Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sardhakata

ఈ సంచికలో >> కథలు >> శోభాయమానం...శోభనం

shobhayamana shobhanam

రాంబాబు పెళ్లి అంగరంగ వైభవంగా హైద్రాబాదులో జరిగింది. ఆడపెళ్లివారు సిటీలో వున్న ఓ శుభకార్యం కోసం చుట్టాల్లింటికి రావడం, అదే ఫంక్షన్ కు రాంబాబు తల్లిదండ్రులు కూడా రావడం, మాటల్లో ఒకళ్లకొకళ్లు తమ పిల్లలకు సంబంధాలు వెతుకుతున్నామని చెప్పుకోవడంతో ఆదరబాదరగా అక్కడే పెళ్లిచూపుల ఏర్పాటు జరిగిపోయింది. రాంబాబు స్ఫురద్రూపి. చూడచక్కగా ఉంటాడు. మంచి చదువు హైటెక్ సిటీలో చక్కటి ఉద్యోగం. అమ్మాయి రజని కాస్త నలుపే కానీ కళగల ముఖం. ఇంటరు వరకూ చదివింది. ఇంటిపనులన్నీ చేయగలదు. వంటలు ఆమోఘంగా చేసి మెప్పించగలదు. కుట్లూ అల్లికల్లాంటివి కరతలామలకం. అమ్మాయి గుణగణాలన్నీ అందర్నీ, ముఖ్యంగా కాబోయే అత్తగార్ని మెప్పించాయి. ఇహనేం దగ్గర్లో ఉన్న మంచి ముహూర్తాల్లో నిశ్చయ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం అపై పెళ్లి జరిగిపోయి కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్న లోకోక్తిని నిజం చేశాయి.

"బావగారూ, సరైన వ్యవధి లేకపోయినా కాలం కలసి రావడంతో, నలుగురు చట్టాలూ చేయివేయడంతో ఇక్కడే పెళ్లి జరిపించేశాం. శోభనం మాత్రం మా ఊళ్లో అంకాలమ్మ దేవతని కొత్తదంపతులు దర్శించుకుని పూజ చేశాక మా ఇంట్లో ఏర్పాటు చేస్తాం. అభ్యంతరం ఏమీ లేదు కదా?"అన్నాడు అచ్యుతరావు.

"దాందేవుందండీ, మేము మీ ఉరినీ, మీ సంప్రదాయాలనూ చూడాలి కదా. అక్కడి వాళ్లూ వీళ్లిద్దరినీ చూసి ఆశీర్వదించాలి! పైగా అబ్బాయి మీ ఇంటికి వస్తూ పోతూ ఉండాలి కూడానూ!"అన్నాడు వివేకవర్ధనరావు.

*****

వెన్నంటిగూడేం  స్టేషన్లో రైలు ఆగింది.

పెళ్లివారందరూ దిగారు. దిగంగానే వేడి సెగ బలంగా ముఖానికి తాకి పలకరించింది. దాంతో రాంబాబుతో సహా మగపెళ్లివారికి శోషవచ్చినంత పనైంది.

వీళ్లను తీసుకెల్లడానికి ఎడ్లబండ్లు వచ్చాయి. కొత్త పెళ్లికొడుక్కి, పెళ్లికూతురికీ మాత్రం కారొచ్చింది. అందరూ ఎక్కి బయల్దేరాక_ రాంబాబు కారు డ్రైవరుతో"కాస్త ఏ సి వెయ్యవా? బాగా ఉక్కపోస్తోంది"అన్నాడు.

"ఆయ్..దీంట్లో ఆ పెసిలిటీ లెదండీ.."అన్నాడు.

రాంబాబు గుండాగిపోయింది. సిటిలో, రాంబాబు ఇంట్లో, వెళ్లే క్యాబ్ లో, ఆఫీసులోనూ ఏ సీ నే. పాతకాలం నాటి బొగ్గుల ఇంజన్లో కూర్చున్నట్టుంది అతని పరిస్థితి.

"బాబూ ఒక్క సారి కారు ఆపు"అని కారు ఆపంగానే గబుక్కున దిగి గట్టిగా వేడిగాలి పీల్చుకుని "ఇహనేను కారులో రాను. ఎడ్లబండీలో వస్తా"అని రెల్లుగడ్డితో టాపు వేసి ఉన్న బండేక్కి కూర్చున్నాడు.

ఎండ మాత్రం వేడి గాలులతో చండ ప్రచండంగా కాస్తోంది. గూబగుయ్యిమనిపిస్తోంది. కాస్త సేద దీరుదామంటే, చుట్టు పక్కల ఓ పచ్చని చెట్టు లేదు, తాగడానికి గుక్కేడు చల్లని నీళ్లు లేవు. 

ఎలాగో ఇంటికి చేరారు.

అది పెంకుటిల్లు. గబ గబా లోపలికెళ్లి, కుండలో నీళ్లు తాగాక కాస్త ప్రాణం తెరిపిన పడింది అందరికీ.

"మావయ్యగారూ, ఈ ఊరేంటండీ ఇలా ఉంది? ఒక్క చెట్టు లేదు, చల్లటి గాలి లేదు..చాలా హారిబుల్ గా ఉంది. నాకైతే నరకంలో ఉన్నట్టుగా ఉంది" అన్నాడు తడిచిపోయిన కర్చీఫ్ తోటే ముఖం తుడుచుకుంటూ.

"ఇక్కడింతే బాబూ, మాకిలాగే అలవాటైపోయింది. మీలాంటి నాజూకు జీవితాలు ఇక్కడుండటం కష్టమే!"అన్నాడు ఒకింత బాధగా.

*****

మరుసటిరోజు ఉదయం ఆరున్నరకే ఎండ భగ భగ లాడుతూ, నిప్పులు కురిపిస్తోంది.

నీళ్లు ఎక్కడో ఉన్న దిగుడుబావి నుంచి తీసుకురావడం వలన చాలా పొదుపుగా స్నాన కార్యక్రమం పూర్తిచేసి అంకాలమ్మ గుడికి బయల్దేరారు.

దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందా గుడి. కొండరాళ్లతో కట్టి వున్నదాంట్లో అమ్మవారి రాతిప్రతిమనుంచారు. అక్కడకూడా ఒక్క చెట్టూ లేదు నీడకు నిలబడదామంటే. లక్కీగా ఒక విశాలమైన రగ్గుకి నాలుగు వైపులా నాలుగు కర్రలు కట్టి ఎత్తుగా ఎత్తి పట్టుకున్నారు. దాని కిందకు బిల బిలమంటూ చేరిపోయారు అందరు. పూజయ్యేసరికి ఓ అరగంటయ్యింది. 

అందరి శరీరాలనుంచీ చమటలు ధారలు కట్టడంతో, నాలుకలు దాహంతో పిడచలు కట్టుకుపోతున్నాయి. ఇంటికి ఎలా చేరారో కూడా తెలియదు.

ఆ రాత్రే వాళ్లకి శోభనం.

విశాలమైన పందిరి మంచం. దానిపైన తెల్లటి దుప్పటి పరచి ఉంది. పూలు చల్లి ఉన్నా అవి వాడి, ఎండి పోయి ఉన్నాయి. మనిషి కూర్చుంటే కర కర మంటున్నాయి. పళ్లు కూడా అంతే! పైనున్న ఫ్యాన్ కిర్రు కిర్రు మని ఆపసోపాలు పడుతూ చిన్నగా తిరిగే ప్రయత్నం చేస్తోంది.

కిటికీలోంచి వేడిగాలి వీస్తోంది. పచ్చమొక్కలూ, పూలమొక్కలూ లేనేలేవు. ఆకాశాన ఉన్న చంద్రుడు కూడా వెలతెల బోతున్నాడు ఎందుకో.
అమ్మాయిని పాలగ్లాసుతో లోపలికి పంపారు. 

ఇద్దరికీ ముఖాన చెమట్లే! పెదాలపై శుష్కహాసాలే!

ఎవరికి వారు తమని తాము భరించడమే కష్టం..అలాంటిది మరొకర్ని దగ్గరకి తీసుకోవడం అసంభవం.

ఎలాగో ఇద్దరూ ఆ గదిలో ఒక అరగంట గడిపి ఇహా ఉండలేక బయట కొచ్చేశారు.

వాళ్లను చూసి అబ్బాయి, అమ్మాయి తల్లిదండ్రులు నిట్టూర్చారు.

రెండో రోజు కూడా అలాగే జరగడంతో-"బాబూ, ఇలా అయితే ఎలా? మూడు రాత్రుల ముచ్చట ఎలా తీరుతుంది?"అన్నడు అచ్యుతరావు చేతులు నలుపుకుంటూ.

"నిప్పుల కొలిమిలా ఉన్న ఆ గదిలో కార్యం ఎలా జరుగుతుందండీ అసలు? మనసు పులకరించడానికి పచ్చదనం లేదు. ఆహ్లాదమైన వాతావరణమూ లేదు. ఇహ మూడెలా వస్తుంది? అసలు మీరందరూ ఏళ్ళకేళ్లుగా ఇక్కడ కాపురాలు ఎలా చేస్తున్నారండీ? ఇలా అయితే ఈ ఊళ్లో మానవ మనుగడ అంతరించి పోవడం ఖాయం."అన్నాడు ఆవేశంగా.

"అవును బాబూ! ప్రకృతిపట్ల మా స్వార్థంతో కూడిన నిర్లక్ష్యమే దీనికి కారణం. అవసరార్థం చెట్లను కొట్టుకుంటూ పోయాం తప్ప ఒక్క మొక్కా నాటలేదు. ఎల్లలుగా ఉన్న కొండల్ని రాళ్లు రప్పలుగా చేసి పట్నాలకు పంపించేశాం. ఊరికి ఆనుకుని ఉన్న అడవిని చేతులారా నాశనం చేసుకున్నాం. పొలాల్ని బిల్డర్లకు అమ్మి స్థలాలుగా మార్చేశాం. భూజలాన్ని అందినంత జుర్రేశాం. చెరువుల్ని పూడ్చి ఇళ్లు కట్టేసుకున్నాం, వర్షపు నీటిని కూడా జాగ్రత్త చేసుకోలేకపోయాం. కిల కిలలాడే పక్షులు లేవు, ఆదుకునే జంతువులు, క్రిమి కీటకాదులు లేవు, ఇప్పుడనుభవిస్తున్నాం. శ్మశానంలోని ప్రేతాల్లాగా అనుభూతుల్లేని జీవితం గడుపుతున్నాం."అన్నాడు పశ్చాత్తాపంతో కళ్లనీళ్లు నింపుకుని. అక్కడున్న నలుగురైదుగురు ఊరి పెద్దలు కూడా తల వంచుకున్నారు.

"అందుకే బాబూ, అంకాలమ్మ పూజ అయిపోయింది కాబట్టి నువ్వు అమ్మాయిని నీతో తీసుకపో. అక్కడ హాయిగా మూడోరోజు గడపండి. పట్నంలో హాయిగా ఉండండి"అన్నాడు.

"అలా ఎవరికి వాళ్లం స్వార్థంగా ఆలోచించబట్టే..ఈ ఊరు వల్లకాడయింది. ‘ఇది మా ఊరు’ అని ఆప్యాయంగా చెప్పుకునే ప్రాధాన్యత కోల్పోయింది. రేపటి నుంచి నేనూ ఈ ఊళ్లో ఉంటాను. మీరందరూ నాకు సహకరిస్తే ఈ ఊర్ని నందనవనం చెద్దాం. ఈ ఊరు శోభాయమానం అయినప్పుడే మా శోభనం!"అన్నాడు స్థిరంగా.

అందరూ సహకరిస్తామని ఆనందంగా మాటిచ్చారు.

*****

రెండేళ్లు గడిచిపోయాయి.

ఇప్పుడు ఆ ఊరు పూర్తిగా మారిపోయింది.

ఎక్కడ చూసినా పళ్లతో ఒంగిన చెట్లు, పచ్చని తివాచీ పరచినట్టు పొలాలు. కిల కిలరవాల పక్షులు, పూడిక తీసిన బావుల్లో, చెరువుల్లో నీళ్లు. పచ్చతోరణాలు కట్టిన గుళ్లు గోపురాలు. ఆహ్లాదానికి మారు పేరుగా నిలిచింది. 

మనుషుల్లో కూడా జీవకళ వచ్చింది.

ఒకప్పుడు ఎవరు రావడానికి ఇష్టపడని ఆ ఊరు ఇప్పుడు ఆహ్లాదకరమైన విడిదై..అందర్నీ ఆకర్షిస్తోంది. రైల్వే స్టేషన్ జనాలతో కిట కిట లాడుతోంది.

ఆ రాత్రి రాంబాబు రజని దంపతుల జీవితంలో మిగిలిపోయిన మూడోరాత్రి సంబరం.

ఆ గది కమ్మటి సువాసన పూలతో, తాజా పళ్లతో అలంకరించబడి వుంది. కిటికీపక్కనున్న నైత్ క్వీన్ పరిమళం గదంతా మత్తుగా ఆవరించింది. ఉండుండి వీస్తున్న చల్లటిగాలి తనువుల్ని మైమరపిస్తోంది.

’రజనీ, చూశావా ఈ రాత్రి ఎంత ఆహ్లాదంగా ఉందో. కొత్త దంపతుల సమాగమానికి ఇలాంటి వాతావరణమే కదా కావలసింది."అన్నాడు కన్నుగీటి సన్నగా నవ్వుతూ.

"అవునండీ, మనకే కాదు ప్రతి జంట తనువును మనసునూ ఇలాంటి వాతావరణమే పులకరింపజేస్తుంది. మీరు అసిధారావ్రతంలా ఈ ఊరిని పచ్చబరచే కార్యక్రమం చేపట్టి సక్సెస్ పొందారు. మీలో చక్కటి నాయకత్వ లక్షణాలున్నాయి. అందుకే ఎవరికి వారు అన్నట్టున్న వారిని ఒక తాటిపైకి తెచ్చి ఊరికి వన్నెతెచ్చారు. మా ఊరివాళ్ల తరఫున మీకు కృతజ్ఞతలు!"అంది రాంబాబు కాళ్లకి దణ్నం పెట్టుకుంటూ.

"పిచ్చీ, సమస్యను చుసి భయపడి పారిపోవడమూ, రాజీ పడడమూ సమాధానంకాదు. పరిష్కరించాలి. ఆ అంకమ్మ దయవల్ల అన్నీ చక్కబడ్డాయి. మీ నాన్నగారి కోరిక ప్రకారం మనిద్దరికీ మీ ఊళ్లోనే మిగిలిన మూడోరోజు శోభనం జరగబోతోంది. ఇహ ఇన్నేళ్ల విరహం నన్ను ఆగనియ్యడం లేదు. పరవళ్లతో ప్రవహిస్తూ కట్టలు తెంచుకోవాలని చూస్తోంది." అని ఆమెని దగ్గరకి తీసుకుని ఆలింగన చుంబన కర్యక్రమాలతో విజృంభించాడు. ఆకాశంలోని చంద్రుడు మనస్ఫూర్తిగా ఆ జంటపై కిటికీగుండా చల్లని వెన్నెల గుమ్మరిస్తూ సహకరించాడు.

 ***                     

 

మరిన్ని కథలు
manasunte