Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ-ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

కిందటి వారం ప్రస్తావించినట్టు, మనదేశంలో ఎక్కడ చూసినా చెరువులనే వాటిని పూర్తిగా   reclamation  పేరుతో ఆక్రమించేశారు. కాలవల సంగతి పట్టించుకునే నాధుడే లేడు. కానీ ప్రభుత్వాలు జల యజ్ఞాల పేరిట మహత్తర కార్యక్రమాలు మొదలెట్టి ఏడెనిమిదేళ్ళయింది. అసలక్కడ ఏం జరుగుతూందో ఆ భగవంతుడికి కూడా తెలియదు. కానీ పత్రికల్లో మాత్రం ఇంత ఖర్చయిందీ,. అంత ఖర్చయిందీ అని ప్రకటనలొచ్చేస్తూంటాయి. ఓహో అనుకోవడం. ఈమధ్యన ఇంకో కొత్త రంధి ప్రారంభం అయింది—ఇంకుడు గుంతలట. కోటానుకోట్లు ఖర్చుపెట్టేసి, టీవీల్లోనూ పత్రికల్లోనూ హోరెత్తించేస్తున్నారు.. అప్పుడెప్పుడో  భూగర్భంలోంచి నీళ్ళు తీయడానికి బోరుబావులని తవ్వుతూండేవారు. రావడానికి నీళ్ళుండొద్దూ? నీళ్ళు లేవుకానీ, ఆ బావులని అలాగే, ఏ మూతా పెట్టకుండా వదిలేయడమూ, దాంట్లో ఏ చిన్నపిల్లో, ప్రమాదవశాత్తూ పడి ప్రాణాలమీదకి తెచ్చుకోవడమూ, ఆ కార్యక్రమాలని ప్రత్య్క్షప్రసారాలు చేయడమూ, ప్రభుత్వాలు ఓ ప్రకటన చేయడమూ—వాటికి మూతలు పెట్టనివారిమీద కఠిన చర్యలు తీసికుంటామూ అని. అదొక్కటే మిగులుతోంది. ఇప్పుడు కొత్తగా వస్తూన్న ఈ గుంటల గతికూడా అంతే. చివరకి రోడ్డుమీదుండే, చెత్తంతా వాటిల్లోకి చేరుతుంది.మనవాళ్ళకి ఓ చెడ్డ అలవాటుంది. ఎక్కడపడితే అక్కడ చెత్త పడేయడం. ఇప్పుడింకా సులభం. ఓ గుంట కూడా వచ్చింది.


ఇంక నదుల విషయంతీసికుంటే, అదేం చిత్రమో కానీ, ఏ రాష్ట్రానికారాష్ట్రం ఆనకట్టలు కట్టుకుంటూ పోతోంది.మనదేశంలో ఏ నదిని చూసినా, గుండె నీరైపోతోంది.  పారిశ్రామిక అభివృధ్ధి పేరు చెప్పి, ఎడా పెడా కర్మాగారాలొచ్చేశాయి. పరిశ్రమలుండకూడదని ఎవరూ చెప్పరు. కానీ వాటిని నిర్వహించేవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలిగా. వ్యర్ధ పదార్ధాలన్నీ convenient  గా పక్కనే ఉండే నదిలోకి వదిలేయడం. దానితో ఆ నది ప్రవహించే ప్రాంతమంతా కలుషితమైపోవడం. చట్టాలున్నాయి కానీ వాటిని పట్టించుకునే నాధుడే లేడు. కారణం, ఆ కర్మాగారాలకి రాజకీయ అండ ఉండడం.

ఒకానొకప్పుడు నిండుగా స్వఛ్ఛమైన నీటితో ప్రవహించే నదులన్నీ ఎండిపోయాయి. ఏదో నామమాత్రంగా నీరు ప్రవహించేవి కలుషితమైపోయాయి. ఇదివరకటి రోజుల్లో ఉండే నూతులన్నీ మూసుకుపోగా, కొన్ని సంవత్సరాలక్రితం బోరుబావులైతే మొదలెట్టారు, ఏదో ఓ పాతిక అడుగుల్లో నీళ్ళు కాస్తా, ఈరోజుల్లో వందల అడుగులు తవ్వినా దిక్కులేకుండా పోయింది. ఇదంతా ఓ ఎత్తైతే, అకాల వర్షాలోటీ.  ఓ గంట భారీ వర్షం కురిసిందంటే చాలు, ఆ నీళ్ళు వెళ్ళడానికి దారీ తెన్నూ లేక రోడ్లమీదా, పక్కనుండే ఇళ్ళల్లోనూ నిలిచిపోతూంటాయి. ఇదివరకటి రోజుల్లో పక్కా ప్రణాలికలు వేసి, మురుక్కాలవలైతే కట్టారు కానీ, ఈరోజుల్లో మచ్చుకైనా కనిపించవు. ఎక్కడమాయమైపోయాయీ అని తీరిగ్గా వెదికితే, వాటన్నిటిమీదా అక్రమ కట్టడాలొచ్చేశాయి. వాళ్ళందరికీ విలువైన ఓటు హక్కుండడంతో, మన పాలకులు కూడా, చూసీ చూడనట్టూరుకుంటారు. పైగా వాళ్ళందరికీ లైటు కనెక్షనూ, కుళాయి కనెక్షనూ కూడానూ.ఇళ్ళల్లోకి 0నీళ్ళొచ్చేస్తున్నాయీ అంటూ హడావిడోటీ. అసలు ఆ కాలవలమీద ఇళ్ళు ఎవడు కట్టమన్నాడూ?

ఇవన్నీ ఓ ఎత్తైతే కొత్తగా వచ్చిన స్వఛ్ఛ భారత్ అభియాన్ ఇంకో ఎత్తూ. ప్రతీ ఇంటికీ ఓ మరుగు దొడ్డి ఉండాలని, కోటానుకోట్లు ఖర్చుచేస్తున్నారు.. ఓ విషయం అర్ధం అవదూ, తాగడానికే నీళ్ళు లేకపోతే, ఈ మరుగు దొడ్లలో వాడడానికి నీళ్ళెక్కణ్ణుంచొస్తాయో తెలియదు.

చిన్నచిన్న పట్టణాలనుండి  మహానగరాల దాకా ఎక్కడ చూసినా ఆకాశాన్నంటే హర్మ్యాలే.మనం వాటిల్లో ఏ ఫ్లాట్టైనా చూడ్డానికి వెళ్ళినప్పుడు, నీళ్ళ విషయం అడిగితే , దూరంగా కనిపించే ఓ వాటర్ ట్యాంకూ, ఆ సొసైటీ ప్రాంగణంలో ఉండే బోరు పైప్పులూ చూపిస్తాడు. తీరా మొత్తం అన్ని ఫామిలీలూ వచ్చేసరికి, ఆ ఖాళీ పైప్పులుమాత్రమే మిగులుతాయి.. కార్పొరేషన్ వారి దయధర్మాలమీద వదిలే నీళ్ళె దిక్కు. చివరకి ఎక్కణ్ణించి తెస్తారో కానీ, వాటర్ ట్యాంకులూ. పోనీ నీటి కొరత ఎక్కువని, నీళ్ళ వాడకంమీద ఏదైనా నియంత్రణ పాటిస్తారా జనాలు, అంటే అదీ లేదూ. రోజువిడిచి రోజు నీళ్ళిస్తామని కార్పొరేషను వాళ్ళు ప్రకటించడం తరవాయి, ఆ నీళ్ళొచ్చినప్పుడు ఇంట్లోని అన్ని బాల్చీల్లోనూ, అన్ని బిందెల్లోనూ, గిన్నెల్లోనూ నింపేసికోడం. పోనీ అవన్నీ వాడతారా అంటే అదీ లేదు. అలవాటు పడ్డ ప్రాణాలు కదూ, ఈ బకెట్టు నీళ్ళూ ఏం సరిపోతాయి,  ఏ పనిచేసే ఆఫీసులోనో కాల కృత్యాలు తీర్చేసికుంటారు. మూడో రోజున తిరిగి నీళ్ళు రాగానే,  రెండురోజులముందు పట్టిన  బకెట్లూ బిందెలూ పారపోయడం. ఎవడికుపయోగించినట్టూ ఆ నీళ్ళూ?

 మనం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఉన్న నీళ్ళు  సరిపోతాయి. అదిలేకే కదా ఈ కష్టాలన్నీ…

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
andam - chandam