Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే ..... http://www.gotelugu.com/issue159/451/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

భద్రా దేవితో పరిచయం ప్రేమ అంతా తన అదృష్టమే. ఆ వేణు గోపాలుడూ, సహ్యాద్రి భీమ శంకరుడు తనకు కటాక్షించిన వరమే ఈ సౌందర్య రాశి భద్రా దేవి.

ఉప్పొంగిన ప్రేమాతిశయంతో ముదమార భద్రా దేవిని కౌగిలించుకుని తన కృతజ్ఞత తెలిపాడు. భద్రా దేవి వలపు మీర కొసరి కొసరి ముద్దాడింది.

‘‘ప్రభూ! నేను మీ హృదయేశ్వరినే కాదు. అంగ రక్షకుడిని కూడ. ఆ మృత్యువైనను మిము చేరాలంటే నను దాటే రావాలె. మీ కొరకు ప్రాణ త్యాగానికైనను వెరగు పడు దానను కాను’’ అంది భద్రా దేవి.

‘‘అంత మాటనకు దేవీ. నీవు లేని లోకంలో ఈ ధనుంజయుడూ వుండడు’’ అంటూ ముద్దాడాడు.

‘‘ప్రభూ! ఈ మాటలు సత్యములేనా? నమ్మ వచ్చునా?’’ ధనుంజయుని ఛాతీకి బలంగా హత్తుకు పోతూ ఆర్తిగా అడిగింది భద్రా దేవి. ఆమె చుబుకాన్ని ఎత్తి కళ్ళ లోకి ఆత్మీయంగా చూసాడు ధనుంజయుడు. వెన్నెల కాంతిలో తామర పుష్పంలా మెరిసి పోతున్న ఆమె ముఖ సౌందర్యాన్ని కొద్ది సేపు ముగ్ధుడై తిలకించాడు.

‘‘ప్రియా... సందేహమా? అటు సూర్యుడు ఇటు ఉదయించినా ఉదయించు గాక కాని ఈ ధనుంజయుడు తన మనోహరికిచ్చిన మాట ఎన్నడూ తప్పడు’’ అన్నాడు.

ఆ మాటలతో పులకించి పోతూ ముద్దులతో అతడ్ని అభిషేకించింది భద్రా దేవి. వెన్నెల చల్ల దనంలో చుంబన ఆలింగనాదుల పరవశంతో మైమరచి పోయారిరువురూ. అంతలో కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ కౌగిలి విడిపించుకుని తన మచ్చల గుర్రం వైపు దారి తీసింది భద్రా దేవి.

ఆ విధంగా సర్ప శీర్షుడిని సంహరించాక ప్రేమికులిద్దరూ తిరిగి తమ అశ్వాల మీద బయలు దేరి రాత్రికి రాత్రి ప్రయాణాన్ని కొన సాగించారు. తెల్ల వారక ముందే వారు మాళవ సరి హద్దును సమీపించారు.

****************************

రాత్రి నాలుగో యామం కొంత సమయం గడిచే సరికి చంద్రుడు అస్తమించి లోకమంతా గాడాంధకారం అలుముకుంది. చుక్కలు ప్రకాశ వంతంగా కన్పిస్తున్నాయి. మహా పథం మీద పోటీ పడి పరుగులు తీస్తున్నాయి అశ్వాలు గరుడ, ఢాకినీలు.

‘‘మనము మాళవ సరి హద్దును సమీపిస్తున్నాం దేవీ.’’ అంటూ గుర్తు చేసాడు ధనుంజయుడు.

‘‘అవును ప్రభూ! రత్న గిరి సరి హద్దును దాటి పోనుంటిమి’’ అంది భద్రా దేవి. రెండూ ఒకటేనని ఇరువురికీ తెలుసు. అందుకే పరిహాసంగా నవ్వుకున్నారు.

సర్పశీర్షుడి సంహారం పిమ్మట`

నిరాటంకంగా రాత్రంతా కొన సాగుతూనే వుంది వారి ప్రయాణం. ఇరు రాజ్యాల సరి హద్దు వద్ద మహా పథం మీద సరిహద్దు దళాల శిబిరాలుంటాయి. సరి హద్దు దళాలు నిరంతరంగా కాపలా వుంటారు. అక్కడి అధికారులు మహా పథంలో సాగే బిడారులు బాటసారుల నుండి సుంకాలు వసూలు చేస్తారు. ఆ విధంగా అటు మాళవం గాని ఇటు రత్న గిరి గాని రాజ్యం లోకి వచ్చే వారి చెంత మాత్రమే సుంకం విధిస్తారు. రాజ్యం నుండి వెళ్ళే వారి వద్ద వసూలు చేయరు. కాని వివరాలు అడుగుతారు. సందేహాస్పదమైన వ్యక్తులయితే సోదా చేసి గాని వదలరు.

సరి హద్దులకి చేరగానే`

తమ సైనిక శిబిరంలో తగినంత విశ్రాంతి తీసుకుని నిద్ర పోయి ఉదయం భోం చేసాక బయలు దేరే ఉద్దేశంలో వున్నాడు ధనుంజయుడు. నిద్ర లేమి అలసట నుండి బయట పడ వచ్చు. అశ్వాలకూ తగిన విశ్రాంతి లభిస్తుంది.
కాని ఇదే అభిప్రాయాన్ని చెప్పినప్పుడు భద్రా దేవి వెంటనే తిరస్కరించింది.

‘‘ప్రభూ! ఆ విధముగా చేయుట మనకి సురక్షితమందురా?’’ అనడిగింది, తిరిగి తనే చెప్పింది.

‘‘ఓ ప్రక్క రత్నగిరిలో పరిస్థితుల గురించి వింటూనే వున్నాం. బాహ్లీకుడు శతానీకునితో చేయి కలిపి అంతర్యుద్ధానికి సిద్ధ పడుతున్నాడు. ఉప సైన్యాధ్యక్షుడైన ఆ ద్రోహి తన ఆధీనం లోని సేనల్ని ఏవేవో ప్రలోభాలు చూపి తన వైపు తిప్పుకున్నాడు. చాప కింద నీరు వలె వాడి మనుషులు ఎక్కడి కక్కడ ఎంత దూరం వరకు వ్యాపించి వున్నారో తెలీదాయె. సరి హద్దు దళముందు అతడి మనుషులు లేరన్న నమ్మకం ఏమున్నది? ఈ పరిస్థితిలో మనం శిబిరంలో నిద్ర చేయటం ప్రమాదమే. మనకు విష ప్రయోగం జరగ వచ్చు లేదా నిద్రించునపుడు మన కుత్తుకు కోయ వచ్చు. మనను బ్రతక నివ్వరు. ఆలోచించండి ప్రభూ. నన్నడిగినచో అసలు మీరు సరి హద్దు దాటిన సంగతే ఇటు రత్న గిరి దళాలకు గాని అటు మాళవ రాజ్య దళాలకు గాని తెలియ కూడదు.’’ అంది.

భద్రా దేవి సలహా లోని వాస్తవాన్ని గ్రహించి అవునన్నట్టు తలూపాడు ధనుంజయుడు. అడవి కోళ్ళు కూసే వేళకి అశ్వాలు సరి హద్దును చేరుకున్నాయి. అక్కడికి కాస్త ఎగువనే భద్రా దేవి సలహా మేరకు తన వేషం మార్చుకున్నాడు ధనుంజయుడు. తలకు తలపాగా చుట్టుకున్నాడు. ముఖం తెలీకుండా వస్త్ర భాగాన్ని చుట్టుకున్నాడు. తన అశ్వాన్ని గుర్తు పట్టకుండా నల్లని జూలు మీద తెల్లటి వస్త్రం కప్పాడు.

ఆ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుని సైనిక శిబిరాన్ని సమీపించారు. వెంటనే సరి హద్దు దళానికి చెందిన కావలి భటులు వారిని ఆపారు.

ధనుంజయుడు మౌనం వహించాడు.

భద్రా దేవి వాళ్ళతో మాట్లాడింది అపర్ణుడిగా.

మగ వేషం లోని ఆమె వాక్చాతుర్యం పని చేసింది. కించిత్తు కూడ అనుమానించకుండా వారిని వదిలేసారు భటులు. అక్కడి నుండి రత్నగిరి భూ భాగం దాటి మాళవ రాజ్య భూ భాగం లోకి ప్రవేశింప గానే అక్కడి మాళవ శిబిరం వద్ద భటలు ఆపేసారు.

అక్కడ కూడ మౌనం వహించాడు ధనుంజయుడు. భద్రా దేవి తనను అపర్ణుడిగా పరిచయం చేసుకొని మాట్లాడింది. తామిద్దరూ మిత్రుని అవంతీ పురంలో (ఉజ్జయిని) బంధువు యింట శుభ కార్యానికి పోతున్నట్టు చెప్పి నమ్మించి ప్రయాణ సుంకాన్ని చెల్లించింది.

ఆ విధంగా యిరువురూ సరి హద్దు దాటి మహా పథంలో ముందుకు సాగే సరికి తూరుపు తెల్ల వారింది. చీకటి మాటున సరి హద్దు దాటి నందున ఎవరూ ధనుంజయుని గానీ అతని అశ్వాన్ని గానీ గుర్తు పట్ట లేదు. సరి హద్దు దాటిన కొద్ది సేపటికే అడవి తరిగి పోయి మాళవం లోని పంట భూములు కను విందు చేస్తూ కన్పించాయి. మనుషుల సంచారం కన్పించింది.

రాత్రంతా నిదుర లేనందున ఇరువురూ బాగా అలసి వున్నారు. కనులు ఎర్ర బారి మండుతున్నాయి. ఆకలి సంగతి ఎలా వున్నా ఎక్కడో చోట ఒక జాము నిద్ర పోవాలి. అనువైన చోటును గాలిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒక చోట దారిలో అగుపించిన పంట కాలువ లో కర చరణాలు ముఖ ప్రక్షాళన చేసుకుని తిరిగి ముందుకు సాగారు. పొద్దు పొడిచిన కొద్ది సేపటికి ఒక ప్రాంతాన్ని చేరుకున్నారు. ఎగువన చిన్ని పల్లె కన్పిస్తోంది. సమీపంలో బాటకి ఎడంగా ఒక పెద్ద సత్రం వుంది. అక్కడ రాత్రి మజిలీ చేసినట్టున్నారు ఒక పెద్ద బిడారు గుంపు కన్పిస్తోంది. ముందుకు పోయి పల్లెలో మజిలీకి ఏదో ఒక అనువైన చోటు చూడాలనుకుంటూ అశ్వాలను అదలించారు.

అశ్వాలు సత్రం ను దాటి పోతున్నాయి. ఇంతలో` ‘‘ఇదిగో అబ్బాయ్‌! అపర్ణా... ఆగుము’’ అంటూ పరిచయమున్న గొంతు ఒకటి బిగ్గరగా విన్పించటంతో వెంటనే కళ్ళాలు బిగించి అశ్వాన్ని ఆపింది భద్రా దేవి. అక్కడ విస్మయ పరిచే మరో సంఘటన జరగనుందని ఆ క్షణంలో ఇరువురికీ తెలీదు. తల తిప్పి చూసిన భద్రా దేవికి బిడారు గుంపు ముందు ఓ కాలు కొద్దిగా కుంటుతూ చేయి వూపుతున్న భల్లాతకుడు కన్పించాడు.

అతడే ఆ బిడారు నాయకుడు.

****************************************

భల్లాతకుడి బిడారు రత్న గిరి చేరిన మూడో రోజునే తిరిగి స్వస్థలమైన అవంతికి బయలుదేరింది. వాళ్ళంతా మొన్న సాయం కాలమే సరి హద్దు దాటి వచ్చి ఆ సత్రం వద్ద రాత్రికి మజిలీ చేసారు. వాళ్ళంతా నిన్న ఉదయమే అవంతికి ప్రయాణం చేయాలి కాని ఆ రాత్రి జరిగిన వూహించని సంఘటన ఒకటి వాళ్ళని అక్కడి నుండి కదలకుండా చేసింది. ఏం చేయాలో తెలీని సంకట స్థితిలో భల్లాతకుడు కొట్టు మిట్టాడు తూండగా యువరాజు ధనుంజయుని వెంట బెట్టుకుని అపర్ణుడు కన్పించటం గొప్ప వరంగా తోచింది. అందుకే మచ్చల గుర్రాన్ని గుర్తు పట్టగానే అపర్ణుడిని పిలిచాడు. నిజానికి అపర్ణుడు పురుషుడు కాదని స్త్రీయని భల్లాతకుడికి తెలీదు. బాలుడనే అనుకుంటున్నాడు.

అసలా సత్రం వద్ద మొన్న రాత్రి ఏం జరిగింది? ఆ రాత్రి బిడారు లోని వర్తకులు ఇతర ప్రయాణీకులు అంతా భోజనాలు చేసి సత్రం ముందు ఆరు బయట వెన్నెట్లో పడుకున్నారు. పంట పొలాల మీదుగా వీస్తున్న పైర గాలికి ఎక్కడి వాళ్ళక్కడ గాఢ నిద్ర లోకి జారుకున్నారు. అతడి మనుషులు రక్షణగా కాపలా తిరుగుతున్నారు. కొందరు అశ్వాల మీద కంటి మీద కనుకు లేకుండా అప్రమత్తంగా వున్నారు.

అప్పటికే అంటే బిడారు గుంపు రావటానికి అయిదు రోజుల ముందే ఆరుగురు సభ్యులతో కూడిన ఒక బృందం అశ్వాల మీద వచ్చి ఆ సత్రంలో విడిది చేసింది. సాధారణ వ్యాపారుల్లా దుస్తులు ధరించి వున్నారు. కాని చెంత మారణాయుధాలున్నాయి. ఆ సత్రంలో ఉంటూ బాట మీద వచ్చే పోయే వాళ్ళ మీద నిఘా వుంచారు. జాముకు ఒకడు చొప్పున మారుతూ పగలు రేయి కాపు వేసి ఎవరి కోసమో చూస్తున్నారు. బిడారు అక్కడ విడిది చేసినప్పుడే వాళ్ళ తీరు భల్లాతకుడికి సందేహం కలిగించింది. వాళ్ళని ఓ కంట కని పెట్టి విషయం ఏమిటో తెలుసుకోమని తన మనుషులిద్దర్ని నియమించాడు.

మనకు సంబంధం లేని విషయమైనప్పటికీ ఒక్కో సారి కుతూహలంతో అదేమిటో తెలుసుకో మంటుంది. దానివల్ల అప్పుడప్పుడూ కొన్ని చిక్కు సమస్యలూ ఎదురవుతూంటాయి. బిడారు నాయకుడు భల్లాతకుడి విషయంలో కూడ అదే జరిగింది.

ఆ రాత్రి మధిర సేవించి చక్కగా భోంచేసి వెన్నెట్లో ఆరు బయట నిద్రించిన కొద్ది సేపటికే అతడు నియమించిన మనుషులిద్దరూ వచ్చి తట్టి లేపారు. లో గొంతుతో వాళ్ళు చెప్పిన విషయాు వినగానే భల్లాతకునికి తాగిన మధిర మత్తు మొత్తం దిగి పోయింది.

ఆ ఆగంతకులు ఆరుగురూ ఖచ్చితంగా ఎవరి మనుషులో తెలీదు. కాని వాళ్ళు వేచి వున్నది ఎదురు చూస్తున్నది మాత్రం సాక్షాత్తూ రత్నగిరి యువ రాజు ధనుంజయుని కోసం. అతడు సరి హద్దు దాటి మాళవం లోకి రాగానే హఠాత్తుగా మూకుమ్మడిగా దాడి చేసి చంపటం లక్ష్యంగా అక్కడ కాపు కాసి కూచున్నారు.

ఈ విషయాలు తెలీగానే విభ్రాంతుడయ్యాడు భల్లాతకుడు. ఇది సాధారణ విషయం కాదు. ఒక రాజ్యానికి ఏకైక వారసుడయిన యువ రాజుని కడ తేర్చటమంటే రత్న గిరి లో ఏదో భయంకరమైన కుట్ర జరుగుతోంది. ఆ కుట్రలో భాగం గానే వీళ్ళు వచ్చుండాలి. ఇది ప్రత్యర్థులు తల పెట్టిన అతి పెద్ద నేరం.

తనకు యువ రాజా వారితో పరిచయం లేదు. కాని అతన్ని చూసాడు. మహా అందగాడు, మహా వీరుడని విన్నాడు. ఎంతటి వీరుడైనా వెన్ను పోటు పొడిస్తే ఏమీ చేయ లేడు. ఈ ఘోరాన్ని తను ఆపి నేరస్తుల్ని పట్టి యువ రాజుకు వప్పగిస్తే రత్నగిరిలో తన పరపతి ఇనుమడిస్తుంది. వీళ్ళిక్కడ కాపు వేసారంటే ఖచ్చితంగా ధనుంజయుల వారు వస్తూ వుండాలి.

ఈ విధంగా ఆలోచించిన భల్లాతకుడు పుణ్యం పురుషార్థం కూడ కలిసి వస్తుందన్న ఉద్దేశంతో ఆ ద్రోహులు ఆరుగుర్ని బంధించి తన ముందుకు తీసుకు రమ్మని తన మనుషులకు ఆజ్ఞాపించాడు.

ఆ రాత్రి వేళ`

వూహించని విధంగా భల్లాతకుడి మనుషులు తమను చుట్టు ముట్ట గానే ఆగంతకులు కత్తులు దూసారు. లొంగి పొమ్మని హెచ్చరించినా లెక్క చేయ లేదు. కొద్ది సేపు పోరాడి తప్పించుకు పారి పోవాలని చూసారు. అశ్వాల మీద తరిమి తరిమి వాళ్ళని పట్టుకున్నారు. అయితే చివరి క్షణంలో వాళ్ళలో నలుగురు విషపు గుళికలు మ్రింగి ప్రాణాలు తీసుకున్నారు. మిగిలిన యిద్దరూ కూడ అదే పని చేయ బోతుంటే, అడ్డుకుని విషపు గుళికలు లాక్కుని ఆ యిద్దర్నీ పెడ రెక్కలు విరిచి బంధించి భల్లాతకుడి ముందుకు తీసుకొచ్చారు.

వాళ్ళు ఆరుగురూ పట్టు బడితే పరిస్థితి వేరేగా వుండేది. నలుగురు చావటంతో భల్లాతకుని పరిస్థితి ఇరుకున పడింది. పట్టు బడిన వాళ్ళని ఎంత హింసించినా తాము వర్తకులమని తమ కేమీ తెలీదని బొంకారు. చచ్చిన వాళ్ళతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాబట్టి కొత్వాలుకు వీళ్ళని వప్పగించి ప్రయోజనం లేదు. ఈ నేరం మొత్తం అనవసరంగా తన నెత్తిన పడే ప్రమాదం వుంది. ఏం చేయాలి?

పక్క పల్లెను దాటి ఎగువకు పోతే అవంతికి వెళ్ళే బాట కుడి పక్కగా చీలి పోతుంది. అక్కడికి ఎగువన గల పెద్ద గ్రామంలో ఉంటాడు కొత్వాలు. అసలే వాడు చండ శాసనుడు. మహా తిక్క మనిషి అంటారు. తను చూస్తే నాలుగు శవాలతో సత్రం వద్ద చిక్కు బడ్డాడు. కొత్వాలు వస్తే ఖచ్చితంగా తనను ఉరి తీయిస్తాడు. ఈ సమస్య నుంచి బయట పడాలంటే యువ రాజు ధనుంజయుడు రావాలి. అందుకే తనను కాపాడమని వేయి దేవుళ్ళకు మొక్కుకుంటూ సత్రం బయటే ఉన్నాడు భల్లాతకుడు. అటు వంటి సమయంలో యువరాజు ధనుంజయుడు అపర్ణుడు కన్పించటం అతడికి ప్రాణం లేచి వచ్చినట్టుంది. కాని అక్కడ ఆగటం ధనుంజయుడికి ఇష్టం లేదు.

‘‘మన  దారిన మనం వెళ్ళి పోవుట మంచిదనుకొందును భద్రా. ఇచట మన కేమి పని?’’ అన్నాడు.

‘‘ప్రభూ! అతను భల్లాతకుడు. ఆ బిడారు నాయకుడు. మీతో పరిచయము లేక పోవచ్చు గాని మీరు అతనికి తెలుసు. చాలా మంచి వాడు. మనము చక్కగా భోజనము చేసి కంటి నిండా నిద్ర పోవుటకు తగిన చోటు. మీరు రండి.’’ అంటూ అశ్వాన్ని మళ్లించింది భద్రా దేవి.

‘‘ఏమిటి బాబాయ్‌! రత్న గిరి నుండి అప్పుడే తిరిగి వచ్చేసినారా?’’ భల్లాతకుడి ముందు అశ్వం దిగుతూ అడిగాడు అపర్ణుడు.

‘‘వచ్చి మూడు దినములైనది అపర్ణా. మీ కొరకే ఎదురు చూచుచుంటిని’’ అంటూ వడి వడిగా ధనుంజయుని ముందు కెళ్ళి చేతులు జోడించాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali