Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

శ్రీ దివ్యతో ఇంటర్వ్యూ

interview with sri divya

అలాగైతే సినిమాల‌కే దూర‌మైపోతా! - శ్రీ‌దివ్య‌

తెలుగ‌మ్మాయిలు క‌థానాయిక‌లుగా అస్స‌లు క‌నిపించ‌డం లేదు.. అని తెగ ఇదైపోతుంటాం గానీ, క‌థానాయిక‌గా రాణించే సత్తా ఉన్నా.. ఎవ్వ‌రైనా ప‌ట్టించుకొంటున్నారా?  ఓ స్వాతి, ఓ బిందుమాధ‌వి.. ఇప్పుడు శ్రీ‌దివ్య‌. న‌ట‌న‌లో శ్రీ‌దివ్య ఎవ్వ‌రికీ తీసిపోదు. అచ్చ‌మైన తెలుగ‌మ్మాయి.. న‌టిగా నిరూపించుకొంది కూడా. కానీ తెలుగులో మాత్రం అవ‌కాశాలు రావ‌డం లేదు. అయితే త‌మిళ తంబీలు మాత్రం శ్రీ‌దివ్య‌ని గుర్తించారు. అందుకే అక్క‌డ విరివిగా సినిమాలు చేస్తోంది. విజ‌యాలూ అందుకొంటోంది. ఆమె న‌టించిన త‌మిళ చిత్రం రాయుడు ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా శ్రీ‌దివ్య‌తో చేసిన చిట్ చాట్ ఇది.

* హాయ్ శ్రీ‌దివ్య‌..
- హాయ్‌..

* కేరింత త‌ర‌వాత చాలా గ్యాప్ వ‌చ్చేసిన‌ట్టుంది...
- అవునండీ. కేరింత త‌ర‌వాత తెలుగులో చేయ‌లేదు. త‌మిళంలో మంచి అవ‌కాశాలొచ్చాయి. అందుకే అటు వెళ్లా. అయితే అక్క‌డి సినిమాలు ఇక్క‌డ డ‌బ్ అవుతున్నాయి క‌దా, ఆ విధంగా తెలుగు సినిమాలు చేయ‌డం లేద‌న్న లోటు తెలియ‌కుండా పోయింది.

* ఇంత‌కీ తెలుగులో అవ‌కాశాలు త‌గ్గాయా, తగ్గించుకొన్నారా?
- రెండూ. త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల్ల‌.. తెలుగు వైపు దృష్టి పెట్ట‌లేక‌పోతున్నాను. నిజంగానే న‌న్ను క‌దిలించే ఆఫ‌ర్ వ‌స్తే.. త‌మిళ సినిమాలు సైతం మానేసి ఇటు వైపు వ‌చ్చి చేసేద్దును. న‌న్ను ఎగ్జ‌యిట్ చేసిన పాత్ర‌లేవీ నాకు ఇక్క‌డ క‌నిపించ‌లేదు.

* మ‌రి త‌మిళంలో వ‌స్తున్నాయా?
- మీరే చూస్తున్నారు క‌దా?  పెన్సిల్ సినిమా మొన్నామ‌ధ్యే విడుద‌లైంది. నా పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంది. హీరోకి స‌మానంగా ఉండే పాత్ర అది. ఇప్పుడు రాయుడులోనూ అంతే. పొగ‌రున్న అమ్మాయిగా క‌నిపిస్తా. ఇంతటి ప్రాధాన్యం తెలుగు సినిమాల్లో క‌నిపించ‌డం లేదు.

* మ‌రి పెన్సిల్ ఫ్లాప్ అయ్యింది క‌దా, బాధ ప‌డ‌లేదా?
- బాధ‌ప‌డ్డా. అయితే వెంట‌నే తేరుకొన్నా. ఎందుకంటే అది కేవ‌లం కాన్సెప్ట్ మీద న‌డిచే సినిమా. ఓ విధంగా ప్ర‌యోగం లాంటిది. మంచి ప్ర‌య‌త్నం చేశామన్న పేరొచ్చింది. కానీ ప్రేక్ష‌కుల‌కు చేర‌లేదు.

* మ‌రి రాయుడు ఎలా ఉంటుంది?
- క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఇది. పెన్సిల్‌గా ప్ర‌యోగాలేం చేయ‌లేదు. రూర‌ల్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా. నేను ప‌రికిణీ ఓణీ వేసుకొని.. అచ్చ‌మైన ప‌ల్లెటూరి అమ్మాయిలా న‌టించా. మేక‌ప్ కూడా త‌క్కువే.

* విశాల్ ప‌క్క‌న కంఫ‌ర్ట్‌గా అనిపించిందా?
- ముందు విశాల్ అన‌గానే కాస్త భ‌య‌ప‌డ్డా. ఆయ‌న తెర‌పై ర‌ఫ్‌గా క‌నిపిస్తాడు, బ‌య‌ట కూడా అలానే ఉంటాడేమో అనుకొన్నా. కానీ చాలా చాలా కూల్‌. ఫ్రెండ్లీగా ఉంటాడు. జోకులు వేస్తాడు. ఎవ‌రికైనా క‌ష్టం వ‌స్తే అస్స‌లు ఆలోచించ‌డు. అత‌నిలోని సేవాగుణం నాకు బాగా న‌చ్చింది.

* మీరూ ఈమధ్య త‌మిళ‌నాడులో సేవా కార్య‌క్ర‌మాల‌కు న‌డుం క‌ట్టార‌ట‌..
- చెన్నై లో వ‌ర‌ద‌లు సంభ‌వించిన‌ప్పుడు నా వంతుగా ఆర్థిక స‌హాయం చేశా. రాయుడు సినిమా కోసం ఓ ప‌ల్లెటూరులో షూటింగ్ చేశాం. అక్క‌డ మ‌రుగుదొడ్లు లేవు. ఆడ‌వాళ్లు చాలా ఇబ్బంది ప‌డుతున్నారు. అది తెలిసి మా టీమ్ కొన్ని మ‌రుగుదొడ్లు కొట్టించింది. నేనూ నా వంతుగా స‌హాయ‌ప‌డ్డా. ప్రేక్ష‌కుల ద‌య వ‌ల్లే మ‌నం ఈ స్థానంలో  ఉన్నాం. అలాంట‌ప్పుడు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి క‌దా?

* శ్రీ‌దివ్య ఇలా ప‌ద్ధ‌తైన పాత్ర‌ల‌కే ప‌రిమితం అయిపోతుందా?
- అందులో సందేహం లేదు. అయినా ప‌ద్ధ‌తిగా క‌నిపిస్తే... మంచిదే క‌దా?

* కానీ సినిమా అంటే గ్లామ‌ర్ క‌దా?
- కావొచ్చు. ఎవ‌రి అభిప్రాయాలు వారివి. నేను మాత్రం గ్లామ‌ర్ జోలికి వెళ్ల‌ను. ట్రెండీగా, ఫ్యాష‌న్‌గా క‌నిపించ‌డంలో తప్పులేదు. కానీ గ్లామ‌ర్ డాల్‌గా మాత్రం కాదు.

* అలాగైతేనే అవ‌కాశాలిస్తామంటే..
- సినిమాల్ని సైతం వ‌దులుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ‌తా. అందులో అనుమానం ఏమీ లేదు. శ్రీ‌దివ్య చేయ‌గ‌ల‌దు అన్న పాత్ర‌లే న‌న్ను వెదుక్కొంటూ వ‌స్తున్నాయి. నాకూ అలాంటి పాత్ర‌ల్లో క‌నిపించ‌డ‌మే ఆనందం.

* మ‌రి కెరీర్ దెబ్బ‌తింటుందేమో?
- జ‌య‌సుధ‌, రేవ‌తిల‌ను చూడండి. వాళ్లేమైనా గ్లామ‌ర్‌గా క‌నిపించారా? ప‌ద్ధ‌తిగానే న‌టించారు. వాళ్ల‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన మార్క్ సంపాదించుకొన్నారు. ఈ విష‌యంలో వాళ్లే నాకు ఆద‌ర్శం.  

* త‌మిళం నేర్చేసుకొన్నారా?
- బ్ర‌హ్మాండంగా. అక్క‌డ త‌మిళంలోనే మాట్లాడుతున్నా. అయితే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది.

* తెలుగులో తెలుగు క‌థానాయిక‌ల‌కు అంత గుర్తింపు ఉండ‌దు అంటారు.. మీదీ అదే మాటా?
- ఏమో, ఒక‌రిని నిందించ‌డం ఎందుకు, నేను ఇలాంటి సినిమాలే చేయాలి అనుకొన్నా.. చేస్తున్నా. మిగిలిన వాళ్ల సంగ‌తి నాకు తెలీదు.

* చేయ‌బోయే సినిమాలేంటి?
- కార్తి సినిమా కాశ్మోరాలో న‌టించా. జీవా క‌థానాయ‌కుడిగా మ‌రో సినిమా సెట్స్‌పై ఉంది.

* ఓకే.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీమ‌చ్‌.

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka