు ఆముక్తమాల్యదపై దీర్ఘ సాహిత్యవ్యాసమును అందించే 
ప్రయత్నముచేశాను. పూర్వ పండితుల వ్యాఖ్యల సహాయము కేవలము క్లిష్టమైన 
ప్రయోగాల సందర్భములలోనే తీసుకున్నాను. అన్వయము, పరిశీలన నా మనసుకు 
ఔననిపించిన మార్గంలోనే చేశాను. అనేక సందర్భాలలో, దుస్సాహసంతో, 
మహామహులు, అపార పాండితీసాగర సద్రుశులు ఐన వారితో విభేదించి, రాయల 
సమస్తశాస్త్రవైదుష్యాన్ని, రాయలవ్యక్తిత్వాన్ని నా రుచిమేరకు, నా దృష్టిమేరకు 
వ్యాఖ్యానించడానికి ప్రయత్నం చేశాను. నా విశ్లేషణలో, అన్వయములో ఏవైనా 
లోపాలుంటే పాఠకులు మన్నింతురుగాక! రాయలను మించిన కవి, యోధుడు లేరు,
నా దృష్టిలో. సాహిత్య, సామాజిక, ఆధ్యాత్మిక రంగాలలో భారతధరిత్రికి యుగాల 
పర్యంతమూ బలమును యిచ్చిన కారణజన్ముడు శ్రీకృష్ణదేవరాయలు! ప్రాచీన 
పద్యకావ్యవిమర్శకు దీర్ఘకాలంగా యింతటి ప్రోత్సాహాన్ని  యిచ్చిన 'గోతెలుగు'
 బృందములోని మిత్రులందరికీ, ఆదరించిన పాఠకులకు ధన్యవాదాలతో, రాయలకు 
ఈ కవితాంజలితో, 'సాహితీవనం' శీర్షికలో రెండవ కావ్య విమర్శను ముగిస్తున్నాను.
 
జయహో శ్రీ కృష్ణ దేవ రాయ!
జయ నిత్య కీర్తి కాయా!
జయ కదన కవన రవి చంద్ర తేజ!
జయ భువన విజయమున ఆంధ్ర భోజ!
 
నీ తనువు  కదన ఘన విజయలక్ష్మికి
నీ మనువు కవనమున విజయలక్ష్మికి 
తను వృత్తి నీకు సామ్రాజ్య రక్షణం
నీ ప్రవృత్తి సాహిత్య వీక్షణం
 
చినరాణినీకు సామ్రాజ్య లక్ష్మి 
పెద్ద రాణి నీకు సాహిత్య లక్ష్మి 
చిన్నమ్మ తోడి చిరకాల చెలిమి
పెద రాణి తోడి కల కాల కలిమి
 
నడి వీధిలోన రతనాలు  రాశి
నడి రేయి దాక కవనాలు  దూసి
పడి కరకు తురక తలచెండ్లు కోసి
కడలేని కీర్తిగనినావు వాసి
 
గజపతుల కైన ఘన స్వప్న సింహమా!
మదవతుల కేళి శృంగార చిహ్నమా!
కవితా వధూటి సిగపువ్వు చంద్రమా!
తులలేని అలల సాహిత్య సంద్రమా!
 
ఘన  తెలుగు కవన ధారా విపంచి
పలికించి తేనెలొలికించి   మించి
వలపించి చూడిక్కు డుత్త  నాచ్చి
నేలించినావు రంగేశుకిచ్చి
  
భువి రాజులెందు?  శాసనములందు!
కవిరాజులెందు? ఉచ్చ్వాసమందు, 
జన జీవ నాడి నిశ్వాసమందు
నిలిచుండురందు! నువు?గుండెలందు!  
 
బ్రహ్మాండమందు శ్రీ వేంకటాద్రి,
దైవతములందు శ్రీ వేంకటేశుడు,
పలు దేశ భాషలను తెలుగు లెస్సరా!!
రాజులందు, రాయ నువు లెస్సరా!
 
***వనం వేంకట వరప్రసాదరావు 
మరిన్ని శీర్షికలు
andam - chandam