Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

 

మౌంట్ రష్మోర్ నేషనల్ మెమోరియల్ ప్రపంచంలో పర్వతాల అందాలు చూసి సంతోషించేవాళ్ళు కొందరయితే, ఆ పర్వతాల మీద అందమైన ఆలయాలు నిర్మించి ఆధ్యాత్మికత నెలకొల్పేవారు ఇంకొందరు.  అయితే అమెరికాలో కొందరు ఆ పర్వతాలనే మలచి సుందర రూపాలని  చెక్కించి ప్రజలకి మానవత్వపు విలువలను చాటి చెప్పారు.  ఇలాంటి అద్భుత సృష్టులు కళాకారులకి ఆనందమివ్వటమేగాక సందర్శకులను కూడా అమితంగా ఆకర్షిస్తాయి. అలాంటి వాటిలో మొదటిది మౌంట్ రష్మోర్ నేషనల్ మెమోరియల్.      సౌత్ డకోటా, కీస్టోన్ లోని బ్లాక్ హిల్స్ లోని హార్నీ పీక్ మీద వున్న ఈ మెమోరియల్ లో నలుగురు అమెరికన్ ప్రెసిడెంట్ల ముఖాలు   అత్యద్భుతంగా కొండలోనే మలచబడ్డాయి.

1278 ఎకరాల్లో విస్తరించిన ఈ మెమోరియల్ సముద్రమట్టానికి 5,725 అడుగుల ఎత్తులో వున్నది. ఈ అద్భుతాన్ని సృష్టించిన శిల్పకారులు గుట్జ్ న్    బోర్ గ్లమ్, ఆయన కుమారుడు లింకన్ బోర్ గ్లమ్.  ఈ భారీ శిల్పాలకు ఈ కొండని ఎన్నుకోవటానికి కారణం, ఈ రాయి శిల్పాలు చెక్కటానికి అనువుగా వుండటమేగాక, వాతావరణ ఆటుపోట్లకు తట్టుకునే శక్తి కలది కూడా కావటం.  అంతే కాదు సూర్య కిరణాలు ఈ ప్రదేశంలో ఎక్కువ సేపు పడటం వల్ల శిల్పులకు తమ పని చేసుకోవటానికి, తర్వాత దర్శకులు వాటిని సందర్శించటానికి అనువుగా వున్నది.  

ఇక్కడ రూపొందించబడ్డ శిల్పాలు నలుగురు అమెరికన్ ప్రెసిడెంట్లవి.  ముందుగా నడుముదాకా రూపొందించాలనుకున్న శిల్పాలు, ఆర్ధిక కారణాలవల్ల తలలతోనే ఆగి పోయాయి.  ఒక్కోక్క తల పొడుగు సుమారు 60 అడుగులు.  వాషింగ్టన్ ముక్కు 21 అడుగుల ఎత్తు, మిగతావారివి దాదాపు 20 అడుగుల ఎత్తులో వుటాయి.  కళ్ళు 11 అడుగులు, నోరు 18 అడుగుల వెడల్పు వుంటాయి.  ఎంత భారీ శిల్పాలో, కొండమీద వాటిని చెక్కటానికి ఎంత అవస్త పడి వుంటారో వూహించండి.

ఈ మెమోరియల్ లో స్ధానం సంపాదించుకున్న ప్రెసిడెంట్లు వీరే....

జార్జి వాషింగ్టన్     1732 – 1799   .. ఫాదర్ ఆఫ్ ది అమెరికాగా ప్రశంసింపబడే వాషింగ్టన్ అమెరికా మొదటి ప్రెసిడెంట్.  ఈయన   అమెరికా ఇంగ్లండ్ నుంచి స్వతంత్రం పొందటానికి కృషి చేసిన వ్యక్తి. 

ధామస్ జెఫర్ సన్    1743 – 1826  అమెరికాకి మూడవ ప్రెసిడెంట్ ఈయన.  డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ వ్రాసినవాడు. ఈయన ముందు చూపుతో లూసియానా టెరిటరీని కొనటంతో దేశం అంతకు ముందుకన్నా రెట్టింపు విస్తీర్ణతను సంతరించుకుంది.

ధియోడర్ రూజ్ వెల్ట్   1858 – 1919  ..  ఈయన అమెరికాకి 26వ ప్రెసిడెంట్.  ఈయన పనామా కెనాల్ ని పూర్తి చేసి, అట్లాంటికి, పసిఫిక్ సముద్రాలను అనుసంధానం చేసినవాడు.  మెమోరియల్ లో నాల్గవ స్ధానం ఈయనది.

అబ్రహం లింకన్   ..    1809 – 1865  అమెరికా 16వ ప్రెసిడెంట్.  1860లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డాడు.  సివిల్ వార్ సందర్భంగా దేశంలో చీలికలు రాకుండా సంఘటితం చేసిన లీడర్. 

పర్వతంపై శిల్పాలు చెక్కించాలనే ఆలోచన ముందుగా సౌత్ డకోటా చరిత్రకారుడు జోన్ రాబిన్ సన్ కి వచ్చింది.  దానికి సుప్రసిధ్ధ శిల్పి గుట్జ్ న్ బోర్ గ్లమ్ ని  శిల్పిగా ఎంచుకున్నాడు. సౌత్ డకోటోలో టూరిజం పెంపొందించాలనే ఉద్దేశంతో ఇక్కడ కొండమీద పొడుగాటి స్తంబాలు, వాటిమీద కొందరు ప్రసిధ్ధ పురుషుల మూర్తులు చెక్కించాలనుకున్నాడు.  కానీ అనేక తర్జన భర్జనలు తర్వాత ఆ మెమోరియల్ దేశ భక్తిని, దేశ పురోభివృధ్ధిని తెలియచేసేదానిలా వుండాలని  అమెరికా చరిత్రలో మొదటి 150 సంవత్సరాలలో అమెరికా అభివృధ్ధికి పాటుపడిన ప్రెసిడెంట్స్ లోనుంచి నలుగురిని ఎంచుకున్నారు.

ఈ శిల్పాలు చెక్కటానికి 4-10-1927 నుంచి 31-10-1941 దాక 400 మంది శిల్పులు కష్టపడ్డారు.  ఎత్తయిన కొండమీద శిల్పాలు చెక్కటమంటే మాటలు కాదు.  పైగా 1930లో అమెరికా  పెద్ద డిప్రెషన్ ఎదుర్కొన్నది.  ఫండ్స్ సరిగ్గా లేక పోవటం, దేశ రాజకీయ, ఆర్ధిక పరిస్ధితులు, వాతావరణ సమస్యలు అన్నీ ఎదుర్కొని నిలిచిన ప్రపంచంలోనే పెద్దదైన ఈ శిల్పాలు అమెరికా ప్రజల దేశ భక్తినే కాదు,  ఎన్నో ఒడిదుడుకులలో శిల్పి, అతని కింద పనిచేసిన 400 మంది అంకిత భావాన్ని, ధృఢ దీక్షని తెలియజేస్తాయి..

వేసవి కాలంలో రాత్రి 9 గం. లకు ప్రతి రోజూ ఈ శిల్పాల మీద లైట్స్ ఫోకస్ చేస్తారు. నిజం చెప్పాలంటే మేము చూసిన రోజు ఆ షో అంత గొప్పగా లేదు.  కొన్ని ఫ్లడ్ లైట్స్ శిల్పాల మీదకి ఫోకస్ చేశారుగానీ, అవి అంత బాగాలేదు.  నాకైతే పగలు చూసిన దృశ్యాలే బాగున్నాయి.  అందుకే కాబోలు ఈ మెమోరియల్ వాళ్ళు కూడా సందర్శకులు ఆ శిల్పాలను చూసి ఫోటోలు తీసుకోవటానికి తగిన సమయం ఉదయమని చెప్పారు. 

ప్రవేశం

రోడ్డు మీదనుంచి ఈ మెమోరియల్ ని ఏ సమయంలోనైనా చూడవచ్చు.  లోపలకి ప్రవేశం మాత్రం ఉదయం 6 గం.ల నుంచీ రాత్రి 10 దాకానే.  ఈ మెమోరియల్ ఒక్క డిసెంబరు 25న తప్ప మిగతా అన్ని రోజులూ తెరిచే వుంటుంది.  ప్రవేశ రుసుము లేదు.  ఇందులో వున్న ఇన్ఫర్మేషన్ సెంటర్, లింకన్ బోర్ గ్లమ్ మ్యూజియం ఉదయం 8 గం.లనుంచి సాయంత్రం 5 గం.లదాకా తెరిచి వుంటాయి.  ఇన్ఫర్మేషన్ సెంటర్ లో ఆ రోజు అక్కడ జరిగే కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చు.  

లింకన్ బోర్ గ్లమ్ మ్యూజియం 

లింకన్ బోర్ గ్లమ్ మ్యూజియం పైనుంచి ఏ అడ్డూ లేకుండా ఈ శిల్పాలను వీక్షించవచ్చు. 5200 చ. అ. ల స్ధలంలో వున్న ఈ మ్యూజియం ఈ శిల్పాల చరిత్ర, పురోభివృధ్ధి గురించి తెలియజేస్తుంది.  మ్యూజియంలో 125 మంది కూర్చునేందుకు వీలుగా 2 ధియేటర్స్ వున్నాయి.  వీటిలో ఒక దానిలో ఆ శిల్పాలు ఎందుకు, ఎలా చెక్కారు అనే విషయం గురించి 13 నిముషాల ఫిల్మ్, రెండవ దానిలో ఈ నేషనల్ పార్కు లోపలగల జంతువుల గురించి 12 ని. ల ఫిల్మ్ చూపిస్తారు.  

యాంఫి ధియేటర్

శిల్పాలకి దిగువలో వున్న ఈ ధియేటర్ లో రోజూ రకరకాల ప్రోగ్రాంలు జరుగుతాయి.  ఆ రోజు జరిగే ప్రోగ్రాం గురించి ఇన్ఫర్మేషన్ సెంటర్ లో గానీ మ్యూజియంలోగానీ వివరాలు తెలుసుకోవచ్చు.  ఇవి కాక ప్రతి రోజూ యాంఫి ధియేటర్ లో మెమోరియల్ నిర్మాణం, అక్కడ చెక్కబడిన నలుగురు ప్రెసిడెంట్ల గురించి హైలైట్స్ చూపిస్తారు.

ప్రెసిడెన్షియల్ ట్రైల్

అర మైలు దూరం వుండే ఈ ట్రైల్ లో నడిస్తే ఈ శిల్పాల చుట్టు పక్కల దృశ్యాలని వీక్షించవచ్చు.  ఈ ట్రిప్ లో సగం దూరం వరకు వికలాంగులు కూడా సునాయాసంగా చూసి రావచ్చు.  అమెరికాలో వికలాంగుల కోసం తీసుకునే శ్రధ్ధ అంతా ఇంతా కాదు.  వారికి ప్రతి చోట ప్రత్యేక సౌకర్యాలు, వీల్ ఛైర్ లు వెళ్ళటానికి వీలుగా దోవలు, లిఫ్ట్ లు, వాష్ రూంలు, బస్ ఎక్కటానికి, దిగటానికి సౌకర్యాలు వారికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండ ఏర్పాటు చేస్తారు.  వారు మనిషి సహాయం లేకుండా బయట తిరిగి వారి పనులు వారు చేసుకునేందుకు వీలుగా వుంటాయి ఈ ఏర్పాట్లు. అవకాశం వున్నవారు తప్పక దర్శించాల్సిన అద్భుతం ఇది. 

మరిన్ని శీర్షికలు