Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulita bandham

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే.http://www.gotelugu.com/issue155/439/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

‘‘కృతజ్ఞురాలిని జనకా. పోయి వత్తును’’ అంటూ తల్లి దండ్రుకు నమస్కరించి వెను తిరిగింది ఉలూచీశ్వరి. ఈ తూరి వెడునది వన విహారమునకు కాదని, తను వరించిన రత్నగిరి రాకుమారుడు ధనుంజయుని కలుసుకోవడానికని తెలిస్తే నాగరాజు ఎలా స్పందించే వాడో గాని, ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం యువ రాణి తన అంతరంగిక చెలికత్తెలు నలుగురితో నాగలోకము విడిచి ఆ పూటే మర్మ భూమికి చేరుకుంది.

అక్కడ సంపంగి వనము బయట ఆమె కోసం శంఖు పుత్రి ఎదురు చూస్తోంది. చెలికత్తెలు నలుగుర్ని సంపంగి వనమున తాను తిరిగి వచ్చు వరకు వేచి ఉండమని వుంచి తను వెళ్ళి శంఖు పుత్రిని కుసుకుంది. ఇరువురూ ధనుంజయుని కోసం వింధ్యాటవికి బయలుదేరారు.
ఈలోపల అక్కడ నాగ లోకంలో నాగరాజు మహా పద్ముడు తన రాజ మందిరం నుండి సభా మందిరానికి చేరుకునే సరికి ప్రతీహారి ఒకడు ఆయన దర్శనార్థం వేచి వున్నాడు.

‘‘ఏమైనది?’’ గంభీర స్వరముతో ప్రశ్నించాడు నాగరాజు.

‘‘అంతగా ఆశా జనకమగు వార్త కాదు ప్రభు’’ తల వంచుకొని సవినయంగా మనవి చేసాడు ప్రతీహారి.

‘‘కానున్న ఏమాయె? ఎంత దూరము రాగలడు ఆ రాకుమారుడు? అదియును జూచెదము గాక. సంశయింపక ఏమి వార్త తెలిసినది చెప్పుము’’

‘‘మనమిచట నుండి ప్రేరేపించిన ఎగిరే నాగములనేకము ఆ యువరాజు ఖడ్గమునకు బలి కాగా, అతడు తప్పించుకున్నాడట. అగ్ని సర్పమును సంహరింపగా రుచికునకు శాప వియోచనం జరిగి తన యక్ష లోకం వెళ్ళి పోయినాడట. సహ్యాద్రి వెళ్ళి భీమ శంకర క్షేత్రమును దర్శించి ధనుంజయుడు ప్రస్తుతం మాళవ సరిహద్దు వైపు సాగి పోతున్నటు తెలిసినది’’ అంటూ తనకు అందిన సమాచారమును విన్నవించాడు.

అంతా శ్రద్ధగా విని` తల పంకించాడు నాగరాజు.

ఒకింత కోపంతో కనులు ఎర్ర బారి శ్వాస బరువైంది. ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ సాలోచనగా చూసాడు.

‘‘ఆ మూర్ఖునకు అర్థము గాకున్నది! చచ్చుటకే వచ్చుచున్నాడు. ఎన్ని అడ్డంకులు కల్పించిననూ ప్రాణమును లేక్క చేయక మును ముందుకే వచ్చుచున్నాడు. రానిమ్ము వింధ్య సానువు దాటిన పిదప తగిన శాస్తి అనుభవింప గలడు. అంత వరకు ఓ కంట గమనింపుమని నా మాటగా నాగానాయకుడు నాగ కేసరికి కబురు చేయుము.’’ అంటూ ఆజ్ఞాపించి నేరుగా సభా మందిరంలోకి వెళ్ళి పోయాడు నాగరాజు.

*********************************************************

అది ఒక రమణీయ ప్రకృతి శోభ.

ధనుంజయ, అపర్ణులు అక్కడికి చేరుకునే సరికి సరిగ్గా మిట్ట మధ్యాహ్నపు వేళ అయింది. సూర్యుడి ప్రతాపం మరింత ధాటిగా వుందీ రోజు. ఎండ వేడిమి ఉక్క పోతకు శరీర తాపం అధికరించింది. అశ్వాలు కూడ డస్సి వున్నాయి. మాళవ రాజ్య సరిహద్దు అక్కడికి ఇంకో రోజు ప్రయాణ దూరంలో వుంది.

ప్రస్తుతం అశ్వాలు ఆగినది ఒక లోయ ప్రాంతం. మాళవం వైపు సాగే మహా పథం ఈ లోయ గుండా పోతోంది. బాటకి ఎడం పక్కన కొంత దూరంలో కొన్ని ఎత్తయిన పర్వత శ్రేణులున్నాయి. ఆ పర్వతాల మధ్యగా వస్తున్న కొండ వాగు ఒకటి ఒక ఎత్తయిన కొండ గుట్ట నుండి మూడు అంచులుగా జారి దిగువన ఒక మడుగు లోకి దూకుతోంది. అది తూర్పుగా కొన్ని యోజనాల దూరం ప్రవహించి క్షిప్రానదిలో కలుస్తుంది.

అన్ని ఋతువుల్లోనూ ప్రవహించే ఈ జల పాతపు నీరు మడుగును చుట్టి ఉన్న అటవీ ప్రాంతాన్ని ఎల్ల వేళలా పచ్చగా ఉంచుతుంది కాబట్టి అక్కడ అనేక ఫలవృక్షాలు, సౌరభాలు వెదజల్లే పుష్పాలతో కూడిన చెట్లు, మొక్కలు, తీగలు కనువిందు చేస్తున్నాయి. ఇక మూడు అంచులుగా జాలు వారుతున్న జలపాతాన్ని ఆ కొండ గుట్ట అందాలను చూడ వలసిందే గాని చెప్పనలవి కాదు.

శుక పిక శారికాలు ఆహ్వానం పలుకుతున్నాయి. పుష్పజాతులు కనువిందు చేస్తూ తమ సువాసనలతో మురిపిస్తున్నాయి. శీతల గాలులు సేద తీరుస్తున్నాయి. ఆ ప్రాంతం మనసుకు, శరీరానికి కూడ హాయినిస్తుండగా అశ్వాలు దిగకుండానే అక్కడి ప్రకృతి శోభకు పులకింప సాగారు.

ధనుంజయ, అపర్ణులు అంబాపురములో బయలుదేరి ఇది ఆరవరోజు. ప్రతి దినము వేకువనే ముందుగా లేచిన అపర్ణుడు తాను వెళ్ళి స్నానాదికాలు ముగించు కొని వచ్చి ధనుంజయుని నిద్ర లేపుతున్నాడు. నాలుగు రోజుల తర్వాత అటవీ ప్రాంతంలో ఎక్కడా మార్గంలో నీటి వనరులున్న ప్రాంతాలు లేవు కాబట్టి రెండు దినముగా స్నానాదికాలు చేయక మహా ఇబ్బందిగా వుంది. అందుకే జలపాతాన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టుంది ఇరువురికీ.

‘‘అయ్యారే! కడు అద్భుతము. ఆశ్చర్యము. మా రాజ్యమున స్వర్గమును తలపించు ఇంతటి మనోహర ప్రదేశమొకటి కలదని మాకే తెలియదు సుమా. నన్నిటకు గొని వచ్చిన నీకు కృతజ్ఞుడను మిత్రమా.’’ అన్నాడు పులకించి పోతూ ధనుంజయుడు.
ఫక్కున నవ్వాడు అపర్ణుడు.

‘‘ప్రభు! ఇది తమ రాజ్యము. ఆ ప్రదేశము మీది. ఇందులో నాకు కృతజ్ఞతలు జెప్పు పని యేమున్నది? మీకు తెలియని సందర్శనా స్థలము మీ రాజ్యమున ఇంకనూ అనేకము గలవు’’ అన్నాడు.

‘‘ఆహాఁ! అవన్నియు సందర్శింప వలసినదే. వెళుచున్న కార్యము జయ ప్రదమైన పిమ్మట మరొక్క సారి ఇరువురము రాజ్యమున పర్యటించక తప్పదు.’’

‘‘అలాగే ప్రభూ.’’ అంటూ అశ్వం దిగాడు అపర్ణుడు.

‘‘ఇది యేమి? మనమింకను జలపాతమును చేరలేదు. ఆలస్యమేల పద. స్నానమాచరించెదము.’’

‘‘స్నానమాచరించిన చాలునా ప్రభూ? భోజనము వేళయినది. మన వద్ద తినుటకు ఫలములు కాయలు నిండుకున్నవి. నేను అశ్వముకు తటాకమున నీరు తాపించి ఇచటనే వేచి వుండెదను. మీరు స్నానము గావించి రండు. ఈలోపల ఫలములు సేకరించి వుంచెదను.’’

‘‘నీవు స్నానము ఆచరింపవా?’’

‘‘మీరు వచ్చిన పిమ్మట నేను పోయి వచ్చెదను.’’

‘‘ఇది యేమి విడ్డూరము? ఇరువురము పురుషలమే గదా. నాతో వచ్చి స్నానమాచరించుటకు అభ్యంతరమేమి?’’

‘‘అవును ప్రభూ అభ్యంతరమే. ఏకాంతమున స్నానమాచరించుట మా వంశాచారము’’ అన్నాడు అపర్ణుడు.

‘‘ఓహో! మీ వంశమున పురుషులు కూడ స్త్రీల వలే ఏకాంతమునే స్నానమాచరింతురా! బాగు బాగు. ఇంకను మీ వంశమున ఏమేమి ఆచారములు కలవు?’’ కొంటెగా అడిగాడు.

అది వంశాచారము కాదని, తనతో కలిసి స్నానమాచరించిన తన గుట్టు బయట పడునను భయం తోనే ఆచారము సాకు చూపి అపర్ణుడు తప్పించుకొంటున్నాడని వూహించాడు ధనుంజయుడు. ఇప్పుడు కూడ తప్పించుకొంటున్నాడంటే భద్రా దేవి వేరు అపర్ణుడు వేరు కాదు. ఇరువురూ ఒకటేయను అభిప్రాయము అతనిలో స్థిర పడి పోయింది.

అపర్ణుడు ఒకింత అలిగినటు ధనుంజయుని గంభీరముగా చూస్తూ` ‘‘ప్రభువులు క్షమించాలి. మా వంశాచారము, కులాచారమును పాటించుట నా ధర్మము. అందుకు మీరు పరిహసింప పని లేదు’’ అన్నాడు.

‘‘అయ్యో..! నేను పరిహసించుట లేదు మిత్రమా. నిజముగనే తెలియ గోరి అడిగితిని. నీకు బాధ కలిగించి వుంటే క్షంతవ్యుడను’’ అంటూ అశ్వం దిగాడు ధనుంజయుడు.

అక్కడికి జలపాతం దిగువ ప్రాంతం అగుపించదు. చెట్ల పొదలు దట్టంగా అడ్డుగా వున్నాయి. తనకు అవసరమైన దుస్తులు తీసుకుని మడుగును చుట్టి జలపాతం వైపు వెళ్ళి పోయాడు యువ రాజు. అతడు అటు వెళ్ళగానే అశ్వాలు రెంటినీ మడుగులో నీరు తాపించి పచ్చిక మీద మేతకు వదిలాడు అపర్ణుడు. సమీప వృక్ష శాఖల నుండి మామిడి పండ్లు, పనస పండ్లు, అరటి, జామ ఫలాలను సేకరించి తెచ్చాడు. చక్కగా నీడనిస్తున్న వృక్ష ఛాయలో కంబళి పరిచి తెచ్చిన ఫలాలు దాని మీద వుంచి విశ్రాంతిగా కూచున్నాడు.

చాలా సేపటి తర్వాత తిరిగి వచ్చాడు ధనుంజయుడు. తడి దుస్తుల్ని డొంక మీద ఆరేసాడు. జలపాతం క్రింద అలుపు తీరా స్నానం చేయటంతో ఇప్పుడు మనసు, శరీరం కూడ అతనికి ప్రశాంతంగా వుంది. వచ్చి అపర్ణుడి సమీపంలో కూచున్నాడు.

‘‘నేను పోయి స్నానమాచరింతును’’ అంటూ లేచాడు అపర్ణుడు. సమ్మతముగా తలాడించాడు ధనుంజయుడు.

‘‘ప్రభూ! నేను తిరిగి వచ్చు వరకు మీరిచటనే వుండవలె. పొరబాటున కూడ అటు చూసి మా ఆచారమునకు భంగము కలిగించ రాదు’’ అన్నాడు.

‘‘అటులనే మిత్రమా. పోయి రమ్ము’’ అన్నాడు ధనుంజయుడు. అపర్ణుడు బయలుదేరి వెళ్ళాడు.వృక్ష ఛాయలో కూచుంటే చల్లటి గాలికి నిద్ర ముంచుకొస్తోంది. ఆకలి కన్నా నిద్రే ముఖ్యం అనిపిస్తోంది. కాని సందేహ నివృత్తి కోసం మనసు తహ తహ లాడుతోంది.

అపర్ణుడి గుట్టు తెలుసు కొనుటకు ఇది చక్కటి అవకాశము. రెండు దినములుగా స్నానమునకు అవకాశం లేనందున సాహసించి స్నానానికి పోతున్నాడు గాని లేకుంటే వెళ్ళే వాడు కాదు. అలాగని మరొక్క అవకాశము చిక్కునను నమ్మకమూ లేదు. పొదల వెనకనుండి చాటుగా జల పాతం వైపు చూడమని మనసు తొందర చేస్తోంది. అలాగని మాటిచ్చి తప్పుట క్షత్రియ ధర్మం కాదంటూ అంతరంగం సతాయిస్తోంది.
కొద్ది క్షణాలు గుంజాటన తర్వాత చివరకు గుట్టు తెలుసుకొనుటకు మరుగున వుండి వీక్షించుట తప్పు గాదని తోచినది. అంతే.... ఇక సందేహాలను పక్కన పెట్టి లేచాడు.

అశ్వాలు గరుడ, ఢాకినీ రెంటికీ చక్కని జోడి కుదిరింది. అవి జంటగా పక్క పక్కనే తిరుగుతూ పచ్చిక మేస్తున్నాయి. ధనుంజయుడు మడుగు వద్ద కెళ్ళాడు. పొదల వెనక ఆకుల కొమ్మల మాటు నుండి మడుగు అవలతున్న జల పాతం వైపు దృష్టి సారించాడు.
కొద్ది సేపటికి` ధనుంజయుడు చూస్తుండగానే

అపర్ణుడు జల పాతం వద్దకు చేరుకున్నాడు.

పొడి దుస్తుల్ని పక్కన బండ మీద వుంచి అవి గాలికి ఎగిరి పోకుండా బరువుకి ఒక రాతి ముక్కనుంచాడు. చుట్టూ పరికించి చూసాడు. ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక అప్పుడు`

అప్పుడు తలపాగా తీసి తల విదిలిస్తూ తల పాగాను జాగ్రత్తగా బండ మీద ఉంచాడు. చూస్తున్న ధనుంజయునికి కొద్ది క్షణాలు గుండె లయ తప్పింది. రెప్పవాల్చటం మర్చి పోయాడు. ఎందుకంటే` తలపాగా తీసిన మరు క్షణం`

అంత వరకు మడిచి తలపాగాలో బంధించి, బిగించి వుంచిన తలకురులు, తల విదిలించగానే జల పాతంలా ఒక్క సారిగా కిందకు జాలు వారాయి. తుమ్మెద రెక్కల్లా నిగ నిగ లాడుతున్న దట్టమైన నల్లటి కేశ సంపదకు ఒక్క సారిగా విడుదల లభించింది. మోకాళ్ళను తాకే నిడుపాటి కురులను చూడ గానే అర్థమై పోయింది. అపర్ణడు పురుషుడు కాదు స్త్రీయని. ఆ స్త్రీ ఎవరో కాదు తను వలచిన భద్రా దేవి. ఇక చెప్పాలా... యువ రాజు హృదయం ఆనందంతో ఉరకలేసింది. తనను తాను అదుపు చేసుకున్నాడు. తను యువతి అయి వుండి కూడ ఇంతగా పురుషుడిగా నటించటం అపర్ణుడికే చెల్లింది. సందేహం తీరి పోయింది.

ఆరోజు సహ్యాద్రి పైన తను అనుమానించిందే నిజమైంది. నీలవేణి మనవరాలు భద్రా దేవిగా స్నాన ఘట్టం వద్ద కన్పించిన అపర్ణుడు తనను చూడగానే త్వరగా దైవ దర్శనం గావించుకొని ఇంటికి పోయి తిరిగి అపర్ణుడిగా తన ముందుకొచ్చాడు. భద్రాదేవి ఎంతటి చతుర? తలచుకుంటేనే విస్మయం కలుగుతోంది.

అక్కడ జలపాతం వద్ద భద్రాదేవి ఒక్కటొక్కటే తను మగ వేషం దుస్తులు తొలగించి నగ్నంగా ఉన్న వంటికి పల్చని వస్త్రం చుట్టు కుంటోంది. పసిడి బొమ్మలా మెరిసి పోతున్న ఆమె నగ్న సౌందర్యాన్ని చూస్తూ వివశుడై పోయాడు. అయితే వెంటనే తేరుకున్నాడు. నగ్న సౌందర్యాన్ని వీక్షించటం సభ్యత కాదని మనసు హెచ్చరించటంతో చూపులు తిప్పుకున్నాడు. ఏమీ తెలియనట్టే వెనక్కి వచ్చి కంబళి మీద మేను వాల్చాడు. కన్ను మూసినా తెరిచినా మెరుపు తీగ లాంటి భద్రాదేవి సౌందర్యమే కళ్ళ ముందు మెదుతోంది. ఆలోచన మధ్య చల్ల గాలికి తనకు తెలియకుండానే నిద్ర పట్టేసింది.

అలా ఎంత సమయం గడిచిందో తెలీదు.

పక్కన అలికిడయితే తిరిగి మెలకువ వచ్చింది ధనుంజయుడికి. అయినా కూడ నిద్ర నటిస్తూ అలాగే వుండి పోయాడు.

గుట్టు తెలిసి కూడ ఇంకా ఉపేక్షించి మిన్న కుండుట ధనుంజయునికి ఇష్టం లేదు. వాస్తవంగా భద్రాదేవి ఎవరు? మగ వేషంలో ఎందుకు తిరుగుతోంది? ప్రయాణం ముందుకు సాగే కొలది తన గురించి తెలుసుకునే అవకాశం లభించక పోవచ్చు. కాబట్టి ఇప్పుడే ఆమె గురించి తెలుసుకోవాలని నిశ్చయానికొచ్చాడు. అలాగని తను మరుగున వుండి ఆమెను చూసిన విషయము బయట పడ కూడదు. అతడి ఆలోచనల్ని భగ్నం చేస్తూ` ‘‘ప్రభూ! ఇక లేవండి’’ అంటూ అపర్ణుడి పిలుపు విన వచ్చింది. ధనుంజయుడు ఉలక లేదు పలక లేదు.
చట్టున ఆ చేతిని అందుకున్నాడు ధనుంజయుడు. కుసుమ కోమలమగు ఆ చేతిని మృదువుగా తడుముతూ` ‘‘ప్రియ సఖీ భద్రా... వచ్చితివా... భద్రాదేవి... కరుణించితివా!’’ అంటూ కలవరించాడు.

‘‘అయ్యో ప్రభు! నేను మీ భద్రా దేవిని గాను, అపర్ణుడను. దయతో కరము వదిలి లేవండి’’ అంటూ చేతిని వెనక్కు తీసుకో బోయాడు. కాని చేయి విడువ లేదు ధనుంజయుడు.

‘‘కనికరము జూపకున్న కరము విడువను భద్రా... కలలో సాక్షత్కరించి పారిపో జూచుట న్యాయమా!’’ అన్నాడు.

అపర్ణుడిగా మగ వేషంలో వున్న భద్రా దేవికి ఏం చేయాలో అర్థం కాలేదు. ధనుంజయుడికి సత్యము తెలిసి పోయినదేమో తెలియకున్నది. ‘‘ప్రభు! నిద్ర మేల్కొనండి. నేను భద్రా దేవిని గాను’’ అంటూ చేతిని విడిపించుకో బోయింది కాని ధనుంజయుడు ఆమె చేతిని బలంగా మీదకు లాగటంతో ఒక్క సారిగా తూలి అతడి మీద పడి పోయింది. ఆ విసురుకు తలపాగా ఎగిరి అవతల పడగా ఆమె కేశ సంపద చెదరి ధనుంజయుని ముఖాన్ని కరి మబ్బులా కప్పేసింది.

తత్తర పడి లేవ బోతున్న భద్రా దేవిని తన ఆజానుబాహువులతో ఆమె ఛాతీని చుట్టేసి మీదకు లాక్కున్నాడు.

వూహించని సంఘటనకు కంగారు పడి తలపాగాను అందుకోబోయింది భద్రా దేవి. ఆమెకా అవకాశం యివ్వకుండా మరింతగా కౌగిలి బిగించి ముఖం మీది జుత్తును తప్పించి చిలిపిగా ఆమె సొగ కళ్ళ లోకి చూసాడు ధనుంజయుడు. సిగ్గుతో ఆమె బుగ్గలు కెంపులై కనురెప్పలు బరువై వాలి పోయాయి.

‘‘ఇంకా ఎన్ని దినములు ఈ మగ వేష ధారణ?’’ నిను వలచితినని తెలిసి కూడ నన్నిలా ఏమార్చుట న్యాయమా? నీ గుట్టు నాకు తెలిసి పోయె. ఇప్పుడేమి చేయ వలె?’’ అనడిగాడు కొంటెగా.

ఓసారి కనురెప్పలు ఎత్తి అతడి కళ్ళలోకి చూసి వెంటనే సిగ్గిలి అతడి వక్ష స్థలమున మోము దాచుకుంది.

‘‘ప్రభువులకిది తగునా? తమరింతటి చిలిపి వారు, కొంటె వారని తెలియక జలకమాడ బోతిని. మరుగున వుండి స్త్రీలను వీక్షించుట మీ వంటి మగ ధీరులకు తగదు గదా’’ అంది చిన్నగా.

‘‘నిజమే. నేను స్త్రీలను జూడ లేదు. నా ఇష్ట సఖిని మాత్రమే జూచినాను. నీవు మాత్రం కులాచారము వంశాచార మంటూ సాకు చెప్పి తప్పించు కొనుట పాడియా?’’ గడుసుగా ఎదురు ప్రశ్నించాడు ధనుంజయుడు.

‘‘మీ వలపునకు అర్హురాలను గాను. అందుకే అలా చెప్పితిని’’ అంటూ చిన్నగా బుదులిచ్చింది భద్రా దేవి.

‘‘ఆ విషయము నిర్ధారించుకో వలసినది మేము గదా... ఒక వేళ నీ మనసున మాపై వలపు లేకున్న ఒక్క మాట జెప్పుము చాలును. నిను విడుతును. ఇక మీదట నిను పురుషుని గానే భావింతును. నిస్సంకోచముగా తెలుపుము.’’

ఆ మాటలకు నోటితో బదులు చెప్ప లేదు భద్రా దేవి. విశాలమగు ధనుంజయుని వక్షస్థలమున సుతారంగా తన పగడాల పెదవు లాన్చి గోముగా ముద్దాడింది.

భద్రా దేవి తన హృదిలో ధనుంజయుని ఎంతగా ఆరాధిస్తోందో తెలియడానికి ఆ ఒక్క ముద్దు చాలు. పులకించి పోతూ ఆమె బుగ్గను స్రృశించి దోలిసితో ముఖారవిందాన్ని పైకి లేపి తన వైపున తిప్పుకున్నాడు. కొన్ని లిప్తకాలం ఒకరి నొకరు ఆరాధనగా చూసుకున్నారు. నును సిగ్గున ఎర్ర బారిన చెక్కు టద్దాలు చూసాడు. అర మూతలయిన కను దోయిని చూసాడు. అదురుతున్న పగడాల పెదవుల్ని చూసాడు. అంతే`
ఇక తాళలేక ఆమెను మరింతగా పొదుపుకుని మీదకు లాక్కొంటూ మురిపెంగా అధరాలను ముద్దాడాడు.

‘‘భద్రా దేవి! పంచ భూతాల సాక్షిగా, సూర్య చంద్రుల సాక్షిగా ప్రమాణము చేసి ప్రకటించుచున్నాడను. నీవే సఖివి. నా రాణివి. ఇందులో మార్పు లేదు. నీలో సందియమున్న నిరభ్యంతరముగా అడుగ వచ్చును’’ అంటూ కురులు సవరించాడు.

‘‘నాకు ఏ సంశయములు లేవు ప్రభు. అలాగునే మహారాణి కావలెనన్న ఆశ కూడ లేదు. నేను సాధారణ యువతిని. మీ దాసిని. మీ పాదముల చెంత ఒకింత చోటు చాలును’’ అంది భద్రా దేవి.

‘‘మా మదిలో నీవు కొలువై ఉండ పాదముల చెంత పని యేమి మనోహరీ’’ అన్నాడు నవ్వుతూ ధనుంజయుడు.

‘‘మీ హృదయ సింహాసనమున నాగ కన్య ఉలూచీశ్వరి కూడ కొలువై వున్నది మరచితిరా ప్రభూ?’’ అంది గడుసుగా భద్రాదేవి.

ఆమె తెలివి తేటలు ఎప్పటికప్పుడు ధనుంజయుని విస్తుపోయేలా చేస్తుంటాయి. అందుకే ఫక్కున నవ్వుతూ` ‘‘చెరి ఒక వైపునా వున్నారు. సింహాసనము మనకు చాలదా?’’ అన్నాడు.

ఆ మాటలకు భద్రా దేవి కూడా నవ్వకుండా వుండ లేక పోయింది. లేచి మోకాళ్ళ మీద చుబుకం ఆన్చి కూచుని క్రీగంట ధనుంజయుని చూడసాగింది. తనూ లేచి ఆమె పక్కనే కూచున్నాడు ధనుంజయుడు. ఒక చేత ఆమె సన్నటి నడుంని చుట్టి రెండో చేత ఆమె చేయి అందుకుంటూ వంగి శంఖం లాంటి ఆమె మెడవం పు మీద ముద్దాడాడు.

‘‘ప్రియా... నా మనసున మరులన్న చాలదు గదా. ఆ నాగ రాకుమారి మనస్సున ఏమున్నదో తెలియదు. ఇంత వరకు తిరిగి నా ముందుకు రానే లేదు. మనము నాగ లోకము చేరిన గాని ఆమె దర్శన భాగ్యము లభించదు. మనకా ఇంకను నాగ లోకము ఎచట వున్నదో, పోవు మార్గమెదియో తెలియకున్నది. గుడ్డిగా పయనించు చున్నారము. ఇంత లోనే ఆమె గురించి నీకెందు కింత అలక ? స్త్రీ సహజమైన అసూయ ఎందుకు? నీవు అసాధారణ యువతివని మరిచితివా?’’ అంటూ లాలనగా అడిగాడు.

‘‘నాకెలాంటి అలుక గాని అసూయ గాని లేదు ప్రభూ’’ అంది వెంటనే భద్రా వతి.

‘‘ఉంది... నీ మనసున అభద్రతా భావం వుంది. అది పోవలె. నీపై నా ప్రేమ శాశ్వతము. నా మదిలో నీ స్థానము సుస్థిరము. సంశయింప నక్కర లేదు. ముందుగా నాకో విషయము చెప్పు’’ అడిగాడు.

‘‘ఏ విషయము ప్రభూ?’’

‘‘నీ విషయమే దేవీ. నీవిటు పురుష వేషమున సంచరింప కారణమేమి? నీ జననీ జనకులు ఎవరు? ఎక్కడుంటారు? నీవు రాజధాని రత్నగిరికి వచ్చి ఎంత కాలమైనది? బామ్మ నీలవేణికి నీకును గల సంబంధమేమి? నీ గురించి సర్వం వివరింప వలె.’’

ఆ మాటలకు భారంగా నిట్టూర్చింది భద్రా దేవి.

‘‘నా గురించి చెప్పుటకు చాలానే వున్నది ప్రభూ. కాని ఇది సమయము గాదు. పొద్దు వాలుచున్నది. భోజనము వేళ మించినది. తక్క సమయమున నేనే వివరించెదను. మనము ఫలములారగించి పయనము కొన సాగించుట మంచిది’’ అంటూ గుర్తు చేసింది.

‘‘ఆ మాట నిజము. నిక్కముగ నీ గురించి సర్వము తెలిపెదవు గదా?’’

‘‘సత్యముగా ప్రభు. మీరేనా ప్రాణమై వుండగా మీకు గాక ఏరికి తెలుప గలను.’’

‘‘సరి. నాదో కోరిక!’’

‘‘ఆహాఁ! ఏమా కోరిక?’’

‘‘ఈ మగ వేష ధారణలో నిన్ను చూడ లేకున్నాను. సహ్యాద్రి పై స్నాన ఘట్టమున దర్శనమిచ్చినటు అందాల భరిణెలా అమ్మాయిగా నిను గాంచ కోరిక.’’

‘‘ఊహుఁ! ఈ కోరిక ఇప్పుడే తీరునది గాదులే. నా వద్ద అమ్మాయి వలువలు లేవు. వాటిని బామ్మ యింటనే వదిలితి. ఇప్పుడు కేవలము పురుష దుస్తులే వున్నవి’’ అంటూ ఒక ఫలము ధనుంజయుని కిచ్చి తను ఒకటి గ్రహించినది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్