Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sarainodu movie review

ఈ సంచికలో >> సినిమా >>

బోయపాటి శ్రీనుతో ఇంటర్వ్యూ

interview with boyapati srinu
మ‌హా అయితే ప‌ది సినిమాలు చేస్తానేమో!  - బోయ‌పాటి శ్రీ‌ను

మాస్ ప‌ల్స్ ప‌క్కాగా క‌నిపెట్టేసిన ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను. ఆయ‌న సినిమాలో హీరోయిజం... ఆకాశాన్ని తాకుతుంటుంది. మాస్ ఎలిమెంట్స్ పుష్క‌లంగా ఉంటాయి. క‌మ‌ర్షియ‌ల్ దినుసులూ.. బాగా ద‌ట్టిస్తారు. కాబ‌ట్టే... బోయ‌పాటి మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ అయిపోయారు. తీసింది త‌క్కువ సినిమాలే అయినా.. ''ఇది బోయ‌పాటి సినిమా'' అనే ముద్ర తెచ్చుకొన్నారు. ఇప్పుడు స‌రైనోడు అంటూ.. మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కులకు యాక్ష‌న్ ధ‌మాకా అందివ్వ‌బోతున్నారు. ఈ సినిమా ఈరోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా బోయ‌పాటితో చిట్ చాట్ ఇది. 

* హాయ్‌...
- హాయ్‌..

* స‌రైనోడు కూడా చివ‌రి నిమిషాల్లో టెన్ష‌న్ పెట్టాడా?
- పెద్ద సినిమా అనేస‌రికి ఇవ‌న్నీ మామూలే క‌దండీ.  నిజానికి చాలా హ్యాపీగా, హాయిగా రావాల్సిన సినిమా ఇది. ముందు ఏప్రిల్ 8న అనుకొన్నాం. దానికంటే ముందే సినిమా రెడీ అయిపోయింది.

* మ‌రి ఈ హ‌డావుడి ఎందుకు?
- సెన్సార్ కోసం రెండు సీన్లు మ‌ళ్లీ తీయాల్సివ‌చ్చింది. అందుకే ఈ హ‌డావుడి..

* అంటే స‌రైనోడు రీషూట్ జ‌రిగిన సంగ‌తి నిజ‌మే అన్న‌మాట‌..
- నేనే చెబుతున్నా క‌దా?  కాక‌పోతే సీన్లేం మార్చ‌లేదు. అంత‌కు ముందు తీసిన స‌న్నివేశాల ఆధారంగా సెన్సార్ వాళ్లు ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. మాకేమో యు బై ఏ వ‌స్తే బాగుంటుంది అనిపించింది. అందుకే.. సెన్సార్ వాళ్లు అభ్యంత‌రం చెప్పిన రెండు స‌న్నివేశాల్ని.. మోతాదు త‌గ్గించి షార్ప్‌గా తీశాం. 

* మెగా కాంపౌండ్‌లో సినిమా అంటే చిరంజీవి నుంచి అల్లు అర‌వింద్ వ‌ర‌కూ.. ఒత్తిళ్లు ఎక్కువ‌గా ఎదుర్కోవాల్సి ఉంటుంది క‌దా?  మీరేమైనా ఇబ్బంది ప‌డ్డారా?
- ఒత్తిళ్లేం లేవండీ. నేను చాలా ఫ్రీగా ఈ సినిమాచేశా. నేను ప్ర‌తీ విష‌యంలోనూ ప‌క్క‌గా ఉంటా. 200 శాతం నా క‌థ క‌రెక్ట్ అనుకొంటేనే.. ఏ హీరో ద‌గ్గ‌ర‌కైనా వెళ్తా. మ‌నకే మ‌న క‌థ‌పై డౌట్లు ఉన్న‌ప్పుడు ఎదుటివాళ్ల‌కూ సందేహాలొస్తాయి. మ‌నం క్లియ‌ర్‌గా ఉంటే ఎవ్రిథింగ్ ఈజ్ క్లియ‌ర్‌.

* చిరంజీవిగారి ఇన్‌వాల‌వ్వ్‌మెంట్ ఏమీ లేదంటారు?
- లేదు. అయితే ఒక‌టి.. షూటింగ్‌కి వెళ్ల‌క‌ముందు ఈ క‌థ ఆయ‌న‌కు వినిపించా. అదీ.. నా ఇంట్ర‌స్ట్ మేర‌కే. ''బ‌న్నీకి ఇది ట్రైల‌ర్ మేడ్ స‌బ్జెక్ట్ ప్రొసీడ్'' అన్నారు.  ఒక‌వేళ స‌ల‌హాలిస్తే త‌ప్పేంటి?  150 సినిమాలు తీసిన అనుభ‌వం ఆయ‌న‌కు ఉంది. పైగా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.

* అర‌వింద్‌గార్ని భ‌లే ఒప్పించారే...
- చెప్పాను క‌దండీ. ముందు మ‌నం క్లియ‌ర్‌గా ఉండాలి. అప్పుడు అంద‌రూ.. మ‌న‌తో బాగానే ఉంటారు. అర‌వింద్‌గారు ఇచ్చిన ఫ్రీడ‌మ్ అంతా ఇంతా కాదు. ఆయ‌న సెట్‌కి వ‌చ్చిన సంద‌ర్భాలు కూడా చాలా త‌క్కువ‌.  

* బ‌న్నీ కోస‌మే ఈ క‌థ రాసుకొన్నారా?
- ఈ క‌థ ఇప్ప‌టిది కాదండీ. ఎప్పుడో నాలుగేళ్ల క్రితమే బ‌న్నీకి వినిపించా. తాను బాగుంద‌న్నాడు.. అంతా సెట్ట‌య్యేలోగా త‌న‌కు ఓ సినిమా ప‌డింది. నేనూ మ‌రో సినిమాతో బిజీగా ఉండిపోయాను. ఇద్ద‌రికీ కుదిరే స‌రికి ఇంత టైమ్ ప‌ట్టింది.

* స‌రైనోడు బ‌న్నీ మార్క్ సినిమా.. లేదంటే బోయ‌పాటి త‌ర‌హా సినిమా?
- అదేం కాదండీ. ప్రేక్ష‌కుల‌కు ఏం న‌చ్చుతుందో, ఎలాంటి సినిమా తీస్తే న‌చ్చుతుందో ఇది అలాంటి సినిమా. నేనెప్పుడు సినిమా తీసినా ప్రేక్ష‌కుడి కోణంలోంచే ఆలోచిస్తా. బ‌న్నీకంటూ ఓ సెప‌రేట్ స్టైల్ ఉంది.. బ‌న్నీ బ‌లాలు వేరు.. వాటిని మిస్ అవ్వ‌లేదు. దాంతో పాటు నాదైన మార్క్ ఉంటుంది. ఇవి రెండూ ఎలా క‌లిశాయ‌న్న‌ది మీరు సినిమా చూస్తే అర్థ‌మైపోతుంది.

* అంజ‌లితో ఐటెమ్ పాట చేయించాల‌న్న ఆలోచ‌న ఎవ‌రిది?
- నాదే.

* లెజెండ్‌తో జ‌గ‌ప‌తిబాబు, స‌రైనోడుతో ఆది... ఇద్ద‌ర్నీ విల‌న్లుగా మార్చేశారు?
- విల‌న్ ఎంత బ‌ల‌వంతుడైతే.. అంత బాగా హీరోయిజం పండుతుంద‌ని న‌మ్ముతాను. అలాంటి బ‌ల‌మైన విల‌న్ ఈ సినిమాకీ అవ‌స‌రం. నాకెందుకో ఆది అయితే బాగుంటాడ‌నిపించింది. ఈ విష‌య‌మే అర‌వింద్ గారికి చెబితే.. ''ఆది హీరోగా చేస్తున్నాడు. మ‌నం అడిగితే బాగోదు'' అన్నారు.  ''ఆదిని అడిగి చూద్దాం. ఒక‌వేళ త‌ను కాదంటే.. మీరు ఎవ‌ర్ని తీసుకొచ్చినా వాళ్ల‌లోనే సినిమా చేస్తా.. మ‌రో మాట మాట్లాడ‌ను'' అని క‌చ్చితంగా చెప్పా. ఆది క‌థ విని ఎగ్జ‌యిట్ అయిపోయాడు. వెంట‌నే ఒప్పుకొన్నాడు. త‌ను కూడా చాలా బాగా చేశాడు. చాలా స్టైలీష్‌గా క‌నిపిస్తాడు. 

* ద‌ర్శ‌కుడిగా ప‌దేళ్ల ప్ర‌యాణం మీది. తీసింది మాత్రం త‌క్కువ సినిమాలు...
- నా స్టైల్ అంతేనండీ. క‌థ‌పై ఎక్కువ రోజులు కూర్చుంటా. నాకు ప‌ర్‌ఫెక్ట్ అనిపించ‌క‌పోతే బ‌రిలోకి దిగ‌ను. ఆల‌స్య‌మైనా స‌రే, మంచి సినిమా ఇవ్వాల‌న్న‌దే నా ఉద్దేశం. ఇక‌పై కూడా అంతే. ఏడాదికి ఓ సినిమా చేస్తానేమో... ఆ లెక్క‌న ప‌ది సినిమాలు మించి తీయ‌లేను. సినిమా అన్న‌ది.. చ‌రిత్ర‌. మ‌నం ఉన్నా లేకున్నా ఉంటుంది. అలాంట‌ప్పుడు మంచి సినిమాలే తీయాలి క‌దా?

* మాస్‌, యాక్ష‌న్‌, క‌మ‌ర్షియ‌ల్ జోన‌ర్‌ని వ‌ద‌ల‌రా?
- వ‌ద‌ల‌నండీ. ఎందుకంటే నా నుంచి అలాంటి సినిమాలే కోరుకొంటున్నారు. నాక్కూడా ల‌వ్ స్టోరీ తీయాల‌ని ఉంటుంది. కానీ.. నా నుంచి యాక్ష‌న్ మూవీ కోరుకొనే వాళ్లంతా నిరుత్సాహ‌ప‌డ‌తారు. 

* ఒక్క‌మాట‌లో చెప్పండి.. స‌రైనోడు ఎలాంటి సినిమా?
- పండ‌గ‌లాంటి సినిమా.. నో డౌట్‌. బ‌న్నీ నూటికి రెండొంద‌ల శాతం కొత్త‌గా క‌నిపిస్తాడు. గుండెల‌మీద చేయి వేసుకొని.. హ్యాపీగా చూడండి.

* త‌దుప‌రి సినిమా...
- బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌తో ఓ సినిమా ఉంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో చెబుతా.

- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka