Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
painting exbition

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రీరామనవమి. - ఆదూరి.హైమావతి

sriramanavami

వేదవేద్య పరేపుంసీ -  జాతే దశారధాత్మజే
వేదః ప్రాచేత సాదా సీత్  - సాక్షాత్ రామాయణాత్మనాః.

వేదములచే తెలియబడువాడు, పరమపురుషుడూ ఐన సాక్షాత్ శ్రీమహావిష్ణువు దశరధుని కుమారునిగా పుట్ట గా వేదమే రామాయణం గా వాల్మీకిచే రచింప బడినది.అంటే రామాయనం ఏవేదమే. రాముడే శ్రీమహా విష్ణువు.

ఆ దేవుడు రామావతారంగా జన్మించిన  దినాన్ని మనం రామనవమిగా జరుపుకుంటున్నాం  .ఉగాది తర్వాత వచ్చే మొదటి పండుగ  శ్రీరామనవమి. ఉగాది తోమొదలయ్యే  చైత్రమాసం లోని శుధ్ధ నవమి రోజు శ్రీరామ నవమి. ఈపండుగ చాలా వరకూ వారంపాటు నిర్వహిస్తారు, కొందరు ఒక్కరోజూ, కొందరు మూడురోజులూ చేసుకుంటారు. ఈరోజు శ్రీరామ చంద్రుడు జన్మించిన దినం. అగ్ని, సూర్యుడు, చంద్రుడు  సమస్త ప్రపంచానికీ ఆధారం.ఈమూడింటి సమ్మిళిత తత్వమే  రామశబ్దం.' ర 'అగ్ని బీజం, ' అ 'కారం సూర్యునికి, 'మ 'కారం చంద్రునికీ ప్రతీకలు.  ' ర 'కారమ నే ఈ అగ్ని బీజం పాపాన్నీ   ' అ 'కారం అనే సూర్య బీజం అఙ్ఞానాన్నీ , 'మ 'కారం అనే చంద్ర బీజం తాపాన్నీ చల్లారుస్తాయి.

రామావతారానికి కారణం కొద్దిగా  చెప్పుకుందాం.  త్రేతాయుగంలో రావణాసురుడు  బ్రహ్మ దేవుని నుండీ వరా లుపొంది సాధు సత్పురుషులనూ, ఋషులనూ ముల్లోకాల్లోనూ హింసించసాగాడు  .దేవతలు, గంధర్వులు, కింపు రుషాదులూ అంతా బ్రహ్మదేవుని శరణుకోరి , " దేవా !రావణాసురునికి  ఎవ్వరి వల్లా మరణం లేకుండా వరం ఇవ్వ టా న అతడు లోకాలన్నింటినీ బాధిస్తున్నాడు.అతడి ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.మీరే మాకు మార్గం చూపాలి" అని వేడుకోగా , బ్రహ్మ " రావణుడు మానవుల వలన తనకు మరణం రాకూడదని కోరలేదు గనుక మనందరం శ్రీమన్నారాయణుని ప్రార్ధిదాం "అని చెప్పి అంతా వెళ్ళి శ్రీహరిని  ప్రార్ధించగా ఆయన" నేను మానవ రూపంలో దశరధ పుత్రునిగా జనించి అతడిని హతమారుస్తాను  “ అని అభయమిస్తాడు. అలా శ్రీమన్నా రాయణుడు శ్రీరామునిగా, ఆదిశేషువు లక్ష్మణునిగా ,శంఖము భరతునిగా,  చక్రము శత్రుఘ్నునిగా దశరధుని ముగ్గురు భార్యలకూ జన్మిస్తారు.

ఈ నలుగురూ నాలుగువేదాలకు ప్రతీకలు.రాముడు - ధర్మానికీ ప్రతిక ఐన యజుర్వేదమునకు  , లక్ష్మణుడు ఋగ్వేదము నకు,  భరతుడు సామవేదమునకు, శతృఘ్నుడు అధర్వణ వేదమునకు ప్రతీకలు .లక్ష్మణుడు ‘ అ’ కారమునకు,  భరతుడు ‘ఉ ‘కారమునకు , శతృఘ్నుడు  ‘మ ‘కారమునకు ,శ్రీరాముడు  ప్రణవనాదమైన ‘ఓం ‘ కారమునకూ స్వరూపులు. దశరధునకు పుత్రకామేష్టి వలన నలుగురు సంతానం కలుగగా కులగురువైన వశిష్ట మహర్షి వారికి నామకరణం చేస్తారు. రామ శబ్దానికి- అర్ధం -  రమయతి గుణైః ప్రజా యితి రామః , రమించు అనగా ఆనందించు , అందరినీ ఆనందింప జేయువాడు ,ఆహ్లాదపరచువాడు - రమ్యతీ ఇతిరామః . లక్ష్మణుడు శౌర్య వీర్యములను ప్రదర్శించు లక్ష్మీ సంపన్నుడు.లక్ష్మీనారాయణుల సేవయే  తన శ్వాసగా భావించి ఆచరించువాడు. భరతుడు అందరినీ ప్రేమా నం దములతో ఆశ్చర్యకరమైన ధర్మ ప్రవృత్తి కలిగి ప్రజల పోషణ కావించువాడు. ఇహ శతృఘ్నుడు శతృవులను నాశనం చేసి అన్నల అడుగు జాడలలో నడిచి , శాంత చిత్తుడై ప్రవర్తించే వాడు. 

శ్రీరాముడు లోక ధర్మాన్ని సంపూర్ణంగా పాటించినవాడు. ' సుఖదుఃఖే సమీకృత్వా లాభాలాభే జయాజయా ' అన్న సూక్తిని ఆచరణాత్మకంగా నిరూపించిన లోకోత్తర పురుషుడు. పట్టాభిషేకానికి సిధ్ధమైన సమయంలో  ఎంత ఆనం దంగా ఉన్నాడో అదే ముహూర్తంలో అరణ్యాలకు వెళ్ళాల్సి వచ్చినా  అంతే ఆనందంతో,  ఏమాత్రం విచారం లేకుం డా  వెళ్లాడు. పట్టువస్త్రాలను తీసేసి నారవస్త్రాలు ధరించి ఆనందంగా వెళ్ళాడు.అంతే కాక రాముడు వ్యక్తిగత , కుటుంబ, సామాజిక  ధర్మాచరణల్లో సామాజిక ధర్మానికే ప్రాధాన్యత నిచ్చాడు. మహారాజుగా రాజధర్మానికే ప్రాధా న్య త నిచ్చాడు. జనులు రాజును అనుసరిస్తారని, జనవాక్యానికి ప్రాధాన్యతనిచ్చి నిర్దోషి అని తెలిసినా సీతను  జనవాక్యం కర్తవ్యం ‘ అని అరణ్యాలకు పంపాడు. ఆయన జాతి , వర్ణ, కుల, అధికార  భేదములకు  అతీతుడు. రామునిలో అతి గొప్పగుణం మాతృభక్తి, దేశభక్తి. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి."అని ,  స్వర్ణలంకను వదలి తన మాతృదేశానికి వచ్చినాడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు.        

రాముని అంతా దైవంగా ఎందుకు పూజించి గౌరవిస్తారో చూద్దాం, రాముని వ్యక్తిత్వం, స్వభావం మానవాళికి ఆదర్శప్రాయాలు.  మానవునిగా జనించిన  మాధవుడు మానవాళికి మానవధర్మాలను ఆచరించి చూపాడు.  ఆయన ఆదర్శపుత్రుడు, తండ్రిమాటలకు కట్టుబడి ,పితృవాక్య పరిపాలకుడై  రాజ్యమును ,  సర్వ సుఖములనూ వదిలేసి తాపస వేష ధారియై వనవాసముల కేగాడు.ఆదర్శసోదరునిగా తన తమ్ములను ప్రేమించి,వారికి ఎప్పటి కపుడు ధర్మమార్గాలను బోధించాడు. ఆదర్శ పతి. సతిని వనవాసమున సైతం ప్రేమానురాగాలతో ఆదరించాడు. ఏకపత్నీవ్రతానికి కట్టుబడి ఉన్నాడు. సతిని అపహరించిన వాని వంశ నాశనం చేశాడు.ఆదర్శస్నేహితుడు.తన స్నేహం కోరిన సుగ్రీవుని , వాలిని సమ్హరించి కిష్కింధాధిపతిని చేశాడు. ఆదర్శమానవునిగా ఇతర స్త్రీలపట్ల మాతృ భావనతో ఉన్నాడు. అంతేకాక శ్రీరాముడు శత్రువును సైతము ప్రశంసించగల ఆదర్శవీరుడు. తన శత్రువైన  రావణు ని మొదటి మారు యు ధ్ధరంగమున  చూసినపుడు " ఈ తేజోమూర్తి,  పరాక్రమశాలి ఎవరు?" అని తనతో ఉన్న విభీషణుని  అడుగు తాడు. శ్రీరాముడు ఆదర్శ శత్రువు కూడా ,ఎలాగంటే ,ఒకరోజు యుధ్ధంలో రావణుని అస్త్ర శస్త్రాలన్నీ పోయి, రధం విరిగి, నిస్సహాయంగా ఉన్నపుడు శత్రువైనా అతడ్ని సమ్హరించక "రావణా! అలసి పోయావు ,ఇంటికెళ్ళి  విశ్రాతి పొంది రేపురా !"అని శత్రువు పట్ల కూడా ధర్మాన్ని అవలంబించాడు.ఆతర్వాత యుధ్ధంలో నేల వ్రాలిన రావణుని చూసి తమ్ముడైన లక్ష్మణునితో  "సోదరా!లక్ష్మణా! రావణుడు మరణించకముందే త్వరగావెళ్ళి అతని వద్ద రాజనీతి తెల్సుకునిరా! "అనిపంపుతాడు. విభీషణూనితో అన్న దహనసంస్కారాదులు సక్రమంగా జరుపమని ఆదేశిస్తాడు. రాముడు ఆదర్శ శిష్యుడు కూడా , గురువాఙ్ఞ ప్రకారం తాటకను సమ్హరిస్తాడు, యఙ్ఞరక్షణ కావిస్తాడు. మునులకు ఆనందం కలిగిస్తాడు. ఈసుగుణాలన్నీమున్న రాముని స్మరిస్తూ ఆఆదర్శాల ను స్మరిస్తూ మనం శ్రీరామనవమి చేసుకుంటే అర్ధం పరమార్ధం కాస్తం తైనా దక్కుతాయి.

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే  
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే .                       

మరిన్ని శీర్షికలు