Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

 గతసంచికలో ఏం జరిగిందంటే.... http://www.gotelugu.com/issue159/452/telugu-serials/atulitabandham/atulitabhandham/

పెళ్ళి దగ్గర పడుతున్న కొద్దీ మధుబాలలో ఆనందంతో పాటుగా ఏదో తెలియని  భయం కూడా చోటు చేసుకోసాగింది.

ఏ ఆటంకాలూ లేకుండా అన్నీ కుదిరాయి అనుకుంటే వేణుగోపాల్ చెల్లెలు వినత ప్రవర్తన పట్ల ఏదో జంకు కలుగుతోంది. ఒకరోజు వేణు షాపింగ్ కార్యక్రమం పెట్టాడు. తనను డైరెక్ట్ గా మార్కెట్ దగ్గరున్న షాపింగ్ మాల్ కి వచ్చేయమని చెప్పాడు. తాను  వెళ్ళిన పది నిమిషాల తరువాత కారులో వచ్చారు వేణు, వినత. వినతను దింపి కారు పార్కింగ్ చేసుకోవటానికి వెళ్ళాడు వేణు.

తానే  రెండు అడుగులు ముందుకు వేసి, వినత వైపు చేయి చాపి “హాయ్!” అంది మధుబాల.

“హాయ్” అంటీ అంటనట్టుగా మునివేళ్ళతో వేళ్ళను స్పృశించి వదిలేసింది వినత. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా నిలుచుని ఉండిపోయింది మధుబాల. ఈలోగా వచ్చాడు వేణు.

“మధూ, అమ్మ నీకు పదివేల రూపాయలు పంపించింది. నీకు ఇష్టమైన చీరలు సెలెక్ట్ చేసుకోమని చెప్పింది. పెళ్ళికి కట్టుకోబోయే పెద్ద పట్టుచీర, మరో రెండూ తీసుకో... మధుపర్కాలు వేరేగా కొంటాము కదా...” అన్నాడు.

“విన్నూ, నువ్వు కూడా నీకేం కావాలో కొనుక్కో... ఆ తర్వాత నన్ను  ఆడిపోసుకోకు...”చెల్లెలితో అన్నాడు నవ్వుతూ.

“అలాగే, ముందు మీ శ్రీమతిగారి షాపింగ్ కానీ... ఆ తర్వాత నేను...” అదోరకంగా నవ్వింది వినత.

చీరలు మడతలు విప్పి, పరచి చూపిస్తున్నాడు సేల్స్ మాన్ కానీ మధుబాల దృష్టి దానిమీద నిలవటం లేదు.

“ఈ అరిటాకుపచ్చ రంగుకి వంగపువ్వు రంగు అంచు చూడండి... వెరీ రేర్ కాంబినేషన్... పైటకొంగు చూడండి లతలతో ఎంత బాగా నేసారో...” అతను వర్ణిస్తున్నాడు... నిజంగానే ఆ చీర చాలా బాగుంది. అప్రయత్నంగా వేలికొసల్తో పైటంచును తాకింది మధుబాల.

“బాగుంది కదూ, పాక్ చేయించనా?” అన్నాడు వేణు.

“అవును... అలాగే...” మెల్లగా అంది మధుబాల.

ఈలోగా పక్కనే మరో కష్టమర్స్ చూస్తున్న చీరల మీద పడింది మధుబాల దృష్టి.  “ఆ మెజంటా రంగు చీర ఓ సారి ఇవ్వండి...” అని అడిగి తీసుకుని దగ్గరగా చూడసాగింది...

“నేను కొన్ని చీరలు తీసుకుంటాను. వీటికి నేనే పే చేస్తాను...” అంది వేణుతో...

“ఎవరికీ? మీ వాళ్ళకా?”

“అవును... మా అమ్మకీ, వదినకీ, నాయనమ్మకీ, ఇంకా నా ఫ్రెండ్ ఐశ్వర్యకూ... ఇదిగో ఈ మెజంటా కలర్ చీర ఆమెకు బాగా నప్పుతుంది...”

“ఓహ్, దట్స్ గుడ్...” అన్నాడు వేణు.

చీరల సెలక్షన్ లో వినత ఏమీ కల్పించుకోలేదు. తాను  మాత్రం పదిహేను వేల రూపాయల చీర ఒకటి కొనిపించుకుంది. మధుబాలకి మూడు చీరలు తీసుకున్నాడు వేణు. మధు తాను  కూడా ఒక నాలుగు చీరలు తీసుకుంది.

“మా చీరలు అయాయి... ఇక మీ బట్టలు?” అంది మధుబాల.

“అవి, నాన్నగారూ, అమ్మా, నేనూ కలిసి వస్తాము...అప్పుడు తీసుకుంటాం.  వినతా... శనివారం నాడు బావను కూడా తీసుకుని రా... ఆయనకీ డ్రెస్ కొనాలి...” అన్నాడు వేణు.

షాపింగ్ అయ్యాక, అక్కడే ఉన్న రెస్టారెంట్ కి కాఫీ తాగుదామంటూ తీసుకువెళ్ళాడు వేణు.  మధుబాలకి ప్రాణ సంకటంగా ఉంది. వినతతో స్నేహంగా మాట్లాడదామన్నా ఆమె అంటీ అంటనట్టు ఉంటోంది. ఏం మాట్లాడినా స్వోత్కర్ష, వాళ్ళ అత్తారింట్లో ఆమెను ఎంతో ప్రత్యేకంగా చూస్తారంటూ గొప్పలూ... కొన్ని సార్లు ‘ఏదో పుణ్యం చేసావు కాబట్టి మా ఇంటి కోడలివి అవుతున్నావు’ అన్న శ్లేష ఆమె మాటల్లో తెలియజేస్తూ ఉంటుంది...

“ఇక్కడ ఉప్మా చాలా బాగుంటుంది... తిందామా?” అన్నాడు వేణు...

“ఉహు.. నాకు కాఫీ చాలు...” అంది వినత.

“అదేమిటే, ఇద్దరం ఈ పక్కనే థియేటర్ లో సినిమా చూసి ఇక్కడికి వచ్చి ఉప్మా తినేవాళ్ళం కదూ? మరచిపోయావా? తిను... ఆర్డర్ చేస్తున్నా...” అని ‘మూడు ఉప్మా’ అని ఆర్డర్ చెప్పాడు.

“పెళ్ళి అయాకా ఆ ఉద్యోగం మానేస్తావా?” మధుబాల వైపు చూస్తూ అడిగింది వినత.

“మానేయటం ఎందుకూ?” అయోమయంగా వేణుగోపాల్ వైపు చూసింది మధుబాల.

“ఉహు, మానదు...మంచి ఉద్యోగమే కదా...” అన్నాడు వేణు.

“ఏమోలే., మనింటి ఆడవాళ్ళు ఉద్యోగం చేయటం అమ్మకీ, నాన్నగారికీ ఇష్టమో కాదో అని...”

“అది నేను చూసుకుంటాలే... డోంట్ వర్రీ...ఊ... ఉప్మా వచ్చింది... తిని ఎలా ఉన్నదో చెప్పండి...” అన్నాడు వేణు.

“నిజమే, ఉప్మా చాలా బాగుంది...” అంది మధుబాల.

“శుభలేఖ ఇవ్వటానికి నువ్వు స్వయంగా రా అన్నయ్యా... మా అత్తగారికి పట్టింపు ఎక్కువ...” చెప్పింది వినత.

“అలాగే విన్నూ... సరే కాఫీయే కదా నీకు?”

“ఏదో ఒకటి చెప్పు...త్వరగా తాగేసి బయలుదేరదాం...”

ముగ్గురూ కాఫీ  తాగటం అయ్యాక కారులో బయలుదేరారు ముగ్గురూ. దారిలో తన రూమ్ దగ్గర దిగిపోయింది మధుబాల.

***
 

“హలో మధూ, మన పెళ్ళి శుభలేఖలు వచ్చేసాయి. ఈరోజు సాయంత్రం ఇంటికి రా... ఇద్దరం కలిసి వెళ్లి మా వినత ఇంట్లో ఆమె అత్త గారికి శుభలేఖ ఇద్దాము. సరేనా?” ఫోన్ లో చెప్పాడు వేణు.

“సరే” నని ఫోన్ పెట్టేసింది మధుబాల.

మధుకు పెళ్ళి కుదిరినప్పటినుండీ ఆమెను ఆఫీసులో అందరూ చాలా  అపురూపంగా చూసుకుంటున్నారు. తన మంచితనంతో, స్నేహంతో, కార్యదీక్షతో అందరికీ తలలో నాలుకలా మెలిగే మధూ అంటే అందరికీ ఎంతో ఇష్టం మరి.

ఆ సాయంత్రం ఇంటికి వెళ్లి స్నానం చేసి లేత నీలం రంగు కాటన్ చీరలో పువ్వులా తయారై వేణు ఇంటికి బయలుదేరింది మధుబాల.

ఆమెను సాదరంగా ఆహ్వానించారు సుగుణమ్మ, గోవర్ధనరావూ. హాల్లోని సోఫాలో బిడియంగా కూర్చుంది మధు.

తానే స్వయంగా చల్లని మంచినీళ్ళు తెచ్చి కాబోయే కోడలికి అందించి, పక్కనే కూర్చుంది సుగుణమ్మ.

“నిన్ననే శుభలేఖలు వచ్చాయ్ మధూ... మీవి కూడా వచ్చేసాయా?”

“ఈరోజు ప్రెస్ నుంచి అన్నయ్య తెస్తానని అన్నాడు అత్తయ్యా..” మెల్లగా చెప్పింది మధు.

‘అత్తయ్య’ అని మధు పిలవగానే సుగుణమ్మ ముఖం చంద్రబింబం అయింది. భర్త వైపు ఓ చిరునవ్వు విసిరింది.

“ఇప్పుడు నాన్నగారి ఆరోగ్యం బాగుందా అమ్మా?” ఆప్యాయంగా అడిగాడు గోవర్ధనరావు.

“ఫర్వాలేదండి, ఇంట్లో ఉండలేకనే మళ్ళీ జాబ్ లో జాయిన్ అయ్యారు...”

“అబ్బాయి వచ్చేస్తాడమ్మా, ఉండు నీకు కాఫీ తెస్తా...” అంటూ లేచింది సుగుణమ్మ.

“అబ్బే, ఇప్పుడు ఏమీ వద్దు...” అని మధు చెప్పినా వినలేదు.

ఈలోగానే లోపలినుంచి వచ్చేసాడు వేణుగోపాల్ ట్రిమ్ గా తయారై.

“అమ్మా, మేము వెడుతున్నాం... కాఫీ బయట తాగేస్తాం...” అంటూ లోపలికి  ఓ కేక పెట్టి, కారు తీయటానికి బయటికి వెళ్ళాడు.

“సరేలేరా... వెళ్ళి రండి... వచ్చేటప్పుడు అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేసి రా...”  అంటూ ఇవతలికి వచ్చి, “వీడేడీ?” అంది మధుబాలతో.

“కారు తీస్తున్నారు అత్తయ్యా...” అంటూ వంగి ఆమెకు, గోవర్ధనరావుకూ  పాదాభివందనం చేసింది.

“వెళ్లి వస్తాను...” అంటూ వారి దగ్గర సెలవు తీసుకొని కారులో అతని ప్రక్కనే కూర్చుంది మధుబాల.

***

“వినత వాళ్ళ ఇల్లు నల్లకుంటలో...” డ్రైవ్ చేస్తూ అన్నాడు వేణు.

“ఓ, అలాగా? ఎవరెవరు ఉంటారు??”

“వినతా, దాని భర్త పవన్, అతని తల్లి సుందరమ్మ గారూ... ఆవిడ మంచం మీదనుంచి లేవలేరు. భర్త పోయిన తరువాత పూర్తిగా జబ్బుపడ్డారు. ఆవిడను చూసుకోవటానికి ఒక మనిషి పూర్తిగా ఇంట్లోనే ఉంటుంది. దీనికి పెద్ద బాధ్యత ఏమీ ఉండదు. అయినా భూభారం అంతా తానే మోసేస్తున్నట్టు ఫీల్ అవుతుంది. వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు. అది కూడా దీని గర్వానికీ, నోటి దురుసుతనానికీ ఒక కారణం. మధూ, వినత ప్రవర్తన నిన్ను నొప్పించినట్టైతే మనసులో పెట్టుకోకు ఎప్పుడూ... దానిని ఇంట్లో చాలా గారాబం చేసి చెడగొట్టేసాము అందరం... ముఖ్యంగా నేనూ...” కుడి చేతిని స్టీరింగ్ మీద ఉంచి డ్రైవ్ చేస్తూ, ఎడమ చేత్తో మధు చేతిని సున్నితంగా తాకుతూ చెప్పాడు వేణు.

“అలాగేనండి... ఎప్పుడూ అలా అనుకోను. కానీ ఆమె కొంచెం సౌమ్యంగా మారటానికి మీరూ కాస్త చెబుతూ ఉండండి...” అంది నవ్వుతూనే.

మరో ఐదు నిమిషాల్లో పెద్ద భవంతి ముందు కారు ఆగింది. గేటు దగ్గర ఉన్న గూర్ఖా కారు చూడగానే గేటు తెరిచాడు. లోపలికి  వచ్చి పోర్టికో లో కారాపి,  తాను దిగి మధుబాలకు చేయి అందించాడు.

“హాయ్ అన్నయ్యా, మధూ...” అంటూ పరుగుతో ఉత్సాహంగా ఎదురు వచ్చింది, వినత.

“ఏయ్ విన్నూ, వదినా అని పిలవాలే...” ముద్దుగా వినత తల మీద చిన్నగా మొట్టాడు వేణుగోపాల్.

“నమస్తే బావగారూ, నమస్తే చెల్లాయ్...” అంటూ పవన్ ఎదురు వచ్చాడు.

మెత్తని సోఫాల్లో కూర్చోగానే లోపలినుంచి జ్యూస్ గ్లాసులు వచ్చాయి.

ఏవో లోకాభిరామాయణం కబుర్ల మధ్యన జ్యూస్ తాగటం కొనసాగింది. ఇల్లంతా ఎంతో రిచ్ గా ఆధునికతనూ, ప్రాచీనతనూ కలబోసుకున్న అలంకరణతో ఎంతో బాగుంది. వాల్ టూ వాల్ కార్పెట్లు మెత్తగా ఉన్నాయి. హాల్లో మధ్యగా వేళ్ళాడదీసిన షాండిలియర్ పూల గుత్తిలా ఉంది... వెన్నెల దీపాల్లా తెల్లని వెలుగులను వెదజల్లుతూ వజ్రాభరణమల్లే వెలిగిపోతోంది. అడుగడుగునా సిరి తాండవమాడుతున్న ఆ పరిసరాలలో ఎందుకో ఉక్కిరిబిక్కిరిగా ఫీలయింది మధుబాల.

“అత్తయ్య గారిని చూద్దామా?” చేతిలో శుభలేఖతో లేచాడు, వేణు.

“అలాగే, అమ్మ కూడా ఎదురు చూస్తోంది...” అంటూ పవన్ తల్లిగదిలోనికి దారి తీసాడు.

లోపల గదిలో సుందరమ్మ తెల్లని మల్లెపువ్వు లాంటి పక్క మీద దిళ్ళకు ఆనుకొని కూర్చున్నారు. నడుముకు బెల్ట్ ఉంది. జుట్టు బాబ్ కట్ చేయబడి ఉంది. నుదుట విభూది రేఖలు. తెల్లని నైటీ లో శాంతి దూతలా ఉన్నది. పక్కనే ఆమె అటెండెంట్ యాభై సంవత్సరాల విమలమ్మ కుర్చీలో కూర్చుని మహాభారతం చదివి వినిపిస్తోంది.

వీళ్ళను చూడగానే ఆమె లేచి నిలబడి, మరి కొన్ని కుర్చీలను తెచ్చి గదిలో వేసింది.

“నమస్తే అత్తయ్యా...” ఆమె పాదాలను తాకి కళ్ళకి అద్దుకున్నాడు వేణుగోపాల్.

“చిరంజీవ! ఏం నాయనా, పెళ్ళి తేదీ కూడా ఖరారు అయిందట కదా...” సౌమ్యంగా పలికింది ఆవిడ గొంతు.

“అవును అత్తయ్యా, ఇదిగో ఈమె మధుబాల, నాకు కాబోయే భార్య...”

మధుబాల చటుక్కున ఆమెకి పాదాభివందనం చేసింది.

“చక్కగా మహాలక్ష్మి లాగా ఉన్నావు తల్లీ...”

“మొట్టమొదటి శుభలేఖ మీకే ఇస్తున్నా అత్తయ్యా...” పసుపురాసిన శుభలేఖను వేణు, మధు కలిసి ఆమె చేతుల్లో  పెట్టారు. సంప్రదాయసిద్ధంగా దేవుళ్ళ బొమ్మలతో, ‘జానక్యా: కమలామలాంజలి పుటే యా: పద్మరాగాయితా:’ శ్లోకంతో ప్రారంభింప బడిన ఆ శుభలేఖను ఆనందంగా పరికించి చూసింది సుందరమ్మ.

“పెళ్ళికి వినతా, అబ్బాయి వస్తారు నాయనా...నేను రాలేను కదా, నా దీవెనలు ఇప్పుడే, ఇక్కడే...” అంటూ సాభిప్రాయంగా విమలమ్మ వైపు చూసింది. ఆవిడ గిన్నెలో కొన్ని అక్షింతలు, ఒక పాకెట్ తెచ్చి ఇచ్చింది.

అక్షింతలు ఇద్దరి మీదా వేసి, “అమ్మాయ్ వినతా, ఇదిగో ఈ చీరను పసుపు కుంకాలతో పాటుగా మీ వదినకి ఇవ్వమ్మా...” అని చెప్పి ఇప్పించింది.

“చాలా థాంక్స్ అత్తయ్యా... మరి మేము వెళ్లి వస్తాము...” లేచాడు, వేణు.

“భోజనం చేసి వెళ్ళండి వేణూ... వినతా, ఏర్పాట్లు చూడమ్మా...”

ఆమె దగ్గర సెలవు తీసుకుని ఇవతలికి వచ్చేసారు వేణు, మధుబాల.

“చాలా లేట్ అయింది కదా బావా, భోజనం మరో సారి చేస్తాం... వెళతాం...” చెప్పాడు, వేణు వాచ్ చూసుకుంటూ.

“అబ్బే, అన్నీ రెడీ గానే ఉన్నాయ్ బావా... రండి... అదిగో ఆ వాష్ రూమ్ లో ఫ్రెష్ అవండి...” అని పవన్ చూపించటం తో ఇక తప్పలేదు.

ఏమనుకుందో ఏమో వినత ఆప్యాయంగానే అన్నీ వడ్డించింది. నలుగురూ కలిసి భోజనం చేసారు. “థాంక్ యూ వినతా...” అంది మధుబాల మనస్ఫూర్తిగా...

“అదృష్టవంతురాలివి మధూ నువ్వు... మంచి పట్టుచీర కొట్టేసావ్...” తగ్గు స్వరంలో అంటూ వంకరగా నవ్వింది వినత.

మధుబాల బాణం తగిలిన పక్షిలా విలవిలాడింది. ఏం జవాబు చెప్పాలో కూడా తోచలేదు. ఆ బాధ చూసిన వినత సంతృప్తిగా నవ్వుకొంది.

“వెళదామా?” మధు వైపు చూసాడు వేణు. సరేనన్నట్టు తలాడించి, పవన్ కూ, వినతకూ వెళ్లి వస్తానన్నట్టు చూసి, వెళ్లి కారులో కూర్చుంది మధుబాల.

చేతిలోని చీర పాకెట్ పాముల బుట్టలా అనిపిస్తుంటే, నిస్సహాయంగా దాన్ని మోస్తూ కళ్ళు మూసుకుంది. దారిలో రెండు మూడు సార్లు వేణు పలకరించినా పలకలేదు. ‘ఏమైందో, ఏమో...’ అయోమయంగా అనుకుంటూ ఆమెను ఇంటి దగ్గర దింపేసి వెళ్ళాడు వేణుగోపాల్.

***

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్