Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
punapratishta

ఈ సంచికలో >> కథలు >> అసలైన పండుగ

asalainapanduga

ఎనిమిదవ తరగతి చదివే రమణకి  అల్లరి ఎక్కువ.  సుబ్బరాజు సావిత్రమ్మల ఏకైక సంతానం కావడంతో ముద్దు ఎక్కువై అలా తయారయ్యాడు. కొడుకుని మంచి మార్గంలో పెట్టేందుకు ప్రయత్నించేవాడు సుబ్బరాజు. రమణకి ఒత్తాసు పలకాలని సావిత్రమ్మ చూసేటప్పుడు ఆమె మీద విరుచుకు పడేవాడు సుబ్బరాజు. అవసరమైతే రమణకి నాలుగు దెబ్బలు తగిలించేవాడు.అప్పటినుండి తండ్రి అంటే భయం పెరిగింది రమణకి .

ఆ రోజు ఉగాది పండుగ కావడంతో సావిత్రమ్మ వేకువనే నిద్ర లేచి పనులు ప్రారంభించింది.  ఉగాది పచ్చడి తయారు చేసింది. దేవుడికి నైవేద్యంగా పెట్టి పూలు, పండ్లతో పూజలు జరిపింది.

రమణని పిలిచి “నువ్వు తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని  దేవుడిని ప్రార్ధించు.  పరీక్షల్లో మంచి మార్కులు రావాలని కోరుకో. ఈ రోజు జరిగేదే సంవత్సరమంతా జరుగుతుందని అంటారు. నాన్న దగ్గర బుద్ధిగా  ఉండు” అంది సావిత్రమ్మ. అలాగే అని చెప్పిన రమణ గబగబా పనులు పూర్తి చేసాడు.

“ఇవాళ జీడిపప్పు, కిస్మిస్ ఎక్కువ వేసి పాయసం చేస్తాను. ప్రక్క వీధి పాల దుకాణంలో రెండు పాల పేకెట్లు తీసుకురా!” అని వందనోటు ఇచ్చింది సావిత్రమ్మ. అది జేబులో పెట్టుకుని పరుగు లాంటి నడకతో వీధిలోకి వెళ్ళాడు రమణ.

అలా వెళ్ళిన రమణ మరో మూడు గంటలు గడిచినా రాలేదు. ఇంట్లో ఉన్న సావిత్రమ్మ, సుబ్బరాజులకు కొడుకు ఏమయ్యాడా అని కంగారుగా ఉంది. “వెధవ ఇంట్లోకి రాగానే కాళ్ళు విరగ్గొడతాను. తిరిగి రావడానికి ఇంత ఆలస్యమా?” అని కోపంగా మాట్లాడాడు సుబ్బరాజు.

“పండుగతో వాడిని ఏమీ తిట్టవద్దు. వాడు వచ్చాక అడుగుదాము” అంటోంది సావిత్రమ్మ. సరిగ్గా అప్పుడే ఇంటికి వచ్చాడు రమణ. వాళ్ళ మాటలు విన్నాడు.  రమణ చేతిలో పాల పేకెట్లు  లేవు.

 “ఏరా ఇంతసేపయిందేం? పాల పేకెట్లు ఏవిరా?” అని అడిగాడు సుబ్బరాజు రమణని చూసి. భయంతో మాట్లాడలేదు రమణ. తండ్రి  ఏమి చేస్తాడో అన్న భయంలో ఉన్నాడు. బేల చూపులు చూస్తున్నాడు తప్ప మాట్లాడక పోవడంతో  “ఎవరైనా అడ్డగించి డబ్బు లాక్కుని వెళ్ళిపోయారా? అందుకే ఆలస్యం అయిందా?” అని అడిగింది సావిత్రమ్మ. 

కాదన్నట్టు తలూపాడు రమణ. “మరేం జరిగింది” హుంకరించి అడిగాడు సుబ్బరాజు.

‘మీరు కాసేపు లోపలకి వెళితే నేను కనుక్కుంటాను” అని భర్తని లోపలకు పంపింది సావిత్రమ్మ. తండ్రి వెళ్లిపోవడంతో రమణ నోరు విప్పాడు.

‘పాల పేకెట్ల కోసం వెళుతుండగా కొందరు జనం రోడ్డు మీద వేపచెట్టు కింద ఉండగా చూసాను.  వేపపువ్వు కోసం చెట్టెక్కి  కింద పడ్డాడు సింహాచలం. వాడు నా తరగతే. వాడికి ఎవరూ సాయం చేయలేదు. వాడికి తగిలిన దెబ్బల నుండి రక్తం కారుతోంది. పాపం వాడికి నాన్న లేడు. అమ్మ పాచి పనులు చేస్తుంది” అని చెప్పాడు రమణ.

“నీకెలా తెలుసు?” అని మధ్యలో అడిగింది సావిత్రమ్మ.

“వాడే చెప్పాడు. ఉగాది రోజు ఉదయం  వేపపువ్వు, మామిడి కాయలు అమ్ముతానని , ఆ  డబ్బుతో నిక్కరు, చొక్కా కొనుక్కుంటానని కూడా చెప్పాడు. వాడిని అలా చూడగానే జాలి కలిగింది. నువ్విచ్చిన వంద రూపాయలతో ఆసుపత్రికి తీసుకువెళ్ళి వైద్యం చేయించాను. వాళ్ళ అమ్మ వచ్చేవరకు వాడి ప్రక్కన ఉన్నాను. అంతకు ముందే వాడి సంచిలో ఉన్న మామిడి కాయలు, వేపపువ్వు చూసాను. వాడికి ఉన్న  కోరిక తీర్చాలని అనుకుని వేపపువ్వు, మామిడి కాయలు ఒక దుకాణం వాడికి అమ్మాను. వచ్చిన  డబ్బు సింహాచలంకి ఇచ్చాను. ఆ డబ్బు చూసి అంత బాధలోనూ వాడు ఎంతో సంబర పడ్డాడు. అందుకే ఆలస్యం అయింది. నేను చేసింది తప్పా?” అని అడిగాడు రమణ తల దించుకుని.

“ఇది విన్నారా? రమణ ఎంత మంచి పని చేసాడో” అని భర్తని పిలిచింది సావిత్రమ్మ.  గదిలో నుండి బయటకు వచ్చిన సుబ్బరాజు “అంతా విన్నాను. డబ్బు వృధా అయితే చివాట్లు పెడతానన్న భయం లేకుండా సింహాచలంకి వైద్యం చేయించి మంచి పని చేసాడు. మానవత్వం తెలియని వాళ్ళకి  కళ్ళు తెరిపించాడు.  వంటలు వండుకుని తింటే పండుగ కాదనీ,  సాటి మనుషుల కళ్ళలో వెలుగు నింపడం పండుగ అని కొత్త అర్ధం చెప్పాడు. అందరు పిల్లలు ఇలాగే మంచిగా ప్రవర్తించడం నేర్చుకుంటే ఎంతో బాగుంటుంది” అని కొడుకుని గుండెలకు హత్తుకున్నాడు సుబ్బరాజు.

తండ్రి ముఖంలో తన్మయత్వం  చూసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు రమణ.   

మరిన్ని కథలు