Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే http://www.gotelugu.com/issue156/444/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

 

అంతటితో సంభాషణ నిలిపి ఇరువురూ ఫలములతోనే భోజనం ముగించారు. భద్రాదేవి తన తలపాగా ధరించి తిరిగి పురుష రూపంలోకి వచ్చినది. ఆమెనే చూస్తూ మందహాసం చేసాడు ధనుంజయుడు. ‘‘ప్రాణ సఖీ... ఇప్పుడు నిన్నేమని నేను పిలవాలి? అపర్ణుడనా... భద్రా దేవియనా?’’ అనడిగాడు.

‘‘అది వేరే చెప్ప వలెనా ప్రభూ. ఏకాంతమున మీ భద్రా దేవిని, మిగిలిన సమయముందు మీ మిత్రుడు అపర్ణుడను.’’ అని బదులిచ్చి అశ్వాలను తీసుకు వచ్చుటకు పచ్చిక వైపు బయలు దేరినది భద్రా దేవి.

సరిగ్గా అదే సమయమున దవ్వుల నుండి మేఘ ఘర్జనలా ఒక్కసారిగా విన వచ్చినది సింహ ఘర్జన ఒకటి. అదిరి పడి అటు చూసారు ఇరువురూ. కొన్ని లిప్తల కాలం వరకు కొండ కోనల వెంట ప్రతిధ్వనిస్తూనే వుందా సింహ ఘర్జన.

************

గోవిందా... గోపాలా...

రాధా రమణా... మురళీ ధరా.

గోపాలా... గోవిందా!

తప్పెట్లు తాళాలు మృదంగ వాద్య ఘోషతో తన్మయంతో చిందులేస్తూ భజన చేస్తూ భక్త బృందం ఒకటి బిడారు గుంపుతో కలిసి సాగి పోతోంది.

ఫెళ్ళున ఎండ కాస్తోంది.

దినకరుడు నడిమింట ప్రకాశిస్తున్నాడు.

మాళవ రాజ్యం నుండి వింధ్య సానువుల గుండా అవతలి విదేహ రాజ్యం లోకి సాగి పోతున్న మహా పథంలో తరలి పోతోందో పెద్ద బిడారు గుంపు ఒకటి.

బిడారు నాయకుడు కృపాణ ధారియై తన అశ్వాన్ని ముందు నడిపిస్తూండగా అతడి వెనక సుశిక్షితులైన అతడి మనుషులు మూడు వందల మంది అశ్వాల మీద రక్షణ కల్పించి వస్తూండగా మధ్యన భద్రంగా సాగుతోందా బిడారు. అందులో అశ్వ శకటాలున్నాయి. వృషభ శకటాలున్నాయి. బరువు మోస్తున్న కంచర గాడిదలు, నడిచి వస్తున్న యాత్రీకులు, బిచ్చగాళ్ళు అలా కోలాహంతో ఒక వూరే కదలి పోతున్నట్టుంది. అంత ఎత్తున ధూళి లేస్తోంది. అలాగే ఒక నాట్య బృందానికి చెందిన సొగసైన నట్టువరాండ్రతో కూడిన మూడు రథాలు కూడ ఆ బిడారు గుంపులో సాగి పోతున్నాయి.

బాట పక్కనే ఒక పెద్ద పూలపొదలో కూచుని సాగి పోతున్న బిడారును ఆసక్తిగా చూస్తున్నారు నాగేంద్రుని తనయ ఉలూచీశ్వరి, శంఖు పుత్రియని పిలువ బడే నాగస్త్రీ మధూలిక ఇరువురు.

వారీ ప్రాంతానికి చేరుకొని ఇది మూడవ దినము. అక్కడికి ఎడమ భాగమున సమున్నత శిఖరముతో కూడిన వింధ్యా పర్వత శ్రేణి కను విందు చేస్తోంది. కుడి భాగమున ఎటు చూసినా దట్టమగు వింధ్యాటవీ ప్రాంతం, దాని మధ్యగా గీత గీచినట్టు చీలుస్తూ ఉత్తరంగా సాగి పోతున్న మహా పథం గోచరిస్తోంది. వేసవి తాపం తీక్షణంగా ఉన్నప్పటికీ ధనుంజయుని రాక కోసం వేచి చూస్తున్నారు. బిడారు లోని ఆఖరు శకటం కూడ తమను దాటి పోగానే శంఖు పుత్రి వంక చూసింది ఉలూచీశ్వరి.

‘‘అత్తా! మహా పథాన ఎవరెవరో సాగి పోతుంటిరి. మరి నా మనోహరునికేమైనది ఇంకను రాకుండెను. ఆ వీర కుమారుని జూడ మనసు తొందరించుచున్నదే’’ అంది భారంగా నిట్టూర్చి.

‘‘ఆహాఁ! మనసైన మగడి కోసము ఇంత తొందరా?’’ అంటూ నవ్వింది శంఖుపుత్రి. తిరిగి తనే అంది.

‘‘ఏవమ్మా! ఈ వేగిర పాటు నాడు ఢాకినీ వనమున ఆ సుందరాకారుని గాంచినపుడే జూపిన, నాడే మీ పరిచయము, ప్రణయము జరిగి వుండును గదా. అప్పుడేమో మిన్నకుండి ఇప్పుడు మాత్రమీతొందరేలనో’’ అంది పరిహాసమున.

‘‘పో అత్తా! నీ చతురము లెందుకు లే గాని, ఒక వేళ ధనుంజయులవారు మన కన్నా ముందు గానే ఈ వింధ్యా సానువుల దాటి ముందు కెళ్లిపోయి వుందురా?’’ అనడిగింది ఉలూచీశ్వరి.

‘‘లేదు లేదు. అతడింకను వెనుకనే వున్నాడు’’ అంది శంఖు పుత్రి.

‘‘అయితే రాడేమీ? అతడి సందర్శనాపేక్షతో కొండంత ఆశతో వచ్చినాను. ఎన్నడూ అసత్యము పలుకని దానను. అతడి కొరకు జనకునితో తొలి సారిగా అసత్యము జెప్పి వచ్చితి. నా మనసు గెలిచిన ధనుంజయుడు నా వలపునంగీకరించునో లేదో... నను స్వీకరించునో లేదో... నేను తనకు నచ్చెదనో లేదో... మనసు తత్తళించుచున్నదే అత్తా’’ అంది గొంతు తడుమారుచుండగా. ఆమె కను దోయిలో చిప్పిలిన కన్నీటిని జూచి జాలి పడి దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా కనులు తుడిచింది మధూలిక.

‘‘ఛ! ఛ! నాగ రాకుమారి ఇంత బేలయని నాకు తెలియదు సుమీ’’ అంది వెక్కిరింపుగా.

‘‘పో అత్తా!’’ అంటూ ఫక్కున నవ్వేసింది ఉలూచీశ్వరి.

‘‘పోదునులే తల్లీ. మీ యిరువురిని కలిపిన పిమ్మట ఎలాగూ నా దారిన పోవు దానను. అయిననూ జగదేక సుందరివి, నాగ లోక యువ రాణివి నీకేమి తక్కువని ఆ సంశయము. నీ అంద చందము ధనుంజయుడు మెచ్చడేమోయను శంకయేల? అసలానాడు ఢాకినీ వనమున రెండవ తూరి నిను గానక అచట నీ కొరకు గాలించునపుడే అర్థము గాలేదా? అతడు నిను మెచ్చినాడని? శంకలు వలదుగాని మన మిచట వేచి వుండవలె. ఒకటి రెండు దినములోనే అతనిటకు తప్పక వచ్చును’’ అంటూ ధైర్యము చెప్పినది శంఖుపుత్రి.

‘‘ఇంకనూ ఒకటి రెండు దినములా... తాళ లేను అత్తా. ఒక పని చేయుదమా? మనమే వింధ్యాసానువుల దాటి ఆ అంద గాడికి ఎదురు పోవుదమా?’’ అనడిగింది ఉలూచీశ్వరి ఉత్సాహంగా.

ఆ మాటలకు ఆశ్చర్యముగా`

బుగ్గన వేలుంచుకొని చూసింది శంఖుపుత్రి.

‘‘అయ్యారే! చూచితివా నీ ధైర్యము? ఇప్పుడే గదా జనకునకు అసత్యము జెప్పి అనుమతి పొందినందుకు నొచ్చుకుంటివి. ఇంత లోనే ఇంత సాహసమా? ఇదియే మరి వలపులో మహిమ. ప్రేమ కొరకు పరుగు లెత్తుట, అసత్యము పలుకుట, నిర్భయము, సాహసము ఇవన్నియు వలపులోని సహజ గుణములే గాని మనము ఎదురు పోవ పని లేదు. ఇదియే మనకు సురక్షిత ప్రాంతము.

అయిననూ నీవు రాకుమారుని కొరకు ఎదురు చూచుచుంటివి. నేను మాత్రం అదో... ఎగువన వృక్ష ఛాయలో గోతిని చుట్టి గుంట నక్కల్లా వున్న కొందరు మానవుల్ని గమనించుచున్నాను. గుర్తున్నదా? మన కన్నాముందే మూడు దినముగా వాళ్ళచటనే వున్నారు. మనలాగే ఎవరికొరకో వేచి చూచుచున్నారు’’ అంది.

శంఖు పుత్రి మాటలకు తనూ సందేహిస్తూ`

దృష్టినటు సారించింది ఉలూచీశ్వరి.

సరిగ్గా అక్కడికి`

కూత వేటు దూరంలోనే వున్నారు వాళ్ళంతా. మొత్తం ఆరుగురు బలిష్టమైన మానవులు. చూడ్డానికి యాత్రీకుల్లా దుస్తులు ధరించి వున్నారు. పర్వత పాదంలో బాట పక్కనే ఒక ఎత్తయిన శాఖోపశాఖుగా విస్తరించిన కరి మాను వృక్షఛాయలో గుండ్రంగా వృత్తాకారంలో కూచుని ఏదో మాట్లాడుకొనుచున్నారు. వాళ్ళు నిజముగా యాత్రీకులయితే ఓ పూట మజిలీ చేసిన వెంటనే బయలుదేరి వెళ్ళి పోవాలిగా. మూడు దినములుగా ఇక్కడే తిష్ట వేసి ఎందుకున్నారు? ఎవరి కోసం నిరీక్షిస్తున్నారు? వాళ్ళ తీరు చూస్తే ఏదో సందేహమే కలిగిస్తున్నది.

అటవీ మార్గంలో ప్రయాణం గాబట్టి ఎవరూ నిరాయుధులుగా రారు. వాళ్ళ దగ్గర ఆయుధాలున్నాయి. వారి అశ్వాలు ఆరూ పక్కనే వరసగా కట్ట బడున్నాయి. వాళ్ళు కూడా మాటి మాటికీ కొండల్లోంచి వస్తున్న మార్గం వంకే చూస్తున్నారు.

‘‘అత్తా! వాళ్ళు ఎవరయి వుందురు?’’ తనూ సందేహ ధృక్కులతో శంఖు పుత్రిని అడిగింది.

‘‘ఎవరనిన నాకు మాత్రం ఏమి తెలియు? పోయి చూడవలె’’ అంది అటే చూస్తూ శంఖు పుత్రి.

‘‘నేను పోయి రానా?’’

‘‘నీవిచటనే వుండుము. నేను పోయి వారి మాటలు పొంచి విని వత్తును. వాళ్ళ వివరములు తెలుసుకొని వత్తును. పొరబాటున కూడ నీవీ పూపొద నుండి బయటకు రావలదు సుమా’’ అని హెచ్చరించి తక్షణం తన సహజ రూపమైన పూర్తి సర్పముగా మారి అగంతకుల వైపు మరుగున సాగి పోయింది శంఖు పుత్రి. ఆమె రాక కోసం ఎదురు చూస్తూ కూచుంది ఉలూచీశ్వరి.

సర్పంగా మారిన శంఖు పుత్రి అలికిడి లేకుండా పొదలు చెట్లు ఆకుల క్రిందుగా జర జరా ప్రాకుతూ కరి మాను వృక్షం వద్దకు చేరుకుంది.

అప్పటికి ఆగంతకులు ఆరుగురూ కాల్చిన కందమూలాలు పండ్లు మధ్యలో ఒక వస్త్రం మీద గుట్టగా వుంచారు. చుట్టూ కూచుని తీసుకు తింటూ కబుర్లలో పడ్డారు.

వృక్ష మానుకి వెనక భాగంలో ఎండుటాకు క్రింద తన సర్ప శరీరాన్ని దాచు కొని తల మాత్రం మానుకు చేర్చి వారి మాటల్ని అతి జాగ్రత్తగా విన సాగింది.

వాళ్ళంతా బలిష్టులు, యోధులు. చెంత మారుణాయుధాలు సిద్ధంగా వున్నాయి. మాటల్నిబట్టి వాళ్ళంతా రత్నగిరి పరిసర వాసులు, గూఢచారులని అర్థమైంది. సంభాషణంతా రత్నగిరి గురించీ, తాము ఇష్ట పడిన అమ్మాయిలతో సరససల్లాపాలమీద చతురోక్తులతో సాగుతోంది. ఎక్కడా రత్నగిరి యువ రాజు ధనుంజయుని ప్రస్తావన రాక పోవటంతో ఇక వెనక్కు వెళ్ళి పోదామని కదిలింది శంఖుపుత్రి. అప్పుడు...

సరిగ్గా అప్పుడు తొలి సారిగా ధనుంజయుని ప్రస్తావన వచ్చింది. అంతే` ఇక కదలకుండా ఉన్న చోటే ఆగి పోయింది.

‘‘ఏమిరా ఈ నిరీక్షణ? మనమింకనూ ఎన్ని దినములిచట కాపు వేయవలె? ఆ ధనుంజయుడు వచ్చు వాడయిన ఈ సరికే ఇటు రాడూ?’’ అనడిగాడు ఒకడు.

‘‘నాకును కూడ శంక గానే వున్నదిరా. యువ రాజుకు మన చేతుల జచ్చు యోగమున్నటు లేదు. సహ్యాద్రి మీదనే మన మొదటి బృందం అంత మొందించి యుండును’’ అన్నాడు.

ఆ మాటలు వినగానే`

ఒక్క సారిగా ఉలికి పడింది శంఖు పుత్రి.

చివరకు తన సంశయమే నిజమైనది.

వీళ్ళంతా తమ యువ రాజును మట్టు పెట్టుటకు ఇచట పొంచి వున్నారు. ఎందుకు? ఎవరి కుట్రయిది? వీళ్ళంతా ఎవరి తరఫున పని చేయుచున్నారు. శంఖ పుత్రి ఆలోచలను పరి పరి విధాలా పోతున్నాయి. వీళ్ళనుకొంటున్నట్టు ధనుంజయునికి సహ్యాద్రిపై ఎలాంటి ప్రమాదము ఘటిల్ల లేదు. అతను మహా పథంలో మాళవ సరి హద్దు వైపు పయనించుట తన జ్ఞాన నేత్రమున సందర్శించినది. అసలు ధనుంజయుని జంపుటకు రత్నగిరి నుండి ఎన్ని బృందాలు బయలు దేరాయి..? తీవ్రంగా ఆలోచిస్తూ ఇంకా ఆలకింపనారంభించింది.

‘‘ఒక వేళ సహ్యాద్రిపై తప్పించుకున్ననూ మన రెండో బృందము మాళవ సరి హద్దు వద్ద ఉండనే వున్నది. మలు జూచి పిడిబాకు దింపి ప్రాణాలు తీసెదరు. ఈ పాటికే పని ముగించి వుందురు.’’ అన్నాడు ఎదురుగా వున్న మరొకడు నమ్మకంగా.

‘‘అనగా మనమిటుల ఈ దిక్కుమాలిన కొండ దారిన మాటు వేయుట వృథా అందువా?’’ అనడిగాడు నాలుగో వాడు.

ఆ మాటలకు ఫక్కున నవ్వుకున్నారంతా.

ఇంతలో వాళ్ళకి నాయకుడిలా వున్న బుర్రమీసాల వ్యక్తి కల్పించుకుంటూ` ‘‘ఏమిరా? మన ఇష్టానికి ఏవేవో వూహించుకుని పని జేసిన అవతల మనకు బాహ్లీకుల వారితో మాట వచ్చును. ఆ పైన యువరాజు ధనుంజయుడు సామాన్యుడు గాడు. అంతటి మహా వీరుని ఎంత ఏమరి పాటున వున్నను ప్రాణాములు దీయుట కష్టము. ఏమో! ఎవరు జూచినారు? రెండు చోట్లను తప్పించుకొని వచ్చుచున్నాడేమో. ఇక్కడ తప్పించు కొనరాదు. అతని రాకను చూడగానే ఎవరి స్థానమునకు వారు పోయి ఏక కాలమున ఆయుధములు విసరి అతడిని ఒక్క పెట్టున హతమార్చవలె. గురుతున్నది గదా మనకివ్వ బడిన ఆజ్ఞ ప్రకారము మనమిచటనే కనీసము ముప్పది దినములు ఎదురు జూచి అప్పటికీనీ రాకున్న జచ్చినాడని నిర్థారించుకొని మనము బయలు దేరవలె.’’ అంటూ గంభీర స్వరంతో తన అనుచరులకు వివరించాడు.

అంత వరకే విన్నది శంఖు పుత్రి.

ఆపైన వినాల్సిన అవసరం లేక పోయింది.

బాహ్లీకుడు ఎవడో తనకు తెలీదు గాని రాజ్యం కోసం జరుగుతున్న ఏదో కుట్రలో ప్రధాన సూత్రధారి అయి వుండాలి. తన కొస్తున్న కోపానికి ఇప్పుడే వీళ్ళందరినీ చంపాలని వున్నప్పటికీ తమ యువ రాణికి చెప్పకుండా తొందర పడ రాదనిపించింది. అందుకే ఎలా వచ్చిందో అలాగే నిశ్శబ్ధంగా వెను తిరిగింది.

‘‘అత్తా! ఎవరు ఆ మానవులు? ఎవరి కొరకు నిరీక్షించుచున్నారు? వివరములు తెలిసినవా?’’ తిరిగి వచ్చిన శంఖు పుత్రిని ఆతృతగా ప్రశ్నించింది ఉూచీశ్వరి.

‘‘నా సందియము వృథా పోలేదు నాగ కుమారీ. మన వలెనే ఆ మానవులును ధనుంజయుల వారి రాక కోసమే ఎదురు చూచు చున్నారు.’’ అంటూ వచ్చి పక్కన కూచుంది శంఖుపుత్రి.

‘‘ఏమంటివి? వారి నిరీక్షణ ధనుంజయుల వారి కొరకా?’’ నమ్మ లేనట్టు అడిగింది ఉలుచీశ్వరి.

‘‘అవును. వారి కోసమే ఆ ధూర్తుల నిరీక్షణ’’

‘‘ధూర్తులా...?’’

‘‘అవును. ధూర్తులు, ద్రోహులు. వారు ఎదురు చూచునది యువ రాజా వారిని కలుసుకొనుటకు కాదు. తమ ఉనికి తెలియకుండా అదాటున దాడి చేసి అంతము చేయ వలెనని.’’

‘‘అమంగళము శాంతించు గాక. అయ్యో అత్తా.. ఏమంటివి? నా మనోహరుని సంహరింప నెంచి మాటు వేసినారా?’’

‘‘అవును’’ అంటూ అక్కడ తను విన్నదంతా పూస గుచ్చినటు ఉలూచీశ్వరికి వివరించినది శంఖు పుత్రి.వింటున్న నాగ లోక యువ రాణి ఆగ్రహంతో బుసలు కొట్టినది. కనులు ఎర్రబారాయి. ‘‘అత్తా! వారిలో దురాలోచన తెలిసాక కూడ వాళ్ళను ఏమీ చేయక మరలి వచ్చితి వేమి?’’ అంది.

‘‘నీకు చెప్పకుండా చేయుదునా?’’ అంది శంఖు పుత్రి.

‘‘సరి. ఈ అల్పులు నా మనోహరుని కడ తేర్చువారా? అదియు వీళ్ళు ప్రాణముతో ఉన్న గదా! ఈ ద్రోహుల్ని వదల. వీళ్ళకు నూకలు నిండుకున్నవి.’’ అంటూ కనులు మూసుకుని భృకుటి ముడిచి తన నాగ శక్తిని ప్రయోగించి పరిసరాల్లోని విష నాగుల్ని ఆగంతకుల మీదికి ప్రేరేపించింది. అంతే`

ఎండ వేడిమికి చెట్ల తొర్ర ల్లోను బురియలు కలుగులందు కొండ గుట్టలందు నేల పగుళ్ళ యందు చలువ ప్రదేశాల్లో సేద తీరుతున్న విష నాగులన్నీ ఎవరో అదిలించి ఆజ్ఞాపించినట్టుగా ఉలికి పడి తలవిదిలించి చివ్వున లేచాయి. తమ తమ తావులు వదిలి తలో పక్క నుంచి కరి మాను ప్రాంతాన్ని చుట్టు ముట్టడానికి బయలుదేరాయి. నేల మీద ఎటు చూసినా జర జరా ప్రాకి వస్తున్న పాములు. భయంకర విషసర్పాలు.

ముంచు కొస్తున్న ప్రమాదం తెలీని మూర్ఖ శిఖామణులైన ఆగంతకులు ఆరుగురూ కబుర్లలో మునిగి తేలుతూనే ధనుంజయుని కోసం బాట ఎగువకు చూస్తున్నారు. అతడ్ని చంపాలని కోరుకుంటూ తమ చావును తెలుసుకో లేక పోయారు. చివరి క్షణంలో ఒకడు అదిరి పడి దిగ్గున లేస్తూ` ‘‘బాబోయ్‌... పా.... పా....పాము... పాము...’’ అనరిచాడు.

వాడు అరిచీ అరవక ముందే ఒక పాము వాడి చేతి మీద మరోటి పాదం మీద కసిగా కాటేసాయి. అంతే` కెవ్వున అరిచి విరుచుకు పడి పోయాడు వాడు. మిగిలిన వాళ్ళు భయ కంపితులై ఆయుధాలు అందుకునే లోపలే పాములన్నీ వాళ్ళని చుట్టు ముట్టేసాయి. దొరికిన వాడ్ని దొరికినట్టు కసిగా కాటందుకున్నాయి. పగ బట్టినట్టు ఇన్ని సర్పాలు ఏక కాలంలో తమపై దాడి చేయటం ఏమిటో వాళ్ళకి అర్థం కాలేదు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపలే నోటి వెంట దారుణంగా నుచ్చలు గ్రక్కుతూ తలో పక్కకు విరుచుకు పడి గిలగిలా కొట్టుకున్నారు. అయినా వదలకుండా తలో కాటు పంచుకున్నాయి పాములు. విష ప్రభావంతో వాళ్ళ శరీరాలు మంటలో కాల్చినట్టు నల్లగా మారి పోతూండగా క్షణాల్లో ఎగిరి పోయాయి వాళ్ళ ప్రాణాలు.

ఆ విధంగా బాహ్లీకుని గూఢచార బృందం ఆరుగురూ విగత జీవులు కాగానే కూడ బలుక్కున్నట్టుగా ఎక్కడి పాములక్కడ వెను తిరిగి తమ తమ తావులకు శర వేగంతో నిష్క్రమించాయి.

కొద్ది క్షణాల క్రితం వరకు ఆగంతకుల నవ్వులు కేరింతలు చతురోక్తుతో సందడిగా వున్న కరి మాను ప్రాంతం ఇప్పుడు శవాలను చూస్తూ నిశ్శబ్ధమై పోయినది. ఇందులో ఆశ్చర్య కరమగు విషయం ఏమంటే`

ఆగంతకుల్ని అంతం చేసిన విష నాగుల్లో ఒక్కటి కూడ పొరబాటున కూడ వారి గుర్రాలను కాటేయక పోవటం. కొన్ని లిప్తల కాలంలోనే గూఢచార బృందం నశించింది. ఉలూచీశ్వరి కనులు అప్పటిగ్గాని శాంతించ లేదు.

అదృష్ట వంతుని చెడిపే వారు లేరు, దురదృష్ట వంతుని బాగు చేసే వారు లేరన్నది పెద్ద సామెత. అది నిజం కూడ. ఇంత వరకు రత్నగిరి యువరాజు ధనుంజయుని గాఢంగా అంటి పెట్టుకొని ఉన్నది అదృష్ట దేవత. అందుకే అతడ్ని అంతం చేయాలని కంకణ బద్ధులై ఎదురు చూస్తున్న శతృ బృందం అతడికి తెలీకుండానే అంతమైంది.

ఉలూచీశ్వరి, శంఖు పుత్రి ఇరువురూ ధనుంజయుని కొరకు ఎదురు తెన్నులు చూస్తూ ఆ పూలపొదలోనే ఉండి పోయారు. అయితే వారి నిరీక్షణ మరో మూడు దినము పిమ్మట గాని నెర వేర లేదు.

********************************

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali