Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

 గతసంచికలో ఏం జరిగిందంటే.http://www.gotelugu.com/issue158/449/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

 నాగుల దిబ్బ మీది నాగాల గూడెం.

సమయం రాత్రి రెండో యామం.

గూడెమంతా నిద్ర పోతున్నప్పటికీ నాయకుడు నాగ కేసరి ఇంటి ముందు నాగ కేసరితో బాటు అనేక మంది కూచునున్నారు. ఎప్పుడో సాయంకాలం ఆరంభించిన ఓజో తాంత్రిక క్షుద్ర విద్యా ప్రయోగం ఇంకా కొన సాగుతూనే వుంది. కుల గురువు, మత గురువు గణా చారి హోమ గుండాన్ని చుట్టి కూచుని ప్రయోగం నిర్వహిస్తున్నారు. విశాలమైన వాకిట్లో అవతల ధూమ నాళికలో మహా పథంలో వెన్నెట్లో ప్రయాణిస్తున్న యువ రాజు ధనుంజయుడు, అపర్ణుడు కన్పిస్తున్నారు.

వెన్నెట్లో గూడెం తడిసి ముద్దవుతోంది. చుట్టూ కాగడాలు వెలుగుతున్నాయి. చల్లటి గాలులు ఆగి ఆగి వీస్తున్నాయి.

మత గురువు చెంత వున్న డబ్బీ నుండి నల్లటి కాటుక తీసి కళ్ళకు కాటుక పెట్టుకుని కూచోడంతో అక్కడున్న వాళ్ళంతా ధూమ నాళికలోని దృశ్యాన్ని స్పష్టంగా చూడ గలుగుతున్నారు, విన గలుగుతున్నారు.

ఇది చాలా ప్రత్యేకమైన కార్యక్రమంగా ఏర్పాటు చేయ బడింది. అందుకు తగిన కారణం కూడ వుంది. రత్న గిరి యువరాజు ధనుంజయుడు దివ్య నాగ మణి కోసం ప్రాణాలకు లెక్క చేయక నాగ లోకం రావటానికే కృత నిశ్చయుడై వస్తూండటం నాగ రాజుకి ఇష్టం లేదు. కంటగింపుగా వుంది. బెదిరింపులకు లొంగడని అర్థం కాగానే అతడ్ని అంతం చేయ సమ కట్టి సర్ప శీర్షుడనే దుష్ట శక్తి మాయావిని ఏర్పాటు చేశాడు. వాడ్ని ముందుగా నాగాల గూడెం నాయకుని వద్దకు పంపించాడు. ఆ విధంగా సర్ప శీర్షుడికి ధనుంజయుని చూపించటం కోసం ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈసారి శంఖు పుత్రి మాత్రం ఇచట లేదు. ఇదే సమయంలో ఆమె యువరాణి ఉలూచీశ్వరి వెంట వింధ్యా పర్వత మార్గంలో ధనుంజయుని రాక కోసం నిరీక్షిస్తోంది. ఈ విషయం ఎవరికీ తెలీదు.

ఓజో క్షుద్ర విద్యతో ధూమ నాళికలో ధనుంజయుడు ఒక్కడే ఒంటరిగా కన్పిస్తాడని నాయకుడు నాగ కేసరితో సహా అంతా భావించారు. కాని వెంట మరో యువకుడితో సింహం వద్ద చూసి విస్తు పోయారు.

సాయంకాలం నుంచి వారిని చూస్తున్నారు. వారిని ధూమ నాళికలో వీక్షించిన వెంటనే సర్ప శీర్షుడు అక్కడ అదృశ్యమై ధనుంజయ, అపర్ణులున్న చోటుకు వెళ్ళి పోయి అదృశ్య రూపంలో గమనించసాగాడు. ఆ దుష్ట శక్తి ధనుంజయుని అంతం చేసే దృశ్యాన్ని వీక్షించాని అప్పటి నుండి ఎదురు చూస్తూనే వున్నారంతా.

అది కూడ కాదు`

కౄర మృగమైన సింహ కిశోరాన్ని అపర్ణుడు వశం చేసుకొని చికిత్స నెరపిన విధం చూసి విభ్రాంతి చెందారు నాగాలు. నాయకుడు నాగ కేసరి ఏదో అనుమానం వచ్చి నాగానందుని చెంతకు పిలిచాడు.

‘‘ఆ రోజు మొదటి సారి మీరు ధనుంజయుని ఓజో ప్రభావంతో కలిసినపుడు ఆరోజు మన ప్రయోగం విఫలమైనది గదా. అప్పుడు ఒక మచ్చల గుర్రం మీద ఎవరో రావటం చివరి సారిగా జూచితినంటివి. అది ఆ యువకుడేనా?’’ అనడిగాడు.

‘‘అవును నాయకా! అతడే సందేహము లేదు.’’ అంటూ బుదులిచ్చాడు నాగానందుడు.

‘‘కాని... అతడు నిజముగా యువకుడేనా? హావ భావము తిలకింప పురుష వేషములోని స్త్రీ వలె తోచుచున్నాడే.’’ అంటూ సందేహించాడు నాగ కేసరి. ధూమ నాళిక లోని దృశ్యాన్ని, మాటలు వినుటతో కొద్ది సేపటి లోనే ఆ సందేహము కూడ తీరి పోయినది. ఆమె భద్రా దేవి యనే యువతి యని, పురుష వేషమున అపర్ణుడిగా సంచరిస్తోందని అర్థమైంది. ధనుంజయునికి రక్షణ వలయంగావున్న ఆమెలో అంతటి మంత్ర శక్తి ఎలా వచ్చిందో అర్థం గాక విస్మయం చెందాడు. తమ మొదటి ప్రయోగం విఫలమైన రోజు హోమ గుండం నుండి ఎగసిన నిప్పుల్ని ఆ బీభత్సాన్ని ఇంకా మర్చి పోలేదు ఎవరూ.

అయితే ఇప్పుడు ధనుంజయుని ప్రాణాలు తీయటానికి వెళ్ళిన వాడు సామాన్యుడు కాడు. నాగ లోక భృత్యుడు దుష్ట మాయావి అయిన సర్ప శీర్షుడు. కాబట్టి సర్ప శీర్షుడి చేతిలో ధనుంజయుడు ఆ యువతి కూడ ఛస్తారని నమ్మకంతో వున్నారంతా. ఆ దృశ్యాన్ని నయనానందంగా వీక్షించాని ఉవ్విళ్ళురుతూ పట్టుదలగా కూచున్నారంతా.

సింహానికి చికిత్స ముగిసాక`

పొద్దువాలుతూండగా జల పాతం మడుగు ప్రాంతం నుండి ధనుంజయ అపర్ణులు తమ అశ్వాల మీద బయలు దేరటం చూసారు. అదృశ్య రూపంలోని సర్ప శీర్షుడు వారి మీద ఎప్పుడు ఎలా దాడి చేస్తోడో అర్థం కాలేదు ఎవరికీ. కుతూహలంతో చీకటి పడినా కదలకుండా వూపిరి బిగించి చూస్తున్నారంతా. ఒక్క నాయకుడు నాగ కేసరి మాత్రం వూహించ గలిగాడు.

అపర్ణుడు చెప్పినట్టు ఖడ్గ మృగం మీద ఎలాంటి వశీ కరణ మంత్రం పని చేయదు. ఆ కౄర మృగం వశం కాదన్న సంగతి తెలిసినదే. కాబట్టి సర్ప శీర్షుడు ఖడ్గ మృగంగా మారి దాడి జరుప వచ్చని వూహించాడు నాగ కేసరి. అదే నిజమైంది.
ఖడ్గ మృగం అరుపు విన్నారు.

అశ్వాలు బాట మీద నిలిచి పోవటం చూసాడు.

బీభత్సంగా దూసుకొస్తున్న ఖడ్గ మృగాన్ని గమనించారు. ఇంకేముంది ఖడ్గమృగంగా మృత్యువులా వచ్చి పడుతున్న సర్ప శీర్షుడి చేతిలో ఆ యిరువురికీ చావు తప్పదనుకున్నారు. ఆ క్షణం కోసం కళ్ళు పత్తికాయలు చేసుకుని ధూమ నాలికను వీక్షిస్తున్నారు. అంతలో అపర్ణుడిగా వున్న భద్రా దేవి క్రోధావేశంతో... ‘ముందుగా ఆ నాగాలకు బుద్ధి చెప్పవలె’ అంటూ అశ్వం నుంచి దూకి గుప్పెడు ఇసుక తీసి అభి మంత్రించటం చూసారు.

‘‘చూడండిరా! ఆ పిల్లగాడు మనకు బుద్ధి చెబుతాడట’’ అంటూ నాగాలు నవ్వుకో సాగారు. కాని గత అనుభవం వలన నాగాల నాయకుడు నాగ కేసరి నవ్వుకో లేక పోయాడు. గాభరాతో చివ్వున లేచి` ‘‘ఆ కుర్రది ఏదో చేయ బోతున్నది. ఆపండిరా! దాన్ని ఆపండి’’ అంటూ హోమం నిర్వహిస్తున్నవాళ్ళ నుద్దేశించి పెద్దగా అరిచాడు.

నిశీధిలో అతడి గొంతు మారు మ్రోగింది.

నాగాలు ఒక్క సారిగా ఉలికి పడ్డారు. నాగాల పెద్దలు జాగ్రత్త పడే లోపలే జరగాల్సింది కాస్తా జరిగి పోయింది. అపర్ణుడు మంత్రించిన ఇసుకను గాల్లోకి ఊపగానే నిప్పు రవ్వలు ఎగరటం మాత్రం కన్పించింది. ఆ మరు క్షణమే అంత వరకు కన్పిస్తున్న దృశ్యాలు ధూమ నాళికలో అదృశ్యమయ్యాయి. ఒక్క సారిగా ధూమ నాళిక చెదరి పోయి అందులో హోమ ధూపమంతా గాలి లోకి చెదిరి పో నారంభించింది.
హోమం నిర్వహిస్తున్న గురువు అదిరి పడి కంగారుగా లేచి పోయారు. అదే సమయంలో జరిగి పోయిందో విపరీతం. ఎవడో రాక్షసుడు హోమ గుండం లోంచి ఊదుతున్నట్టు హోమ గుండం నుండి ఒక్క సారిగా కణ కణ మండే నిప్పులు గాల్లోకి ఎగిరి చెల్లా చెదురుగా నాగాలమీద వర్షంలా కురవ నారంభించాయి. అంతటితో ఆగకుండా నాగాల నాయకుడి ఇంటితో బాటు సమీపం లోని కొన్ని యిళ్ళ మీద పడ్డాయి.

దయనీయంగా మారి పోయింది నాగాల పరిస్థితి. నిప్పు కణాల తాకిడికి వంటి మీద బొబ్బు లేస్తుండగా కాళ్ళు తొక్కుకుని చిందులేస్తూ గోలగోలగా పరుగు ఆరంభించారు. ఇంతలో ఇళ్ళకు నిప్పంటుకుని మంటలు లేచాయి.

తాటి, కొబ్బరి వంటి ఆకులతో కప్పిన యిళ్ళు అవి. గాలికి వెంట వెంటనే అంటుకున్నాయి యిళ్ళు. నిద్ర పోతున్న వాళ్ళని బయటకు తెచ్చే లోపు ఒక్కో ఇల్లు కాలి బూడిద కాసాగింది. నాగాల నాయకుడు నాగ కేసరికి ఒళ్ళంతా కాలింది. భగ భగ మంటలతో ఇళ్ళు తగల బడుతూంటే నిస్సహాయంగా చూస్తూండి పోయాడు.

మంటలు....

ఎటు చూసినా మంటలు.

గూడెం మొత్తం చూస్తూండగానే మంటల్లో చిక్కి దారుణంగా తగల బడి పోసాగింది. నాగాల ఏడుపులు పెడబొబ్బలు మిన్ను ముట్టాయి. 
‘‘నిజం గానే ఆ కుర్రది తమకు బుద్ధి చెప్పింది.’’ అనుకున్నాడు నాగ కేసరి.

మిగిలిన రాత్రి నాగాల పాలిట కాళ రాత్రిగా మిగిలి పోయింది. అర్ధ రాత్రి దాటే సరికి ప్రాణ నష్టమంటూ ఏమీ జరగ లేదు. కాని నాగాలు తమ పశువుల తోను, కట్టు బట్టల తోను కాందిశీకులుగా మిగిలి పోయారు.

**************************

‘‘భద్రా! అది వచ్చి పడుచున్నది. ఇప్పుడేమి చేయాలె?’’ విల్లంబులను సిద్ధంగా పట్టుకుని అడిగాడు యువ రాజు ధనుంజయుడు. బాట వెంట మహా ప్రళయంగా ఉగ్ర రూపంతో దూసుకొచ్చేస్తోంది ఖడ్గ మృగం.

భద్రా దేవి తన అశ్వం మీది పండ్ల సంచి నుండి మూడు నిమ్మకాయలు తీసింది. వాటిని కొన్ని లిప్తల కాలం అభి మంత్రించి ముమ్మారు వూది చేతిలో సిద్ధంగా వుంచుకుంది. తన అశ్వం కళ్ళాలు అందుకుని సిద్ధం చేస్తూ ధనుంజయుని అశ్వం కళ్ళాలు కూడ తన చేతి లోకి తీసుకుంది.

‘‘ప్రభూ! అశ్వం మీద వెను తిరిగి కూచుని వస్తున్న ఖడ్గ మృగాన్నే గమనిస్తూండండి. నేను అశ్వాలను వేగంగా పోనిస్తాను. ఖడ్గ మృగం మన సమీపం లోనికి రాగానే ఒక నిమ్మ కాయను విసురుతాను. ఆ కాయను దాట గానే ఖడ్గ మృగం అదృశ్యమై ఆ స్థానంలో ఆ రూపం ధరించిన మాయావి కొద్ది లిప్తల కాలం కన్పిస్తాడు. అలా కన్పించిన వెంటనే బాణం వదిలి వాడ్ని పడగొట్టాలె. తిరిగి మృగంగా మారక ముందే వాడ్ని మట్టి కరిపించాలె. మనకి మూడు అవకాశములు మాత్రమే కలవు. తప్పితే ఆ మృగం మనల్ని బ్రతుక నివ్వదు.’’ అంటూ వివరించింది.

‘‘భయ పడకుము భద్రా! చెప్పినావుగా. ఇక నేను వాడి సంగతి చూసుకొందును. అశ్వమును పోనిమ్ము’’ అంటూ అశ్వం జీను మీద వెను తిరిగి కూచుని సిద్ధమయ్యాడు. అశ్వాలను అదలించింది భద్రా దేవి.

అశ్వాలు గరుడ, ఢాకినీలు ఒక్క సారిగా పరుగు అందుకున్నాయి. అప్పటికే వారికి నూరు ధనువుల దూరం లోకి వచ్చేసిందా ఖడ్గ మృగం. ఎప్పుడైతే అశ్వాలు పరుగు అందుకున్నాయో ఇక అశ్వాలకు ఖడ్గ మృగానికి ఆరంభమైంది పరుగు పందెం.

అప్పటికి నూరు ధనువుల సమీపం లోకి వచ్చేసిందా మృగం. తనకు అందకుండా పారి పోతున్న అశ్వాలను చూస్తూ రెట్టించిన వేగంతో తరుమ నారంభించింది.

సహజంగా ఖడ్గ మృగం చాలా బరువైన జంతువు. అది అశ్వాలతో సమంగా పరుగెత్తటం అసంభవం. కాని ఇక్కడ తరుముతోంది మాయా ఖడ్గ మృగం. అందుకే ఎగిరి వస్తున్న కొండ గుట్టలా అమిత వేగంతో అశ్వాలను వెన్నంటి వస్తోంది. బుసలు కొడుతూ బీభత్సంగా తరుముతోంది. నిశీధిలో అశ్వాల గిట్టల శబ్ధం, ఖడ్గ మృగం పద ఘట్టనతో అటవీ ప్రాంతం మారు మ్రోగుతోంది. క్షణం ఆగినా అది అశ్వాలతో సహా తమను కుమ్మి పాదాలతో మట్టగించి చంపేస్తుందని తెలుసు. అశ్వాలను వాయు వేగంతో పరుగెత్తిస్తున్నారు.

మచ్చల గుర్రం మీది భద్రా దేవి తల త్రిప్పి ఆ భయానక మృగం బీభత్సాన్ని గమనిస్తూనే వుంది. క్రమంగా అది తమకు యాభై ధనువుల సమీపం లోకి వచ్చేసింది. అప్పుడు`

ధనుంజయుని హెచ్చరిస్తూ తన తల మీదుగా మొదటి నిమ్మ కాయను వెనక్కు విసిరేసింది భద్రా దేవి. చూస్తూండగానే ఖడ్గ మృగం మంత్రించిన నిమ్మ కాయను దాటింది. దాటిన మరు క్షణం ఒక అద్భుత దృశ్యం కంట బడింది.

ఖడ్గ మృగం అదృశ్యమై`

ఆ స్థానంలో ఒక వింత ఆకారం ప్రత్యక్షమైంది.

ఆ ఆకారం రొప్పుతూ పరుగెత్తుకొస్తోంది.

వాడు బలిష్టంగా పదడుగుల ఎత్తుండే మనిషి రూపుడు. కాని వాడికి తల స్థానంలో పడగ విప్పిన పెద్ద సర్పం తల వుంది. చేటంత పడగ, ఎర్రని కళ్ళతో చూస్తూ ఆ సర్ప శిరస్సుడు భయానకంగా వున్నాడు. నల్లటి దేహం, ఎర్రటి పంచె దట్టీ బిగించి కట్టాడు. మెడలోను చేతులకు నాగాభరణాలున్నాయి. అటు ధనుంజయుడు ఇటు భద్రా దేవి కూడ ఆ విచిత్ర రూపం గాంచి చకితులయ్యారు.

ధనుంజయుడు ఎంతగా విభ్రాంతుడయ్యాడంటే వాడి పైకి బాణం వేయటం కూడ మర్చి పోయాడు. దాంతో కొన్ని లిప్తల కాలం మెరుపులా మెరిసిన ఆ ఆకారం తిరిగి ఖడ్గ మృగంగా మారి పోయాడు. రెట్టించిన వేగంతో ఖడ్గ మృగం తిరిగి తరుముకొస్తోంది. క్రమంగా అది దగ్గరవుతోంది.

‘‘క్షమించు భద్రా! ఆ విచిత్ర రూపమును గాంచి విభ్రాంతుడనై బాణము వేయ లేక పోతిని’’ అన్నాడు భద్రా దేవితో ధనుంజయుడు.
‘‘మనకు ఇంకను రెండు అవకాశములున్నవి ప్రభూ. ఈసారి ప్రయోగించండి. వాడిని ఎంత త్వరగా వధించిన అంత మంచిది.’’ గుర్రాలను అదలిస్తూనే అరిచింది భద్రా దేవి.

చెట్టు పుట్టలు శర వేగంతో వెనక్కి పోతున్నాయి. వెన్నెట్లో వాయు వేగంతో పరుగు తీస్తున్నాయి అశ్వాలు. వాటి సందడికి ఏం జరుగుతోందో అర్థం గాక గూళ్ళ లోని అడవి పక్షులు కకావికలై గాల్లోకి ఎగురుతున్నాయి.

కొంత అవధి తర్వాత ధనుంజయుని హెచ్చరిస్తూ తన తల మీదుగా రెండో నిమ్మ కాయను వెనక్కి విసిరింది భద్రాదేవి.

ఈసారి ధనుంజయుడు అప్రమత్తంగానే వున్నాడు. రెండు బాణాలను వింటికి సంధించి సిద్ధంగా వున్నాడు. ఆ రెంటిలో ఒకటి అర్ధ చంద్రాకార బాణం.

ఖడ్గ మృగం నిమ్మ కాయను దాటింది.

అంతే` మరు క్షణమే ఖడ్గ మృగం అదృశ్యమై తిరిగి సర్ప శిరస్సు వాడు ప్రత్యక్షమై పరుగెత్తుకు రాసాగాడు. వాడు కనీ కనిపించగానే ఏక కాలంలో రెండు బాణాలనూ ప్రయోగించాడు ధనుంజయుడు. అతడి గురి తప్పదు.

ఒక బాణం సూటిగా పోయి ఆ మాయావి గుండెల్లో నాటుకుంది. వస్తున్నవాడు వస్తున్నట్టే ఆగి పోయి పెద్దగా అరిచాడు. ఆ అరుపు గొంతు దాటుతూండగానే అర్ధ చంద్రాకార భాణం రివ్వున వచ్చి వాడి సర్ప శిరస్సును ఖండించి దూరంగా పడేసింది. దాంతో వాడు నెత్తురు ధారుగా పారుతుండగా అక్కడి కక్కడే విరుచుకు పడి పోయాడు. అది చూడ గానే అశ్వాలను నిలువరించి వెనక్కు తిప్పారు ధనుంజయ భద్రా దేవిలు.

ధనుంజయుడు తన అశ్వం మీద యధా ప్రకారం కూచుని భద్రా దేవితో వెనక్కి వచ్చాడు. అశ్వాలను ఆపి ఆ వింత మనిషిని చూసారు. కింద పడి ఇంకా కొట్టుకుంటున్నాడు వాడు. అంతలో దూరంగా తెగి పడిన అతడి సర్ప శిరస్సు నెమ్మదిగా గాల్లో లేచి రా నారంభించింది.
ముందుగా ఆ దృశ్యాన్ని చూసిన భద్రా దేవి ఉలికి పడింది. ఆ శిరస్సు వచ్చి మొండేనికి చేరితే తిరిగి ఆ మాయావి బ్రతుకుతాడు. కథ మళ్ళీ మొదటి కొస్తుంది. ‘‘ప్రభూ!’’ అంటూ ధనుంజయుని హెచ్చరించింది.

క్షణం కూడ ఆలస్యం చేయకుండా మరో బాణాన్ని సంధించి, గాల్లో తేలి మొండెం వద్ద కొస్తున్న పడగ మీదికి వదిలాడు. ఆ బాణం పడగ మధ్యలో దిగి రివ్వున వెళ్ళి వెనక వున్న మద్ది వృక్షం మానుకు నాటుకుంది. బాణానికి వేలాడుతూ చెట్టుకు నాటుకుని అలానే ఉండి పోయింది పాము తల. ఈ లోపల ధనుంజయుడు ఆ భీకరాకారుని మీద మరో రెండు బాణాలు వేసి మరింత గాయ పర్చాడు.
ఇద్దరూ అశ్వాలు దిగారు.

పెద్ద గండం గడిచినందుకు`

తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు.

భద్రా దేవి చెట్టుకు నాటుకున్న సర్ప శిరస్సు సమీపం లోకి వెళ్ళి ఏవో మంత్రాలు చదివి శిరస్సు వంక చూసింది. ‘‘నువ్వింకా చావ లేదు. బ్రతికే వుంటివి. మాట్లాడ గలవు. చెప్పు! ఎవరు నువ్వు?’’ కోపంతో ఆ శిరస్సును గద్దించి అడిగింది.

ఎర్రని కళ్ళతో ఇద్దరినీ కౄరంగా చూస్తూ భద్రా దేవి ప్రశ్నకు బదులు చెప్పకుండా విషాన్ని కక్కిందా సర్ప శిరస్సు. ఆ విషం మీద పడితే క్షణాల్లో ప్రాణాలు ఎగిరి పోవలసిందే. కాని ముందు ప్రమాదాన్ని వూహించి దూరంగా నిలవటంతో ప్రమాదం తప్పింది.

‘‘చచ్చే ముందయినా నిజం చెప్పి చావరా ముర్ఖా! ఎవరు నీవు?’’ తిరిగి గద్దించింది భద్రా దేవి.

అప్పుడు నోరు విప్పిందా సర్ప శిరస్సు.

‘‘నన్ను సర్ప శీర్షుడంటారు. నాగ లోక వాసిని. నాగ రాజు భృత్యుడ్ని’’ అంది.

‘‘నిను నాగ రాజు పంపించినాడా?’’

‘‘అవును. ధనుంజయుని కడ తేర్చమని ఆనతిచ్చి పంపించినాడు.’’

‘‘మా ఉనికి ఎలా తెలిసినది?’’

‘‘నాగాలు ఓజో ప్రయోగం చేసి చూపించినారు. నేరుగా అటు నుండి జల పాతం వద్ద కొచ్చితిని.’’

‘‘అంటే... ఆదృశ్య రూపంలో మా మాటలు అక్కడ విన్నావు. అందుకే ఖడ్గ మృగంగా మారి మా మీదకు దాడి చేయ వచ్చినావు. అవునా?’’

‘‘అవును. కాని... నా నుంచి మీరు తప్పించుకోవచ్చు. దివ్య నాగ మణిని మాత్రం సంపాదింపజాలరు. ఈ లోపలే మీరును చచ్చెదరు... మీకును...’’ అంటూ ఉన్నట్టుండి తల వాల్చేసిందా శిరస్సు.

సర్ప శీర్షుడు మరణించాడని తెలీగానే ఇద్దరూ వెనక్కి వచ్చారు. అక్కడ సర్ప శీర్షుడి మొండెం కూడ రక్తపు మడుగులో అచేతనంగా పడుంది.
చుట్టూ కీచు రాళ్ళ రొద.

పక్షు లింకా ఆకాశంలో తారాడు తున్నాయి. అవి ఇంకా గూళ్ళకు చేరుకో లేదు. మబ్బులు లేని ఆకాశంలో చంద్రుడు పాల వెన్నెల కురిపిస్తున్నాడు.

ధనుంజయునికి ఈ ఘన విజయం అమితానందాన్ని కలిగించింది. అయితే సర్ప శీర్షుడ్ని తను సంహరించి ఉండొచ్చు. కాని భద్రాదేవి పక్కన లేకుంటే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. మృగ రూపం లోని సర్ప శీర్షుడ్ని తను జయింప గలిగే వాడు కాదు. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atulita bandham