Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Acne | Sure Cure | Telugu | Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)

ఈ సంచికలో >> శీర్షికలు >>

రాజస్థాన్ అందాలు చూద్దాం రారండి ( తొమ్మిదవ భాగం) - కర్రానాగలక్ష్మి

beauty of rajasthan

ఉదయపూర్ 

మధ్యహ్నము భోజనం చేసుకొని ఉదయపూర్ కి ప్రయాణం అయేము . సుమారు 160 కిలో మీటర్ల దూరం ప్రయాణించాలి , కారు మీద దగ్గర దగ్గర మూడున్నర నాలుగు గంటల సమయం పడుతుంది . ఈ విభాగంలో  "  రాష్ట్ర రవాణా సంస్థ వారి బస్సులు మాత్రమే నడుస్తాయి కాని వీటిలో ప్రయాణం సుమారు ఆరు గంటలు పడుతుంది . ఈ రూటు లో చాలా తక్కువ బస్సు సదుపాయం వుండడంతో ప్రతీ పల్లెలో ఆగుతూ వెడుతూమనకి చాలా విసుగు కలిగిస్తాయి . మేము ఆరోజు హొటల్ లో చెక్ యిన్ చేసి మరునాడు సైట్ సీయింగుకి వెళదామని నిశ్చయించుకున్నాం . అందుకే తిన్నగా హొటల్ కి వెళ్లిపోయేం .

రాజస్థాన్ లో ఉదయపూర్ ఉదయపూర్ జిల్లా  ముఖ్యకేంద్రం కూడా . ఉదయపూర్ రాజస్థాన్ లో వున్న మరో అందమయిన , పర్యాటకులను ఆకర్షించే నగరాలలో వొకటిగా లెక్కిస్తారు . ఆరావళీ పర్వతాలలో వున్న 'గిర్వా ' అనే శస్యశ్యామలమైన లోయలో నిర్మించబడింది . శిశోడియా వంశానికి చెందిన రాణా కుంభ ,( రాణా ఉదయసింగ్ -2 గా చరిత్రలో పేరు పొందిన  ) 1553 లో రాజ్య పరిపాలనా దృష్ట్యా ' ఆయాద్ ' నగరాన్ని విస్తరింపజేసి రాజ పరివార నివాసార్దం అనేకరాజ భవనాలు నిర్మించేడు .

రాణా కుంభ మహారాణా సంగ్రామ్ సింగ్ , కర్ణావతి ల నాలుగో పుతృడు . చరిత్ర ప్రకారం రాణా కుంభ 1522 లో పుట్టినట్టుగా ఆధారాలు వున్నాయి . రాణా సంగ ( సంగ్రామ సింగ్ ) మరణానంతరము రాజ్యభారాన్నివహించిన రత్న సింగ్ --2 ని హతమార్చి అతని సోదరుడు , అతనిని హతమార్చి తరవాత సహోదరుడు రాజ్యాన్ని జయిస్తారు . శతృశేషం మిగల్చ కోడదనే వుద్దేశంతో రాణా కుంభ పరివారాన్ని హతమారుస్తారు . రాణా కుంభపెంపక బాధ్యతలు చూస్తున్న పన్నాదాయి రాణా కుంభ దుస్తులు అదే వయసు వున్న తన కుమారుడికి వేసి తనబిడ్డ దుస్తులు రాణా కుంభ కు వేసి తన యెదురుగా పుతృడిని హత్య చేసినా చలించక రాజకుమారుడినిరాణా సంగ అనుయాయులకు వప్పజెప్పి చరిత్రలో స్మామిభక్తి చాటుకున్న మహిళగా ఈనాటికీ కొనియాడబడుతోంది .

రాణా కుంభ సామాన్యనిగా జీవితం గడుపుతూ శస్త్ర విద్యలు నేర్చుకుని కుంభాల్ గఢ్ లో పెరిగి పెద్దవాడై సైన్యాన్ని కూర్చుకొని చిత్తోఢ్ ని జయిస్తాడు . చిత్తోఢ్ పై యెప్పుడూ శతృవుల దాడుల జరుగుతూవుండడంతో రాణా కుంభ రాజధానిని కుంభాల గఢ్ కి మార్చి , దానికన్నా సురక్షిత ప్రాంతం కొరకు ఆరావళీ పర్వతాలలో తిరుగుతూ వుండగా ఒక ముని రాజుని సమీపించి చెయ్యి పట్టుకు తీసుకు వెళ్లి ఓ ప్రదేశం చూపించి ఆప్రదేశం లో కోటను నిర్మించుకోవలసినదిగా ఆదేశించి భవిష్యత్తులో ఆకోట శతృవులకు దుర్భేద్యంగా వుంటుందని ఆశీర్వదించేడట .

రాణా కుంభ ఆ ప్రదేశం లోనే కోట నిర్మించుకొని సామ్రాజ్య ముఖ్యకేంద్రం గా చేసుకొని పరిపాలించేడు . అరవింద సింగ్ మేవాడ్ ప్రస్తుతపు రాజభవనాల అధిపతి శిశోడియా వంపు రాజులలో 76 వ సంతతికి చెందినవాడు.

ఉదయపూర్ ఆరావళీ శ్రేణులకు దక్షిణ భాగాన నిర్మింపబడింది . 

16 వ శతాబ్దాపు తొలినాళ్లలో శస్త్రాగారాన్ని కూడా ఉదయపూర్ కి తరలిస్తాడు రాణా కుంభ . అక్బరు కి చిత్తోడాగఢ్ ని ముట్టడించి విజయం సాధించినపుడు అక్బరుకు ఖాళీ కోట మాత్రమే శ్వాధీన మౌతుంది . మేవాడ్రాజులకు ఉదయపూర్ రాజధాని గా కొనసాగింది .

ఉదయ పూర్ ని సరస్సుల నగరం అని కూడా అంటారు . వర్షాకాలంలో పర్వతాలపై కురుసే వర్షపునీరు యీ సరస్సులలో చేరి యెండాకాలానికి నీటి సమస్య రాకుండా వుండేందుకు పూర్వం రాజులు ఈ పద్దతినిఅవలంబించేరేమో ? . ఎండాకాలం లో యీ నీటి పై నుంచి వచ్చేగాలులు నగరాన్ని చల్లాబరిచి ప్రజలకు వేడి నుంచి వుపసమనం కలుగజేస్తూ వుంటాయి .

ఉదయ పూర్ లో యెన్నో సరస్సులు వున్నా ముఖ్యంగా చెప్పుకో దగ్గవి మూడు సరస్సులు . ఈ సరస్సుల చుట్టూ నగరం విస్తరించడం కనిపిస్తుంది . ఉదయపూర్ లో ముఖ్యం గా చూడతగ్గ ప్రదేశాలు యివి --

1)సిటీ పేలస్ 
2)లేక పేలస్
3)మాన్సూన్ పేలస్
4)జగ మందిరం
5)సహేలియోంకి బాగ్
6)ఫతేసాగర్ సరస్సు
7)పిఛోల సరస్సు
8)జగదీష్ మందిరం
9)మోతిమగ్రి
10)నీమక్ మాతా మందిరం

ఉదయపూర్ చుట్టు పక్కల వున్న చూడతగ్గ ప్రదేశాలు అంటే ఉదయపూరు నుంచి వంద కిలోమీటర్ల దూరంలో వున్న చూడదగ్గ ప్రదేశాలు యివి ---- 

1)హల్దీఘాటీ 
2)రాణక్ పూర్ జైనమందిరం
3)కుంభాల్ గఢ్
4)ఏకలింగజీ మందిరం
5)నాథ్ ద్వార్

రాజభవనాలు సరస్సులు యెన్నో చూసేం కాబట్టి ముందుగా చారిత్రాత్మకమైన హల్దీఘాటీ , కుంభాల్ గఢ్ , ఏకలింగజీ చూద్దామని నిరణయించుకున్నాం . పొద్దున్న యెనిమిదింటికల్లా బయలుదేరి ఏకలింగజీ మందిరానికి బయలుదేరేం .

1)ఏకలింగజీ మందిరం---

ఉదయపూర్ కి సుమారు 22 కిలో మీటర్ల దూరం లో వుంది ఏకలింగజీ మందిరం . మేవాడ్ రాజుల కులదైవం యీ ఏకలింగజీ . మేవాఢ్ రాజులు యెంతటి భక్తులంటే మేవాఢ్ కి ఏకలింగజీని రాజుగాను తమని తాముఏకలింగజీకి సామంతులగాను భావించుకుంటారు . క్రీస్తు శకం 971 లో యీ మందిరాన్ని శిశోడియా వంశస్థులచే నిర్మింపబడింది . ఈ కోవెల ప్రాంగణం లోనూ , కోవెల గోడలపైనా మొత్తం 108 మందిరాలు వున్నాయి . 971వ సంవత్సరంలో నిర్మించిన కట్టడాన్ని 15 వ శతాబ్దం లోపునః నిర్మించేరు . రాణా కుంభ్ ని చిత్తొఢ్ నుంచి పన్నాదాయి రహస్యం గా తెచ్చినప్పడు కొన్నాళ్లు యీ మందిరం లో తలదాచుకున్నట్లు స్ధానికుల కథనం . యీమందిరం చుట్టూరా గోడ నిర్మింపబడి పెద్ద పెద్ద తలుపులతో కోట ను తలపింప చేస్తూ వుంటుంది . మధ్య మండపం రెండతస్తులలో నిర్మింపబడి పాలరాయి , గ్రానైటు రాయి లతో కట్టబడిన మందిరం . గర్భ గుడిలో నల్లరాతితోచెక్కబడిన నాలుగు ముఖాలు కలిగిన శవలింగం దర్శనమిస్తుంది . ఇప్పటికీ ఉదయపూర్ లో నివసిస్తున్న శిశోడియా వంశానికి చెందిన అరవింద సింగ్ ప్రతీ సోమవారం సాయంత్రం శివదర్శనానికై రావడం జరుగుతోంది .అద్దే సమయంలో చుట్టుపక్కలనుంచి భక్తులు రావడంతో సోమవారం రద్దీగా వుంటుంది మిగతా దినాలలో రద్దీ తక్కువగా వుంటుంది . 

ఈ మందిర ప్రాంగణం లో వున్న మరో మందిరం ' లకులిశ ' తెగకు చెందిన యేకైక మందిరాన్ని చూడొచ్చు . లకులిశ అనే తెగ శైవానికి చెందినదని , లింగ పురాణం ప్రకారం లకులిశ శివునియొక్క 28వ అవతారంగావర్ణింప బడింది .

ఏకలింగజీ ని దర్శించుకున్నాకా ఓ ఔత్సాహికుడైన స్థానికుని సమాచారంతో అక్కడకి రెండున్నర కిలోమీటర్ల దూరంలో వున్న సహస్ర బాహు ' విష్ణు మందిరం చూడ్డానికి వెళ్లేం .

ఏకలింగజీ కి సుమారు రెండున్నర కిలో మీటర్ల దూరంలో ' సహస్ర బాహు ' విష్ణు మందిరం వుంది . స్థానికులు దీనిని ' సాస్ బహు ' మందిరం అని అంటారు . వారి ఉఛ్చారణకి మేము అత్తాకోడళ్ల మందిరంఅనుకున్నాము . ఈ మందిరం పదవ శతాబ్దానికి చెందినది . ఈ ప్రాకారం లో రెండు మందిరాలు వున్నాయి . ఒకటి బాగా పెద్దదిగా వుంది మరొకటి చిన్నది . ఆ మందిరాల మీద వున్న శిల్పకళ చూడతగినది . మొఘల్రాజుల విద్వంశమో లేక హిందువుల నిర్లక్ష్యమో గాని యీ అద్భుతమైన కోవెల మరుగున పడి పోయింది . పేరును బట్టి విగ్రహం విశ్వరూపానికి ప్రతీక అవొచ్చు . కోవెల లోని శిల్పాలు వాటి నగలు దుస్తులు చెక్కిన తీరుప్రశంసనీయం . బయట భారత ప్రభుత్వం పెట్టిన బోర్డు ద్వారా ఆ మందిరపు పూర్వ వైభవం తెలుస్తుంది . కోవెలలోని శిల్పాలు , మకరతోరణం చూడతగ్గవి . పురాతత్వశాఖ వారు యీ మందిరాన్ని హెరిటేజ్మోన్యుమెంటుగా ప్రకటించి అవుసరమైన చర్యలు ప్రారంభంచేరు . మరికాస్త శ్రద్ధ వహించి నిపుణులైన శిల్పులకు బాధ్యత అప్పగిస్తే ప్రస్తుతం శిల్పాలకు వేస్తున్న అతుకులు అసహ్యంగా కనిపించకుండా వుండేవేమో అనిఅనిపించకమానదు . ఈ మందిరాలను దర్శించుకున్న తరువాత ఒక అద్భుతమైన విష్ణు మందిరాన్ని దర్శించుకున్న అనుభూతి కలిగింది . అక్కడ నుంచి తిరిగి ఉదయపూర్ వచ్చి మధ్యాహ్నాలు భోజనం చేసుకొని ' హల్దీఘాటీ ' ప్రయాణ మయ్యేం . 

2)హల్దీఘాటీ------

ఉదయ పూర్ కి సుమారు నలభై కిలో మీటర్ల దూరం లో వుంది యీ హల్దీఘాటీ . ఈ లోయ రాజస్థాన్ లోని రాజసమండ్ మరియు పాలీ జిల్లాలను కలుపుతూ వుంటుంది . చిన్నప్పుడు హిస్టరీ పుస్తకాలలో చదువుకున్న హల్దీఘాటీ చూడబోతున్నాం అనగానే యేదో కుతూహలం కలిగింది . ఏదో యుద్దభామి అనుకున్నాం కాని యిది చదునైన నేల కాదు . కొంత దూరం పీఠభూమి లోప్రయాణంచేక యెత్తైన ఆరావళీ పర్వతాలలో ప్రయాణం మొదలవుతుంది యీ కొండలలోని లోయలు యెలా వూన్నాయంటే మనషి అడుగు దూరంలో వుంటే మాత్రమే చూడగలం లేకపోతే కొండల చాటున యెవరికి కనబడంఒక కొండకు మరో కొండ అడ్డుగా వుండి బాగా తెలిసిన వారు మాత్రమే ఆ లోయలలో సంచరించగలరు . కొత్త వారు నిశ్చయంగా దారితప్పిపోయి బయటకి రాలేక అక్కడక్కడ తిరుగుతూ సమయం వృధా చేసుకుంటారు .యిలాంటి కొండ దారులే మనకి మధ్య ప్రదేశ్ లో చంబల్ లోయలో కూడా వున్నాయి .' హల్దీఘాటీ ' అని పేరెందుకు వచ్చిందంటే యీ ప్రాంతంలో కొండలు పసుపు పచ్చని మట్టి తో పసుపు రాశులు పోసినట్లు భ్రాంతి కలిగిస్తుంది . కొన్ని కిలోమీటర్ల మేర మనం ప్రయాణిస్తున్న దారికి యిరువైపులాకనుచూపు మేర వరకు అంతా పసుపు రాశులే కనిపించడం ఓ అద్భుత దృశ్యమే . కొంచెంసేపు హల్దీఘాటీ యుద్ధం గురించి చెప్పుకుందాం . మేవాఢ్ రాజైన రాణా ప్రతాప్ కి మొఘల్ చక్రవర్తి అక్బరు కి జరిగిన అనేక యుధ్దాలలో గెలుపు ఒకసారి అటు , ఒకసారి యిటూ అవుతూ వుండేది . ఈక్రమంలోనే 1576 లో  మొఘల్ సేనలు లక్షలలో రాణా ప్రతాప్ సేనలను యీ హల్దీఘాటీ లో యెదుర్కున్నాయి . మూడున్నర రోజులు జరిగిన యుధ్దం లో జరిగిన ప్రాణ నష్టం అపారం ఆ యుధ్దానికి ప్రత్యక్షసాక్షి వర్ణనప్రకారం హల్దీఘాటీ లో రక్తం యేరులై ప్రవహించి హల్దీఘాటీ ని యెర్రగా మార్చి యిది హల్దీఘాటీ కాదు సింధూర్(కుంకుమ) ఘాటీ యేమో అనిపించిందట , క్షతగాత్రుల  ఆర్తనాదాలు యీ కొండలలో కొన్ని యేళ్ల వరకుప్రతిధ్వనించేయట .

హల్దీఘాటీ లో రాణా ప్రతాప్ మాన్సింగులు ముఖామఖీ తలపడతారు . ఆ పోరులో మాన్ సింగ్ యేనుగుమీద ప్రతాప్ తన ప్రియ గుర్రమైన ' చేతక్ ' మీద వుంటారు . మాన్ సింగ్ ధాటికి ప్రతాప్ క్షతగాత్రుడౌతాడు .చేతక్ మాన్ సింగ్ యేనుగు దెబ్బకు గురౌతుంది . అచేతనస్తితిలో వున్న ప్రతాప్ ను రక్షించే క్రమంలో మాన్ సింగ్ కత్తిదెబ్బలు తన శరీరం పై పడేటట్టు చేసుకొని యుధ్దభూమినుంచి తన యజమానిని రక్షించి సరక్షితమైనప్రదేశానికి తీసుకు వెళ్లి ప్రాణాలను వదులుతుంది . మొఘల్ సేనలను తప్పుదారి పట్టించడానికి ప్రతాప్  అనుచరుడు ప్రతాప్ వేషం లో మాన్ సింగ్ తో యుధ్దం చేసి వీరగతి చెందుతాడు అతడే ప్రతాప్ అని తలచిన మాన్సింగ్ యుధ్దం ముగిసి నట్లుగా ప్రకటిస్తాడు . ఆ విరామంలో రాణా ప్రతాప్ మిగిలిన సేన సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటుంది . మరణించినది ప్రతాప్ కాదని తెలుసుకున్న మాన్ సింగ్ అప్పటికే చాలా సైన్యం కోల్పోవడంతోమిగిలిన సేనలతో హల్దీఘాటీ దాటడం ఆత్మహత్యా తో సమానమని తెలుసుకొని వెనుతిరుగుతాడు .

రాణా ప్రతాప్ ఆ యుధ్దంలో రాజ్యం లో చాలా భాగం పోగొట్టుకొని యెవరు మితృలో యెవరు శతృవులో తెలియక కొంత , గాయాలు మానక కొంత మొత్తం మీద చాలా కాలం కుంభాల్ గఢ్ లో తలదాచుకుని  తిరిగిసేనలను కూర్చుకొని పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి వశపరచుకుంటాడు . ప్రతాప్ యొక్క గొరిల్లా దాడులకు యీ హల్దీఘాటీ చాలా వరకు సహాయపడినట్లుగా చరిత్ర కారులు వర్ణిస్తారు .' చేతక్ ' నేలకొరిగిన ప్రదేశంలోనే ఆ అశ్వానికి నివాళిగా రాణా ప్రతాప్ సమాధి నిర్మించి గౌరవాన్ని చాటుకున్నాడు . ఆ సమాధి స్థలాన్ని హల్దీఘాటీ లో చూడొచ్చు . 1997 లో భారత ప్రభుత్వం మహారాణా ప్రతాప్ జ్ఞాపకార్ధం అక్కడ మ్యూజియం కట్టడం ప్రారంభించి 2009 లో ప్రజలకు సమర్పించింది . అందులో రాణా ప్రతాప్ జీవిత చరిత్ర , హల్దీఘాటీ యుధ్ద సన్నివేశాలు బొమ్మలరూపంలో ప్రదర్శిస్తూ అదనంగా లైట్ మరియు సౌండ్ యెఫెక్ట్ యేర్పరిచేరు . నిజంగా యుధ్దాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది . 

ఈ ప్రదేశం ' టెర్రకోటా ' బొమ్మలకు ప్రసిద్ది .  గులాబ్ జల్ , గుల్ ఖండ్ లకి ఈ ప్రదేశం చాలా ప్రసిద్ది చెందింది . మళ్లావారం రాణక్ పూర్ జైనమందిరం , నాథ్ ద్వార , కుంభాల్ గఢ్ లగురించి తెలుసుకుందాం , అంతవరకు శలవు . 

మరిన్ని శీర్షికలు
visheshalu