Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

నందితతో ఇంటర్వ్యూ

interview with nandita
ఆ కోరిక నాకూ ఉంది... కానీ... - నందిత‌తో ఇంట‌ర్వ్యూ
 
క‌థానాయిక‌లంతా గ్లామ‌ర్ పాత్ర‌ల చుట్టూనే తిరుగుతుంటారు.నాలుగు పాట‌లు.. కొన్ని రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టిస్తే స‌రిపోతుందిలే అనుకొంటారు. మ‌న సినిమాల్లో క‌థానాయిక పాత్ర‌కు అంత‌కంటే ప్రాధాన్యం ఏముంటుంది లెండి. అయితే కొంత‌మంది క‌థానాయిక‌లు మాత్రం.. 'ఈ సినిమాలో నా పాత్ర ఏమిటి?' అని క్వ‌శ్చ‌న్ వేస్తారు. దానికి స‌రైన స‌మాధానం ల‌భిస్తేనే సినిమా ఓకే అంటారు. అలాంటి క‌థానాయిక నందిత‌. నీకు నాకు, ప్రేమ‌క‌థాచిత్ర‌మ్‌, ల‌వ‌ర్స్‌, కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రినీ, శంక‌రాభ‌ర‌ణం.. ఇలా వైవిద్య‌మైన చిత్రాల్ని ఎంచుకొంటూ ప్ర‌యాణం సాగిస్తోంది. ఇప్పుడు సావిత్రిగా అల‌రించ‌డానికి సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా నందిత‌తో గోతెలుగు చేసిన చిట్ చాట్ ఇది.

* హాయ్‌...
- హ‌లో అండీ..

* కెరీర్ ఎలా సాగుతోంది..?
- మీరే చూస్తున్నారు క‌దా..?  బ్ర‌హ్మాండంగా ఉంది.  ఊపిరి స‌ల‌ప‌నంత బిజీగా లేను.. అలాగ‌ని అవ‌కాశాలు రాకుండానూ లేవు. నా ప్ర‌యాణం ప‌ట్ల నేను పూర్తి సంతృప్తిగా ఉన్నా.
 
* సినిమా త‌ర‌వాత సినిమా... అంటూ ప్లానింగ్ చేస్తుంటారా?
- అలాంటిదేం లేదు. ఇండ్ర‌స్టీలో ప్లాన్ ప్ర‌కారం ఏమీ అవ్వ‌దు. సినిమా చేయాలంటే క‌థ న‌చ్చాలి. అలాంటి క‌థ‌లు ఎప్పుడు దొరికితే అప్పుడు చేయ‌డానికి నేను రెడీ. ఒకేసారి మూడు మంచి క‌థ‌లు నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తే.. నో అని ఎలా ఉంటా. మూడూ చేస్తా.
 
* క‌థానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలేమైనా వస్తున్నాయా?
- వ‌స్తున్నాయి.. కానీ అలాంటి పాత్ర‌లో న‌టించే స్థాయి నాకు ఇంకా రాలేద‌ని నా న‌మ్మ‌కం.
 
* అదేంటి.. అలా అనేశారు..
- నిజం చెబుతున్నా. ఓ సినిమా అంతా భుజాల‌పై వేసుకొని న‌డిపించేంత శ‌క్తి నాకు లేదు.  అలాంటి శ‌క్తి వ‌చ్చినప్పుడు త‌ప్ప‌కుండా ఆలోచిస్తా.
 
* మ‌రి సావిత్రి ఆ టైపు క‌థ కాదా, టైటిల్ చూస్తే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమానే అనిపిస్తోంది..
- నేనూ ముందు అలానే అనుకొన్నా. ప‌వ‌న్ సాదినేని నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి..  ''సావిత్రి అనే క‌థ ఉంది. వింటారా'' అన్న‌ప్పుడు భ‌య‌ప‌డ్డా. ఇదేమైనా లేడీ ఓరియెంట్ సినిమానేమో అనుకొని.. 'నో' చెప్పా. ఇది అలాంటి క‌థ కాదు.. అని చెప్పాకే క‌థ విన‌డానికి ఒప్పుకొన్నా. 
 
* మ‌రింత‌కీ ఎలాంటి పాత్ర‌ల్లో చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు?
- ఇలాంటి క‌థ‌లే చేస్తా అని చెప్ప‌ను. నా గ‌త సినిమాకీ ఈ సినిమాకీ కాస్తో కూస్తో తేడా ఉండాలి.  అంత‌కు మించిన ష‌ర‌తులేం లేవు.
 
* స్టార్ క‌థానాయ‌కుల‌తో న‌టించాల‌ని లేదా.. మీకు ఆ అవ‌కాశాలు ఎందుకు రాలేదు?
- ఎందుకులేదు. పెద్ద పెద్ద హీరోల‌తో న‌టించాల‌న్న కోరిక నాకూ ఉంది. కానీ అలాంటి అవ‌కాశాలు ఎందుకు రావ‌డం లేదో.. నాకు మాత్రం ఎలా తెలుస్తుంది?  మంచి మంచి సినిమాలు చేసుకొంటూ వెళ్తే... త‌ప్ప‌కుండా అలాంటి ఛాన్సులొస్తాయోమో. చూద్దాం.. స్టార్ హీరోల చూపు నా మీద ప‌డాలంటే ఇంకెంత కాలం ప‌డుతుందో..?
 
* ఈ ప్ర‌యాణంలో మిమ్మ‌ల్ని బాగా నిరాశ ప‌రిచిన చిత్రాలున్నాయా?
-  శంక‌రాభ‌ర‌ణం పై చాలా హోప్స్ ఉండేవి. చాలా డిఫ‌రెంట్ సినిమా చేస్తున్నాం.. అనుకొన్నామంతా. అందులో నా పాత్ర కూడా బాగుంటుంది. నేనూ క‌ష్ట‌ప‌డి న‌టించా. కానీ... ఆశించ‌న ఫ‌లితం రాలేదు.  'ఎంతో సాధిస్తామ‌నుకొంటే ఇలా అయ్యిందేంటి?' అని బాధ‌పడ్డా. కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రినీ సినిమా కూడా చాలా ఇష్టంగా చేశా. బేసిగ్గా.. చాలామంచి సినిమా అది. కానీ విమ‌ర్శ‌కుల‌కు మాత్ర‌మే న‌చ్చింది. అలాంటి సినిమాలు క‌మ‌ర్షియ‌ల్‌గానూ విజ‌యం సాధిస్తే..ఎంతో సంతృప్తిగా ఉంటుంది. మ‌రిన్ని మంచి సినిమాల్లో న‌టించ‌డానికి అదో బూస్ట‌ప్‌గా ప‌నిచేసేది. ఆ రెండు సినిమాల ఫ‌లితాలు బాగా నిరాశ ప‌రిచాయి.  
 
* మీరు తెలుగ‌మ్మాయి.. తెలుగు చ‌క్క‌గా మాట్లాడుతున్నారు. కానీ మీ పాత్ర‌ల‌కు వేరొక‌రు డ‌బ్బింగ్ చెబుతున్నారు. ఎందుక‌లా?
- నా పాత్ర‌ల‌కు నేనే డ‌బ్బింగ్ చెప్పుకోవాల‌ని ఉంటుంది. కానీ. ద‌ర్శ‌కులు మాత్రం ఎందుక‌నో ఆ దిశ‌గా ఆలోచించ‌డం లేదు. ప్ర‌తీ సినిమాకి ముందు `ఈ సినిమాకి నేనే డ‌బ్బింగ్ చెప్పుకొంటే బాగుణ్ణు` అనుకొంటా. కానీ కుద‌ర‌డం లేదు.
 
* 'లండ‌న్ బ్రిడ్జ్' అనే మ‌ల‌యాళం చిత్రంలో న‌టించారు.. అక్క‌డి నుంచి మ‌ళ్లీ అవ‌కాశాలొస్తున్నాయా?
- మ‌ల‌యాళం నుంచే కాదు.. త‌మిళ సీమ నుంచి కూడా ఛాన్సులు వ‌స్తున్నాయి. కానీ.. త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల‌తో కాస్త ఇబ్బందే. నాకు ఆ భాష రాదు. డైలాగులు అర్థ‌మ‌వ్వ‌వు. మ‌నం ప‌లికే సంభాష‌ణ‌కి అర్థం ఏమిట‌న్న‌ది తెలిస్తే.. న‌ట‌న మ‌రింత స‌హ‌జంగా ఉంటుంది. కాని ప‌క్షంలో.. కృత్రిమంగా త‌యార‌వుతుంది. అలాంటి సినిమాల్లో న‌టించ‌డం ఎందుకు అనిపిస్తుంది. త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ప‌ట్టు సాధించాక‌.. అక్క‌డ చేయాలా, వ‌ద్దా అనేది ఆలోచిస్తా.
 
 
* ఇంత‌కీ సావిత్రిలో మీ పాత్ర ఏమిటి?
- సావిత్రి అనే అమ్మాయి చుట్టూ తిరిగే క‌థ ఇది. ఓ పెళ్లిలో పుడుతుంది సావిత్రి. అప్ప‌టినుంచీ పెళ్లంటే ఎంతిష్ట‌మో. త‌నకి ఎలాంటి భ‌ర్త దొరికాడు.. అన్న‌దే క‌థ‌.
 
* న‌టి సావిత్రికీ ఈ సినిమాకీ ఏమైనా సంబంధం ఉందా?
- అదేం లేదు.. కేవ‌లం పాత్ర పేరు సావిత్రి అంతే. అయితే టైటిల్ కార్డులో సావిత్రి గారిని గుర్తు చేసుకొంటూ మాయా బ‌జార్‌లోని అహ‌నా పెళ్లీ అంట‌.. అనే పాట‌ని ప్లే చేశాం.
 
* ఈ సినిమా మీ కెరీర్‌కి ఎంత వ‌ర‌కూ ప్ర‌త్యేకం?
- ప్ర‌తీ సినిమా ప్ర‌త్యేక‌మైన‌దే. మంచి పాత్ర దొరికిన‌ప్పుడు ఇంకాస్త స్పెషాలిటీ ఉంటుంది. సావిత్రి అలాంటి సినిమానే. నా కెరీర్‌కి ఈసినిమా బూస్ట‌ప్ గా నిలుస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.
 
* ఓకే... ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌...

-కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
balayya for hundred movie