Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> వేసవి విడిది

vesavi vididi

“ ఇంకా ఆ పల్లెటూరిలో ఇల్లు, భూములు  దేనికి నాన్నా... అయిన కాడికి అమ్మేయండి ...ఇప్పుడు ఏవో సెజ్ ల కోసం భూములు  సేకరిస్తున్నారు కదా! వాటికి ఇచ్చేయ రాదూ! మంచి రేటే వస్తోంది కూడా...అమరావతి రాజధాని అవుతూంటే భూముల ధరలకి  రెక్కలొస్తున్నాయసలే ...మన వాటికి కూడా మంచి ధర పలక వచ్చు...ఏమంటారు?’’ అమెరికా నుంచి ఫోన్ చేసిన పెద్ద కొడుకు ప్రవీణ్  ఎప్పటి లాగానే పాత పాటే పాడి  ఊదర గొడుతూ ఉంటే  ‘అలాగేలేరా...చూద్దాం ...’’ అంటూ చిరు నవ్వు నవ్వాడు పుణ్య మూర్తి .
“ఇప్పటికి ఎన్నో సార్లు మీరీ విషయం చెప్పారు...మీ నాన్న గారు ఏమన్నా స్పందించారా? వృధా ప్రయత్నం కాక పోతేనూ!’’ పక్క నుంచి కోడలు సన్నాయి నొక్కులు నొక్కడం స్పష్టంగానే వినిపించింది పుణ్య మూర్తికి .

“చూద్దాం కాదు నాన్నా...మళ్ళీ మేమొచ్చేసరికి అమ్మకం జరిగిపోవాలి. తమ్ముడు ,చెల్లి కూడా ఇదే చెప్పమన్నారు.’’ కాస్త గట్టిగా చెప్పేసి ఫోన్ కట్ చేశాడు  ప్రవీణ్.

 పుణ్యమూర్తి మనసు చివుక్కుమంది. అలా వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేయడానికి అదేమీ తాతలనాటి ఆస్తి కాదు. తన స్వార్జితం. తండ్రి తనకిచ్చిన రెండెకరాల పొలాన్ని తన కష్టంతో పదెకరాలు చేశాడు. ఈలోపు పిల్లలు ఎదిగొచ్చారు .వాళ్ళ చదువులకోసం పట్నంబాట పట్టక తప్పలేదు. 

పల్లెలో ఆపొలాన్ని కామరాజుకి కౌలుకి ఇచ్చాడు. ఆయిల్లు కూడా అతడినే వాడుకొమ్మన్నాడు . పాపం ! గత ఇరవై ఏళ్లుగా వాటి మంచిచెడ్డ అతడే చూసుకుంటున్నాడు. తన ఖర్చులకి గాను కొంత డబ్బు తీసుకుని మిగతా సొమ్మును తన బాంక్ అకౌంట్ లో జమ చేస్తున్నాడు. 

అలాంటిది ఇప్పుడు ఉన్నట్లుండి భూములధరలు పెరిగాయని వాటిని అమ్మేస్తే బంగారం పండే పొలాలు బీళ్ళు అయిపోవడమే కాకుండా వాటినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న కామరాజు, అతడి కుటుంబం వీధిన పడతారు.

ఈ పిల్లల పంతం కాకపోతేనూ ...వాళ్ల్లకి ఆపొలాలు అమ్మేయాలన్న పట్టుదల దేనికో ! వాటిని అమ్మేస్తేగాని తమకి జరగదు అన్నబాధలేదు . ఒక్కొక్కళ్ళూ  విదేశాలలో  స్థిరపడి  డాలర్స్ పండిస్తున్నారు. ఆ పంటలతో ఇండియాలో స్థిరాస్తులు సమకూర్చుకుంటున్నారు. బంగారాలు కొనుక్కొని బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకుంటున్నారు .

ఇంకా డబ్బు కూడబెడదామన్న తాపత్రయం దేనికి ! పోయేటప్పుడు వెంటరావని తెలిసినా మనుషులకి ఈ భవబంధాల మీద, భోగభాగ్యాల మీద మమకారం నశించదు ఎందుకో! ప్రతివాళ్ళు ఎంతో కొంత కూడబెట్టి వారసులకి మిగిల్చిపోదామని ఆరాట పడేవారే .

వేదాంతధోరణి తొంగిచూసింది పుణ్యమూర్తి లో.

“ఎవరూ! పెద్దాడేనా ఫోను! ‘’వంటింట్లోంచి చేతులు తుడుచుకుంటూ వచ్చింది కమల.

అవునన్నట్లుగా తలూపాడు పుణ్యమూర్తి.

“ఏమంటాడు?’’

“ఏముంది!పాతపాటే!’’ విసుగ్గా చెప్పాడు పుణ్యమూర్తి.

“మీకు మాత్రం అంత పట్టుదల దేనికండీ. మన తరువాత ఆ పొలాలు అన్నీ చెందవలసింది  వాళ్ళకే కదా! అప్పుడు మాత్రం వాళ్ళు వాటిని అమ్మి సొమ్ము చేసుకోరని గ్యారంటీ ఏమిటి? అదేదో మనం బతికుండగానే చేసామనుకోండి ...వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా!’’ మాతృప్రేమ గంగలా ఉప్పొంగింది కమలలో.

“వాళ్ళ సంతోషం కోసం నన్ను నమ్ముకున్న మనుషులకి అన్యాయం చేయలేను. నీకు మాత్రం తెలియదా! మనం పొలం, ఇల్లు అమ్మేసి ఇచ్చిన సొమ్ము వాళ్లకి సముద్రంలోకాకిరెట్ట తో సమానం అని.నేను బతికున్నన్ని నాళ్ళు కూడా వాటిని అమ్మే ప్రసక్తి లేదు ’’ కాస్త కోపంగా అన్నాడు పుణ్యమూర్తి.

“హు(...నేను చెప్పినమాట మీరు ఎప్పుడూ విన్నారు కనుక!’’ మూతి ముడుచుకుని లోపలికి పోయింది కమల.
తల్లిప్రేమతో కమల తనకి ఎదురుచెప్పిందే కాని, వాస్తవం ఆమెకి మాత్రం తెలియదా ఏం! ...భారంగా నిట్టూర్చి చేతిలోని భగవద్గీతపైకి దృష్టి సారించాడు పుణ్యమూర్తి.

-----------------                  --------------------------------            --------------------------

“ఛీ...ఛీ... ఒకటే ఉక్కపోత...ఒకటే ఎండలు! ఈ సమ్మర్ లో మీ చెల్లి పెళ్లి  పెట్టినందుకు మీ బాబుని అనాలి ! హాయిగా డిసెంబర్ లో పెట్టి ఉంటే ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం.’’ చిరాగ్గా అన్నాడు ప్రవీణ్.

“బాగుంది ! మనకి కావాల్సినప్పుడు ముహూర్తాలు కుదరద్దూ! ఆ అబ్బాయి కూడా మీలాగా ఆత్రం పెళ్లికొడుకే! ఈనెలలోపెళ్లి చేసుకుని ,పెళ్ళాన్ని వెంట పెట్టుకుని అతను కూడా అమెరికా వెళ్ళిపోతాడుట! అందుకే ఇంత అర్జెంట్ గా  చేయాల్సివచ్చింది.’’ తానూ కూడా తగ్గకుండా చెప్పింది అతడి భార్య. 

“ఎలాగర్రా పిల్లలూ అలా విసుక్కుంటే... మీకోసం మీ నాన్న ఖర్చుకి వెనకాడకుండా మూడు బెడ్ రూముల్లోను ఏసీ లు పెట్టించారు. అయినామీరు  ఈ సుఖాల మధ్యనే పుట్టి పెరిగారా ఏమిటి! కష్టం సుఖం, ఎండ వాన అన్నింటికీ ఓర్చుకుంటేనే మనిషి...’’ మృదువుగా అంది కమల.

“ఆయనతో చేరి నువ్వు కూడా వేదాంతం వల్లించడం నేర్చావమ్మా ...చెప్పడానికి అన్నీ బాగానే ఉంటాయి...!మా బాధ నీకేం తెలుసు !’’ ఎండవేడిని తట్టుకోలేని  చిన్నకొడుకు నవీన్ చిన్నగా కసురుకున్నాడు. 

అతడు కూడా అత్తవారివైపు వాళ్ళ పెళ్లి ఏదో ఉంది అంటే కుటుంబంతో సహా దిగాడు.  

“అయినా ఏసీ అంటే పెట్టించారు కాని, పవర్ ఎక్కడినుంచి తెస్తారు?’’ తానూ మాట్లాడాను అనిపించుకోవడానికి పెదవివిప్పింది కూతురు కుందన.

తమ కడుపున పుట్టి తమని ఏమీ తెలియనివాళ్ల లా అలా తీసి పారేయడంతో కమల మనసు నొచ్చుకుంది. ఆ కోపం అంతా దేనికో ,ఆకస్సుబుస్సులు ఎందుకోసమో! అర్ధం అయిన పుణ్యమూర్తి గుంభనగా నవ్వుకున్నాడు. 

“మీరు మీరొచ్చిన శుభకార్యాలకి హాజరు అవడానికి ఇంకా వారం రోజుల టైం ఉంది. ఈలోపు సరదాగా అలా మన ఊరు వెళ్లి వద్దామా!’’ అడిగాడు బిడ్డలని ఉద్దేశ్యించి.

“ఎందుకూ! ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటేనే ఉండడం చాలా ఇరిటేటింగ్ గా ఉంది. కనీసం ఒక రెండు మూడు గంటల తర్వాతనన్నా పవర్ వస్తుంది అన్న గ్యారంటీ ఉంది. అక్కడేముంది! ఒకవేళ పవర్ పొతే ఎప్పుడొస్తుందో! ఏమిటో కూడా తెలియదు.’’ ప్రవీణ్ ఖండించాడు .
“అవునురా అన్నయ్యా,,,పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్లుంది వ్యవహారం.’’ హేళనగా నవ్వింది కుందన.

“మరేనమ్మా! ‘’ వదినలు వంతపాడారు.

ఏ మాత్రం చిన్నబుచ్చుకోలేదు పుణ్యమూర్తి. తనని అనే హక్కు వాళ్లకి తప్ప ఇంక  ఎవరికీ ఉంటుంది అన్నట్లుగా చిరునవ్వు నవ్వాడు.
“అలాకాదర్రా... నామాట వినండి. మనూరు వెళ్దాం . మీకు నచ్చకపోతే వెంటనే వచ్చేద్దాం. పిల్లలకి కాస్త ఆటవిడుపు గా ఉంటుంది. కాస్త ఈ పొల్యూషన్ కి దూరంగా తీసుకెళ్ళినట్లుగానూ ఉంటుంది. వాళ్ళ నాన్న, చిన్నాన్న అత్త పుట్టి పెరిగిన ఆపల్లెలను వాళ్ళనూ చూడనీయండి మరి!’’ నెమ్మదిగా అనునయించే ధోరణిలో చెప్పాడు పుణ్యమూర్తి.

ఏమనుకున్నారో మరి కాదనలేదు వాళ్ళు. పిల్లలందరూ కూడా గంతులేయనారంభించారు. అందరూ కార్లలో పల్లెదారి పట్టారు. 
వచ్చిన దగ్గరనుంచి పచ్చిగాలి వాసన తగలక అల్లాడిపోతున్నారో ఏమోగాని...పిల్లలు, పెద్దలు ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయనారంభించారు.

“అదృష్టం కొద్దీ మన ఊరికి ఇంకా పల్లె లక్షణాలు మిగిలే ఉన్నాయి.డబ్బు మీద ఆశతో పచ్చని పంటపొలాలని ఈ సెజ్ లపేరిట బీళ్ళుగా మార్చేస్తున్నారు. అందరూ అలా తమ భూములని అమ్మేసుకుంటే మనం తినేందుకు తిండి ఎక్కడనుంచి వస్తుంది! మీరంతా చదువుకున్నవారు. గ్లోబల్ వార్మింగ్ గురించి అవగాహన ఉన్నవారు.

ఇలా అభివృద్ధి కోసం అడవులు ఆక్రమించుకుని , చెట్లను నరుక్కుంటూ పోతే కొన్నాళ్ళకి ఈ ప్రపంచంలో పచ్చదనం అన్న పదమే వినబడదు. మొత్తం భూమండలమంతా ఉష్ణ తాపానికి విలవిలలాడిపోతుంది. ఒక పాతికేళ్ళ క్రిందట వేసవి కాలం ఎలా ఉండేది. మామిడిపళ్ళ తీయదనాన్ని, మల్లెల సౌరభాలని ఆస్వాదిస్తూ ఎంతో ఆనందంగా గడిచేది. కాని, ఇప్పుడు విపరీతంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో , అగ్నిగుండాన్ని తలపింపచేసే భూతాపంతో , బయటకు రావడానికి కూడా భయపడుతూ గడుపుతున్నాం.

ఇది ఆహ్వానించదగ్గ పరిణామమేనంటారా? నాకు వ్యతిరేకంగా ఆలోచించకుండా చదువుకున్న వాళ్ళుగా కాస్త ఆలోచించి చూడండి.’’ మెత్తగా సాగుతున్న పుణ్యమూర్తి మాటలు పిల్లలను నోరేత్తనీయలేదు.

మనసులో మాత్రం “అబ్బ ! ఈయనగారేమిటి ...ఇలా లెక్చర్ దంచుతున్నాడు ...’’ అనుకున్నారు .

అలా కబుర్ల మధ్యన, పిల్లల కేరింతల నడుమ ఊరు చేరారు వాళ్ళు. వీళ్ళు వస్తున్నారన్న మాట ముందే తెలియడం వలన కామరాజు ఘనస్వాగతం పలికాడు.

దాదాపు ఒక ఐదువందల గజాల స్థలంలో కట్టబడి ఉన్న పాతకాలపు పెంకుటిల్లు అది. ఇంటిచుట్టూ అనేక రకాల ఫలవృక్షాలు , పూలచెట్లు పెంచబడి ఉన్నాయి. బయట ఎండ మండిపడుతున్నా అక్కడమాత్రం హిమవంతంలాగా అతి శీతల వాతావరణం నెలకొని ఉంది. అదంతా అక్కడ ఉన్న చెట్ల మహాత్మ్యం వల్లనే అని వేరే చెప్పక్కర లేకుండా అర్ధం చేసుకున్నారు అందరూ. 

ఇల్లు పాతకాలం నాటిదే అయినా నిరంతరం కనిపెట్టుకుని ఉండి మరమ్మత్తులు అవీ చేయిస్తూ ఉండడం మూలాన కొత్తగానే కనిపిస్తోంది. పట్నంలో ఇరుకిరుకు గదులలో జీవితం గడపడానికి అలవాటు పడిన వాళ్లకి విశాలంగా, స్వేచ్చగా మసలడానికి వీలుగా ఉన్న ఇల్లు ఎంతో సౌకర్యవంతంగా అనిపిస్తోంది. 
దానికి తోడు కామరాజు దంపతుల ఆదరణ, ఆతిధ్యం వాళ్లని మరింత ఆనందిపజేశాయి. ఎరమరికలు లేని వాళ్ళ ఆప్యాయత, కల్మషం లేని వారి ప్రేమాభిమానాలు పుణ్యమూర్తి కుటుంబాన్ని రంజింపచేశాయి. మామిడితోటలు, పొలాలు అన్నీ చూసి చిన్నపిల్లలతో సమానంగా అల్లరిచేశారు పుణ్యమూర్తి పిల్లలు.
తాటిముంజెలు, మామిడిపళ్ళ మజాని మనసారా అనుభవించారు పిల్లలు, పెద్దలు తేడాలేకుండా.పూర్వంలా పల్లెలకి పవర్ కట్ అంతగా లేదు. కాని, పవర్ ఉందో...పోయిందో కూడా తెలియలేదు వారికి ఆచల్లని వాతావరణంలో. పట్నంలో లాగానే ఇక్కడ కూడా వడగాలులు వీస్తున్నా... ఆ బాధ తెలియడంలేదు వారికి .కారణం ఆ ప్రాంగణం అంతా పచ్చనిచెట్లతో నిండి ఉండడమే అని గ్రహించారు వారు.
‘వృక్షో రక్షతి రక్షితః’ అన్న మాటలకి అర్ధం తెలిసింది వారికి. తండ్రి ఆవేదన కూడా అర్ధం అయ్యింది. ఏ ఏసిలు కూడా ఇవ్వలేనంత చల్లదనాన్ని అందిస్తున్నాయి ఆ వృక్షరాజాలు.
ఒకరోజు కూడా ఉండడానికి ఇష్టపడకుండా ఆపల్లెకి రావడానికి సైతం వెరచిన వాళ్ళు, తిరుగుప్రయాణం ఊసే ఎత్తకుండా నాలుగురోజుల పాటు అక్కడే ఉండిపోయారు. 
“మీ చెల్లి పెళ్లి కాబట్టి నువ్వు కావలిస్తే వెళిపో ...నేను మాత్రం పెళ్లి వేళకి వస్తాను...’’ చెప్పేశాడు ప్రవీణ్ తన భార్యతో  .
“బాగుంది వరస! ఇప్పటినుంచీ నేను వెళ్లి మాత్రం ఏం చేస్తాను? సుఖానున్న ప్రాణాన్ని కష్టాన పెట్టుకోడానికి కాకపోతేనూ! నేనూ మీతోనే...’’ చెప్పేసింది ఆమె.
నవీన్- అతడి భార్య, కుందన - ఆమె భర్త అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అందరిదీ ఏకాభిప్రాయం కావడంతో మరి వేరే తలపే లేకుండా పోయింది.
“మమ్మల్ని క్షమించండి నాన్నగారూ...మీరు ఎంత ముందుచూపు తో ఆలోచించి ఈ ఇల్లు,భూములు అమ్మనన్నారో ఇప్పుడు అర్ధమైంది .ఉన్నవూరు , కన్నతల్లి అని ఎందుకన్నారో ఇప్పుడు తెలుస్తోంది. మా అభిప్రాయం తప్పని తెలుసుకున్నాం.ఇప్పుడు  మీరు ఈ ఇల్లు, పొలాలు అమ్మడానికి సిద్ధపడినా మేము ఒప్పుకోము. ఇకమీదట ఇదే మా వేసవివిడిది. డాలర్ల వేటలో అలసిపోయిన మేము సేదతీరడానికి ఇంతకన్నాగొప్పప్లేస్ ఏముంటుంది ?
 మీతదనంతరం కూడా కామరాజు మామయ్య కుటుంబం ఇక్కడే హాయిగా ఉండవచ్చును. మేము ఆయనకి ఏలోటూ రానివ్వము.’’ తనముందు నిలిచి ముక్తస్వరం తో పలికిన పిల్లలను చూస్తూఉంటే పుణ్యమూర్తి దంపతుల కళ్ళు ఆనందంతో చెమర్చాయి. 

మరిన్ని కథలు
melkolupu