Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే...http://www.gotelugu.com/issue156/443/telugu-serials/atulitabandham/atulita-bandham/
 

 “ఇప్పుడు చెప్పు ఎలా ఉంది జాబ్?” మెత్తటి సోఫాలో కూర్చున్న మధు పక్కనే కూర్చుని ఆమెను చుట్టేసుకుంటూ అడిగింది ఐశ్వర్య.

“బాగుందే... నేనూ చిన్న రూమ్ చూసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు చెప్పు నీ లైఫ్ ఎలా ఉంది? కార్తీక్ ఎలా ఉన్నాడు? నీతో ఎలా ఉంటాడు? నిన్ను  బాగా చూసుకుంటాడా? ప్రేమగా ఉంటాడా?” ప్రశ్నల వర్షం కురిపించింది మధుబాల.

“చాలా...” మెరుస్తున్న కళ్ళతో చెప్పింది ఐశ్వర్య.

“ఇద్దరం కలిసి పనులన్నీ చేసుకుంటాం. మార్కెట్ పనులు, ఇస్త్రీ చేసుకోవటం, కూరగాయలు కోయటం లాంటివి.  గిన్నెలకీ, బట్టలకీ పని మనిషి ఉంది. వంట మాత్రం నేనే చేస్తాను. కార్తీక్ కూడా అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటాడు...”

“ఓ...” నవ్వింది మధుబాల.

“హాయిగా ఉందే మధూ, నాదైన ఒక జీవితం... ఈ హాయి నాకు మాత్రమే  సొంతం...”

“అవునవును... కానీ నీ అస్తిత్వాన్ని కోల్పోకు మరి. నీకంటూ కొద్దిగా సమయం వెచ్చించుకో... మంచి పుస్తకాలు చదువుకోవటానికి, మంచి సంగీతం వినటానికి... సరేనా?”

“అలాగే... కానీ ఇద్దరం ఉంటే సమయమే తెలియదు. చాలా సేపు కబుర్లతో, టీవీ చూస్తూ, నవ్వుకుంటూ గడిపేస్తాం... వీకెండ్ కి బయటికి వెళతాం... అన్నట్టు పిన్నిచ్చిన ప్రసాదాలు తిందామా? పాపం నువ్వు వచ్చాక ఏమీ పెట్టలేదు...ఆకలి వేస్తుంది కదా...” అంది ఐశ్వర్య.

“సరే, తిన్నాక ఈరోజు నేను వంట చేస్తా సరదాగా... సరేనా?” అంది నవ్వుతూ మధుబాల.

“అలాగేనే... మీ అమ్మా నాన్నగారూ బాగున్నారా? ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉందీ?”

“ఫర్వాలేదే... నాకు సంబంధాలు చూస్తున్నారు... తన బాధ్యతలు నెరవేర్చుకోవాలని...”

“అద్భుత: అయితే నువ్వు ఓ ఇంటి దానివి అవుతావన్న మాట... భలే భలే... సిటీ సంబంధమే చూడమని చెప్పు... సరేనా? ఇదిగో ప్లేట్స్ లో సర్దేసా... రా తిందాం...”

తిన్నాక ఇల్లంతా తిప్పి చూపించింది ఐశ్వర్య. తన వార్డ్ రోబ్ లో బట్టలు, డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న రకరకాల సౌందర్య సాధనాలు, కార్తీక్ ప్రెజెంట్ చేసిన నెక్లెస్, తాను కొనుక్కున్న బంగారు గాజులు అన్నీ చూపించింది. ఐశ్వర్య కళ్ళల్లో మెరుపులు చూస్తుంటే మధు బాలకు ఎంతో  సంతృప్తి కలిగింది. ‘పోనీలే  ఈ  సహ జీవనమనే జీవిత విధానం తానూహించినంత బల హీనమైనది  కాదేమో... మారుతున్న కాలంలో ఇదీ ఒక జీవన విధానమే కాబోలు...’ అనుకుంది.

ఆరోజంతా కలిసి వంట చేసుకొని, కబుర్లు నంచుకుంటూ ఆరగించి, ఆ తర్వాత టీవీలో సినిమాలు చూస్తూ హాయిగా నవ్వుతూ గడిపేశారు ఆ స్నేహితురాళ్ళు ఇద్దరూ.

***

హాస్టల్ కి దగ్గరలోనే ఒక సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ తీసుకుని అందులోకి షిఫ్ట్ అయింది మధు బాల.

రోజూ ఉదయమే వంట చేసుకుని,  ఆఫీసుకు వెళ్లి రావటం, మళ్ళీ రాత్రి వచ్చి కాసేపు పుస్తకాలతో కాల క్షేపం చేసి అన్నం తిని పడుకోవటం... ఇలా రొటీన్ కి అలవాటు పడింది. రోజుకో సారి ఐశ్వర్యకి ఫోన్ కాల్,   ఎప్పుడైనా కలవటం...ఇవి మామూలే.

ఆరోజు ఆఫీసుకు వెళ్ళగానే అక్కడ సోఫాలో కూర్చుని ఉన్న అమ్మాయిని చూసి ఆశ్చర్య పోయింది మధు. ఆమె కూడా మధును పరీక్షగా చూసి వెంటనే చిరునవ్వు నవ్వింది.

“ఏయ్, నువ్వు మమతా దాస్ కదూ? ఎన్నేళ్ళయింది నిన్ను చూసి?” మమత పక్కనే కూర్చుని ఆమె చేయి పట్టుకుంది మధుబాల.

“అవును. నేను మమతనే... బాగున్నావా మధూ? టెన్త్ తర్వాత విడిపోయాం మనం...”

తెల్లగా సన్నగా చెక్కిన దంతపు బొమ్మలా ఉంది మమత. నార్త్ ఇండియన్ అమ్మాయి కావటం వలన యాసతో కూడిన తెలుగు మాట్లాడుతుంది. మెజెంటా కలర్ చుడీ దార్ లో, పెదవులకు గులాబీ రంగు లిప్ స్టిక్ తో ఎంతో అందంగా అనిపించింది. పాపిటలో సిందూరం ఆమె వివాహిత అని తెలియజేస్తోంది.

“ఓ, పెళ్లి అయిపోయిందా? మీ వారు...”

“ఇక్కడే బంజారా హిల్స్ లో ఓ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. నువ్విక్కడ?” ఆంగ్లంలో చెప్పింది మమత.

“ఇది నా ఆఫీసే మమతా... నెల రోజుల క్రితం ఇక్కడ జాయిన్ అయ్యాను... నువ్వు...”

“ఇక్కడ జాయిన్ అవటానికి వచ్చాను...” నవ్వింది మమత.

“వావ్... వెరీ గుడ్... రా... మా బాస్ దగ్గరికి వెళదాం...” అని మమత చేతిలోని అపాయింట్ మెంట్ ఆర్డర్ అందుకుంది మధుబాల.

“నేను ఆల్రెడీ కలిసాను మమతా... కూర్చోమని అన్నారు...”

సంభాషణ అంతా ఇంగ్లీష్ లోనే జరుగుతోంది. మమతకి తెలుగు మాట్లాడటం కష్టంగా ఉందని తలచి తనూ ఆంగ్లానికి షిఫ్ట్ అయింది మధు.

“ఓకే, నేను కలిసి వస్తాను...నేను ఆయనకి పర్సనల్ సెక్రెటరీనిలే” లోపలికి  వెళ్లి సాగర్ లాల్ తో మమత తన స్నేహితురాలని చెప్పింది. వెంటనే మమతను లోపలికి పిలిపించి, ఆమె పని చేయాల్సిన సెక్షన్ కి తీసుకువెళ్ళి, అక్కడి ఆఫీసర్ కు పరిచయం చేసాడు స్వయంగా సాగర్ లాల్.

బాస్ కాబిన్ లోనే తన సీటు కావటం వలన జాగ్రత్తగా వర్క్ నేర్చుకోమని చెప్పి తానూ లోపలికి వెళ్లి పోయింది మధుబాల.

***

సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. వాకిట్లోనూ, బాల్కనీలోనూ దీపాలు వెలిగించి, హాల్లోనూ లైట్ వేసింది ఐశ్వర్య. 

“ఏమిటి అలా ఉన్నావు?” ఏదో ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత దీర్ఘాలోచనలో పడిన కార్తీక్ ని కుదుపుతూ అడిగింది ఐశ్వర్య.

“ఏమీ లేదు ఐశూ... వచ్చే వారం మా మేనత్త కూతురి పెళ్లి ఉంది మా ఊరిలో... అదే విషయం అన్నయ్య గుర్తు చేసాడు... నేను వెళ్ళాలి!”

“మరి నేను?” అప్రయత్నంగా, అమాయకంగా అడిగింది ఐశ్వర్య.

“నాన్న గారి చెల్లెలి కూతురు. వెళ్ళక పోతే ఆయన చాలా బాధ పడతారు... అదీ గాక, మా అత్తయ్యతో చిన్నప్పటి నుండీ నాకు చాలా అనుబంధం... నిన్ను తీసుకు వెళ్ళటం కుదరదు...” కొద్దిగా ఇబ్బంది పడుతూ చెప్పాడు కార్తీక్.

“కార్తీ... అదీ...మీ వాళ్లకి తెలుసు కదా, మనం ఇద్దరం కలిసి ఉంటున్నామని...” ఏదో చెప్ప బోయిన ఐశ్వర్యను వారిస్తూ, “ఐశూ... మనం కలిసి ఉన్నా కానీ మనిద్దరివీ స్వతంత్ర జీవితాలు కదా... ఎవరూ ఎవరినీ ఇబ్బంది పెట్ట కూడదు. మా అత్తయ్య వాళ్లకి మన రిలేషన్ తెలియదు కదా... నువ్వు నాతో వస్తే అన్నీ బయటకు వస్తాయి. నాకది ఇష్టం లేదు...”

“అంటే... నువ్వు నమ్మిన సహ జీవనం మీద నీకే నమ్మకం లేదా? ఎవరో ఆక్షేపిస్తారని ముసుగేసుకుంటావా?” తీవ్రంగా అడిగింది ఐశ్వర్య.

“ఇందులో ముసుగేముంది? మాంసం తింటున్నాం కదాని మెడలో ఎముకలు వేసుకు తిరగలేము కదా... అమ్మా నాన్నలకి, అన్నయ్యా వదినలకి మన సంగతి తెలుసు. బంధువుల్లో ఎవరికీ తెలియదు. తెలిస్తే మా వాళ్ళు చిన్న తనంగా ఫీల్ అవుతారు. కొన్నాళ్ళ తర్వాత తెలిసినా ఫర్వా లేదు...”

ఐశ్వర్య మనసంతా పాడై పోయింది. దుఃఖం సుడులు తిరిగి గొంతు దగ్గరే ఆగి పోయినట్టు అయింది. అవమానంగా కూడా అనిపించింది. మౌనంగా లేచి వెళ్లి దూరంగా బాల్కనీ లోని ఉయ్యాలలో కూర్చుంది.

అతను ఎవరి తోనూ సంబంధాలు తెంచుకో లేదు. తను మాత్రం అమ్మా నాన్నలకి శాశ్వతంగా దూరమైంది. ఒకరిపై మరొకరికి హక్కులు లేని మాట నిజమే... కానీ స్నేహం ఉంటుంది కదా... సాంత్వన ఉండ కూడదని లేదు కదా... ఘనీభవించిన మంచు గడ్డ కరిగినట్టు ఆమె కళ్ళలోంచి కన్నీరు జాలు వారింది. తనకు తెలుసు కార్తీక్ ఇంతే... అది స్వార్థమో ఏమో తెలియదు కానీ అతను తన గురించే తప్ప ఎవరి గురించీ ఆలోచించని మనిషి... అలవాటు చేసుకోవాలి కానీ ఇలా బాధ పడ కూడదు... మెల్లగా కళ్ళు తుడుచుకుంది ఐశ్వర్య.

“ఐశూ... ఇదిగో జ్యూస్ తాగు...” గ్లాసుతో జ్యూస్ అందించాడు కార్తీక్.

“సెంటిమెంటల్ ఫూల్ అవకు ఐశూ... నాతో నువ్వు మెల్లగా అలవాటు  పడాలి. నేనేమిటో నీకు తెలుసు కదా... అన్నీ తెలిసే కదా మనం ఈ జీవితం మొదలు పెట్టింది? ఇప్పుడు కొత్తగా ఇలా ఇల్  ఫీలింగ్స్ వద్దు. నిన్ను నీ పేరెంట్స్ దగ్గరకు వెళ్ళ వద్దు అని నేను ఎప్పుడూ అనను... అసలు అలా శాసించే హక్కులూ, అధికారాలు మన జీవితంలో లేవు కదా... ఇప్పుడు నువ్వు ఇలా బాధ పడితే నేను ఏం చేయగలను చెప్పు?” అనునయంగా చెబుతూనే  ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.

తలూపి మెల్లగా సిప్ చేస్తూ జ్యూస్ తాగింది ఐశ్వర్య.

“ఎప్పుడు బయలుదేరుతున్నావు?”

“వచ్చే సోమవారం. మూడు రోజులు లీవ్ పెట్టాను. అందరం కలిసే వెళుతున్నాము.  వెళ్ళాకా ఫోన్ చేయటం కుదరక పోవచ్చు...”

‘సరే’ అన్నట్టు తలూపింది. చేదుగా, వికారంగా అనిపించింది ఆమెకు ఎందుకో.

“ఇటు రా...” చేయి చాపి దగ్గరకు తీసుకున్నాడు.

“కార్తీ... ఐ లవ్ యూ...” నిశ్శబ్దంగా అతని గుండెల్లో ఒదిగిపోయింది.

“ఐ నో ...అండ్  ఐ టూ!” అన్నాడు ఆమె చుట్టూ చేతులు బిగిస్తూ... “లోపలికెళదాం...” అతని పెదవులు గుసగుసలాడాయి.

క్షణాలు, నిమిషాలై; నిమిషాలు గంటగా మారి, గడియారం ఎనిమిదైనట్టు గంట కొట్టింది.

మోహావేశం చల్లారి పోయాక, గుండెలో పేరుకున్న బాధంతా ఎవరో తీసేసినట్టు అనిపించింది ఐశ్వర్యకు. శరీరం, మనసూ కూడా చిత్రమైన హాయితో నిండి పోయాయి. ఎక్కడో చదివింది తాను ‘సంగీతమూ, శృంగారమూ మనసుకెంతో సాంత్వన నిస్తాయి’ అని. ఎంత నిజం!

తన ఎదపై వాలి సేద దీరుతున్న  ఆమె వీపును సవరిస్తూ, “ఐశూ, ఆకలి వేస్తోంది...” అన్నాడు కార్తీక్.

“కూరలు ఉన్నాయి, మైక్రో లో  వేడి చేస్తాను. రైస్ కుక్కర్ పెట్టాలి... లేస్తాను...” సోగ కళ్ళతో నవ్వుతూ లేచింది.

నైటీ హుక్స్ సరి చేసి, “ఊ... ఇప్పుడు వెళ్ళు... ఏమైనా హెల్ప్ కావాలంటే పిలువు. జుట్టు దువ్వుకో... పక్కింటి పిన్ని గారేమైనా వస్తే బాగుండదు... నాకు కాస్త ఆఫీస్ వర్క్ ఉంది...” అంటూ లాప్ టాప్ తెరిచాడు.

సరిగ్గా ఇరవై నిమిషాల తర్వాత టేబుల్ మీద అన్నీ వడ్డించి అతన్ని పిలిచింది ఐశ్వర్య.

***

‘ఏమిటీ మనిషి? తన కోసమే పుట్టినట్టు ప్రవర్తిస్తాడో సారి... తనతో ఏమీ సంబంధం లేనట్టూ ఉంటాడు ఇంకో సారి... అతను వచ్చేసరికి చాలా సార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. భోజనం చేయకుండా తాను ఎదురు చూస్తూంటే, అలా కాచుకుని ఉండ వద్దని, ఎనిమిది కల్లా భోజనం చేసేయమని చెబుతాడు. ఆలస్యంగా వచ్చిన ప్రతీ సారీ బయట తినే వస్తాడు. ఒక్కో సారి డ్రింక్ చేసి కూడా...

లోపల బాధ కలిగినా అదేమీ బయట పెట్టకుండా కాస్త తిని పడుకుంటూ ఉంటుంది తను. ఈ రోజుల్లో మంచి నీళ్ళ లాగే మద్యం సేవించటం హై సొసైటీ లో కామన్. కార్తీక్ లాంటి ఉద్యోగస్తులకు పార్టీలు, విందులూ పరిపాటే. అలాగే, తనకు తెలిసినంత వరకూ తాగినప్పుడు ఒకరిద్దరు ఇతర స్త్ర్రీలతో అనుభవాలు కూడా కార్తీక్ కి ఉన్నాయి. ఆఫీసులో అతని ప్లేస్ ను బట్టి అతని లేడీ  సబార్డినేట్స్ చాలా మంది అతనితో చనువుగా మెలుగుతారు. కార్తీక్ దృష్టిలో అది తప్పు కాదు. అలాంటి స్వేచ్ఛ   కోసమే తాను పెళ్ళి అనే బంధంలో ఇరుక్కోనని చెబుతాడు.

కానీ తనకి ఒకటే ఆశ్చర్యం... మనసు లేకుండా తనువుతో సరాగాలు ఆడటం సులభమా? మదిలో ప్రేమనేది లేకుండా శారీరకంగా ఆనందం కలుగుతుందా? ఎట్టి పరిస్థితుల లోనూ తన భాగస్వామిగా కార్తీక్ ని తప్ప మరెవ్వరినీ ఊహించదే తను? మరి అతను?  పెళ్ళి అయిన మగవాళ్ళు నీతిగా ఉంటారని కాదు కాని, కొన్ని కట్టుబాట్ల వలన కొంతైనా నీతిని పాటిస్తారని తన భావన.

తనకు కూడా అలాంటి పరిమితులు వద్దనీ, ఎవరి మీద మనసైనా తన కోరికలు తీర్చుకోవచ్చనీ ఎప్పుడో చెప్పాడు కార్తీక్. విననట్టు ఊరుకుంది అయిష్టంగా... తాను  ఎటూ ఆప లేదు అతన్ని... కానీ మనసుకు వ్యతిరేకంగా తానెందుకుండాలి? పెళ్లి అయిన ఆడవాళ్ళు భర్తల మీద అలుగుతారట. రెండేసి రోజులు మాట్లాడరట. పడక మీదికి రానీయరట. భర్తలు వాళ్ళని మంచి చేసుకుంటారట... రక రకాల ప్రామిస్ లు చేస్తారట. చివరికి ప్రసన్నం చేసుకుని ఒద్దికగా ఉంటారట... ఇది ఒక కోణం.

డబ్బు కోసం చంపేయటాలు, మాటలతో చిత్రవధ చేయటాలు, శారీరకంగా హింస పెట్టటాలు, బలవంతంగా అనుభవించటాలు ఇది మరో రకం, మరో కోణం. అమ్మో, ఆ నరకం కన్నా, ఇదే నయం అనిపిస్తుంది. తనకి ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు కానీ, మూడ్ బాగాలేనప్పుడు కానీ తన వాంఛ తీర్చుకోవటం కోసం తనని ఎప్పుడూ బలవంతం చేయడు కార్తీక్. అందుకు సంతోష పడాలేమో... అతనంటే ఉన్న అపరిమితమైన ప్రేమ వలన కానీ, లేక పోతే అతనికున్న చాపల్యాలు తెలిసీ మళ్ళీ అతనితో కలయిక అసాధ్యమే. అతని స్పర్శకే పులకించి పోయి తనను తాను  అర్పించేసుకుంటుంది మరి...

ఏదైనా ఊరు వెళ్ళినా, టూర్ వెళ్ళినా ఫోన్ చేయడు కార్తీక్.  మొదట్లో బాగా ఎదురు చూసేది. తర్వాత తర్వాత ఎదురు చూడటం మానేసింది. అక్కడ పనుల తర్వాత రిలాక్సేషన్  కోసం ఫ్రెండ్స్ తో డ్రింక్స్ తీసుకుంటాడని తనకి తెలుసు. ఇక ఆపైన ఆలోచించదు, అడగదు కూడా.. ఎందుకంటే, తన హద్దులు తాను  ఎప్పుడూ అతిక్రమించ కూడదు. తమ జీవన విధానంలో అవలంబించ వలసిన మొదటి నియమం ఇది.

పిన్ని దగ్గర అన్నమయ్య కీర్తనలు నేర్చుకుంటోంది ఈ మధ్యే... ఆ సాధన తనకు కాస్త సాంత్వన నిస్తోంది. తన గొంతు చాలా బావుందనీ, పట్టు వదలక సాధన చేయమనీ ఎంతో ప్రోత్సహించింది పిన్ని.  పిన్నీ, బాబాయ్ ఎంత మంచి వాళ్ళు? మొదట్లో తమ బాంధవ్యం గురించి తెలిసి, తమది వివాహ బంధం కాదని అర్థమై  మౌనంగా ఉండిపోయారు. కానీ తనను దూరం చేయ లేదు. పిన్ని గారు సలహాగా ఏదో చెప్పాలని ప్రయత్నించినట్టు అనిపించింది. కానీ ఎందుకో మిన్నకుండిపోయారు.

ఫ్లాట్స్ లో అందరికీ తెలిసి పోయింది, కార్తీక్ తన భర్త కాదని. ఇక్కడ చేరి మూడు నెలలు పూర్తి  అవుతున్నా ఇంకా ఎవరితోనూ పరిచయం దాట లేదు. ఉద్యోగానికి వెళ్ళి రావటం, వీకెండ్స్ కి పనులు, కార్తీక్ తోనో, మధూ తోనో బయటికి వెళ్లి రావటంతో తనకీ సమయం చాలటం లేదు. అందుకే ఒక్క పిన్ని, బాబాయ్ గార్లిద్దరూ తప్ప ఇంకెవరూ దగ్గర కాలేదు.

కలిసి జీవితం మొదలు పెట్టని రోజుల్లో తనకి పరీక్షల సమయంలో అతను ఎంత బ్రతిమాలినా తన ఏకాగ్రత అంతా చదువు మీదనే ఉండేది. ఎంతో నిగ్రహశక్తి తో ఉండగలిగేది. అలాంటిది, ఇప్పుడెందుకింత ఒంటరిగా అనిపిస్తోంది?

కార్తీక్ కూడా ఆఫీసు పనుల మీద, చాలా సార్లు బయటకు వెళ్ళాడు తనని వదిలి. అయితే ఈసారి ఫ్యామిలీతో వెళ్ళాడు... అందుకా ఇంత బాధగా ఉంది? కార్తీ, ప్లీజ్ త్వరగా వచ్చేయవా? నాకు దిగులుగా, బెంగగా ఉంది డార్లింగ్... ప్లీజ్...’

ఆలోచనల్లోనే నిద్ర లోకి జారుకుంది, ఐశ్వర్య.

***

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్