Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 20th may  to 26th may

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

పాండురంగమాహాత్మ్యము 

పాండురంగమాహాత్మ్యము కావ్యానికి కృతిపతి  ఐన విరూరి వేదాద్రిమంత్రి వంశమును అద్భుతమైన  65 పద్యాలలో వర్ణించాడు తెనాలి రామకృష్ణుడు. ఎంత గొప్ప పద్యములు ఐనప్పటికీ కేవలం వంశచరిత్రను, కృతిపతిని వర్ణించిన పద్యములు కనుక, ఆ కృతిపతికూడా వేరే ఎక్కడా తారసిల్లని వ్యక్తి కనుక ఈ భాగాన్ని వదిలి ప్రధానకథలోకి అడుగుబెడదాము.మిశారణ్యంలో సూతుడిని శౌనకాది మునులు ఒక ప్రశ్న అడిగారు. 

తులితోక్షధ్వజసూతుడై వెలయు సూతుం గాంచి మున్ శౌనకా
దులు 'క్షేత్రంబును వేల్పుఁ దీర్థము  బుధస్తుత్యప్రభావంబులై 
దళితైఘస్తిమిరంబులై యిహపరార్థప్రాప్తిమూలంబులై 
యిలపైనొక్కెడఁ గల్గెనే ననఘమూర్తీ! తెల్పవే' నావుడున్          (మ)

అక్షధ్వజుడు అంటే వృషభధ్వజుడు, శివుడు. సూతుడు అంటే సారథి. 'తులితోక్షధ్వజ సూతుడు' అంటే శివుని సారథి ఐన బ్రహ్మతో సమానుడు, అంటే బ్రాహ్మీమయమూర్తి, జ్ఞానములో. త్రిపురాసురులను నాశము చేసిన సందర్భములో పృధివి రధముగా, విధి  సారధిగా, నాలుగు వేదములు నాలుగు అశ్వములుగా, రవిచంద్రులు రథచక్రాలుగా ఉన్న రథానికి సారధిగా బ్రహ్మదేవుడు సహకరించాడు పరమశివునికి, ఆ బ్రహ్మదేవునికి సమానుడైన సూతుడిని, నైమిశారణ్యములో, శౌనకాది మహర్షులు ఒక ప్రశ్న అడిగారు. సూతుడు అనేది నిజానికి ఒక వ్యక్తికి ఉన్న పేరు కాదు. అది ఒక ప్రత్యేక ధర్మనిర్వహణకు ఉద్భవించిన జాతి. పృథుచక్రవర్తి ఒక యాగము చేస్తున్నపుడు ఒక పొరబాటు జరిగింది.ఏ కర్మకలాపములోనైనా, అర్చన, యాగము మొదలైనవాటిలో, చెబుతున్న మంత్రానికి  సంబంధించిన క్రియ దోషరహితముగా జరగాలి. ఏ మంత్రము, ఎప్పుడు ఉచ్చారణ  చేయబడుతున్నదో, ఏ క్రియ భావింపబడుతున్నదో, ఆ మంత్రానికి సంబంధించిన ఆ క్రియ అప్పుడు జరగాలి. లేకుంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అవుతుంది, డబ్బింగ్ సినిమా డైలాగు లాగా! బ్రహ్మదేవునికి సంబంధించిన హవిస్సు కొద్దిగా ఆలస్యముగా, యింద్రుని మంత్రము చెబుతున్నపుడు సమర్పించడం జరిగింది, యజ్ఞగుండములో. దానితో బ్రహ్మ, క్షత్రియ తేజస్సుల సంకరం జరిగింది. యజ్ఞగుండములోనుండి ఒక దివ్యపురుషుడు వెలువడ్డాడు. ఆతడే ఆది సూతుడు. పురాణవిజ్ఞాన ప్రచారము, ఆయుర్వేదము, యుద్ధసంబంధమైన అస్త్రశస్త్రాలను, రథములను సిద్ధము చేయడం, సారధ్యం చేయడం మొదలైనవి ఆ జాతి ధర్మాలుగా ఏర్పడ్డాయి. వారి విధులలో అత్యుత్తమమైనది పురాణ ప్రవచనము. మహాభాగవతము రోమహర్షణుడు అనే మహర్షి ఐన సూతునికి కుమారుడైన ఉగ్రశ్రవసుడు అనే సూతునిచే నైమిశారణ్యములోని మహర్షులకు నిపింపబడింది. ఆ రోమహర్షణుడు వ్యాసులవారి ప్రత్యక్ష శిష్యుడు. భారతీయుల పురాణ చర్చ అంతా సూతులద్వారా జరిగింది. అది జాత్యేకవచనముగా సంప్రదాయము కనుకనే, సూతుడు యిలా చెప్పాడు అనడమే గానీ ఆ సూతుని నామధేయము ఎక్కడా మనకు కనిపించదు, ఒకే వ్యక్తి కాకపోవచ్చు, వేర్వేరు వ్యక్తులు వేర్వేరు పురాణములను ప్రవచింపనూ వచ్చు, అది అప్రస్తుతము అనే ఉద్దేశముతో ఆయా సూతుల పేర్లు మనకు చెప్పడం కనిపించదు. సూతులకు కులగురువు సాక్షాత్తూ వేదవ్యాసులవారే అని సూచన. యిదీ సూతుల చరిత్ర సంక్షిప్తముగా. క్షేత్రము, అక్కడి వేల్పు, అక్కడి తీర్థము విద్వాంసులచే, జ్ఞానులచే పొగడబడుతూ,పాపపు చీకట్లను పారద్రోలుతూ, యిహపర ప్రాప్తికి మూలములై ఒకేచోట వెలసిన పుణ్యస్థలం ఏదైనా ఉన్నదా, తెల్పవయ్యా పుణ్యాత్ముడా! అని సూతుడిని అడిగారు. అప్పుడు సూతుడు చెప్పడం ప్రారంభించాడు.  

ఆ ఋషుల ప్రశ్న మంగీ
కారం బొనరించి పలుకుఁ గథకుఁడు శ్రీనా
థారాదన హితచర్యున్ 
బారాశర్యుం దలంచి ప్రాంజలి యగుచున్     (కం)

ఆ శౌనకాది ఋషుల ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అంగీకరించి, శ్రీహరిని ఆరాధించడమే  హితవుగా కలిగిన మహానుభావుడు, పరాశరుని పుత్రుడు ఐన వేదవ్యాసుని తలచి, మనసులో  నమస్కరించి చెప్పడం ప్రారంభించాడు సూతుడు. 'మహాత్ములారా! మీ ప్రశ్నకు సమాధానం గతములో ముమ్మార్లు వ్యాసులవారు నాకు వినిపించినది ఒకటి ఉన్నది. ఆ కథ అంతా మీకు  వినిపిస్తాను, వినండి' అని చెప్పడం ప్రారంభించాడు సూతుడు, కాశీపుర వర్ణనతో.

 
శీతాహార్యసుతాళినీ వికచరాజీవంబు, విశ్వేశ్వర 
జ్యోతిర్లింగ విశుద్ధరత్నఖని, మోక్షోపాయ ముక్తాబ్ది వే
లాతీరావని, డుంఠినామకగజాలానంబు, గంగామృత 
స్రోతోనిస్సృతిచంద్రగోళి యన మించున్ గాశి శ్రీరాశియై    (శా)

'మంచుకొండ కొమరిత'(పార్వతీదేవి)అనే తుమ్మెదకు వికసించిన తామరపూవువంటి  పరమశివుడు నెలవైన ప్రదేశము కాశి. విశ్వేశ్వర జ్యోతిర్లింగము అనే విశుద్ధమైన రత్నము ఉన్న రత్నఖని కాశీ. మోక్షోపాయము అనే పాలసముద్రపు తీరము కాశీ. 'డుంఠి' అనే 
పేరున్న గజమును కట్టిన స్తంభము, గణపతికి నెలవైన స్థలము కాశీ. గంగ అనే అమృతము స్రవించే చంద్రమండలము కాశీ.  సంపదలకు రాశి కాశి. 

ప్రాలేయాచాలకన్యకావదన శుంభత్పద్మ సౌరభ్యమున్ 
గ్రోలంగల్గియు దుష్టిలేక మునిహృత్క్రోడాబ్జ సౌగంధ్య లీ
లా లాలిత్యముఁ గోరు నొక్క సిత రోలంబంబు నైజాకృతిన్ 
డాలొందించు బరాసులన్ భ్రమరకీటన్యాయరీతిం బురిన్    (శా)

 గ్రోలడానికి హిమవత్పర్వత కుమార్తె వదనము అనే పద్మముయొక్క సౌరభ్యము ఉండికూడా, సంతృప్తి లేక మునుల మనసులనే పద్మముల సుగంధమును కోరుకునే 'తెల్ల తుమ్మెద' ఐన  శివుడు తన నిజాకృతితో 'పరమును ఆశించే' మునులను, వారి మనోపద్మములను ప్రకాశింపజేసే  పవిత్రస్థలం కాశీ. భ్రమరకీట న్యాయముతో మునులను తనలా మార్చేస్తాడు, వారికి సారూప్య 
ముక్తిని ప్రసాదిస్తాడు. తుమ్మెద కీటకాన్ని పట్టి తన గూటిలో ఉంచుతుంది. నిరంతరమూ ఆ  తుమ్మెద చేసే రొదను వినీ వినీ, అదే ధ్యాసతో ఆ కీటకము కూడా చివరికి తుమ్మెదగా మారుతుంది. దేనిమీద సర్వేంద్రియాలు లగ్నం చేసి ఉపాసన చేయడం జరుగుతుందో చివరికి ఆ రూపమే, ఆ భావమే పొందడం జరుగుతుంది, సాధనలోని చరమస్థితి అది. మునులు తమ మనసులలో పరమశివుడినే భావించి, అంతా శివమయమైపోయి, చివరికి వారూ శివోహం అంటూ, తామూ  శివులు అవుతారు, అద్వైతానుభావముతో. అలా పార్వతీదేవి  ఖపద్మమును, మునుల మనసులు అనే పద్మములను మరిగిన 'తెల్లని తుమ్మెదకు' నెలవైన స్థలము కాశీ.  
 
ఒకనాడుఁ దీర్థోపయోగి గాని శఠుండు / నౌఁదల ధరియించు నభ్రగంగ 
నాప్రొద్దు ప్రొయిరాఁజనట్టి నిర్పేదయు / భోగించు నైశ్వర్యము లెనిమిదియు 
బుష్కరాక్షులపొంతఁ బోని వర్షవరుండు / దేహార్ధమునఁ దాల్చుఁ దీఁగబోఁడి
నాయుధప్రభఁగాంచి యలఁగు భీరువుఁ బూను / వాఁడిముమ్మోముల వేఁడియలుగు   (సీ)

మలినవర్తనుఁడును సుధాలలితమూర్తి 
మించి వర్తించు మతిలేని మేదకుండు 
మౌనివర్యులఁ జదివించు మఱ్ఱినీడ 
బంచముఖువీట మేనోసరించెనేని              (తే)

కాశీపురాధీశ్వరుడైన పరమేశ్వరుడిని శ్లేషతో ప్రస్తుతి చేస్తున్నాడు. రామకృష్ణుని కవిత్వ  ప్రతిభకు ఉదాహరణలుగా చెప్పుకోదగిన పద్యాలలో యిది ఒకటి. ఆ మహానుభావుడు, శివుడు  ఒక్కనాడైనా ఏ పుణ్యతీర్థములోనైనా స్నానమాడి ఎరుగని  మూర్ఖుడు, కానీ నెత్తిమీద తీర్థరాజమైన గంగను పెట్టుకున్నాడు. సాక్షాత్తూ దేవగంగానది  ఆయన శిరస్సును ఆశ్రయించి తన పవిత్రతను పెంచుకున్నది, యింకా సామాన్య తీర్ధాలకు  ఆయన వెళ్ళాల్సిన పని ఏమున్నది అని విరుపు.  ఒక్కొక్క ప్రొద్దున ఆయన యింట్లో పొయ్యే రాజుకోదు, కూటికిలేని నిరుపేద! కానీ  అష్టైశ్వర్యములనూ అనుభవించే భోగి! ఆది భిక్షువు, ఆయనకు వండుకునే పనేమున్నది, అన్నపూర్ణయే ఆయన ఇల్లాలు, యింకా ప్రత్యేకముగా పొయ్యి రాజేసే పనేముంది? అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశత్వములు అనే అష్ట సిద్ధులను   అనుభవించేవాడు, తన భక్తులకు ప్రసాదించేవాడు, యిక వేరే ఐశ్వర్యములు ఆయనకు  ఎందుకు అని చమత్కారపు మెరుపు. తామరకన్నుల సుందరాంగుల జోలికి వెళ్ళనివాడు, కానీ ఒక సుందరాంగికి తన శరీరములో  ఏకంగా సగభాగాన్నే యిచ్చాడు. ఆయన యోగి, జితేంద్రియుడు, అంతకుముందు తనకు  కామవికారాన్ని కలిగించాలని ప్రయత్నించిన ఒక తుంటరిని కాల్చి బూడిద చేసినవాడు, భార్యను (సతీదేవిని) పోగొట్టుకుని పిచ్చివాడై, దిసమొలతో తిరుగుతుంటే చూసి మోహించి  వెంటబడిన మునిపత్నులను, దేవకాంతలను తప్పించుకుని వెళ్లి తపస్సులో మునిగినవాడు. తన భార్యకు తన శరీరములో సగభాగాన్ని యిచ్చి 'భార్య'అనే పదాన్ని 'అర్ధాంగి' అనే పదానికి  అర్ధముగా మార్చిన ఆదర్శపురుషుడు, దాంపత్యజీవనం అంటే కొంతమాత్రమే కామం,  మిగిలినదంతా అనురాగం అని చెప్పిన ఆదిపురుషుడు అని ప్రస్తుతి!  శాంతుడు, యోగి, హింసను ఆయుధాలను నిరసించి, బెదిరిపోయేవాడు, త్రిలోకభయంకరమైన 
మూడుమొనల త్రిశూలాన్ని ధరించే ప్రళయస్వరూపుడు కూడా! మలినవర్తన గలవాడు, శ్మశానములాంటి క్షుద్ర స్థలాలలో తిరిగేవాడు. అమృతమువంటి హాయి అయిన వర్తనగలవాడు కూడా. ఒకోసారి అత్యున్నతంగా ప్రవర్తిస్తాడు, ఒకోసారి  జడుడిలా ఉంటాడు. మతిలేని మూర్ఖుడిలాగా ఉంటాడు, కానీ, మహా మహా మునీశ్వరులకు  కూడా మఱ్ఱిచెట్టు నీడలో పాఠాలు చెప్పే ఆదిగురువు, దక్షిణామూర్తి! సద్యోజాత, వామదేవ,  అఘోర, తత్పురుష, ఈశానములనే ఐదు ముఖముల ఆదిపురుషుడు ఆ పరమశివునిపట్టణంలో, 
కాశిలో శరీరమును వదిలాడా ఎవడైనా, ఇంకేముంది, ఆనందమే! మోక్షమే! పునర్జన్మరాహిత్యమే!  పరమశివుడైపోవడమే అని కాశీ పట్టణాన్ని, కాశీపురాధీశ్వరుడిని సన్నుతిచేస్తున్నాడు తెనాలి  రామకృష్ణుడు.

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు 
మరిన్ని శీర్షికలు
veekshanam