Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunalugu yugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యం.లక్ష్మి

                                                                                        విండ్ కేవ్ నేషనల్ పార్క్

కస్టర్ స్టేట్ నేషనల్ పార్కు దగ్గరలోనే (పక్కనే అనుకోండి) వున్నది విండ్ కేవ్ నేషనల్ పార్కు.  మొదట్లో ఈ భూగర్భ గుహలోకి వెళ్ళటానికి మార్గం వుండేది కాదు.  కేవలం ఒక రంధ్రం మాత్రం వుండేది. (ఇప్పటికీ అది అలాగే వున్నది.  ఫోటో చూడండి) దాన్లోంచి లోపలకి, బయటకి గాలి వేగంగా రావటం, కొన్ని వందల సంవత్సరాల క్రితమే అమెరికన్ ఇండియన్లు కనుక్కున్నారు.  ఆ ప్రాంతంలో నివసించే కొండ తెగలవారు ఆ శబ్దాలు వారి దేవతలు చేసే శబ్దాలుగా భావించి, దానిని ఒక పవిత్ర ప్రదేశంగా  భావించేవారు.

ప్రస్తుతం ఇలాంటివన్నీ ప్రజలకి అందుబాటులోకి వచ్చాయంటే వాటిని పరిశీలించి, పరిశోధించి, ప్రపంచానికి తెలియ చేసిన ఆద్యులు తప్పని సరిగా వుంటారుకదా.  ఈ విండ్ కేవ్ కి అలాంటి ఆద్యులు జెస్సె మరియు టామ్ బిన్ ఘమ్.  1881 లో వారు ఈ ప్రాంతానికి వచ్చారు.  ఈ కేవ్ రంధ్రంలోంచి వేగంగా వచ్చే గాలి, దాని శబ్దాలు వారిని ఆకర్షించాయి.  ఆ గాలి వేగానికి టామ్ టోపీ ఎగిరి పోయిందని కూడా చెప్పుకుంటారు.  కొన్నాళ్ళ తర్వాత జెస్ తన స్నేహితులకి ఈ వింత చూపించటానికి తీసుకు వచ్చాడు.  అప్పుడు గాలి ప్రయాణించే దిశ మారటం గమనించాడు.  మునుపటిలా గాలి రంధ్రంలోంచి బయటకి కాకుండా లోపలకి వెళ్ళటం గమనించాడు.  ఇప్పుడు మనకైతే తెలుసు .. గుహ లోపలి, బయట వాయు పీడనాలవల్ల గాలి వెళ్ళే దిశలు మారుతాయని.  అప్పటికింకా సైన్సు అంత అభివృధ్ధి చెంద లేదు కదా.  అందుకే అది కూడా వారికి వింతగానే కనిపించింది.


ఈ కేవ్ లోకి ప్రవేశించిన మొదటి వ్యక్తి ఛార్లీ క్రేరీ,  1881 లో అని చెప్తారు.  ఆయన ఒక ట్వైన్ దారం సహాయంతో లోపలకి వెళ్ళాడంటారు.  వారు గుహలో రూపొందిన బాక్స్ వర్క్ ఫార్మేషన్స్ చూశారు.  ఇవి చాలా అరుదుగా వుంటాయి.  దానితో ప్రైవేట్ కంపెనీలు మైనింగ్ కోసం వచ్చాయి కానీ ఆ తవ్వకాలు సరిగ్గా జరగకపోవటంతో వదిలేశారు.  ఆ సమయంలో పని చేసిన మెక్ డొనాల్డ్, అతని కుటుంబం  మాత్రం ఆ గనిలో తవ్వకాలు జరపలేకపోయినా, సందర్శకులను ఆకర్షించటం వలన, గుహలోని ఖనిజ రూపాలను అమ్మటం వలన లాభాలు గడించవచ్చనుకున్నారు.  ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.  ఆ కేవ్ కి మనుషులు వెళ్ళటానికి వీలుగా దోవ ఏర్పాటు చేసి, దర్శకుల సందర్శన కోసం ఇరుకు దోవల్ని కొంత వెడల్పు చేశారు.  

తర్వాత మెక్ డొనాల్డ్ కీ వేరేవారికీ, ఆ కేవ్ మీద అధికారం కోసం లావా దేవీలు జరిగాయి.  చివరికి 1-3-1903 న ప్రెసిడెంట్ ధియోడర్ రూజ్ వెల్టు దీనిని విండ్ కేవ్ నేషనల్ పార్కుగా ఏర్పరిచే బిల్ మీద సంతకం పెట్టారు.  అమెరికాలో ఇది ఎనిమిదవ నేషనల్ పార్కు.  భూగర్భ గుహని సంరక్షించటానికి ఏర్పాటు చేసిన మొట్ట మొదటి పార్కు.  అంతేకాదు.  విండ్ కేవ్ చాలా పెద్దది.  పొడుగైన, అంతుబట్టని (complex) కేవ్స్లో ఒకటి.  దీనిలో ఇంకా పూర్తిగా కనుగొనని దోవలు ఎన్నో వున్నాయిట.  

మొదట్లో ఇక్కడ అడవి జంతువులు వుండేవి కావు.  1912లో అమెరికన్ బైసన్ సొసైటీ బైసన్ల మంద కోసం స్ధలం కొరకు వెతుకుతున్నప్పుడు ఈ ప్రదేశాన్ని అనువైనదిగా ఎంచుకున్నారు.  ఈ అడవి జంతువుల వల్ల కూడా ఈ కేవ్ కి సందర్శకులు సంఖ్య పెరిగింది.  ప్రస్తుతం ఈ పార్కు విస్తీర్ణత 33,851 ఎకరాలు.

ఈ కేవ్ లో అరుదైన బాక్స్ వర్క్ రూపొందిందని చెప్పానుకదా.  ఈ బాక్స్ వర్క్ ఇంత బాగా, ఇంత ఎక్కువగా వున్నది ఈ కేవ్ లోనేనంటారు.  బాక్స్ వర్క్ ఇక్కడ అత్యధికంగా వుండగా వేరే గుహలలో చాలా అరుదుగా కనిపిస్తుంది.

సాధారణంగా గుహలలో నీరు చుక్క చుక్కగా పడటంవల్ల అనేక రకాల ఆకారాలు తయారవుతాయి.  విండ్ కేవ్ లో ఏర్పడ్డ ఆకారాలని బాక్స్ వర్క్ అంటారు.  ఇవి వేరే గుహలలో తక్కువ పరిణామంలో కనబడవచ్చుగానీ విండ్ కేవ్ లో ఏర్పడినంత అద్భుతంగా, అధికంగా ప్రపంచంలోనే ఎక్కడా లేదంటారు.  కేల్ సైట్ అనే ఖనిజంతో  గుహ పైకప్పు మీద, గోడలమీద పల్చటి బ్లేడ్స్, దారాలు, నరాలు .. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట .. మొత్తానికి ఖనిజంతో పల్చగా గళ్ళలాంటి అల్లికలు  ఏర్పడ్డాయి.    వీటినే బాక్సెస్ అంటారు.  బాక్స్ వర్క్ అంటే కేల్ సైట్ అనే ఖనిజంతో చాలా పల్చగా, గుహ గోడలమీద, కప్పు మీద గళ్ళు గళ్ళుగా ఏర్పడ్డ ఆకృతులు.  ఇవి ఒక దానితో ఒకటి అనేక ఏంగిల్స్ లో కలిసి గళ్ళు గళ్ళుగా తేనె పట్టు ఆకారంలో తయారవుతాయి.  కాలక్రమంలో పగుళ్ళుపడ్డ గోడలు రాలిపోగా ఇవి అలాగే వున్నాయి.  పక్కన ఇచ్చిన ఫోటోలు రెండింటిలో ఆ అల్లికను మీరూ చూడవచ్చు. 

గుహలో ముందు వున్న రంధ్రం, పక్కనే తర్వాత ఏర్పాటు చేసిన మెట్ల ఫోటోలు కూడా చూడవచ్చు.  అసలు సంగతేమిటంటే, కొన్ని మెట్లు దిగేసరికి, నాకు ఊపిరాడనట్లు అయి గుహ లోపలకి వెళ్ళలేక పోయాను.  అప్పటికే గైడ్ ప్రవేశ ద్వారం తలుపుకి తాళం బిగించి ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నది.  నా ప్రాబ్లమ్ చెబితే, వెంటనే తలుపు తాళం తీసి, నన్ను బయటకి తీసుకొచ్చి కూర్చోబెట్టి,  ఆ హడావిడిలోనే నేను బాగానే వున్నాను అనిపించుకుని మరీ మిగతావారికి గుహ చూపించటానికి వెళ్ళింది.    అందుకే ఇక్కడి ఫోటోలన్నీ మా అమ్మాయి దీప్తి, అబ్బాయి తేజస్వి తీసినవి.  ఇది 45 నిముషాల ప్రోగ్రాం.

బయట ఖాళీగా కూర్చుని నేనేం చెయ్యాలని ముందు ఇన్ఫర్మేషన్ సెంటర్ కి వెళ్ళాను.  అక్కడి వారు లోపల ఆ గుహ గురించి డాక్యుమెటరీ చూపిస్తున్నారని అది చూడమని సలహా ఇచ్చారు.  మా వాళ్ళు వచ్చి వెతుక్కుంటారేమోనంటే, 45 ని. పడుతుంది వాళ్ళు వచ్చేసరికి, మేమూ చెబుతాములెండి అన్నారు.  పైగా అది 15 నిముషాల ఫిల్మ్ అనుకుంటా.  సరే వెళ్ళాను.  మంచిదయింది.  గుహలోకి వెళ్ళకుండా, ఆ ఫిల్మ్ లో గుహ టూర్ లో చూపించే ప్రదేశాలన్నీ చూశాను.  బయటకి వచ్చిన తర్వాత వీటి గురించే ఒక ప్రదర్శనలా వుంటే అదీ చూశాను.  అప్పటికి మావాళ్ళూ వచ్చారు.  అందరం కలిసి బయల్దేరాము.

దీనివల్ల తెలుసుకున్నదేమిటంటే, ఫారెన్ వెళ్ళినా, మన వీక్ నెస్ లు, మన ఎడ్వంచర్లూ మన బ్రాండ్ మనదే.  మరి నేను గుహలోకి వెళ్ళలేక పోయినా, బయటంతా నేనొక్కదాన్నే తిరిగి అన్నీ చూశానుకదా!!

మరిన్ని శీర్షికలు
weekly horoscope 8th april to 14th april