Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
andam - chandam

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

 మన దేశంలో  ఓ గమ్మత్తేమిటంటే, ప్రతీవాడికీ తెలుసు,  భవిష్యత్తులో ఏదో ఒకరోజున ఉన్న నీటివనరులన్నీ ఎండిపోతాయని.  దాన్ని నివారించడానికి ఏదో ఒకటి చేయకపోతే, ప్రాణం మీదకొస్తుందనీ. “ పోనిద్దూ అంతగా వస్తే అప్పుడే చూసుకోవచ్చూ “ అనే  బాధ్యతారహిత మనస్తత్వం. మన ప్రధానమంత్రి గారి దగ్గరనుండి, ప్రతీ రాజకీయనాయకుడూ ఉద్బోధలు చేసేవారే. కానీ కార్యాచరణకొచ్చేసరికి ఫలితం శూన్యం.

ఉన్న నీటి వనరులని జాగ్రత్తగా కాపాడుకున్నా సగం పని అయినట్టే.. కానీ వచ్చినగొడవేమిటంటే అసలు ఆ సంకల్పమే లేకపోవడం.. ప్రతీవాడూ అనుకునేదేమిటంటే, “ పోనిద్దూ మనం ఒక్కరం చేస్తే అయేపనా ఏమిటీ, అందరూ కలిసిరావాలి కానీ.. “ అనుకుని ,ఎవ్వరూ పట్టించుకోకపోవడం. ఎవరికివారే అలా అనుకుంటే ఎప్పుడో తాగడానికి ఓ చుక్క కూడా ఉండదు.  ఒకానొకప్పుడు సకాలంలో వర్షాలు పడేవి. ఈరోజుల్లో ఎప్పుడు చూసినా అకాల వర్షాలే. పోనీ ఆ వచ్చిన వర్షం భూమిలోకి ఇంకి,  భూగర్భ జలాలను ఎక్కువ చేస్తుందా అంటే, ముందు ఆ వర్షపు నీరు ఇంకడానికి మట్టి ఉండాలిగా.  అసలు మట్టెనేది ఉండాలిగా. అంతా కాంక్రీటు మయం. ఇంకొన్ని రోజులు గడిచాయంటే, మట్టిని కూడా ఏ   మ్యూజియం లలోనో చూడాల్సిన పరిస్థితి రావడం ఖాయం.. ఒకానొకప్పుడు వర్షం వచ్చేముందు, మట్టి వాసన వచ్చేది. అసలు ఆ మట్టే లేకపోతే ఇంక వాసనెక్కడా? కాలవ మట్టి అనుండేది. కానీ ఈరోజుల్లో అసలు కాలవలే కనిపించవూ, అధవా కనిపించినా వాటినిండా, గుర్రపు డెక్కా, ప్లాస్టిక్ వ్యర్ధాలూ. గోదావరి డెల్టాలో ఒకానొకప్పుడు, సరుకురవాణా కాలవలలో నాటు పడవల ద్వారా చేసేవారు. ఆ కాలవలూ, రహదారీ పడవలూ మచ్చుకైనా కనిపించవు.


అసలు సశ్యశామలంగా ఉండే మన దేశంలో నీటి కరువు రావడానికి ముఖ్యకారణం మన రాష్ట్ర, దేశ పరిపాలకులనడంలో సందేహం లేదు. ఉదాహరణకి, విదేశీ శీతలపానీయ కంపెనీలకి, మన ప్రభుత్వాలు, ఎడాపెడా తక్కువ ఖరీదుకి నీళ్ళు అమ్మడం. ఆ నీళ్ళని ఆ కంపెనీలు, సీసాల్లో పెట్టి మినరల్ వాటర్ పేరుపెట్టి తిరిగి మనకే అధిక ధరలకి అమ్మడం. ఇవి కాకుండా శీతలపానీయాలైతే సరేసరి.

దురదృష్టం ఏమిటంటే, మన రాజకీయనాయకులు, కరువు మీదకూడా డబ్బులు చేసికోవడం. అప్పుడెప్పుడో కరువుప్రాంతాల్లో బోరుబావుల తవ్వకానికి కోట్లరూపాయలు ఖర్చుపెట్టారు. ధనవంతులైన భూస్వాములు, బ్యాంకులనుండి ఋణాలుకూడా తీసికున్నారు ఆ పేరు చెప్పి. ఆ అప్పులు ఎగ్గొట్టారు అది వేరే సంగతనుకోండి. ఎకరం, రెండెకరాలూ సాగుచేసే రైతులు మాత్రం ఆత్మహత్యలు చేసికుంటున్నారు.

ఈ మధ్యన  వినే ఉంటారు, మరాఠ్వాడా ప్రాంతంలో, నీటి ఎద్దడి కారణంగా, రైళ్ళలో నీరు పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ల‍క్షల లీటర్ల నీరు మాత్రం, ఆ దిక్కుమాలిన క్రికెట్  మాచ్ లకి వాడడానికి సంకోచించలేదు. చివరకి సుప్రీంకోర్టు ధర్మమా అని, మహరాష్ట్రలో ఆ మాయదారి మాచ్ లమీద నియంత్రణ పెట్టారు. చెప్పొచ్చేదేమిటంటే, మనవాళ్ళకి  priorities  ఏమీ లేవు. ఎందుకంటే ఈ క్రికెట్ తమాషాలో డబ్బే డబ్బు. డబ్బుండి లాభం ఏమిటి, తాగడానికి గుక్కెడు నీళ్ళు ముఖ్యం అని ఈ పెద్దలందరూ ఎప్పుడు గుర్తిస్తారో ఆ భగవంతుడికే తెలియాలి.

నీళ్ళ కోసం  యాగాలూ యజ్ఞాలూ చేసేకన్నా, ఉన్న  నామమాత్రపు నీటి వనరుల్ని ఎలా కాపాడుకోవాలో అధ్యనం చేసి, ఆచరణలో పెట్టడం ముఖ్యం. చెప్పాగా సంకల్పం అంటూ ఉంటే , ఏ పనైనా సులభంగా చేయొచ్చు. ప్రచారానికి కోట్లు ఖర్చుపెట్టడానికి వెనకాడరు మన కంపెనీలు. అందులో సగం ఖర్చుపెట్టి, కంపెనీ వ్యర్ధాలను శుధ్ధి పరచడం మాత్రం గుర్తుండదు. దాని పేరు  Waste Management  లాగానే, శుధ్ధిపరచడంకూడా శుధ్ధ  Waste  అనే పధ్ధతిలోనే ఉన్నాయి.

ప్రస్థుత నీటి కొరతని అరికట్టడానికి ప్రభుత్వమే నడుం కట్టాలి. ప్రతీదానికీ ఆందోళనలు, ధర్నాలు చేసే అలవాటున్న మన ప్రజలుకూడా సహకరించాలి. ప్రభుత్వ పథకాలు  ఒక్క పేపర్లకీ, డ్రాయింగ్ బోర్డులకే పరిమితం కాకుండా, చిత్త శుధ్ధితో చేస్తేనే విజయవంతమౌతాయి. రేపెప్పుడో నిజంగా నీళ్ళు ఎండిపోతే, వాటికి నువ్వు ఓ మాజీ రాజకీయనాయకుడవో కాదో తెలియదుగా.  పదవుల్లో ఉన్నప్పుడు ఎంత డబ్బు కూడబెట్టుకున్నా, చుక్కనీరు కావాలంటే దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు చేసేదేమీ ఉండదు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే,  అసలు చేతులే కాలకుండా చూసుకోవడమే ఉత్తమమేమో….

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
veekshanam