Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
saradanandam

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

ఇదివరకటి రోజుల్లో.. “ ఇంటి గుట్టు రచ్చకు ఎక్కించొద్దూ..” అనేవారు. కానీ ఈరోజుల్లో, “ గుట్టు” అనే మాటకి విలువే లేకుండా పోయింది. గుట్టు అంటే మరీ విపరీతార్ధాలు తీయకండి. సాధారణం గా ఏ విషయమైనా, ప్రపంచం అందరికీ తెలియడం ఎందుకూ, ఏదో కుటుంబ సభ్యులమధ్యలోనే ఉంటే బావుంటుందీ అని,  బయటివారితో పంచుకునేవారు కారు. అలా చేయడం వలన కొన్నిసార్లు  నష్టంకూడా జరిగేది. ఉదాహరణకి,   ఇంట్లో ఓ సభ్యుడికి కొడుక్కో, కూతురికో, ఏదైనా చెప్పుకోలేని ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు, దగ్గరవారితో ఆ విషయం పంచుకుంటే తప్పేమీ లేదు. వారికి ఏదైనా పరిష్కారమార్గం తెలిస్తే చెప్తారు. కానీ ఆ రోజుల్లో చాలామందికి ఓ   mind block  ఉండేది. ఊరికే టముకేసికోవడం ఎందుకూ, వాళ్ళు ఊరంతా చెప్పేస్తే బావుండదూ అనె ఓ అభద్రతా భావం. ఏది ఏమైనా ఆనాటి పరిస్థితి అదీ.   ఉదాహరణకి ఇంటి కూతురో, కోడలో “ నీళ్ళోసుకున్నప్పుడు”,  “ శ్రీమంతం” దాకా ఎవరికీ చెప్పేవారు కాదు. ఆతరువాత ఎలాగూ తెలుస్తుందే…. ఊరికే ఊరంతా తెలిస్తే పిల్లకి దిష్టితగులుతుందీ అని ఓ అభిప్రాయం కావొచ్చు. ఇలాటివాటికి ఎవరూ అభ్యంతరం కూడా చెప్పేవారు కాదు.  అలాగే, పసిబిడ్డని, పక్షులు గూటికి వెళ్ళేలోపలే, చీకటి పడ్డాక బయటకు తీసికెళ్ళడం ఉండేది కాదు. అంతదాకా ఎందుకూ, ఏవో శాంతినక్షత్రాల్లో పుట్టిందనో, పుట్టాడనో, చివరకి కన్న తండ్రిని కూడా, ఆ పసిబిడ్డని, “ బారసాల” దాకా, పీటలమీద కూర్చునేదాకా చూడనిచ్చేవారు కాదు. అదీ ఓ మూకుడులో నూనె పోసి, అందులో తన గారాలపట్టి ప్రతిబింబం మాత్రమే.. మన పాత సాంప్రదాయాలనిబట్టి అలా ఉండేది. .

 

ఆ పాత సంప్రదాయాలని పట్టించుకునేవాళ్ళెవరు ఈరోజుల్లో? నూటికి 70 పాళ్ళు, తేదీలని బట్టే, సిజేరియన్ ఆపరేషన్లాయె.  బిడ్డని స్కూల్లో వేసే వయసుకి, ఏ అడ్డంకీ రాకుండా, ఆ ప్లే స్కూల్లో చేర్చడానికి సూటయ్యే, తేదీల్లో ఆపరేషన్లు. ఈరోజుల్లో ,  శాంతీ లేదూ, నక్షత్రాలూ లేవూ, మూకుళ్ళూ లేవూ, పక్షులూ లేవూ,  అంతా  instantaneous…   పుట్టేది ఆడబిడ్డా, మగబిడ్డా అని ముందరే తెలిసికోడం  ( ఎన్ని చట్టాలున్నా),, పసిబిడ్డ పుట్టిన మరుక్షణం, ఓ ఫొటో తీసి, ఏ  Facebook  లోనో పెట్టుకోడం,, ఆ ఫొటోకి కనీసం ఓ 100 like  లైనా రాకపోతే, భోరుమని ఏడవడం. తన friend list  లోంచి like  చేయని దురాత్ములని  unfriend  చేసేయడం.

 ఆ రోజుల్లో , ఇంటి ఆడపిల్లకి ఏ పెళ్ళి చూపులైనా ఉంటే, ఏ దగ్గరి చుట్టానికో, లేదా తెలిసిన పెద్దమనిషికో మాత్రమే చెప్పేవారు. తాంబూలాలుచ్చుకునే టైములో, ఏదో అవసరానికి, సాక్ష్యానికైనా ఉపయోగిస్తారని.. ఇంకో కారణం,, అందరికీ తెలిస్తే, ఇంకోరెవరైనా ఆ పెళ్ళికొడుకుని,  తన కూతురికి, ఎగరేసుకుపోతాడేమో అనో భయం. ఈరోజుల్లో ఆ గొడవే లేదు. పెళ్ళి చూపులన్నవి కూడా, మన రైల్వే రిజర్వేషన్లలాగ  online  అయిపోయాయి.. ఎక్కడ చూసినా అంతర్జాల వేదికలే.  అందులో  Register  చేసికుంటే చాలు, వందలాది సంబంధాలు.. వారి వివరాలు, ఫొటోలు, జీతభత్యాలూ,   ఇంకా మొదలెట్టలేదుకానీ, వచ్చే రోజుల్లో వారి వారి  Boy/Girl  Friend ల వివరాలూ, పెళ్ళికొడుకుల  Spertm Count  తో సహా తెలిసినా ఆశ్చర్యపడక్కర్లేదు.  Police Verification Report  ఒక్కటీ మాత్రం ఉండదు.  ఇంక పాత “ గుట్టు “ కి  అర్ధం ఏమిటీ? అంతా పారదర్శకత్వమే…

ఇంటి ఆడపిల్ల యుక్తవయస్కురాలయేటప్పటికి, ఓణీ తప్పని సరీగా వేసేవారు. అసలు ఈ రోజుల్లో ఆ గొడవే లేదు. ఎవరిష్టం వారిదీ. కొంతమందైతే,  ఎంత వీలుంటే అంత చూపించి, బయటివారికి “ కనుల విందు “ చేయడమే  ధ్యేయంగా ఉంటారు. ఇంక సినిమాతారలైతే అడగక్కర్లేదు.  More you expose more in demand..   హాయిగా ఉన్నదేదో చూపించుకోక, గుట్టు ఏమిటీ? అనే సిధ్ధాంతం..

 అలా చెప్పుకుంటూ పోతే, ఇదివరకటి సిధ్ధాంతాలకి అర్ధాలే మారిపోయాయి. ఈరోజుల్లో  అసలు గుట్టు అనేది ఉందా అసలు?   ఆరోజుల్లో, ఎంత ధనవంతుడైనా సరే, చూపించుకునేవారు కాదు. అవసరానికి మాత్రం సహాయం చేసేవారు. కానీ ఈరోజుల్లో చేతిలోకి నాలుగు డబ్బులొచ్చేసరికి, ఎంతలా ప్రదర్శించుకుందామా అనే తపనే ఎక్కువయింది.. అలా చూపించుకునేసరికి ఏమౌతోందీ.. వీడి బడాయి చూసి, ప్రభుత్వం వారు, ఏ సిబిఐ వారినో వీడి వెనక్కాల వదుల్తున్నారు. మరీ అంతలా చూపించుకోవడం అవసరమంతారా….

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
pounch patas