Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Study Skills, Exam Tips and Ayurveda Remedies in Telugu by Dr. Murali Manohar

ఈ సంచికలో >> శీర్షికలు >>

అరి సె ల్లాంటి ఐకమత్యమే - మణుగు బూలంత మహాబలం. - ఆదూరి.హైమావతి.

arisellaanti ikamatyame - manuguboolanta mahaabalam

గారెల రాజ్యంలో  పులిహోర పురం రాజధానిగా  , దద్దోజనం చక్రవర్తి , చక్రపొంగలి  రాణితో  , మలై కాజా  మహా మంత్రి సలహాలతో ,సమోసా సైన్యధిపతిగా, పరిపాలిస్తుండగా ,అతడి తమ్ముడు అప్పాలు ,వంకాయ బజ్జీ వంకర మాటలువిని, వేడి వేడి పకోడీల్లా  వేరుపడి కుడుముల రాజ్యం చేసుకుని , రవ్వ లడ్డు  రాజధానిగా , మిరపకాయ బజ్జీ మంత్రిగా, సేమ్యాపాయసం సేనానిగా  రాజ్యపాలన చేయాలని నిప్పంట్టంత నీల్గి ,నీరుల్లి వడలా వగ పడ్డాడు. మడత కాజా లెవల్లోని  లేఖకునితో  అన్నకు  కట్లెట్ భాషలో  కమ్మవ్రాసి కలాకండతో  కబురంపాడు.  లడ్డు బుట్టలో లేఖ పట్టుకుని , మిర్ఛి బజ్జీ బండిలో , తీపి గారెల కబుర్లు వింటూ   , కలాకండ  వెళుతుండగా ,వేసవి కాలం కావటాన  వేరుశనగ ఉండల్లా  వడదెబ్బతగిలి , పరమాన్నపురంలో  , సున్నుండల  సలహాతో, ఇడ్లీ ఇంట విశ్రమించి , మినపట్టు మెడికల్  సేవలతో, మొక్క జొన్న వడల మందేసుకుని, టమాట జామ్ తో సేదతీరి, పాయసం  ఫలహారం చేసి, మషాలా పకోడి తో మంచం దిగి, బ్రెడ్ హల్వా బండిలో , కరివేప వడ  కళ్ళెం పట్టుకోగా , పాలకోవా బాట  చూపగా,  పుణుగులు కట్టిన బండి పరుగెత్తసాగింది.

వెజటబుల్ వడ వెంట వస్తుండగా , బర్ఫీ బిగువుతో , సున్ని ఉండల కొండలూ, కజ్జికాయల కోనలూ, పూతరేకుల పర్వతాలూ, సగ్గుబియ్యపాయస సము ద్రాలూ,  ఖర్జూరం హల్వా  కోనేరునూ, కొబ్బరి పాయసపు కొలనునూ, జాంగ్రీల  జాగీరు నూ దాటుకుని  , ఆలూ వడ అరణ్యంలో ప్రవేసించగా  , బూరెల దొంగలూ, కట్లెట్ కర్రలతో, అడ్డుకోగా , రవ్వ కజ్జి కాయల రక్షకులు ,బూందీ లడ్డు బూరలూది , కాజాల జాగిలాలను రప్పించి, సేమ్యా హల్వా శూలాలతో ,  బొబ్బట్లు బొబ్బల తో  భయపెట్టగా , తొక్కుడు లడ్డు  దొంగలంతా , ఆవడల అరణ్యంలోకి పారిపోయారు.

రాజభక్తి గల రవ్వ కేసరి , వడియాల వేగులూ , బఠానీ వడబంట్రోతులు ,  చెర్రి జామ్  చారులూ,   కలాకండ కారణం లేని రాక  తెల్సుకుని , అన్నం పరవాన్నం పారించి, ఉల్లిపాయ పకోడి, అరటికాయ బజ్జీ లూ దారికడ్డం వేసి ,అరిసెలు బండి అడ్డంపెట్టి , ఊతప్పం తో వళ్ళంతా వాతలేసి, గవ్వలతో గవదలూడ గొట్టి, పాలకోవా బిళ్ళలతో పళ్ళు పీకి, బాదం కేకు తో  బాది, కొబ్బరి ఖీర్ కొరడాతో కొట్టి, గులాబ్ జామ్ లతో గుచ్చి గుచ్చి , ఉల్లిపాయ వడియపు తాళ్లతో కట్టేసి, పాయసం తో పనిష్ చేసి, బొంగుమిఠాయ్   తో బొమికెలు విరగ్గొట్టి  , అదిరి పోయే అల్లం , బెల్లం పచ్చడి- మిర్చి బజ్జీతో మిక్స్ చేసి పట్టించి , ఖర్జూరం హల్వా ఖైదులో వేశారు.

చిమ్మిరుండల చారులూ, సజ్జప్పాల సమాచరకులూ,  వెనిల్లా వేగులూ , అప్పచ్చుల ఆత్మీయులూ అదించిన ఈ సమాచారం విని , బూంది బాబాయ్  పెట్టిన భయంతో , కొబ్బరి వడలా వణికిపోయి, మిర్ఛి బజ్జీ మైత్రితో, పెసరట్టు దొంగ ప్రేమతో, మైసూరుపాక్ మైత్రితో , జీళ్ళ జాయింట్లు జారిపోయి , చిలకడ దుంపల లడ్డులా చింతించి, సజ్జ బూరెల్లా స్వాంతనపడి,  పెసర అప్పడాల్లా పశ్చాత్తాపపడి, ఖర్జూరం హల్వాలా కుళ్ళికుళ్ళీ ఏడ్వగా,కరుణగల క్యారట్ పాయసపుదేవుని  కారుణ్యంతో, మైసూరు బజ్జీ బుజ్జగింపులతో మనసుమారి, మినప్పిండి అప్పడాల్లా  ముసిరిన ఆలోచనలు వదిలి, నువ్వుండల నయ వంచకత్వం , చెగోడీల  చెప్పుడు మాటలూ, బీరకాయ బజ్జీ బీరాలూ ,జిలేబీల జాడ్యాలూ అంటించినవి  వదలుకుని , అప్పాల్లా ఆగి ఆగి, , క్యారట్ కేక్ లా కేకలేసి, ఉండ్రాళ్ళ లాపొర్లి పొర్లి, హల్వా లా అరచి అరచి, బొబ్బట్ల లా బొబ్బలేసి, వేరుశనగ ఉండలా వేరుపడాలన్న తన చెడు చింతనకు , పూర్ణం లా పూర్తిగా మారిపోయి, బాదం ఐస్ క్రీం లా పశ్చాత్తాపపడి, బాస్మతి బియ్యపు పరవాన్నంలో  , స్పాంజ్ కేక్ తోస్నానం, చేసి , సగ్గుబియ్యం  వడియంలా శుధ్ధిపడి, బ్రెడ్ హల్వాకేకుతో భయంతీరి, జీడిపప్పు మైసూరుపాక్ లాంటి ‘ అన్నప్రేమ ‘ తల్చుకుని,  మైమరచి, ఐస్ క్రీం లాంటి అన్నతనను క్షమించే లా చేయమని , ఉప్మా తో దేవుని ఉపాసించి , పైనాపిల్ కేక్ లా ఫ్రండ్సును పక్కకు నెట్టి , తనకు జీడిపప్పు అచ్చు జాడ్యం వదలి నందుకు , పిండి వడియంలా  పరవసించి, అప్పడాల వంటి అన్నను చూడాలని, పకోడి పళ్ళెం పట్టుకుని, బూరెల బ్యాగ్ భుజానికి తగిలించుకుని, కొబ్బరి బొబ్బట్లు కొన్ని తీసుకుని,  ప్రియమైన వదిన కోసం పెసరపిండి వడియాలు , స్నేహితుల కోసం  సొరకాయ వడియాలు, మరికొందరి కోసం కొబ్బరి క్యాబేజి వడలు, ప్రేక్షకుల కోసం పాన్ కేక్సూ , కొలువులోవారి కోసం  కొబ్బరి ఉండలు  , సేవకుల కోసం సగ్గు బియ్యం పాయసం,తీసుకుని  అన్నపు పాయసం లాంటి అన్నను చేరి, , కొబ్బరి హల్వా  పాయసం వంటి పాదాలు పట్టుకుని , కోకోనట్ కేక్ లా కేక లేసి ఏడ్వగా , అన్న ఆల్మండ్ చాకొలెట్‌ బార్  లా కౌగలించుకుని , తీపికాజా లాంటి తమ్ముడ్ని, ఆవడలా ఆలింగనం చేసుకుని , బూడిద గుమ్మడి వడియాలవంటి బుగ్గలు ముద్దాడి,  బిడియ పడవద్దని బియ్యం పిండి వడియాల విందిచ్చాడు. రవ్వ లడ్డు లాంటి  వారి లవ్వుకు శాండ్ విచ్ వంటి సభికులంతా  ఆవపెట్టిన  పనసపొట్టు కూరలా ఆనందించారు.  
 

 

మరిన్ని శీర్షికలు
beauty of rajastan   7th part