Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: ఈడోరకం ఆడోరకం 
తారాగణం: మంచు విష్ణు, రాజ్‌ తరుణ్‌, రాజేంద్రప్రసాద్‌, సోనారికా భడోరియా, హెబ్బా పటేల్‌, రవిబాబు, పోసాని కృష్ణమురళి, అభిమన్యు సింగ్‌, సుప్రీత్‌, సత్యకృష్ణ తదితరులు. 
సంగీతం: సాయి కార్తీక్‌ 
మాటలు: డైమండ్‌ రత్నం 
ఛాయాగ్రహణం: సిద్దార్ధ్‌ 
దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి 
నిర్మాత: సుంకర రామబ్రహ్మం 
నిర్మాణం: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
విడుదల తేదీ: 15 ఏప్రియల్‌ 2016 


క్లుప్తంగా చెప్పాలంటే 
ఓ ప్రముఖ లాయర్‌ కొడుకు అర్జున్‌ (మంచు విష్ణు), ఎస్‌ఐ కొడుకు అశ్విన్‌ (రాజ్‌తరుణ్‌) స్నేహితులు. ఇద్దరూ అల్లరి కుర్రాళ్ళే. ఓ ఫ్రెండ్‌ పెళ్ళిలో వీరిద్దరిలో ఒకరికి నీలవేణి (సోనారిక), ఇంకొకరికి సుస్మిత (హెబ్బా పటేల్‌) నచ్చుతారు. నీలవేణి తనను కట్టుకోయేవాడు అనాధ అయి ఉండాలనుకుంటుంది. దాంతో నీలవేణిని సొంతం చేసుకోవడానికి తాను అనాధనని చెప్తాడు అర్జున్‌. అయితే అర్జున్‌కి తెలియకుండా నీలవేణి, అర్జున్‌ ఇంట్లోనే ఓ పోర్షన్‌లో అద్దెకు దిగుతుంది. దాంతో అతనికి కష్టాలు ఎదురవుతాయి. ఆ కష్టాలనుంచి గట్టెక్కేందుకు అశ్విన్‌ సహాయం తీసుకుంటాడు అర్జున్‌. అక్కడి నుంచి వీరు సమస్యల్లో ఇరుక్కుంటారు. అందులోంచి ఎలా బయటపడ్తారు? ఈ క్రమంలో సుస్మిత - అశ్విన్‌ ప్రేమ వ్యవహారం ఏమైంది? అనేది తెరపై చూడాలి. 


మొత్తంగా చెప్పాలంటే 
విష్ణు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. రాజ్‌తరుణ్‌ తన సహజమైన నటనతో రాణించాడు. ఇద్దరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. డాన్సుల్లో, కామెడీలో ఒకరితో ఒకరు పోటీపడ్డారు. హీరోయిన్లలో సోనారిక, హెబ్బా పటేల్‌ గ్లామర్‌ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. నటన పరంగా సోనారికాతో పోల్చితే హెబ్బా పటేల్‌కి మార్కులు పడతాయి. 
బోల్డంతమంది కమెడియన్లతో ఆర్టిస్టులతో తెర నిండిపోయింది. కామెడీ పరంగా ప్రతి ఒక్కరూ నవ్వించడానికి తమవంతు ప్రయత్నం చేశారు. సినిమాకి రాజేంద్రప్రసాద్‌ నటన హైలైట్‌. ఆయనకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. ముఖ్యమైన పాత్రల్లో రాజేంద్రప్రసాద్‌కి ఎక్కువ మార్కులు పడతాయి. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు. టైటిల్‌ సాంగ్‌లో సునీల్‌ సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌. 
ఇలాంటి కథలు హిందీలో ఎక్కువగా చూస్తాం. తెలుగులోనూ తక్కువేమీ కాదు. కొత్త కూడా కాదు. ఆద్యంతం సినిమాని కామెడీతో నడిపించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. మాటలు బాగానే ఉన్నాయి. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది. సంగీతం ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వర్క్‌ బాగుంది. సినిమాని రిచ్‌గా తెరకెక్కించారు. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీనామా పడలేదు. 
పాత్రల మధ్య కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్‌ చేసి అందులోంచి కామెడీని జనరేట్‌ చేయడం పాత ట్రెండే. అయితే ఇందులో కామెడీ పండిన ప్రతిసారీ రిజల్ట్‌ బాగుంటుంది. ఈ సినిమాలోనూ కామెడీ బాగానే పండింది. హీరోయిన్ల గ్లామర్‌ సినిమాకి పెద్ద ప్లస్‌. హీరోలిద్దరూ ఎనర్జిటిక్‌గా కనిపిస్తే, రాజేంద్రప్రసాద్‌ సీనియారిటీ సినిమాకి కలిసొచ్చింది. ఫస్టాఫ్‌ సరదా సరదాగా సాగిపోతుంది. అక్కడక్కడా ట్విస్టులతో అడపా దడపా ఎమోషనల్‌ సీన్స్‌తో, మళ్ళీ ఎంటర్‌టైనింగ్‌ సీన్స్‌తో సినిమా హుషారుగానే నడుస్తుంది. ఓవరాల్‌గా కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు రుచించే సినిమానే. రొటీన్‌ అనిపించినా, నవ్వించే కామెడీతో సినిమా ప్రేక్షకుల్ని అలరించనుందనడం నిస్సందేహం. 


ఒక్క మాటలో చెప్పాలంటే 
టైమ్‌పాస్‌ కామెడీ రకం 


అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka