Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Chinta Chuguru Pachadi

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటిఫణిబాబు

 

 ఇదివరకటి రోజుల్లో, వార్తల్లోకి రావడమంటే అంత సుళువుగా ఉండేది కాదు. ప్రసార మాధ్యమాలు కూడా అంతంతే. ఏదో పెద్ద  పెద్ద నగరాల్లో తప్పించి, చిన్న పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ జరిగిన సంఘటనల గురించి ఎంతమాత్రమూ తెలిసేది కాదు. ఆరోజుల్లో, రేడియో, వార్తాపత్రికలూ మాత్రమే  ప్రసార మాధ్యమాలుగా ఉండేవి. ప్రముఖ పత్రికలకి  కొంతమంది, విలేఖరులుగా ఉండి, తనుండే స్థలమూ, ఆ చుట్టుపక్కల ఏదైనా చెప్పుకోదగ్గ సంఘటనా జరిగినప్పుడు,  ఆ సమాచారాన్ని తను ప్రాతినిధ్యం వహిస్తూన్న పత్రిక కి పంపేవాదు. ఆ పత్రికకి ఆరోజు ప్రచురించే ఖాళీ ఉండకపోతే, ఇంకోరోజెప్పుడో ప్రచురించేవారు. అంతా దైవాధీనం.. ఏదో మొత్తానికి అరా కొరా వార్తలు తెలిసేవి.. ఇంక రేడియో అంటారా, ప్రాంతీయ వార్తలు , జాతీయ ప్రసారాల్లో వినిపించేవే కాదు. కాలక్రమేణా, ప్రాంతీయ ప్రసారాలు ప్రారంభించాక ఆ లోటు కాస్తా తీరింది.



ఒకలా చూసుకుంటే, ఇదివరకటిరోజుల్లో, ఏ విషయం గురించీ అంతగా తెలిసేది కాదు. దానివలన ఏదో పెద్ద నష్టమూ కలిగేది కాదు. ఒకలా చూసుకుంటే  Ignorance is bliss  అన్నట్టు, అసలు తెలియకపోతే పాపమనే ప్రశ్నేలేదు కదూ?

కానీ ఈరోజుల్లో చూడండి, ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా క్షణాల్లో తెలుస్తోంది. అది మంచిదే. కానీ, ఆ తెలియడమనేది కొంచం డోసు ఎక్కువైనట్టు కనిపిస్తోంది. ఎక్కడ ఏం జరిగినా, టీవీవాళ్ళు వారి కెమెరాలతో ప్రత్యక్షం. దీనివలన లాభం కంటే నష్టమే ఎక్కువ అవుతోంది. ప్రతీదానినీ , కోర్టులకెళ్ళే ముందరే మీడియాలో చర్చ జరిపేసి, ఎవరికివాళ్ళే ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఎంత ప్రభావం ఉండకూడదన్నా, మన న్యాయాధీశులు  ఈ చర్చలతో ప్రభావితం అవుతున్నారనడంలో సందేహం లేదు. పైగా ఈ మీడియావారుకూడా, కొన్ని సందర్భాల్లో బాధ్యతారహితంగా కూడా ప్రవర్తిస్తూంటారు. ఉదాహరణకి అప్పుడెప్పుడో ముంబైలో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు, ప్రత్యక్షప్రసారాలు చేయడం. చివరకి ప్రభుత్వం ఆదేశాలిచ్చిన తరువాత ఆపేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది..

ఈ రోజుల్లో ప్రతీవారికీ ఓ విషయం తెలిసింది—ఎలాగోలాగ వాళ్ళు చేసే పని, అది మంచిదవనీయండి, లేక చెడ్డదవనీయండి, మీడియా ముందర చేస్తే, ఎక్కడలేని, popularity  సంపాదించేయొచ్చు. దానితో, ఏదో సెల్ టవర్ ఎక్కి దూకేస్తానని బెదిరించేవాడి దగ్గరనుండి, చెడిన కాపరం చక్కబెట్టుకోడానికి భార్య చేసే ధర్నా దాకా, అన్నీ టీవీల్లో చూడాల్సిన దౌర్భాగ్యానికి చేరింది పరిస్థితి. దీనివలన జరుగుతోందేమిటంటే, ప్రతీవారూ కొత్త కొత్త పధ్ధతులు నేర్చుకుంటున్నారు. ఇది సమాజానికి లాభమా, నష్టమా అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. నాకోవిషయం అర్ధం అవదు—ఏదైనా సంఘటన జరిగినప్పుడు, క్షణాల్లో మన మీడియా వారు , ఎలావచ్చేస్తారూ అన్నది, చేసేముందర ఫోను చేసి రమ్మంటారా లేక యాదృఛ్ఛికమా?

అలాగే రాష్ట్ర శాసనసభల్లోనూ, పార్లమెంటులోనూ మన గౌరవనీయ సభ్యులు చేసే అల్లరి దేశం అంతటికీ చూపాల్సిన అవసరమేమిటో అర్ధం అవదు. పదవిలో ఉన్న అయిదేళ్ళూ, వాళ్ళు ఉధ్ధరించేది ఏమీలేదని అందరికీ తెలుసు, కానీ వారి ప్రవర్తన కూడా చూపించి, ఏం సాధించాలనుకుంటున్నారో తెలియదు. భావితరాల వారికి  ఇవన్నీ  dress reharsels  గా ఉపయోగించాలనేమో ? లేక, సినిమాలకి ఓ అర్ధవంతమైన కథావస్తువు కరువైన ఈరోజుల్లో, ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించడమైనా కావొచ్చు..   ఈరోజుల్లో ఏ సినిమా చూసినా, ఒకటే theme—జరిగే ప్రతీ దుర్మార్గం వెనుకా, ఓ రాజకీయనాయకుడి హస్తం ఉన్నట్టే చూపిస్తారు. బహుశా, అందరూ అలాటివారే కాకపోవచ్చు. కానీ మన సినిమాలు చూస్తే, దేశంలోని ఏ రాజకీయనాయకుడినీ నమ్మే పరిస్థితిలో లేము. మన మీడియాకీ, సినిమావాళ్ళకీ , రాజకీయనాయకులమీద నమ్మకమే లేనప్పుడు, ప్రజలు మాత్రం నమ్మాల్సిన అవసరం ఏమిటీ?

టీవీల్లో వివిధ భాషల్లో వచ్చే ధారావాహికలైతే,  అడగక్కర్లేదు. ఇదివరకు దూర్ దర్శన్ లో, కనీసం ఓ వంద ఎపిసోడ్లకి పూర్తయేవి. ఈనాటి సీరియళ్ళకి అలాటి నిర్భంధం ఏమీ లేదు. అవేవో  TRP  ల పేరుచెప్పి, ప్రేక్షకుల కోరికా అని  నమ్మించి, అర్ధం పర్ధం లేకుండా ఆ ధారావాహికలని పెంచుకుంటూ పోవడం. ఇదివరకటిరోజుల్లో నాటకాలు నాలుగైదు గంటలు సాగేవి కాబట్టి, ఒకటో కృషుడూ, రెండో కృష్ణుడూ అని ఉండేవారు. అలాగే ఈరోజుల్లోకూడా, ఆ ధారావాహిక పూర్తయే లోపల , ఆ పాత్రధారుల్ని ఎడా పెడా మార్చేయడం. ఎందుకొచ్చిన హింసా ఇదంతా, హాయిగా ఏ వంద ఎపిసోడ్లకో ఆపేసి ప్రేక్షకులని కూడా సుఖపెట్టొచ్చుగా…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
navvunaaluguyugaalu