Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
visheshalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

రాజస్థాన్ అందాలు చూద్దాం రారండి ( పదవ భాగం) - కర్రా నాగలక్ష్మి

                                                                                     ఉదయపూర్--2
రాత్రి హోటల్ లో భోజనానికి వెళ్లి నప్పుడు అక్కడ ఉదయ పూర్ దగ్గర చూడదగ్గ ప్రదేశాలను గురించి ఆరా తీయగా తెలిసిన విషయం యేమిటంటే రానక్ పూర్ జైన మందిరం , నాథ్ ద్వార్ తప్పక చూడాలని అన్నారు . కుంభాల్ గఢ్ మాకు ముందే తెలుసు కాబట్టి ఈ మూడు చూసుకుందామని నిర్ణయించుకున్నాం .    పొద్దున్నే ఫలహారాలు కానిచ్చి రానక్ పూర్ బయలుదేరేం .

1) రానక్ పూర్ జైన్ దేవాలయాలు ---

ఉదయ పూర్ కి 91 కిలో మీటర్ల దూరంలో ' పాలి ' జిల్లాలో ' దేసూరి ' తాలూకాలో ' సద్రి ' అనే గ్రామానికి దగ్గరగా వున్నాయి . 15 వ శతాబ్దం లో ' ఆధినాథునుకి సమర్పించిన యీ మందిరాలు ' ధనషా ' అనే వ్యాపారి చే నిర్మాణం చేపట్ట బడి అనంతరం రాణా కుంభ సహాయ సహకారాలతో పూర్తి చేయబడ్డాయి . అందుకే ' రాణా పూర్ ' మందిరాలుగా పేరుపొంది కాలక్రమేణా రాణక్ పూర్ గా రూపాంతరం చెందేయి . 

 సోమ సౌభాగ్య కావ్య " ప్రకారం ' ధనషా ' కి ఆధినాథు డు స్వప్నం లో కనిపించి మందిర నిర్మాణం చేపట్ట మన్నట్టుగా గ్రంధస్థం చెయ్యబడింది .

ఈ మందిరం లో ప్రయోగించిన శిల్పకళని మరు-గుర్జర శిల్పకళ అని అంటారు . ఈ మందిరం లో ని అతి సున్నితమైన పనితనం కనిపిస్తుంది మరు-గుర్జర శిల్ప కళ ని రెండుగా విభజించేరు . అవి మహామరు , మరు గుర్జర . మరు గుర్జర గుర్జరదేశ - అర్బుద , గుర్జరదేశ-అంతర , గుజరాత్ లన నుండి వుద్బవించినట్లుగా చెప్తారు . సాధారణంగా యీ శిల్పకళ ని దేశ పశ్చిమ భాగాలలో వున్న మందిరాలలో కనిపిస్తుంది 

ఈ  మందిరాలు లేత గులాబీ రంగు పాలరాతి నిర్మాణాలు . 62క్ష్60 మీటర్ల విస్తీర్ణం లో కట్టబడిన మందిరాలు . శిల్ప కళ యింతవరకు చూసిన జైనమందిరాలను తలదన్నేట్టుగా వుంటుంది . తోరణాలు , పై కప్పులు , స్థంబాలు ఒక దానిని పోలి మరొకటి వుండవు . అయితే ఈ మందిరంలో ముఖ్యంగా చూడవలసినవి కల్పవృక్షం , నవద్వీపం , జైన తీర్థంకరులు , 108 తలల నాగేంద్రుడు . ఈ నాగేంద్రుని తోక యెక్కడ మొదలైంది యెక్కడ అంతమయింది చెప్పలేనంతగా పెనవేసుకున్నట్లు చెక్కారు . నాగేంద్రుని యేవైపునుంచి చూస్తే నాగేంద్రుడు అటే చూస్తున్న అనుభూతి కలిగేటట్ల చెక్కేరు . మాటలలో వర్ణించడం కష్టమే . ఈ మందిరంలో మరో ఆకర్షణ యిక్కడ వున్న 1444 పాలరాతి స్థంబాలు , ఒక్కొక్క స్థంబం మీదా ఒక్కోరకమైన శిల్పాలు చూసి తీరాలిగాని వర్ణించలేము . వీటిని లెక్కించడం చాలా కష్టమైనదని అంటారు  . 

గర్భ గుడిలో తెల్లపాలరాతితో మలచబడ్డ విశాలమైన ఆధినాథుని విగ్రహాన్ని చూడొచ్చు .

ఈ మందిర నిర్మాణం క్రీస్తుశకం 1437 లో మొదలు పెట్టి 1458 లో పూర్తి చేసినట్లు గా యిక్కడ రాగి రేకు పై లిఖించి మందిరంలో భద్ర పరిచేరు .

ఈ మందిర ప్రాంగణం బయట మరో మూడు చిన్న మందిరాలు వున్నాయి . ఒకటి శివ మందిరము , మరొకటి సూర్య మందిరము వున్నాయి .

పచ్చని అడవులు యెత్తైన కొండల మద్య వున్న ఈ మందిరాలు జీవితం లో ఒక్కసారైనా దర్శించుకోవలసినవి . 

మధ్యాహ్నం భోజనాలు చేసుకొని కుంభాల్ గఢ్ వైపు ప్రయాణమయేం .

2) కుంభాల్ గఢ్ ---

15 వ శతాబ్దం లో మహారాణా కుంభ చే నిర్మించబడ్డ కోట . మహరాణా కుంభ సామ్రాజ్యం ' రత్తంబోరు నుంచి గ్వాలియర్ ' వరకు విస్మరించి వుండేది . అందులో మొత్తం 84 కోటలు రాణా కుంభ ఆధీనంలో వుండేవి , వాటిలో 32 కోటలను రాణా కుంభ కట్టించేడు .

ఈ కోటను అతి పటిష్టమైన కోటగానూ మరియు అతి విశాలమైన కోటగానూ అభివర్ణిస్తారు చరిత్రకారులు . సముద్ర మట్టానికి 3600 అడుగుల యెత్తులో పర్వతాలపైన కట్టబడిన కోట . దీని చుట్టూ వున్న దుర్బేధ్యమైన గోడ 32 కిలో మీటర్ల పొడవుండి ప్రపంచంలో రెండో అతి పొడవైన గోడగా ప్రసిధ్ది చెందింది . ఈగోడ వెడల్పు 15 అడుగులు . ఈ కోట లో రాజభవనాలు రాణీ వాసాలు లాంటివి అన్నీ వున్నాయి ఈ కోట లోపల మొత్తం 360 మందిరాలు వున్నాయి , అందులో 300 జైన మందిరాలు కాగా మిగతావి హిందూ మందిరాలు . ఈ కోట పైనుంచి చూస్తే ఒక పక్క ఆరావళీ పర్వత శ్రేణులు , మరో పక్క థార్ యెడారి యిసుక తిన్నెలను చూడొచ్చు . 

ఈ కోట నిర్మాణం గురించి చిన్నకథ ప్రచారం లో వుంది . 

అదేమిటంటే కోట గోడ కట్టేటప్పుడు ఓ వైపు గోడ యెన్ని మార్లు కట్టినా పడిపోతూ వుంటుంది , అప్పుడు ఒక ముని రాజు దగ్గరకు వచ్చి ఆ గోడ నిలబడాలంటే నరబలి యివ్వాలని , అది కూడా ఆ వ్యక్తి పూర్తి అంగీకారంతోనే జరగాలని చెప్తాడు , ఎన్ని కానుకలను యివ్వజూపినా యెవ్వరూ ముందుకు రారు . అప్పుడు ఆ ముని తానే బలి కి సిధ్ద పడి మొండెం పడ్డ చోట గోడ కట్టమని శిరస్సు పడ్డ చోట మందిరం నిర్మించ మని చెప్తాడు .కోట ముఖ్యద్వారమైన హనుమాన్ పోల్ దగ్గర అతని గౌరవార్ధం నిర్మింపబడిన చిన్న మందిరాన్ని చూడొచ్చు . చిన్ననాట నుండి రాజపుతృల సాహస సౌర్యాలను ప్రదర్శించి సముద్రమంతటి మొఘల్ సేనలతో అనేక సార్లు వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన మహరాణా ప్రతాప్ ఈ కోటలోనే జన్మించేడు .

ఈ కోట ఒకే ఒక్కసారి ఆక్రమణకు గురైంది , గుజరాత్ నుంచి మీర్జాలు , అక్బరు సేనలు యేక కాలంలో దండెత్తి రావడంతో రాణా ఉదయ సింగ్ ఉదయ పూర్ లో తలదాచుకొని చాలా కొద్ది కాలం లోనే తిరిగి యీ కోటను స్వాధీన పరచుకున్నాడు .

19 వ శతాబ్దం వరకు యీ కోట రాజపరివార నివాసం గా కొనసాగింది . 

ప్రతీ రోజు సాయంత్రం కొద్ది సమయం యీ కోటంతటా దీపాలు వెలిగించడం ఆనవాయితీగా కొనసాగుతోంది .

రాజస్థాన్ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం యిక్కడ మూడురోజులు ఉత్సవాలను నిర్వహిస్తారు అందులో రాజస్థానీ తలపాగా చుట్టుకొనే స్పర్ధ వుండడం అందులో విదేశీయులు యెక్కువ సంఖ్యలో పాల్గొనడం జరుగుతూ వుంటుంది .

2013 వ సంవత్సరంలో ఊణేశ్ఛో వారిచే వొర్ల్ద్ హెరితగె సితె గా గుర్తింపు పొంది సంరక్షింప బడుతోంది .

3)నాధ్ ద్వార్-----

రాజస్థాన్ లో రాజసమండ్ జిల్లాలో , ఆరావళీ పర్వతాలలో ' బనస్ ' నదీతీరాన వున్న చిన్న పట్టణం నాధ్ ద్వార్ .

ఈ పట్టణానికి  ' శ్రీనాథ్ జీ ' మందిరం కారణం గానే ఆ పేరు వచ్చింది . స్థానికులు దీనిని మందిరం అని అనరు ' శ్రీనాథ్ జీ కి హవేలీ ' అని అంటారు .

ఇక్కడ మందిరం రాజభవనాన్ని తలపిస్తూ విశాలమైన గదులు వరండాలతో వుంటుంది . రోజు లో చాలా కొద్ది సమయం మాత్రమే భక్తుల దర్శనార్థం భగవంతునికి యెదురుగా కట్టిన పరదా తొలగించుతారు . మిగతా సమయం అంతా పరదా వేసే వుంచుతారు . ఇక్కడ విష్ణుమూర్తి కృష్ణావతారం లో యశోదాదేవి బిడ్డగా యేడు సంవత్సరాల వయసు బాలుని అవతారంలో పూజలందుకుంటున్నాడు .

కారు పార్కింగులో కారు దిగి జనసమర్దమైన బజారులో నడుస్తూ ముందుకి వెళుతూ వుంటే యిరువైపులా వున్న దుకాణాలవైపు మందిరం తెరవడానికి చాలా సమయం అంటే వో గంట వుందని అక్కడి చేతి తయారీ వస్తువలు కొనమని మమ్మల్ని పిలువసాగేరు . యెలాగూ కోవెల తెరవడానికి చాలా సమయం వుండడం తో అక్కడ అమ్ముతున్న వస్తువులను చూసేం . అన్నీ బాలకృష్ణుని అలంకరణ సామానులే , యిత్తడి తో చేసిన బంగురుతున్న చిన్ని కృష్ణుని విగ్రహాలు . మేమూ పోటాపోటీలుగా వాటిని కొన్నాం . కొన్ని చిత్ర పటాలమ్మే దుకాణాలు వుండడం తో అది అక్కడి స్థానిక చిత్ర కళ అయివుంటుందని భావించి ఆ దుకాణం యజమానిని ఆ చిత్రకళ గురించి అడిగేం . ఆ చిత్ర కళ ని ' పిఛ్వీ ' అంటారు . అందులో కాయగూరలు , పండ్ల నుంచి తయారు చేసిన రంగుల వుపయోగిస్తారు . మధ్యలో నల్లని కృష్ణుడు గోవర్ధనగిరిని పై కెత్తుతున్నట్టుగా బొమ్మ వుండి దాని చుట్టూ రకరకాలైన డిజైనులు గీస్తారు . కృష్ణుని బొమ్మ లేకుండా యీ పెయింటింగు పూర్తికాదు . చాలా అందంగా వున్నాయి . మేము కొనాలని బేరంమొదలు పెట్టేసరికి కోవెల తలుపులు తెరుస్తున్నట్లు మైకులో అనౌన్స్ చేసేరు . షాపులవాళ్లే తొందర పెట్టసాగేరు . ఎందుకంటే పది నిముషాల తరువాత మందిరం మూసేస్తారుట . పరుగెట్టి వెళ్లండి లేకపోతే మూసేస్తారు అంటే పరుగుపరుగున మందిరం చేరుకున్నాం . ఓ మాదిరి చిన్న సైజు రాజుగారికి కోటలా వుంది మందిరం . వేల సంఖ్యలో భక్తులు మందిర ద్వారం దగ్గర చేరేరు . తోపిడి మొదలయింది . తలుపులు తెరిచేక పెద్దహోలులోకి ప్రవేశంచేం . హాలులో అందరినీ కూర్చోపెట్టేరు . పరదా వేసేవుంది లోపల దేవునికి యేవేవో సేవలు చేస్తున్నారు . బయట భక్తుల భజన సాగుతోంది . ఒక్కసారి భజన వూపందుకుంది . బుజాలు బజంత్రీలు , గంటలు పెద్దగా మ్రోగేయి . ప్రధానపూజారి పరదా తొలగించేరు .

తోపడి మొదలయింది , జనం యెటు నెడితే అటు వెళ్లేం , యెదురుగా చూస్తే ఇహాన్ని మరపింపజేసే దివ్య మంగళ స్వరూపం , యెంతసేపు చూసినా తనివి తీరని ముద్దుల చిన్ని కృష్ణుని  ప్రతిమ ముద్దులు మూటగడుతూ దర్శనమిచ్చింది . ఆ అలంకరణ యెంత శ్రద్దగా చేసేరో కదా ! అని అనిపించింది . 

రత్నాలు , వజ్రాలు , మణులు పొదగబడిన హారాలు , కడియాలు , బాజూబందులు , గాజులు , కిరీటాలు ఒకటేమిటి యెన్ని రకాలయిన నగలు వుంటాయో అన్నిటినీ. అలంకరించబడి వున్నాడు చిన్ని కృష్ణుడు . ప్రతీ రోజూ వేరే వేరే అలంకారాలలో వుంటాడని అంటారు . అంటే యేడు వారాల నగలు వున్నాయట . ఈ నగలు ద్వాపరయుగం నాటివని భక్తునమ్మకం , చరిత్ర కారులు  ఈ నగలు మొఘలుల కాలం కంటె ముందువి గా గుర్తించేరు .

నల్లని కృష్ణ విగ్రహానికి చుబుకం దగ్గర నిమ్మకాయంత మణి మిలమిల మెరుస్తూ వుంటుంది . చీకటిలో దీపంవంటి కాంతి నిచ్చే యీ మణి వెలకట్టలేనిదిగా చెప్తారు . ఇలాంటిదే తమిళనాడులో కన్యాకుమారి ముక్కు పుడకలో వున్నది చూసేం . ఆంగ్లేయుల కాలంలో నావికులకు లైట్ హౌసు కాంతిగా భ్రమింప జేసేదని అమ్మవారి మందిరానికి సముద్రము  వైపున వున్న ద్వారాన్ని మూసివేసినట్లుగా చెప్తారు . అయితే శ్రీనాథ్ జీ చుబుకానికి వున్నది అంతకంటే బాగా పెద్దది . బంగారు జరీతో నేసిన పట్టువస్తాలు అలంకరించి , కుడి చేత్తో గోవర్ధనగిరిని యెత్తుతున్నట్లు , యెడమచేయి పిడికిలి బిగించి నడుమునకు అన్చినట్టుగా వుంటుంది విగ్రహం .

గోవర్ధనగిరిని యెత్తినప్పుటి రూపం కాబట్టి అప్పుడు కృష్ణుని వయస్సు యేడు సంవత్సరాలు కాబట్టి యేడు సంవత్సరాల బాలుని తల్లి యే విధంగా ముద్దుచేస్తుందో అదే విధంగా యిక్కడ పూజాది కార్యక్రమాలు రూపొందించారు . రోజులో యెనిమిది దర్శనాలు 10 , 15 నిముషాలకు మించకుండా వుంటాయి మిగతా సమయంలో పరదా వేసే వుంచుతారు . మొదటది మంగళ దర్శనము సూర్యోదయానికి ముందు పాలు ఫలహార నైవేద్యం అయిన తరవాత దర్శనం . ఈ దర్శనం యెంతో పవిత్రమైనదిగా భావిస్తారు . తరవాత శృంగార దర్శనం , అభిషేకారానంతరం యశోద చిన్ని కృష్ణుని యెంతో శ్రద్దగా అన్ని నగలతో అలంకరించి కడుపారా పాలు ఫలహారాలను తినిపించేదట . అలంకార సేవ తరువాత పాలు ఫలహారాల నైవేద్యం తరువాత భక్తులకు దర్శనం యిస్తారు . తరువాత ' గ్వాల్ ' దర్శనం పదకొండు గంటల సమయంలో గోపాలురతో ఆడుకునేందుకు పంపేదట . ఆటకు వెళ్లే తొందరలో వుంటాడు కాబట్టి పది నిముషాల దర్శనమే వుంటుంది . యశోదా తనయుడు ఆడుకోడానికి వెళ్లిపోయేడు కాబట్టి గర్భ గుడిని మూసేస్తారు .

మద్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆట నుంచి తిరిగి వచ్చిన తనయునికి యశోద స్నాదికాలు కానిచ్చి మంచి బుద్దులు చెపుతూ పంచభక్ష పరమాన్నాలతో , పానీయాలతో కొసరి కొసరి భోజనం తినిపించేదట .ఆ సమయంలో  సహశ్రనామార్చన తులసి దళాలతో గావించి అన్ని రకాలయిన పిండివంటలతో కూడిన నైవేద్యం సమర్పిస్తారు దీనిని ' రాజభోగ్ ' అని అంటారు . అనంతరం భక్తులకు ధర్శనం కలిగిస్తారు . దానితరువాత స్వామి ని కొత్త పూలతో అలంకరించి చల్లదనం కోసం తామరపూలతో విగ్రహాన్ని అలంకరిస్తారు . ఆ సమయం లో స్వామి తల్లి కోరిక మేరకు నందాలయం లోనే కాస్త సేపు ' పచ్చీసు ' ఆడుతూ విశ్రాంతి తీసుకుంటాడు .

విశ్రాంతి అనంతరం పాలు , కరకరలాడే ( అంటే స్నేక్ అన్నమాట) పదార్ధాలు నివేదిస్తారు . అప్పుడు ఒకసారి దర్శనం కలుగ జేస్తారు . తరవాత యశోద అనుజ్ఞ తో భగవానుడు గోపాలుల దగ్గరకు వెళ్లి వారితో పాటుగా గోవులను తోలుకొని వస్తాడు . ఆ సమయంలో స్వామికి పాలు ఫలహారాలతో నివేదిన జరుపుతారు . అనంతరం సాయంత్రపు అభిషేకాదులు నిర్వహించి , అలంకరణ చేసి రాత్రి నైవేద్యం ' రాజ భోగ్ ' లాగే చేస్తారు . కాస్త తక్కువ పదార్ధాలు వుంటాయి . అప్పుడు దర్శనం వుంటుంది .

ఈ మందిరం లో ఆఖరు దర్శనం శయన హారతి దర్శనం , దాని తరువాత స్వామిని వుయ్యాలలో వేసి  జోలలు పాడి నిద్ర పుచ్చుతారు . ప్రతీ నైవేద్యానంతరం హారతి వుంటుంది , హారతి తరువాతే భక్తుల దర్శనార్థం పరదా తొలగిస్తారు . ప్రతీ హారతి సమయం ఊరంతా పెట్టిన మైకులలో అనౌన్స్ చేస్తూ వుంటారు .

రాత్రి సమయంలో కృష్ణుడు యశోదామాత నిద్రించిన తరువాత గోపికలతో రాసలీలలాడడానికి యమునాతీరానికి పరుగెత్తే వాడట . కృష్ణుని మనస్సు యిప్పటికీ యమునాతీరానికి వెళ్లి గోపికలతో రాసలీల ఆడుతుందని , రాత్రి సమయంలో కృష్ణుడు ఈ మందిరం లో వుండడని యిక్కడివారి నమ్మకం . 

కృష్ణుడు సజీవంగా ఈ మందిరం లో తిరుగుతున్నట్లుగా వైష్ణవుల విశ్వాసం . తిరుపతి లో తలనీలాలు యిస్తాం అని మొక్కుకున్నట్లు యిక్కడ రాసలీల చేయిస్తానని భక్తులు మొక్కుకుంటారు .

ఈ కోవెలని శ్రీనాథ్ జీ కి ' హవేలీ ' అని అంటారు . పేరుకు తగ్గట్టుగానే ఈ మందిరం విశాల మైన వరండాలతోనూ గదులల తోనూ వుంటుంది . ఇక్కడి గదులు దూద్ ఘర్ ( పాల గది ) , ఫూల్ ఘర్ ( పూలగది) , పాన్ ఘర్ ( తాంబూలం గది ) , రసోయి ఘర్ (వంటగది) , మిశ్రిఘర్ ( పటిక పంచదార గది) , గెహనాఘర్ ( ఆభరణాలగది) , ఖర్చా భండార్ ( ఆఫీసు అనుకోవచ్చు) , అశ్వశాల , బైటక్ ( డ్రాయింగురూము) అనే పేర్లతో పిలుస్తారు . గర్భగుడికి యెడమ వైపున వున్న గదిలో వెండి బంగారాలతో చేసిన తిరగలి వుంటుంది . దీంతో పూర్వం స్వామికి చేసే నైవేద్యాలకు కావలసిన పిండిని తయారుచేసేవారట .

ఈ కోవెలలో అన్ని విధులు పుష్టి మార్గం , లేదా శుద్దఅద్వైత సాంప్రదాయాన్ని అనుసరించి నిర్వహింపబడతాయి . దీనిని వల్లభ సాంప్రదాయం అని కూడా అంటారు .

శ్రీనాథ్ జీని ' దేవదమన ' అని స్తుతించడం జరుగుతూ వుంటుంది . దీనికి కారణం యేమిటంటే దేవతల రాజైన ఇంద్రుడిని ఓడించి గోవర్ధనగిరిని చిటికెన వ్రేలుతో యెత్తి యదుకులాన్ని రక్షించినందుకు .

ఈ విగ్రహం గురించి ఓ కథ ప్రచారంలో వుంది . కంసుని సంహరించి ' ఉగ్రసేనుని ' మథుర దేశానికి రాజుగా చేసి ద్వారకకు తరలిపోతారు బలరామకృష్ణులు . బాలకృష్ణుని రూపం తాతగారైన ఉగ్రసేన మహారాజు మరువలేక శిల్పులను అదే రూపాన్ని మలచమని ఆదేశిస్తారు , శిల్పులు యెంత ప్రయత్నించినా మోహనరూపుని మలచలేక దిగాలుపడి వుండగా ఒకరాత్రి విగ్రహం యెవరూ చెక్కకుండానే రూపుదిద్దుకుంటుంది . ఆ విగ్రహాన్ని చూసిన ఉగ్రసేనమహారాజు సంతోషించి దేవకి వసుదేవులను బందీలుగా వుంచిన శ్రీకృష్ణ జన్మస్థలంలో  ప్రతిష్టింపజేసి వెలలేని మణులు మాణిక్యాలు , బంగారునగలతో అలంకరించి పూజించుకొనే వాడు .  కాలాంతరంలో ఈ విగ్రహం మరుగున పడిపోయింది . 

15 వ శతాబ్దం లో వల్లభాచార్యనికి కలలో కనిపించి తన వునికిని యెరుక పరచేడట భగవంతుడు . విగ్రహాన్ని వెతుకుతూ వచ్చిన వల్లభునికి గోవర్ధనగిరి దగ్గర దొరికిన విగ్రహాన్ని ' నందగావ్ ' లోని నందుని కోటలో ప్రతిష్టించేరు , అతని తదనంతరం అతని పుతృడు విఠలునాథ్ శ్రీనాథ్ జీ పూజ బాధ్యత వహించేడు . అలా అర్చకత్వం  వల్లభాచార్యుల సంతతికి వంశపారంపర్యంగా వస్తోంది . 

1672 లో ఔరంగజేబు ఆద్వర్యంలో మొఘల్ సేనలు శ్రీనాధుడి నగలు కొల్లగొట్టడానికి వస్తే ప్రధాన పూజారి ఈ విగ్రహాన్ని యమునానదిని దాటించి ఆరునెలల కాలం ఆగ్రా లో తలదాచుకొని విగ్రహాన్ని మహారాజా ఉదయ సింగ్ కి వొప్పజెప్పాలని రహస్యముగా తీసుకొని వెళుతూ వుండగా ఒక ప్రదేశంలో బండి చక్రం బురదలో కూర్చుకొని పోయి యెన్ని ప్రయత్నములు చేసినా కదలక బండి నిలచిపోతుంది . పూజారి ఆ ప్రదేశం లో భగవంతుడు నివసించదలిచేడని భావించి అక్కడే మందిర నిర్మాణం చేయ నిశ్చయించుకుంటాడు .

మందిర నిర్మాణం  పూర్తయే వరకు రాజుగారి హవేలీలో వుంచి నిత్య పూజలు నిర్వహిస్తూ వుంటారు . విషయం తెలుసుకున్న ఔరంగజేబు యుధ్దానికి రాగా ఉదయ సింగ్ సేనలు ఔరంగజేబు సేనలను నిలువరించలేక పోతాయి . ఔరంగజేబు  సేనలు కోట బయట మోహరించి వుండగా ఉదయసింగ్ ' నిన్ను రక్షించేందుకు సాయశక్తులా ప్రయత్నించేను , పృధ్విని రక్షించే రక్షకుడు నీవు , నీకు తురుష్కుల దగ్గరకు చేరాలని వుంటే అటులే కానియ్యి , జగద్రక్షకుడను నేను రక్షించటం యేమిటి , నిన్ను నువ్వే రక్షించుకొ ' అని మరునాడు ఔరంగజేబు సేనలతో పోరాడడానికి వెళ్లగా మొఘల్ సేనలు ఉదయ సింగ్ ధాటికి ఆగలేక పరాజయం పాలయేరు . 

ఉదయసింగ్ ఆ విగ్రహానికి తన కోటలోనే మందిరం నిర్మించి పూజింపసాగేడు . 18 వ శతాబ్దంలో ఇండోరు ని పరిపాలిస్తున్న హోల్కరులు , పిండారీలు ఈ విగ్రహాన్ని తీసుకుపోయేందుకు దండెత్తి రాగా విగ్రహాన్ని ఉదయపూర్ కి తరలించి శిశోడియా రాజులు కాపాడుకున్నారు .

ఈ విగ్రహం కాంతులీను తున్న నల్లరాతితో చెక్కి నది , అదే పలకమీద రెండు ఆవులు , పులి , రెండు నెమళ్లు , రామచిలుక చెక్కి వుంటాయి . విగ్రహం కిందన ముగ్గురు ఋషుల విగ్రహాలు వుంటాయి . 

ఈ మందిరంలో ద్వజస్ధంబం పైన యేడు జండాలు యెగుర వేస్తారు . పూరీ జగన్నాథ్ మందిరం లో లాగే యిక్కడ కూడా కోవెల శిఖరం పైన జెండా యెగురవేస్తారు . ప్రతీ రోజూ శిఖరం నుండి కొబ్బరి కాయ నేల పైకి విసిరి కొడతారు . ఈ ఆచారం వెనుక నున్న  కారణం యెవరూ వివరించలేక  పోయేరు .

ప్రతి ఒక్కరూ దర్శించుకు తీరవలసిన మందిరం .

యివన్నీ చూసుకొని తిరిగి ఉదయపూర్ చేరేసరికి రాత్రి యెనిమిది దాటింది .

వచ్చే సంచికలో ఉదయపూర్ లో చూడతగ్గ ప్రదేశాల గురించి తెలుసుకుందాం అంతవరకు శలవు . 

మరిన్ని శీర్షికలు
pounch patas