Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రసమీక్ష

sardar gabbarsingh movie review

చిత్రం: సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ 
తారాగణం: పవన్‌కళ్యాణ్‌, కాజల్‌ అగర్వాల్‌, శరద్‌ ఖేల్కర్‌, కబీర్‌సింగ్‌, ముఖేష్‌ రిషి, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, రఘుబాబు, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సంజన, ఊర్వశి తదితరులు 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
ఛాయాగ్రహణం: ఆర్థర్‌ విల్సన్‌ 
కథ - కథనం: పవన్‌కళ్యాణ్‌ 
మాటలు: సాయి మాధవ్‌ బుర్రా 
దర్శకత్వం: కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) 
నిర్మాతలు: శరద్‌ మరార్‌, సునీల్‌ లుల్లా 
విడుదల తేదీ: 8 ఏప్రియల్‌ 2016

క్లుప్తంగా చెప్పాలంటే 
రతన్‌పూర్‌ని భైరవ్‌ సింగ్‌ (శరద్‌ ఖేల్కర్‌) పీడిస్తుంటాడు. రతన్‌పూర్‌ రాజా కుటుంబానికి చెందిన అర్షి దేవ్‌ (కాజల్‌ అగర్వాల్‌)పై భైరవ్‌ సింగ్‌ కన్ను పడుతుంది. రాజకుటుంబానికి విధేయుడు హరినారాయణ (ముఖస్త్రష్‌ రుషి), అర్షిదేవిని కాపాడటానికి సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ (పవన్‌కళ్యాణ్‌)ని రప్పిస్తాడు. అక్కడినుంచి సర్దార్‌ గబ్బర్‌సింగ్‌కీ భైరవ్‌ సింగ్‌కీ మధ్య యుద్ధం జరుగుతుంది. రతన్‌పూర్‌ని సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ కాపాడాడా? ఈ క్రమంలో సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అర్షిదేవిని సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, భైరవ్‌ సింగ్‌ బారి నుంచి రక్షించాడా? అనేవి తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే 
నటుడిగా పవన్‌కళ్యాణ్‌కి వంక పెట్టడానికేముంది? అభిమానుల్ని రంజింపజే క్రమంలో పవన్‌ ఏం చేసినా అది సంచలనమే. పవన్‌ డాన్సులేశాడు, అల్లరి చేశాడు, ఫైటింగ్స్‌ చేశాడు, టీజింగ్స్‌ చేశాడు. ఒకటేమిటి? అభిమానులు ఎలా పవన్‌ని కోరుకుంటారో అలా కనిపించాడు. ఔట్‌ అండ్‌ ఔట్‌ వన్‌ మ్యాన్‌ షో అనిపించాడు పవన్‌కళ్యాణ్‌. ఆద్యంతం తెరపై పవన్‌కళ్యాణ్‌ని చూస్తోంటే అభిమానుల కడుపు నిండిపోతుంది. 
హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ రాజకుమారిలా అద్భుతంగా కనిపించింది. రాజకుమారి పాత్రలో మెప్పించింది. ఆమె అందం, గ్లామర్‌ ఈ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌. పవన్‌ సరసన సూపర్బ్‌గా కనిపించింది కాజల్‌ అగర్వాల్‌. వీరిద్దరి జోడీ తెరపై నిండుగా ఉంది. విలన్‌ పాత్రలో శరద్‌ ఖేల్కర్‌ ఆకట్టుకున్నాడు. ముఖేష్‌ రుషి బాగా చేశాడు. కమెడియన్లలో దాదాపు అందరూ నవ్వించారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు.

కథ కొత్తదేమీ కాదు. కథనం కాస్త డల్‌గా సాగింది. ఈ రెండూ పవన్‌కళ్యాణ్‌వే. నటుడిగా సినిమా బాధ్యతను మొత్తం తన భుజాన మోసిన పవన్‌కళ్యాణ్‌, కథ - కథనాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. సెకెండాఫ్‌లో కథనం చాలా స్లోగా అనిపిస్తుంది. నిడివి కూడా చాలా ఎక్కువయ్యింది. డైలాగ్స్‌ బాగున్నాయి. సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్బ్‌. పాటలు తెరపై చూడ్డానికీ బాగున్నాయి. ఎడిటింగ్‌ సెకెండాఫ్‌లో అవసరం అనిపించడం, సినిమా స్లోగా నడుస్తోందని చెప్పడానికి నిదర్శనం. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమా మూడ్‌కి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కింది. 
'జాని' తర్వాత పవన్‌కళ్యాణ్‌, కథ - కథనాలు సమకూర్చిన చిత్రమిది. 'జాని' పవన్‌కళ్యాణ్‌ దర్శకత్వంలోనే వచ్చింది. అది నిరాశపరిచింది. దాంతో, ఈ సినిమాపై ఎన్ని అంచనాలున్నాయో అన్నే అనుమానాలూ ఉన్నాయి. ఏమాత్రం డిజప్పాయింట్‌ చెయ్యనని పవన్‌ చెబుతూ వచ్చాడు. అభిమానులకు సినిమాని అంకితం కూడా చేశాడు. కానీ అభిమానుల్ని ఓ మోస్తరుగా ఆకట్టుకున్నా, ఉర్రూతలూగించే సినిమా మాత్రం కాదిది. ఫస్టాఫ్‌ ఓకే అనిపిస్తుంది. సెకెండాఫ్‌ నీరసంగా సాగుతుంది. పవన్‌కళ్యాణ్‌ తెరపై కన్పించినంతసేపూ అభిమానులు ఎంజాయ్‌ చేసినా, సినిమా నిడివి, సన్నివేశాల్లో సాగతీత అభిమానుల్నీ ఇబ్బంది పెడ్తాయి. పాటలు, యాక్షన్‌, కామెడీ పవన్‌కళ్యాణ్‌ స్థాయిలో ఉన్నాయి. స్టైలింగ్‌ కూడా అంతే. కానీ అన్ని వర్గాల ఆడియన్స్‌నీ మెప్పించే అంశాలు తక్కువే ఉన్నాయి. కథ, కథనాలు నీరసంగా ఉండటంతో దర్శకుడికీ పెద్దగా పని లేకుండా పోయింది.

ఒక్క మాటలో చెప్పాలంటే 
గబ్బర్‌సింగ్‌ పవర్‌ తగ్గింది

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka