Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే ....http://www.gotelugu.com/issue161/457/telugu-serials/nagaloka-yagam/nagalokayagam-serial/

‘‘వేరెవరు?’’
‘‘నేను.....’’
ఉన్నట్టుండి ‘నేను’ అంటూ విన్పించిన వికృత స్వరానికి ఉలికి పడ్డారిరువురూ. భద్రా దేవి సందియము వృధా పోలేదు. ఎవరో వున్నారు.
‘‘ఎవరది?’’ చేతిని ఖడ్గం పిడి మీదకు పోనిస్తూ అరిచాడు ధనుంజయుడు.
‘‘నేనే...’’ అంటూ ఆ వికృత స్వరం తిరిగి విన్పించింది.
‘‘ఏయ్‌! బ్రతకాలనుంటే సజావుగా బదులు చెప్పుము. నేనంటే ఎవరు నీవు? ఎచట వున్నావు?’’ గద్దించాడు.
ఈసారి భయంకరంగా`
వికృతమైన నవ్వు విన్పించింది.
ఆ నవ్వు కొండ కోనల్లో మారుమ్రోగింది.
ప్రశాంతంగా గూళ్ళలో వున్న పక్షులు కకావికలై గాల్లోకి ఎగిరాయి. ధనుంజయ భద్రాదేవిలు ముఖ ముఖాలు చూసుకున్నారు. నవ్వు ఆగిన వెంటనే` ‘‘నేను భూతాన్ని... నన్ను మీరు చూడ లేరు. నన్ను చూచినంతనే గుండె పగిలి చచ్చెదరు.’’ అంటూ మాటలు విన్పించాయి.
ఈ సారి భద్రా దేవి మాట్లాడిరది.
‘‘నువ్వు భూతానివైతే మాకేమీ... ప్రేతానివైతే మాకేమి? ఎక్కడున్నావు?’’ అంటూ గద్దించింది.
‘‘నేనీ వట వృక్షాన్ని ఆశ్రయించి ఎంతో కాలంగా వుంటున్నాను. ఈ మండపమందు నిద్రించు మానవుల జంపి నెత్తురు తాగి బతుకుతున్నాను. నా నుంచి మీరు తప్పించుకో లేరు. చాలా రోజుల పిమ్మట నేడు నా పంట పండినది. మీ నెత్తురుతో నాకు విందు భోజనమే. హ్హ హ్హ హ్హ’’ అంటూ కొండ చరియలు విరిగి పడుతున్నట్టు నవ్వింది భూతం.
‘‘ఏయ్‌! నీ వంటి పిరికి భూతాలనేకం జూచితిమి. నీకంత శక్తి ఉన్నచో మా ముందు కొచ్చి మాటలాడుము.’’ అంది భద్రా దేవి.
‘‘ఏయ్‌! నేను పిరికి భూతాన్ని కాదు. ఒక్క గుద్దుకు మీరు నెత్తురు కక్కుకుని చచ్చెదరు’’ అంది భూతం.
ఆ వెనకే వట వృక్షం కొమ్మ ఒకటి కిర కిర లాడుతూ విరిగి పడిరది. ఆ కొమ్మ నుంచి నల్లటి వికృతాకారం ఒకటి తమ వైపు గాల్లో తేలుతూ రావటం ఇద్దరూ చూసారు. దాని కళ్ళు ఎర్రగా నిప్పు ముద్దల్లా వున్నాయి. అది నేరుగా మండపము వంచకు వచ్చి ఎదురుగా గాల్లో నిలబడింది.
బహుశ భద్రా దేవి గురించి ఏ మాత్రం ముందుగా తెలిసినా ఆ భూతం ఎదురుగా వచ్చేది కాదేమో. నేరుగా భద్రా దేవి ఎదురుగా వచ్చి నిలవటంతో ఆమె వశీకరణ ప్రయోగానికి వెంటనే లోబడి పోయింది. పులిలా ఉగ్రంగా వచ్చిన భూతం కాస్తా పిల్లిలా శాంతంగా మారి పోయింది. అంతే`
సవినయంగా ఆమె సమీపంలో మోకాళ్ళ మీద కూచుని నమస్కరించింది. దాని ఆకారం నల్లగా భయంకరంగా వుంది. అది ఆడ భూతం. ‘‘మీ గురించి తెలీక ఏదో వదరితిని. నను మన్నించమ్మా’’ అంటూ వేడుకుంది.
ధనుంజయుడు విభ్రాంతుడై`
అలా చూస్తున్నాడు.
‘‘నీ నాయధేయమేమి?’’ భూతాన్ని ప్రశ్నించింది భద్రా దేవి.
‘‘నేను ఘృతాచియను భూతమును’’ బదులిచ్చింది భూతం.
‘‘ఏ ప్రాంతం నుండి యిటకు వచ్చితివి?’’
‘‘వైతరిణీ నదీ ప్రాంతమందు ఒక మాంత్రికుడు నన్ను పట్టుగొని వచ్చి యిచట వదిలి పోయినాడు. నాటి నుండి ఆ వట వృక్షము నాశ్రయించి వుంటిని.’’
‘‘సరి. ప్రస్తుతము నీవు నా వశమందుంటివి. ఉంటివి గదా?’’
‘‘అయ్యో ఎంత మాట. నేను మీ సేవకురాలిని. మీ ఆజ్ఞా బద్ధురాలిని. ఏమి చేయవలె?’’
‘‘కావలి... అప్రమత్తురాలివై ఈ రేయి మాకును, మా అశ్వముకును కావలి కాయవలె. ఈ మండపము వైపు మృగ సర్పాదులేవియును చేరి మమ్ము బాధింపకుండ జూడవలె. మా ఏకాంతమునకు విశ్రాంతికి భంగము వాటిల్ల రాదు సుమా...’’
‘‘చిత్తము. మీ సేవకురాలిని మీ ఆజ్ఞా బద్ధురాలిని’’ అంటూ నమస్కరించి రివ్వున గాల్లో తేలుతూ దూరంగా వెళ్ళి పోయింది ఘృతాచియనే ఆ భూతం.
అంత వరకు వినోదం చూస్తున్న ధనుంజయుడు`
ఉన్నట్టుండి ఫక్కుమని నవ్వాడు.
అది చూసి వెక్కిరింపుగా భావించి`
ముఖం ముడుచుకుంది భద్రా దేవి.
‘‘ఏమైనది ప్రభూ! అంతగా నవ్వితిరి?’’ పొడిగా అడిగింది.
‘‘ఇంకనూ ఏమేమి కానున్నదో తెలియదు గదా. అది తలచిన నవ్వు వచ్చినది.’’
‘‘ఒకింత అవగత మగునటు నుడువ వచ్చును గదా!’’
‘‘ఏమున్నది. అంతా వశీకరణమే. రాజ వశ్యమే... నేనే నీ వశమైతిని గదా.... మృగ వశ్యమ్‌... అంతటి మృగ రాజే నీ వశమైనాడు. సర్ప వశ్యమ్‌... పామును రప్పించి తండా లోని బాలుడ్ని కాపాడినపుడే తెలిసి పోయినది. సర్పము నీ వశమని. ఇక భూత వశ్యమ్‌. ఇప్పుడు ప్రత్యక్షముగ వీక్షించితిని. ఘృతాచి నీ వశమైనది. ఇంకను వేరేమి నీకు వశం కానున్నవో తలచి నవ్వితి’’ అంటూ తన నవ్వుకి అర్థం వివరించాడు.
అంతా విని మరింత ముఖం ముడుచుకుని కూచుంది భద్రా దేవి. కొన్ని లిప్తల తర్వాత గాని ఆమె అలకను గుర్తించ లేదు ధనుంజయుడు.
ఓ చేత్తో లత వంటి ఆమె నడుంని చుట్టి ఒడిలోకి లాక్కున్నాడు. ముఖం లోకి తొంగి చూసాడు. జాబిలి జిలుగుల వెలుగులో ఆమె ముఖ పద్మాన్ని ఎంత వీక్షించినా తనివి తీరదనిపించింది.
‘‘ప్రియా.. నీవిలా అలక బూనిన సైపజాలనని తెలియదా? ఇప్పుడు నేనేమి కువచనము పలికితినని ఈ కినుక?’’ అంటూ లాలనగా అడిగాడు. ఆ అన్నులమిన్న అలకలో మరింతగా ముద్దొస్తోంది.
‘‘కువచనము గాదులే ప్రభూ. మీ మనసున మాటే పలికినారు. ఏమి? నా వశీకరణమునకు మీరు నా వశమైతిరా? మీ మీద వశీకరణము ప్రయోగించితినా? ఎంత మాట! మనసా వాచా నా వలెనే మీరును నను వలచితిరనుకొంటి గాని ఇలాంటి అపోహ ఒండు మీ మనమున గలదని తలచనైతి. పోనిండు. ఇప్పటి కైనా బయట పడినారు. ఇక మీదట మనము ఎడముగా ఉండుటయే మేలు.’’ అంటూ ఒడిలోంచి పక్కకు జరగ బోయింది.
కాని ధనుంజయుడు విడువ లేదు.
భద్రా దేవి అలిగిన కారణం అప్పటి గ్గాని అర్థం కాలేదు. ఏదో పరిహాసమున మాట పెదవి దాటినది. ఆమె నొచ్చు కొనుటలో ఆశ్చర్యము లేదు. పొరబాటు జరిగినది. ఇప్పుడీ పూ బోణిని ప్రసన్నం చేసు కొనుట ఎలా?
‘‘నా ఉద్దేశము అది కాదు భద్రా. నేనుగా నీ వశమైతి గాని నీవే వశీకరణమును నాపై ప్రయోగించ లేదు. అపార్థము జేసు కొని నన్ను వేధించుట న్యాయము కాదు.’’
‘‘క్షత్రియ కులతిలకమగు తమను వేధించునంతటి దానను గాను.’’
‘‘ఊహుఁ! పొరబాటున మాట జారితి. మన్నించుమని వేడుకొందునా?’’
‘‘అంతటి మాటలెందుకు లెండి ప్రభూ! నేనూ మీ దాసిని. ప్రభువు దాసిని మన్నింపు కోర కూడదు.’’
‘‘వేరేమి చేయ వలె? సదా సిరి వన్నెల సౌందర్య రాశివి. నేనుగా నీ సౌందర్యమునకు దాసుడనైతి. చాలునా... ఇప్పుడు నీ అలుక తీర్చు మార్గమెయ్యెది?’’ అంటూ భద్రా దేవిని తిరిగి బిగి కౌగిట బంధించి ముద్దులతో అభిషేకించాడు. బామాలి బ్రతిమాలి చివరికి ఎలాగో ఆమెను ప్రసన్నం చేసుకో గలిగాడు. భద్రా దేవి కూడ కొసరి కొసరి ముద్దు లిచ్చి మురిపించింది. చివరికి ఆమె ముంగురులను సవరించి అడిగాడు` ‘‘భద్రా! ఇప్పుడైనా నీ వివరములు విన వచ్చునా? చెప్పవా?’’ అంటూ.
‘‘ఇప్పుడా ప్రభూ!’’
‘‘ఇప్పుడే దేవీ. ఇంత కన్నా మనకు ప్రశాంతమగు సమయము చిక్కునా? పోగ పోగ ఏమి జరుగునో ఏమో. సంశయింపక వివరించుము.’’
అతడి కౌగిలి వీడి ఎడంగా`
పద్మాసనం వేసుక్కూచుంది భద్రా దేవి.
‘‘చెప్పండి ప్రభూ! ఈ రాత్రికే నా గురించి తెలుసుకొనదలిచినారా?’’ అడిగింది.
‘‘సందేహమే ప్రియా! నీవు తెలుపవలె. నేను వినవలె.’’
‘‘నా గురించి చెప్పుటకు ముందుగా మా వంశమూలము గూర్చి తెలుపవలె. అనగా మనమొక పరి కలియుగారంభకాలమున ఏమి జరిగినదో తెలుసుకోవలె.’’
‘‘ఆరంభకాలమున ఏమున్నది. ద్వారక నీట మునుగుట, మా పెద్దలు పాండవుల స్వర్గారోహణ చేయుట పరీక్షిత్తు ప్రభువగుట ఇత్యాదులే గదా.’’
‘‘అవును. పరీక్షిత్తు మీ చంద్ర వంశాభి వృద్ధికి కారకుడు. కలి పురుషునే శాసించిన మహా శక్తి వంతుడైన ధర్మ ప్రభువు. కాని ఎంత గొప్ప వారయినా ఏదో ఒక తప్పు చేయక మానరు. పరీక్షిత్తూ విషయమున అదే జరిగినది. ముని బాలకుడి శాప వశాన వారం దినములో తక్షకుడను సర్పముచే మరణించనున్నాడు. ఆ సమయమున ఏమి జరిగినదో ముందుగా వివరించెద.’’ అంటూ చెప్పటం ఆరంభించింది భద్రాదేవి.
*******************************
భానుడు నెత్తిన నిప్పులు చెరుగుతున్న వేళ.
చెట్లు ఆకులు కదల్చటం లేదు.
పక్షులు ఎండకు భయ పడి గూళ్ళను వదిలి రావటం లేదు. అడవంతా నిశ్శబ్ధమై గుబులు పుట్టిస్తున్నవేళ ఆ సమయన`
ఉక్క పోతకు చెమటలు గ్రక్కుతున్న శరీరంతో ఒక నడి వయసు భూసురుడు కాళ్ళకు చెప్పులు కూడ లేక రాజధాని హస్తినా పురికి గుడ్డ సంచి భుజాన వేసుకొని నడిచి పోతున్నాడు.
అది మండు వేసవి కాలం.
పరీక్షిత్తూ మహారాజు ప్రాణాల మీదికి తెచ్చినది కూడ ఆ వేసవి కాలమే.
క్షత్రియులకు, అందునా రాజ్యమును పాలించు ప్రభువులకు వేట ఒక వ్యసనము. అయితే కౄర మృగాలను వేటాడి, ప్రజల్ని పరి రక్షంచాల్సిన బాధ్యత కూడ రాజన్యులపై వుంది. ఆ విధంగా చూసినపుడు పరీక్షిత్తూ మహారాజు తన తండ్రియగు అభిమన్యుని వలెనే అవక్ర పరాక్రమ వంతుడు, మహా వీరుడు, ధర్మ ప్రభువు. ప్రజలు మెచ్చిన పరిపాలకుడు.
తన రాజ్యంలో ఎక్కడెక్కడ తన ప్రభావం చూపాలో చెప్పి కలి పురుషుడినే శాసించిన మహా శక్తి వంతుడు, ధీరో దాత్తుడు. కాని... ఎంతటి గొప్ప వాడైనా, న్యాయ ధర్మాలు తెలిసి వున్నా కూడ ప్రారబ్ధ కర్మననుసరించి ఒక్కో సారి అనుచితంగా ప్రవర్తించి భంగ పడతారు. పరీక్షిత్తూ విషయంలో కూడ అదే జరిగింది.
సమీపంగా సపరివారంగా అడవికి వేట కెళ్ళి కొద్ది రోజులు అక్కడే వున్నాడు. వేట చివరి రోజు.
మృగయా వినోదంలో పడి తన పరివారానికి దూరమయ్యాడు. అసలే వేసవి కాలం. దప్పికతో ఒక ముని ఆక్రమానికి చేరుకున్నాడు. దాహానికి నీరు అడిగాడు. తపో నిష్టలో వున్న ముని పరీక్షిత్తును గమనించ లేదు.
ఏమీ... తనంతటి రాజన్యుడు స్వయంగా దాహార్తితో వస్తే పట్టించుకొనక పోవుటయా... ఇంత అహంకారమా అని కోపించి సమీపము లోని ఒక చచ్చిన సర్ప మృత దేహాన్ని ముని మెడలో వేసి అవమానించి తన దారిన వెళ్ళి పోయాడు.
పిమ్మట వచ్చి చూసిన ఆ మునీంద్రుని కుమారుడు కోపోద్రిక్తుడై` ‘‘చచ్చిన పాముని మెడలో వేసి నా జనకుని అవమానించిన ధూర్తుడు ఎంత గొప్ప వాడైనా గానీ, నేటికి వారము దినము లోపల తక్షకుడనే పాము కరిచి మరణించు గాక’’ అంటూ ఘోరంగా శపించాడు.
ఆ ముని పుత్రునికి శాపమిచ్చుటే గాని వెనక్కి తీసుకోనుట తెలీదు. మునీంద్రుడు జరిగిన దానికి బాధ పడి, వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోమని హస్తినకు కబురంపాడు.
పరీక్షిత్తు మహారాజు వూహించని పరిణామం యిది. ఇప్పుడు పరితపించి ప్రయోజనం లేదు. తక్షకుడి నుండి ఎలా తప్పించు కోవాలో అర్థం కాలేదు. మంత్రుల సలహా మేరకు వెంటనే పరీక్షిత్తు ఒంటి స్తంభం మేడ లోకి మారాడు. పాములు ఏవీ రాకుండా ఆ మేడను చుట్టి అగ్నివలయం ఏర్పరిచాడు. ఒక్క బ్రాహ్మణులు తప్ప ఎవరూ లోనకు పోకుండా కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు. అంతే కాదు`
తక్షకుడి నుండి తనను కాపాడిన వారికి ఎనలేని ధన కనక వస్తు వాహనాలు కానుకలు యిస్తానంటూ తన రాజ్యమంతటా ప్రకటించాడు.
అప్పటికి అయిదు దినాలు గడిచి పోయాయి. ఈ విషయం తెలిసిన తన భార్య సలహా మేరకు అగ్నిభట్టారకుడను ఆ భూసురుడు పరీక్షిత్తును కాపాడేందుకు హస్తినకు బయలుదేరి పోతున్నాడు.
అగ్నిభట్టారకుడికి భార్య యిద్దరు కొడుకులు. అదే అతని కుటుంబం. అతను గొప్ప దైవ భక్తుడు. వేద వేదాంగాలు చదివాడు. అంతకు మించి సిద్ధ వైద్యుడు. ఆ పైన గొప్ప పాముల మంత్ర వేత్త. ఎలాంటి సర్పమైనా అతడి ముందు తల వంచాల్సిందే. గ్రామంలో వున్న కొద్ది పాటి భూమిలో సేద్యం చేసుకుంటూ పది మందికీ వైద్యం చేసుకుంటూ పేదరికంలోనే గడుపుతున్నాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali serial