Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagalokayagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

 గతసంచికలో ఏం జరిగిందంటే...http://www.gotelugu.com/issue158/448/telugu-serials/atulitabandham/atulitabandham/

 

 “కానీ పిన్నీ, మీరు ఎప్పటినుంచో వాళ్ళతో కలిసి ఉన్నారు. కొత్తగా వచ్చిన నా కోసం వాళ్ళతో విరోధం కొని తెచ్చుకోవటం మంచిది కాదు... మీ ఆశీర్వచనం కోసం ప్రసన్న ఎదురు చూస్తూ ఉంటుంది. ప్లీజ్ వెళ్ళండి... ఈ పరిణామం నేను ఊహించనిది ఏమీ కాదు... మీరు వెళ్లి రండి... ఇప్పటికే ఆలస్యం అయింది పిన్నీ...” అని ఐశ్వర్య మరీ మరీ చెప్పిన మీదట అయిష్టంగానే కదిలింది ఆవిడ.

ఐశ్వర్య తయారై చెప్పులు వేసుకుంది.

“కార్తీ నేను మధూ దగ్గరకి వెళుతున్నాను. రేపుదయం వస్తాను... సరేనా?”

“ఓ, అలాగే, నేను దింపనా?”

“ఉహు, వద్దు... నేను ఆటోలో వెళతాను...” అంటూనే బయటకు నడిచింది.

***

“కష్ట కాలంలో నా కూతురికి తోడుగా నిలిచావు... ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను తల్లీ?” మధుబాల తలను నిమురుతూ ఆప్యాయంగా అన్నాడు ముకుంద దాస్ హిందీలో.

“మమత నాకు పరాయిది కాదు కదా  అంకుల్... తన బాధ చూడలేకపోయాను. అది నా బాధ్యతగా భావించాను అంతే అంకుల్...” వినయంగా చెప్పింది మధుబాల.

ఎదురుగా సోఫాలో కూర్చున్న మమతను చూస్తూ, “తను మానసికంగా  చాలా దెబ్బ తిని ఉంది అంకుల్. మీరు కన్న తండ్రి... అన్నీ చూసుకుంటారనే మీకు ఫోన్ చేసి రమ్మని చెప్పాను. మీతో తీసుకువెళ్ళండి... ప్రస్తుతం జాబ్ కి లీవ్ పెట్టించాను. తన భవిష్యత్తు గురించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా  సరే, మీ ఇష్టమే... మమతను మాత్రం ఏమీ అనకండి...” చెప్పింది మధుబాల.

“అలాగేనమ్మా... మేము సాయంత్రం బండికే బయలుదేరతాం.  టికెట్స్ కి ఫోన్ చేస్తాను...” అని మొబైల్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసాడు ముకుంద దాస్.

“సరే అంకుల్, మీరు భోజనం చేయండి... అన్నీ రెడీ గా ఉన్నాయి, వడ్డిస్తాను...” అంటూ లేచింది మధుబాల.

“నీకు చాలా ఋణపడి ఉన్నామమ్మా ఏ జన్మలోనో... అమ్మా మమతా... నువ్వు కాసేపు పడుకోమ్మా... చాలా నీరసంగా ఉన్నావు...” అన్నాడు కూతురితో.

మెత్తని ఆ మాటకు ఆమె మనసులో ఏదో కదిలినట్టు అయింది... రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవ సాగింది... ఆమె పక్కనే కూర్చుని ఆమె తలను గుండెలకు హత్తుకున్నాడు ముకుంద దాస్.

“చిన్నప్పుడు స్కూలుకు వెళ్ళననీ వెళితే టీచరు కొడుతుందనీ భయపడ్డావు... అయినా కఠినంగా ఉండి స్కూలుకు పంపాను. పెద్దయ్యాక, ప్రేమ వద్దనీ, హద్దులో ఉండాలనీ గట్టిగా చెప్పాను... అయినా నీవు నమ్మిన విషయాన్ని వదలలేదు... కొట్టి తిట్టి నిన్ను ఆపలేని అసహాయుడనయ్యాను... బంగారు తల్లీ, నాన్నల కాఠిన్యం బాధ్యత తో కూడినదే కానీ బాధ పెట్టేది మాత్రం కాదమ్మా... అయిందేదో అయిపోయింది. అతన్ని గురించి నీకు తెలిసింది కదా... నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కాదనేది లేదురా... ముందు మన ఇంటికి వెళ్ళిపోదాం. ఆ తర్వాత మిగిలిన విషయాలు... సరేనా?” అనునయంగా చెప్పాడు.

“మమత చాలా అదృష్టవంతురాలు అంకుల్... మీలాంటి తండ్రి ఉండటం తనకి వరం... మీరు రండి,  మమతా, నీవు కాసేపు పడుకో...”

***

సాయంత్రం ఆరు గంటలు కావస్తోంది... నౌబత్ పహాడ్ మీద వెలసిన పాలరాతి చంద్రికలా బిర్లా మందిరం మెరిసిపోతోంది... చిరు చీకట్లు కమ్ముకుంటున్నాయి... 

అప్పుడే ఆటో దిగిన మధుబాల మెల్లగా మెట్లు ఎక్కుతూ పరిసరాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగుతోంది...ముందుగా వినాయకుడిని దర్శించుకుంది. నడుస్తూ ఉంటే, ఎడమప్రక్కన ఉన్న మురళీ లోలుడు చేతిలోని వేణువుతో ఆమెను పలకరించాడు... ఆయన మోమును మనసారా వీక్షించి, మధురిమను నింపుకున్న మనసుతో మళ్ళీ మెట్లు ఎక్కసాగింది. 

‘ఆయన పేరు కూడా వేణు గోపాలే అట... ఫోటోలో చాలా బాగున్నాడు సుమీ...’ ఆమె మనసు కవ్విస్తున్నట్టు చెప్పటంతో అప్రయత్నంగా బుగ్గలు ఎర్రబడ్డాయి... 

పైకి చేరుకొని, క్యూలో నిలబడి, పది నిమిషాల్లో బాలాజీ దర్శనం చేసుకుంది. నల్లని ఆ దేవుడు ఆమెను కరుణారస పూరిత దృక్కులతో చూసినట్టు అనిపించింది... ‘నా భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది తండ్రీ...’ అనుకొని, బయటకు వచ్చి, కొబ్బరిముక్క, పటికబెల్లం ప్రసాదం తీసుకుని, చందనాన్ని ముంజేతికి, మెడకు రాసుకుంది. ఆ తరువాత పద్మావతి అమ్మవారిని, ఆండాళ్ తల్లినీ దర్శించుకొని, క్రిందికి దిగి సాయిబాబా దర్శనం చేసుకుని మళ్ళీ పైకి వచ్చి పక్కనే ఉన్న మంటపంలో కూర్చుంది.

అప్పటికే అక్కడకి వచ్చిన భక్తులంతా గుంపులు గుంపులుగా కూర్చున్నారు. తూర్పు వైపునుంచి పెద్ద చంద్రబింబం ఉదయిస్తోంది... ఈరోజు పౌర్ణమి కదూ, అనుకుంది పరవశంగా ఆ బింబాన్ని చూస్తూ... ఒక ప్రక్కగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీద వాహనాలు, దాని అవతల నిశ్చలంగా హుసేన్ సాగర్, మధ్యలో నిలుచుని ఉన్న తథాగతుడు...

‘దైవ  దర్శనం కూడా అయిపోయింది... కానీ అతని జాడేదీ?’  అప్రయత్నంగా బాగ్ లోంచి కవర్ తీసి అందులో ఉన్న ఫోటో తీసి చూసింది. పేరు వేణు గోపాల్. ఈ ఊరి లోనే జాబ్ చేస్తున్నాడు. నాన్నా, అన్నయ్యా చూసిన సంబంధం ఇది... ఫార్మల్ గా పెళ్లి చూపులు అరేంజ్ చేస్తామంటే వద్దని, ఫ్రెండ్లీ గా కలుస్తామని అన్నాడట. నిన్న ఫోన్ చేసి విషయం చెప్పి, ఈరోజు ఇక్కడ కలుద్దామని అన్నాడు. గులాబీ రంగు చొక్కా వేసుకొని వస్తానని చెప్పాడు...తననూ గులాబీ రంగు చీరే కట్టుకోమని కోరాడు... చూడటానికి బాగానే ఉన్నాడు... మరి అన్నీ కలిసి వచ్చి, ఇతనితో జీవితం పంచుకుంటే ఎలా ఉండబోతుందో తన జీవితం? ఆలోచిస్తూనే కవర్ని బాగ్ లో పెట్టేసింది మధుబాల. చేతిలోని కొబ్బరిముక్క, పటికబెల్లం ప్రసాదాలు అయిపోయాయి... చేతికి అలదుకున్న చందనాన్ని ఆఘ్రాణించింది. చల్లగా, తేలికగా, హాయిగా అనిపించిందా పరిమళం.

“ఎక్స్ క్యూజ్ మీ... మీరే కదా మధుబాల?” ఎదురుగా నవ్వుతూ నిలుచున్నా యువకుడిని చూడగానే తత్తరపాటుగా లేవబోయింది మధుబాల.

“ఆ...ఆ... లేవకండి... నేనే కూర్చుంటాను...” అని ఆమె ఎదురుగా కూర్చున్నాడు. 

అప్రయత్నంగా ఆమె కనులు వాలిపోయాయి.

“దర్శనం చేసుకున్నారా?” నవ్వుతూ అడిగాడు...

“అయింది... మీరు?”

“ఆ, నేను కూడా... రెండు దర్శనాలు!” ప్రశ్నార్థకంగా చూస్తున్న ఆమెతో, “దైవ దర్శనం కన్నా దేవీ దర్శనమే బాగుందనుకోండి...” అన్నాడు కొంటెగా.

మళ్ళీ ఆమె బుగ్గలు ఆమె చీర రంగును సంతరించుకున్నాయి.

“మీరు... మీరు చాలా అందంగా ఉన్నారు మధు... సారీ మధుబాలా... ఈ చీరెలో గులాబీ బాలలా ఉన్నారు...”

“థాంక్స్ అండీ...” 

“మీ ఇంటి పరిస్థితులు అన్నీ మీ అన్నయ్య గిరి నాతో మాట్లాడారు. మా అమ్మకు మీరు బాగా నచ్చారు. మీకూ నేను నచ్చినట్టైతే ఇక పెళ్ళి ముహూర్తాలు పెట్టేసుకుందాం...” అన్నాడు నవ్వుతూ.

“మీ గురించీ అన్నయ్య చెప్పాడు... అందరు ఆడపిల్లల్లా పెళ్ళి కాగానే పుట్టింటితో బంధాన్ని తెంచుకోలేను నేను... అవసరమైనప్పుడు వారి బాధ్యతలనూ పంచుకోవాలి... అందుకు మీరు సహకరిస్తే...”

“బై ఆల్ మీన్స్... పెళ్ళి అయ్యాక మీ వాళ్ళూ నా వాళ్ళే కదా...”

“చాలండీ, అంత మాటన్నారు, అదే నాకు వేయి ఏనుగుల బలం ఇస్తోంది... మీతో జీవితాన్ని పంచుకోవటానికి నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు...” మెల్లగా చెప్పింది.

“నేను చాలా అదృష్టవంతుడినని మరో సారి ఋజువయ్యింది... చూడండి, మన జంటను చూసి చందమామ కూడా ఆనందంతో ఎలా వెలిగిపోతున్నాడో...” నవ్వాడు వేణు... 

“ఊ,ఊ, మీరు కవులన్న మాట!”

“అబ్బే, భావుకుడిని మాత్రమే...” అలా మొదలైన వారి మాటల ప్రవాహం మరో గంటన్నర వరకూ అంటే గుడి మూసేసే వరకూ కొనసాగింది. చౌకీ దార్ వచ్చి వెళ్లాలని చెబుతూ ఉంటే అయిష్టంగా అక్కడినుంచి లేచారు ఇద్దరూ... 

మెట్లు దిగేటప్పుడు ఆమెకు  తన చేయిని అందించాడు వేణు. ఆ చేతిని ఆనందంగా అందుకున్నది మధుబాల.

ఆ తొలి స్పర్శ ఇద్దరిలోనూ ఏదో అవ్యక్త భావావేశాన్నీ, అంతులేనంత ఆనందాన్నీ నింపేసింది.

***

“అంటే, నాకు చెప్పకుండానే సంబంధం స్థిరం చేసేసుకున్నారా అమ్మా?” తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది వినత. 

“అదేమిటే, పెళ్ళి చేసుకోవలసింది వాడు... వాడికి ఓకే అయితే ఇక మనకి ఏం అభ్యంతరాలుంటాయి చెప్పు?” అన్నది సుగుణమ్మ.

“ఇంకా నేనూ, అక్కయ్యా బ్రతికే ఉన్నామే... మమ్మల్ని పిలవనక్కరలేదా? పెళ్ళి అయ్యాక  ఆడపిల్లలంటే ఇంత చులకనేమిటే అమ్మా నీకూ?” వినత సీరియస్ గా అంది.

“చులకన ఏముందే? అదేమీ లేదు... ఇదిగో వదిన ఫోటోని చూడు...” అందించింది సుగుణమ్మ.

ఫోటోని చూస్తున్న వినత ముఖం మరింతగా క్రోధారుణిమ సంతరించుకుంది. మధుబాల ముఖం లో కనిపించే అందం, గ్రేస్ ఆమెలో అసూయను రగిలించాయి. 

“ఇంత అందంగా ఉంటే ఇక కాపురమేం చేస్తుందీ?” అంది సాగదీస్తూ...

“ఛీ, అవేం మాటలే వినతా? తప్పు కాదూ?? ఒకింటి ఆడపిల్లను, మనింటికి వస్తున్నా కోడలిని అలా అనొచ్చా? ఎప్పటికి ఎదుగుతావ్?” అంది మందలింపుగా...

“అబ్బో, ఇంకా కోడలు కాకముందే ఇంత వెనకేసుకు వస్తున్నావంటే? హమ్మో... మీరంతా ఆవిడ బుట్టలో పడిపోయారన్న మాట!” మూతి మూడు తిప్పులు తిప్పింది వినత.

“అవన్నీ అలా ఉంచు కానీ, మీ అత్తగారు ఎలా ఉన్నారే? ఆరోగ్యం బాగుందా?? నేనే రేపు రావాలని అనుకున్నాను ఆవిడని చూడటానికి...”

“అంతే అంతే... కూతుర్ని చూడటానికి కాదన్న మాట! ఆవిడ ఎలా ఉంటుందే? మోకాళ్ళ నొప్పులు, కదలలేదు ఎక్కడికీ... ఇంకా అదృష్టం ఏమిటంటే, మంచం పట్టలేదు... ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటూ ఉంటుంది. అయినా అమ్మా, నీకు ఆవిడ మీద కన్సర్న్ ఏమిటే?” 

“అదేమిటే, ఆవిడా నాలాటిదే కదా... అలా అనకూడదు... నీకు పెళ్ళి చేసి పంపినపుడు నాన్నగారూ, నేనూ ఏమని చెప్పాం? మామగారు ఎటూ లేరు... ఆడబిడ్డలు లేరు... నీ భర్త ఒక్కడే కొడుకు ఆవిడకి. అలాంటప్పుడు నువ్వు కాకపోతే ఆవిడని ఎవరు చూసుకుంటారమ్మా?  ఆవిడలో నన్ను చూసుకోవాలి... రేపు మీ వదినా అంతే కదా... నన్నూ, నాన్నగారినీ ఆ అమ్మాయే చూసుకుంటుంది. ఇక మా జీవితం అన్నయ్య దగ్గరే కదమ్మా?”

“ఆ... ఆ నీతి బోధలు చేసే నన్ను అక్కడికి పంపారు. మూడేళ్ళ బట్టీ నా బ్రతుకింతే... ఓ సరదానా, పాడా? ఆయనకీ ఎంత సేపూ తల్లి సేవే.... ఓ సినిమా లేదు, షికారు లేదూ...నాన్నకి చెప్పినా నన్నే అంటారు. నాన్నేరీ?  సరే కానీ, ఆకలేస్తోంది... ఏదైనా టిఫిన్ పెట్టవే...”

“అదే ప్రయత్నంలో ఉన్నానే, వేడిగా దోసెలు వేసిద్దామని! నాన్నగారు బయటికి వెళ్ళారు, ఇంకా రాలేదు.”

“త్వరగా వెయ్యి, ఎంత సేపు వెయిట్ చేయాలి?”

“మా అత్తగారి చేతుల్లో నేను నరకాన్ని చూసానే, ఆవిడ చనిపోయినా నీ రూపంలో వదలకుండా ఇలా సాధిస్తోంది...” నవ్వుతూ అన్నది సుగుణమ్మ...

“అసలు నువ్వు నా తల్లివేనా అమ్మా?” సాగదీస్తూ, న్యూస్ పేపర్ మడత విప్పింది వినత.

***

వేణుగోపాల్ అక్కయ్య సురేఖకు మధుబాల నచ్చింది. ఆమె వినతలా కాక కొంచెం పెద్దరికంగా, సాత్వికంగానే ఉంటుంది. పెళ్ళి అయి ఇద్దరు పిల్లల తల్లి అయ్యాక మరింత పెద్దరికం వచ్చింది ఆమెకు. తన కుటుంబంతో బెంగుళూరులో ఉంటుంది ఆమె. 

వినత స్వభావం కొద్దీ చాలా దురుసు మనిషే కాక పక్కా స్వార్థ పరురాలు. వేణు అలాంటి వాడు కాకపోయినా చెల్లెలంటే ఉన్న ఇష్టం కొద్దీ ఆమె ఇష్టాలన్నీ మన్నిస్తూ ఉంటాడు. ఆమె మీద ఈగనైనా వాలనీయడు. ఒకరకంగా చెల్లెలంటే ఆరో ప్రాణం అతనికి. 

అలాంటి అన్నయ్య తనను సంప్రదించకుండా మధుబాలను సెలెక్ట్ చేసేసుకుని, సంబంధం నిశ్చయం చేసేసుకున్నాడంటే వినతకు కొరుకుడు పడటం లేదు.  అందుకే అతన్ని అలిగి సాధించాలని కంకణం కట్టుకుని మరీ పుట్టింటికి వచ్చింది. 

ఆ సాయంత్రం వేణూ ఆఫీసు నుంచి రాగానే తగువేసుకుంది. తానంటే అసలు ప్రేమ లేదంది. ‘తన అభిప్రాయానికి విలువేదీ?’ అని ప్రశ్నించింది. “చదువుకున్న, అందమైన అమ్మాయిని చేసుకుంటే వాళ్ళు మాట వినరూ’ అని హెచ్చరించింది. ‘అసలు ఆమె తమ అంతస్తు కి తగదూ’ అని చెప్పింది. అన్నీ విని కూల్ గా నవ్వేసాడు వేణు.

“వినతా, నీ ఇష్టం లేకుండా ఏదీ జరగదురా... కానీ మరి నీ అన్నయ్య సంతోషంగా ఉండటం నీకిష్టమా కాదా చెప్పు? ఎందుకో తెలియదు కానీ, మధుబాల నాకు బాగా నచ్చిందిరా... ఆమె మనలో బాగా కలిసిపోతుందని అనిపించింది.  మధ్యతరగతి కుటుంబంలోని అమ్మాయి కాకుండా అంతస్తు ఎక్కువైన కొద్దీ ఆ వచ్చే అమ్మాయి నిన్నూ, అక్కయ్యనూ ఆదరించకపోతే? అనిపించింది... మధుబాల ఇద్దరు  అక్కలకూ, ఒక అన్నయ్యకూ చెల్లెలు... ఆమె తన నాయనమ్మను కూడా ఎంతో ఆదరంగా చూసుకుంటుందిట. వాళ్ళన్నయ్య చెప్పాడు. స్వభావ రీత్యా సాత్వికురాలు... అలాంటి అమ్మాయి నీకు వదినగా వస్తే పుట్టింట్లో మీ ఇద్దరి స్థానం పదిలం... పెట్టుపోతలు ఎప్పటికీ ఘనతరం... ఇవన్నీ ఆలోచించే ఆ అమ్మాయిని ఓకే చేసాను...అదీ గాక, అమ్మను, నాన్నగారినీ కూడా బాగా ఆకట్టుకుంది ఆ అమ్మాయి...” అని కన్విన్స్ చేసేసాడు.

ఇక ఏమీ అనలేక మౌనం వహించింది వినత.

కూతురి దుడుకుతనానికి మనసులోనే బాధపడ్డారు సుగుణమ్మ, ఆమె భర్త గోవర్ధనరావూ...

***

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali