Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagaloka yagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే....http://www.gotelugu.com/issue162/462/telugu-serials/atulitabandham/atulita-bandham/

రాత్రి పెళ్ళి వేడుకలన్నీ పూర్తయే సరికి ఇంచుమించుగా రెండు దాటిపోయింది. అప్పుడు రూమ్ కి వచ్చి నిద్రపోయారు ఐశ్వర్య, కార్తీక్.  ఈలోగానే కార్తీక్ కి ఆఫీసునుంచి వరుసగా అర్జెంట్ కాల్స్ రావటంతో మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరాలని అనుకున్నవాళ్ళు కాస్తా ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసేసి బయలుదేరిపోయారు. పసుపు నీలిరంగు కాంబినేషన్ లో చిన్న చిన్న గళ్ళున్న మంగళగిరి జరీ చీర తన వదిన చేత బొట్టుపెట్టించి, ఐశ్వర్యకు ఇచ్చింది మధుబాల. మధుబాలను కౌగలించుకుని విడువలేక, విడువలేక కన్నీళ్ళతో కారెక్కింది ఐశ్వర్య. మధు పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. కనురెప్పల ముందు పరచుకున్న మంచుతెరలలోంచి దూరమైపోతున్న కారును చూస్తూ చేయి ఊపింది.

సాయంత్రం ఆరు గంటలు దాటుతూ ఉండగా ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరిన వెంటనే స్నానం చేసి, ఆఫీసుకు వెళ్ళిపోయాడు, కార్తీక్. అలసటగా పక్క మీద వాలింది ఐశ్వర్య.

***

పసుపు బట్టలతో తిరుమల వెళ్ళి ఆ ఏడుకొండలవాడిని దర్శించుకుని, ఆ నిత్య కల్యాణచక్రవర్తి కి  కళ్యాణం చేయించారు  నవదంపతులు మధుబాల, వేణుగోపాల్. మరునాడు బయలుదేరి చెన్నై, బెంగుళూరు, మైసూరు, ఊటీ చూసుకుని తిరిగి హైదరాబాదు రావాలని ప్లాన్... మొత్తం మూడువారాల హనీమూన్ కార్యక్రమం. అందులో పున్నమి రోజు ఊటీలో ఉండేలా ప్లాన్ చేసాడు వేణు.

ఈ ప్రయాణం వలన పెళ్ళికి ముందు తాము అపరిచితులమని ఇద్దరూ మరచిపోయారు. ప్రాణస్నేహితులుగా మారిపోయారు. కంచిలో అత్తగారికి, ఆడబిడ్డలకూ, అక్కలకూ, వదినకూ పట్టుచీరలు కొన్నది మధుబాల. బెంగుళూరు లోని లాల్ బాగ్, కబ్బన్ పార్క్, బన్నెర్ ఘట్ట దేవాలయం, ఇస్కాన్ దేవాలయం సందర్శించాక, మర్నాడు విశ్వేశ్వరయ్య పారిశ్రామిక మరియు సాంకేతికవిజ్ఞాన పురావస్తుశాలను దర్శించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ అన్నిటినీ పరిశీలిస్తూ మైమరచి ఉండిపోయారు. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులతో బాగా అలిసిపోయి రూమ్ చేరి రాత్రి వరకూ నిద్రపోయారు. ఆ రాత్రి భోజనం అయ్యాక, హోటల్ ఆవరణలో ఉన్న లాన్ లో బెంచీ మీద కూర్చుని ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు. పడుకోబోయే ముందు తన గుండెల మీద తల ఆనించి, అరమోడ్పు కనులతో చూస్తున్న మధుబాల నుదుట ముద్దాడుతూ, “ఈ హెచ్చెంటీ కార్యక్రమం ఎందుకు పెట్టారో ఇప్పుడు అర్థమైంది...” అన్నాడు వేణు.  

“హెచ్చెంటీ? అంటే వాచీల కంపెనీ యా?”

“నో... కాదు... H M T – HONEY MOON TRIP...”

“ఓహ్... భలే ఉంది... తమరే కాయిన్ చేసారా ఈ పదాన్ని?” అతని బుగ్గల మీద వేళ్ళతో సున్నాలు చుడుతూ అడిగింది మధుబాల.

“కాదురా, మనకన్నా పెద్దవాళ్ళూ, అనుభవజ్ఞులూ చాలా మంది పెట్టిన పేరు అది. బాగుంది కదూ...”

“ఊ! అవును... చాలా... ఇంతకీ ఈ హెచ్చెంటీ ఎందుకు పెట్టారట?”

“ఇలావన్ ప్లస్ వన్ ఈక్వల్ టూ టూ కాదని, ఒక్కటే అని నిరూపించటానికి... అద్భుతం కదూ?” 

ఇక వేణూని మాట్లాడనీకుండా అతని పెదవులను మూసేసాయి మధు పెదవులు. మర్నాడు ఉదయమే మైసూరు బయలుదేరిపోయారు. మహిషుడిని అమ్మవారు మర్దించిన స్థలం కనుక మైసూరు అని పేరు వచ్చిందని తెలుసుకుని, చాముండేశ్వరి దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. అక్కడ పెద్ద నందీశ్వరుడి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యచకితులే అయ్యారు. రాత్రి పూట అత్యద్భుతమైన విద్యుద్దీపాలంకరణతో మెరిసిపోతున్న మహారాజా పాలెస్ దర్శించి, బృందావన్ గార్డెన్స్ కి బయలు దేరిపోయారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత వ్యాహ్యాళికి బయలుదేరారు. ఎటు చూసినా నవ యువ జంటలే. చేయీ చేయి కలుపుకుని, ఒకరి భుజమ్మీద తలవాల్చి మరొకరు, అమ్మాయి నడుము చుట్టూ చేయి వేసి అబ్బాయి...

ఇలా రకరకాలుగా కలిసి నడుస్తున్నారు. ఈ సువిశాలమైన తోట కృష్ణరాజసాగర్ డామ్ అనే అందమైన ఆనకట్టకు ఒకవైపు ఎంతో శోభానమాయంగా నిర్మించబడింది. బృందావన్ గార్డెన్స్ నిండా రకరకాల రంగురంగుల పూలు, వృక్షాలు, లతలు, మొక్కలూ... ఇంకా ఎన్నో ఫౌంటైన్స్... ఇప్పుడంటే హైదరాబాద్ లో సర్వసామాన్యం అయిపోయింది కానీ, ఒకప్పుడు బృందావన్ గార్డెన్స్ లో డాన్సింగ్ ఫౌంటైన్స్ అంటే ఎంతో క్రేజ్... రాత్రి ఒక గంట సేపు  రకరకాల పాటలు వేస్తూ, వాటి లయకు అనుగుణంగా ఊగేలా, నీటి ధారలు చిమ్మేలా అమర్చిన వందల సంఖ్యలోని ఫౌంటెన్ లు, రంగురంగుల దీపాల వెలుతురులో, రకరకాల వేగాలలో, రకరకాల ఎత్తులకు ఎగురుతూ, రంగులలో  నీళ్ళు చిమ్ముతూ కనులవిందు చేస్తాయి.  ఇద్దరూ చెట్టపట్టాల్ వేసుకుని ఆ విన్యాసాలు తిలకించి, సంతోషం, సంతృప్తి నిండిపోయిన హృదయాలతో  రూమ్ చేరుకున్నారు. 

మరునాడే ఊటీ చేరుకున్నారు. చేరిన రోజు ఆ వాతావరణం చూసి థ్రిల్ గా ఫీల్ అయింది అప్పటివరకూ అక్కడికి రాని మధుబాల. ఆకాశం మేఘావృతం అయి ఉంది... సన్నగా చినుకులు పడుతూనే ఉన్నాయి.  మండువేసవిలో సైతం అక్కడ ఉష్ణోగ్రత ఇరవైకి మించదు. 

 “అబ్బ, చలేస్తోంది వేణూ...” రూమ్ లోకి చేరగానే  సామాను పక్కన పడేసి, అతన్ని హత్తుకుపోయింది మధుబాల. 

“అవును... నిజం... చాలా చల్లగా ఉంది మధూ...” అంటూ ఆమెను తనలో పొదువుకుని, మంచంమీద కూర్చోబెట్టాడు. అక్కడ నేల కూడా మామూలు ఫ్లోరింగ్ కాకుండా చెక్కతో చేసిన ఫ్లోరింగ్ ఉన్నది.  

 “టైల్స్ కానీ, మామూలు ఫ్లోరింగ్ కానీ  అయితే ఆ చల్లదనానికి తట్టుకోలేరని ఇలా చెక్కలతో ఏర్పాటు చేసారు... వేడి వేడిగా కాఫీ తాగుదాం ముందు... సరేనా?” అని రూమ్ సర్వీస్ కి ఫోన్ చేసి కాఫీ ఆర్డర్ చేసాడు. 

ఒక పెద్ద  ఫ్లాస్క్, మరో చిన్న ఫ్లాస్క్ లో ఫిల్టర్ డికాక్షన్, మరో ఫ్లాస్క్ లో పాలు, షుగర్ క్యూబ్స్ అన్నీ అమర్చిన ట్రాలీ ని త్రోసుకుంటూ వచ్చాడు ఆ నడివయస్కుడు.  ట్రే లోనే స్టీలు గిన్నెలు, స్టీలు గ్లాసులు కూడా ఉన్నాయి. 

“షల్ ఐ మేక్ ఇట్ సారు?” తమిళ యాస కలిసిన ఇంగ్లీష్ లో అడిగాడు. అతని ముఖం మీద పెద్ద గంధం బొట్టు, అడ్డంగా విభూదిరేఖతో అచ్చం వారి సాంప్రదాయానికి అద్దం పడుతున్నట్టుగా ఉన్నాడు.

“యస్... ప్లీజ్...” నవ్వుతూ తలూపాడు వేణు... 

“కొత్తగా కల్యాణం జరిగినాదాప్పా, పొన్ను రొంబ నల్లా ఇరిక్కు...” మధుబాల వైపు వాత్సల్యంగా చూస్తూ, కొద్దిగా డికాక్షన్, కొద్దిగా పాలు కలిపి వేడి వేడి కాఫీని గ్లాసుల్లో పోసి, వేణూ సూచన ప్రకారం ఒక్కో పెద్ద షుగర్ క్యూబ్ వేసి చెంచాతో తిప్పి,  గిన్నెల్లో పెట్టి అందించాడు. 

“ఇదిదా నమ్మ ట్రెడిషన్ అప్పా... కాఫీ బాగుండాదా తంబీ?” అని అడిగాడు. ఘుమఘుమలాడిపోతున్న ఊటీ కాఫీని ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ  సేవించారు  ఇద్దరూ... 

“చాలా బాగుందండి, థాంక్స్...” చెప్పింది మధుబాల.

“యు ఆర్ వెల్కం మేడమ్!” అని ఖాళీ కప్పుల్ని ట్రే లో వేసుకుని వెళ్ళబోయాడు అతను.

“వి నీడ్ సమ్ డ్రింకింగ్ వాటర్...” చెప్పాడు వేణు.

“థిస్ బిగ్ ఫ్లాస్క్ కంటైన్స్ హాట్ వాటర్... నార్మల్ వాటర్ యు కాంట్ కన్జ్యూం...” చెప్పి, బల్ల మీద పెట్టిన ఫ్లాస్కు ను, పక్కనే ఉన్న గ్లాసులను చూపించాడతను.

అతను వెళ్ళగానే తలుపు మూసి వచ్చాడు వేణు...

“ఈరోజు ప్రోగ్రాం ఏమిటి వేణూ?” అడిగింది మధుబాల.

“బొటానికల్ గార్డెన్ కి వెళదాం కాసేపాగి... తర్వాత లంచ్ చేసి, లేక్ కి వెళదాం... సరేనా? ముందు.. కొంచెం... ఫ్రెష్ అవ్వాలి...” అంటూ ఆమెను చుట్టేసాడు.

***

ఆఫీసులో లంచ్ టైం... ఇంటి దగ్గరనుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోకపోవటంతో ఆఫీసు కాంటీన్ కి వెళ్లి టిఫిన్ ఆర్డర్ చేసి, మొబైల్ లో అప్డేట్స్ చూస్తూ  కూర్చుంది ఐశ్వర్య.

ఇంతలో ఫోన్ మ్రోగింది. 

“హాయ్ మధూ... ఎలా ఉన్నావే? ఏమిటీ ఊటీలో ఉన్నావా? వావ్... చాలా బాగుందా? ఎక్సలెంట్... వేణూ ఎలా ఉన్నాడే? ఇంకా ఎక్సలెంటా? ఓహ్, వెరీ గుడ్... ఫోటో లు పంపావా, మెయిల్ చూసుకోలేదే, చూస్తాను. చాలా బాగుంది డియర్... ఆహా, అద్భుతం... నేను... నేను బాగానే ఉన్నానే... కార్తీక్ ప్రస్తుతం ఊళ్ళో లేడు... సరే... సరేనే... బై... హావ్ అ వండర్ ఫుల్ టైం డార్లింగ్...” నవ్వుతూ ఫోన్ పెట్టేసి, టిఫిన్ తినటం మొదలు పెట్టింది ఐశ్వర్య. 

తరువాత మెయిల్ ఓపెన్ చేసి, కర్ణాటకలో మధుబాల, వేణు తీయించుకున్న ఫోటోలు చూసింది... మధు ముఖంలో ప్రతిఫలిస్తున్న ఆనందాన్ని చూసి మనసు ఉప్పొంగగా, ఎంతో ఉత్సాహంగా  ఆమెకు మెయిల్ రాయటం మొదలుపెట్టింది.

***

“అబ్బా, ఎంత పెద్ద గార్డెన్స్... ఎంత గొప్ప వృక్షాలు! ఏమి పూలు, ఎన్ని రంగులు... చూడు, లాన్స్ ఇన్ని రకాలుగా కత్తిరించి ఇంత అద్భుతంగా పెంచటం ఎప్పుడైనా చూసామా వేణూ? అబ్బా... బంతి పూలను చూడు ఎన్ని డిజైన్స్ వచ్చేలా పెంచారో... ఆ హాంగింగ్ క్రీపర్స్ చూడు,  నిండా పూలు పూచి, ఆ  గోడంతా పూవుల మయం..ఇన్ని రంగుల పూలను ఒకే చోట చూడటం నాకిదే మొదటి సారి. నిజంగా నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ అనంతమైన  సౌందర్య రాశిని చూస్తూ... ప్రకృతి ప్రసాదించిన వనసంపదను, ఇంత మనోహరంగా మలచి యాత్రికులకు అందించటం వీరికే చెల్లింది... వేణూ, నీకు చాలా థాంక్స్... ఇంత మంచి ట్రిప్ ప్లాన్ చేసినందుకు...” 

ఊటీ బొటానికల్ గార్డెన్స్ లో వేణూ చేయి పట్టుకుని నడుస్తూ చెప్పింది మధుబాల.

“ఒద్దికగా ఒక చక్కని బంధంలో ఒక్కటిగా మారిన ఆలుమగలకు ఇలాంటి ప్రేమయాత్ర మానసికంగా ఒకరికొకరు చేరువయ్యేలా మరింతగా దోహదం చేస్తుందనటంలో సందేహమేమీ లేదు మధూ...”

ఆ సాయంత్రం లేక్ లో బోట్ షికారు చేసి వచ్చి, భోజనం చేసి విశ్రాంతిగా కూర్చున్నారు. పున్నమి చంద్రుడు మేఘమాలికలతో దోబూచులాడుతున్నాడు. బాల్కనీ నిండా వెన్నెల మరకలు... మధుబాల జడనిండా అరవిరిసిన మల్లెమొగ్గలు... చల్లని చలి... ఉండీ ఉండీ సన్నని చిరుజల్లు... ఇద్దరూ బాల్కనీ లో కూర్చుని నిండు చందమామను చూస్తూ తమకు వచ్చిన వెన్నెల పాటలన్నీ పాడేసుకున్నారు.

మనసు అలవకున్నా శరీరం విశ్రాంతి కోరటంతో పాన్పు చేరి ఒకరి చేతులలో ఒకరు సేదదీరుతూ నిద్రపోయారు.

***

రోజులు గడిచే కొద్దీ కార్తీక్, ఐశ్వర్యల మధ్య తెలియకుండా దూరం పెరగసాగింది. ఐశ్వర్యకు ఎప్పుడూ రెగ్యులర్ షిఫ్ట్... ఉదయం వెళ్ళి రాత్రి ఏడు లోపుగా ఇంటికి రావటమే. కార్తీక్ కి ఏదో ఒక షిఫ్ట్ లేదా టూర్స్ ఉంటాయి.  తాను ఇంటికి వచ్చేసరికి కార్తీక్ ఉండటం లేదు.  అతని కోసం ఎదురు చూస్తూ గంటలు గంటలు కాలం గడిపే ఐశ్వర్యకు చాలా సార్లు తన పరిస్థితి మీద తనకు జాలి కలుగుతోంది.   ఒక్కోసారి డ్యూటీ నుంచి డైరెక్ట్ గా ఇంటికి వస్తాడు, లేదా తెల్లవారి ఆరు ఏడు గంటల మధ్య వస్తాడు.  పలకరించబోతే బాగా విసుక్కుంటాడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంటోంది అతని ధోరణి. అతనికి వచ్చే కాల్స్ లో చాలా మటుకు ‘డాలీ’ అనే అమ్మాయి నుంచి వస్తున్నట్టు గమనించింది ఐశ్వర్య.

తను గాక కార్తీక్ జీవితంలో మరో స్త్రీ... ఆలోచిస్తే చాలా బాధగా అనిపించినా, కార్తీక్ లాంటి వారికి సెంటిమెంట్స్ ఉండవేమో అని అనిపిస్తోంది... ప్రేమను చెల్లిస్తే రెట్టింపు ప్రేమను పొందగలమని అంటారు. కానీ... తానెంత మనస్ఫూర్తిగా అతన్ని ప్రేమించినా, కలలోనైనా తన పక్కన వేరే పురుషుడిని ఊహించుకోలేకపోయినా, ఎప్పటికీ జీవితమంతా అతనితోనే కలిసి ఉండాలని దృఢ నిశ్చయం చేసుకుని అందరినీ విడచి పెట్టి వచ్చేసినా... అతను మాత్రం తన చేయి విడచిపెడుతున్నట్టే భావన. ఆ భావన వలన ఐశ్వర్యకు అభద్రతా భావాన్ని, తెలియని భయాన్ని కలుగుతున్నాయి.

ఇప్పటికైతే తనకున్నది ఒక్క కార్తీక్ మాత్రమే. అతన్ని నమ్ముకొని జీవితాన్ని కొనసాగిస్తోంది... మరి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలియటం లేదు... ఈమధ్య తమ ఇద్దరి మధ్యా సామరస్యత తగ్గింది. పడక సంబంధాలు కూడా సన్నగిల్లుతున్నాయి. 
బాధగా నిట్టూర్చింది.  ఒక కన్నీటి కణం కనురెప్పలను త్రోసుకొంటూ ఐశ్వర్య బుగ్గ   మీదికి జారింది.

‘అణువంతగా ఆవిర్భవించి, క్షణాలలో త్రివిక్రమ రూపం దాల్చిన 

కన్నీటి కణానికే తెలుసు నీ అంతరంగ రంగాన చెలరేగే మథనం...

అందుకే జాలి పడుతున్నట్టుగా రాలి పడుతుంది...నీ చెక్కిలి పైకి...’    

ఎప్పుడో ఎక్కడో చదివిన మినీ కవిత మనసులో మెదిలింది. ఆవేదనను బలవంతంగా అణచుకొని,   ఒక గ్లాసుడు మంచి నీళ్ళు తాగి వచ్చి మళ్ళీ పడుకుంది ఐశ్వర్య. ఇంతలోనే ఏదో అనుమానం... 

లైట్ వేసి, కేలెండర్ వైపు చూసింది. ఎందుకో ఈ సారి లేట్ అయిందే... అయితే... అయితే... తను తల్లికాబోతోందా? ఏదో తెలియని ఆనందపు కెరటం ఆమెను చుట్టేసింది. మనసులో సంతోష తరంగాలు నృత్యం చేసాయి. పై ఇంటి ప్రసన్న చేతిలో బాబుతో సగర్వంగా చూస్తున్న చూపులు గుర్తు వచ్చాయి... 

‘నేనూ అమ్మనౌతున్నానా! అబ్బ, ఎంత బాగుంది ఈ ఊహ? రేపు తప్పకుండా  డాక్టర్ దగ్గరకు వెళ్లి కన్ఫం చేసుకోవాలి...’ అనుకుంటూ కళ్ళు మూసుకుంది సంతృప్తి గా. 

***

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali