Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulitabandham

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే ... http://www.gotelugu.com/issue163/463/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

 

వెన్నెట్లో దిగువన`

తామున్న కొండను చుట్టి గాల్లో ఎగురుతూ కావలి తిరుగుతున్న భూతం ఘృతాచి కన్పిస్తోంది. ఒక చెట్టు ఎండు కొమ్మను గదలా భుజాన వేసుకొని మరీ తిరుగుతోంది. కొండ పైకి చిన్న పురుగు వచ్చినా అది చంపేస్తుంది. సందేహం లేదు`

‘‘ప్రభూ! కలి యుగారంభం తర్వాత కురు సామ్రాజ్యానికి తొలి చక్రవర్తి పరీక్షిత్తు మహారాజు. అంతటి చక్రవర్తి మరణం అదో పెద్ద విషాద కర సంఘటన. అదలా వుంచిన` ఇటు అగ్నిభట్టారకుని గృహమున ఏమి జరిగినదో తొలుత చెప్పవలె.

అగ్నిభట్టారకుని భార్య దొడ్డ యిల్లాలు. మాటకు కట్టు బడు మనిషి. భూదేవి సాక్షిగా భర్తకు ప్రమాణము చేసినది గావున ఆ వాక్కునకు కట్టు బడే వున్నది. పరీక్షిత్తును కాపాడ లేక ఇంటి కొచ్చిన భర్తతో ఆమె మాట్లాడనే లేదు. ఆ దినమునే గాదు, మరణ కాలము దనుక మాట్లాడనే లేదు.

గృహ కృత్యాలు నెర వేర్చుకొని, భర్తకు కావసినవి సమ కూర్చుట అంతయు మౌనము గానే సాగించినది. అందరితో సంభాషించేది గాని సంసారములో భార్యా భర్తల మధ్యన మాటలు లేవు. ఇలా వుండగా`

కొడుకు లిరువురికీ వివాహములు జరిగినవి. కోడండ్రు వచ్చినారు. అప్పుడు గూడ తక్షకుడు యిచ్చిన సంపదను దాచి వుంచారు గాని ఖర్చు చేయ లేదు. తనకు తెలిసిన విద్యలన్నీ అగ్ని భట్టారకుడు కొడుకులకు భోధించి తనంత వాళ్ళుగా తీర్చి దిద్దాడు.

ఇలా వుండగా దాచిన రెండు సంచుల సంపదలోను ఒక సంచి లోని మణి మాణిక్యాలు బంగారం దొంగల పాలయ్యాయి. దొంగలు దోచుకుంటే రెండు సంచు తీసుకుపోయే వారు గాని ఒక సంచి వదిలేస్తారా? కోడళ్ళు వచ్చినారుగా` వాళ్ళే ఒక సంచి తీసి పంచుకుని తమ పుట్టిళ్ళకు తరలించారు. అందుకే వాళ్ళు ధనవంతులైనారు అని గ్రామ వాసులు గుసగుసలు పోయినారు. ఆ మాట నిజము కూడ. అయిననూ అగ్నిభట్టారకుడు ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు.

కాలం కరిగి పోతూనే వున్నది.

హస్తినలో పరీక్షిత్తు కుమారుడు జన మేజయుడు యుక్త వయస్కుడయినాడు. పట్టాభిషేకం జరిగి సింహాసనం అధిష్టించి కురు సామ్రాజ్యానికి చక్రవర్తి అయినాడు. తన తండ్రి మరణానికి తక్షకుడనే సర్పం కారణమని తెలిసి ఆగ్రహంతో మండి పడినాడు. పుడమి పై నాగ జాతే ఉండ రాదని సర్ప యాగం జరిపించినాడు.

ఆ యాగానికి అగ్నిభట్టారకుడూ వెళ్ళాడు. అక్కడే వ్యాసుల వారిని కలిశాడు. కారణం ఏమైనా గానీ సర్ప యాగం మధ్యలో నిలిచి పోయినది. దీనంతటికీ కారణమైన తక్షకుడు మాత్రం ఇంద్రుడి సింహాసనాన్ని ఆశ్రయించి బ్రతికి పోయాడు. పేరు పేరున ఋత్విక్కులు పిలుస్తుండగా అనేక నాగజాతులు వచ్చి యాగాగ్నిలో బడి మరణించాయి.

ఆ విధముగా సర్ప యాగంతో నాగలకు క్షయం గావుట అప్పటి నాగ లోక ప్రభువైన పద్ముడికి ఎంతో మనః క్లేశం కలిగించినది. చెట్టు పుట్టల నాశ్రయించి బ్రతికే నాగుల నాశనానికి ఒక చంద్ర వంశ రాజు కారకుడయ్యాడు. నేటి నుండి తొంభై వత్సరముల పిమ్మట నుండి ఆ పైన తొమ్మిది వందల వత్సరముల వరకు సింహాసనం ఎక్కి పరిపాలించు చంద్ర వంశ రాజు పుట్ట వ్రణ వ్యాధి బారిన పడి మరణించెదరు గాక యని చంద్ర వంశాన్ని ఘోరంగా శపించాడు.’’ అంటూ వివరించింది భద్రా దేవి.

‘‘అనగా... నా జనకునికి ఏర్పడిన పుట్ట వ్రణమునకు కారణము నాటి నాగరాజు శాపమేనా?’’ ఆసక్తిగా వింటున్న ధనుంజయుడు ఆశ్చర్య సంభ్రమాలతో భద్రా దేవిని ప్రశ్నించాడు.

‘‘అవును ప్రభూ. ఆ శాపమే కారణము.’’ అంది భద్రా దేవి.

‘‘పిమ్మట ఏమి జరిగినది?’’

‘‘ఈ శాప వృత్తాంతమును గూర్చి వ్యాస భగవానుడి శిష్యుని మూలముగా అగ్ని భట్టారకునికీ తెలిసినది. మానసికంగా మరింతగా కృంగి పోయినాడాయన.

‘‘ఔరా! ఆనాడు నేను జేసిన పొరబాటు ఎన్ని అనర్థముకు కారణంబైనది! తను తక్షకుని నిరోధించి పరీక్షిత్తును కాపాడి వుంటే నాగలకు క్షయము జరిగేనా...? నాగ రాజు వలన చంద్ర వంశ రాజుకీ శాపముండెడిదా? అన్యోన్యమగు తమ సంసార మందు భార్యా భర్తల మధ్య మాటలు కరువై ఎడ బాటు ఉండేదా? అయ్యో... ఎంతటి అనర్థము ఘటిల్లినవి’’ అంటూ వా పోయాడు.

సతీ పతుల నడుమ మాటలు లేకున్ననూ ఒకరి యెడల ఒకరికి గల ప్రేమానురాగము చెక్కు చెదర లేదు. ఇలా వుండగా కాలము ఎవరి కోసమూ ఆగదు.

అగ్నిభట్టారకుని భార్య ఈలోకము వదిలి పోయినది. మరణ ఆసన్న కాలమందునా తనతో మాటాడని భార్య మీద ఆయనలో మరింత ప్రేమ పెరిగినదే గాని తరుగ లేదు. ఆ విధముగా భార్య మీది బెంగ తోడనే అనతి కాలమందే అగ్ని భట్టారకుడూ కాలం చేసినాడు.
అవసాన కాలమందు కొడుకులిరువురినీ దగ్గర కూచుండ బెట్టుకుని మాట్లాడినాడు.

‘‘నాయన లారా! మీ జనని ఉత్తమ యిల్లాలు. మహా సాధ్వి. ఆమె నా పట్ల చూపిన ప్రేమానురాగములు మరువ లేనివి. నే జేసిన తప్పునకు నాతో మాటలాడక జీవిత కాలము తను శిక్ష అనుభవించినది. ఇప్పుడు నేనును తన వద్దకు పోవు చుంటిని. పై లోకము నయిననూ నాతో మాటలాడునో లేదో తెలియదు. కాని నా ఆత్మ మాత్రము క్షోభిస్తూనే వుంటుంది. నా ఆత్మ శాంతించి ఉత్తమ గతులు పొందుట అనేది మీ చేతులందే యున్నది. ఇప్పుడు నేను జెప్పు విషయము కడు జాగరూకులై ఆలకించండి.

నా మూలమున జరిగిన తప్పుని నా వంశీకులే సరి దిద్దవలె. నేటి నుండి మన వంశమున తరాలు మారినా అంతా సిద్ధ వైద్యులు, గొప్ప పాము మంత్ర వాదులు గానే ఉండాలె. ప్రతి తరము తాము నేర్చిన విద్యల్ని ముందు తరాలకు బోధింప వలె. నా గాధను వినిపించ వలె. ఎందుకనగా, చంద్ర వంశ రాజుల్ని మన వంశీకులే కాపాడ వలె. నాగ రాజు శాపమునకు తిరుగు లేదు. అది ఫలించును. రానున్న వేయి సంవత్సరముల కాలమందు ఎందరు ఆ శాపమునకు బలి యగుదురో తెలియదు. వారిలో కొందరినయినా కాపాడితే నా ఆత్మ శాంతిస్తుంది.
పుట్ట వ్రణమునకు ఇంత వరకు సిద్ధ వైద్యమున మందు లేదు.

కాని ఎవడయినా చంద్ర వంశ వీరుడు సాహసముతో నాగ లోకము పోయి దివ్య నాగ మణిని తెచ్చిన అది పుట్ట వ్రణమును హరించును. నాగ రాజు శాపమున మరో కిటుకును గలదు. శాపము నుండి తప్పించు కొనుటకు గల ఏకైక మార్గము అదే. సింహాసనం అధిష్టించి పరి పాలించు చంద్ర వంశ రాజుకే నాగ రాజు శాపం వర్తించును. కావున తన పట్ట మహిషిని గద్దెనెక్కించి ఆమె తరఫున పరిపాలన సాగించిన చంద్ర వంశ రాజు శాపం నుండి తప్పించుకో వచ్చును. భవిష్య కాలమున కురు సామ్రాజ్యము వుండదు. జన మేజయుని వారసులు అధికరించి సామ్రాజ్యము ముక్కలై చిన్న చిన్న రాజ్యములగును. ఆయా రాజన్యులను మన వారసులే కాపాడ వలె. ఇది నా ఆన.’’ అంటూ ఒట్టు పెట్టి మరీ కొడుకు లిరువురికీ వివరించాడు అగ్ని భట్టారకుడు.

‘‘కాని జనకా! శక్తి మంతులగు రాజన్యులు ఈ శాప వృత్తాంతమును విశ్వసింతురా? మనము చెప్పినటుల నడచు కొందురా?’’ కొడుకులు తమ సందేహమును అడిగినారు.

‘‘నాయన లారా! బుద్ధి కర్మను సారిణి గదా. కర్మ బాగున్న వారు విని బ్రతికెదరు. వినని వారు చెడుదురు. వారికి తెలియ జెప్పుట మీ కర్తవ్యమని మరచి పోవలదు.

ఇకపోతే..

తక్షకుడు నాకిచ్చిన రెండు ధన రాసులున్న సంచులలో ఒక సంచిని మీ భార్యలు తస్కరించి, చెరి సగం పంచుకొని వారి పుట్టిళ్ళకు రహస్యముగా పంపించినారు. రెండో సంచిని దొంగలు దోచుకెళ్ళినారు.

మెట్టినిల్లు కడు పేదరికమున వున్న గ్రహింపక, అత్తా, మామలు, కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన బిడ్డలు ఆర్థిక పరమైన ఇడుములు పడుచున్ననూ, పుట్టింటిని కాపాడే ప్రయత్నములు ఏ కోడళ్ళయితే చేయుదురో వారు రానున్న కాలములో బహు రీతిన కష్టముల పాలవుదురు. వారికి నరక లోక ప్రాప్తి తథ్యము.

తమ కూతురు ఒక ఇంటికి కోడలై కూడా తన భర్తను, అత్తా మామల్ని నిర్లక్ష్యం చేస్తున్నా మందలించని ఆడపిల్లల తల్లిదండ్రులు, ఆమె తోడ బుట్టిన వాళ్ళు కూడా రోగ పీడితులై భయంకరమైన నరకం అనుభవింతురు.

ధర్మము మరచి అను క్షణము భర్తను కించ పరుచుచూ, తన తోడ బుట్టిన వారిని పొగుడుదురో వారు 84 జన్మములు ఎత్తి రవరవాది నరకము అనుభవింతురు. ఇదియే ఈ అగ్నిభట్టారకుడి శాపము...’’ అంటూ పక్క కున్న పాత్రలోని నీరు తీసుకుని మంత్రో చ్ఛారణ చేస్తూ గాల్లోకి వెద జల్లారు. తమ జనకుడిలో వెల్లువెత్తిన ఆగ్రహావేశాలను చూసి కొడుకులిద్దరూ విస్మయానికి లోనయ్యారు.

‘‘అవును నాయనలారా... నా ఆగ్రహావేశాలు సబబయినవే. నా బిడ్డలయిన మీ కొరకు స్వధర్మం స్వార్థంతో కూడుకున్నదయినా పర ధర్మం కంటే గొప్పదని రాజ ద్రోహానికి పల్పడ్డాను.

ఫలితంగా అంది వచ్చిన రెండు సంచులలో రెండవది దొంగల పాలయినది. మొదటి సంచి మీ భార్యలు దొంగిలించారు. ఇదే నా ఆగ్రహానికి కారణం...

భర్త భరించినంత వరకే భార్య తన పుట్టింటి మీద మమకారం చూపించాలి. అది హద్దులు దాటితే అనర్థాలే జరుగుతాయి.
భర్తను, అత్తా మామల్ని నిరాదరణకు గురి చేసి, నింద లేసే కూతుర్ని మందలించి సరి దిద్దని ఆడపిల్లల తల్లిదండ్రులు, ఆమె సోదరీ మణులు సైతం నా శాపం నుండి తప్పించు కోలేరు.

ఇక ఈ చివరి ఘడియల్లో మీ కేమీ యివ్వలేని అశక్తుణ్ణి...’’ అంటూ కంట నీరు పెట్టుకున్న తమ జనకుడ్ని చూసి కుమారూలిద్దరూ చలించి పోయారు.

అప్పటికే చివరి శ్వాసల్లో వున్న అగ్నిభట్టారకుడు ఏదో స్ఫురణ కొచ్చినట్లు తన కుడి చేతి వేళ్ళ వైపు చూసుకొని సంతృప్తిగా తల ఫంకించి, కుమారులను చెంతకు రమ్మని సంజ్ఞ చేసి, తన కుడి చేతి అనామిక వేలికున్న దివ్య నాగ లోక అంగుళీయాన్ని నెమ్మదిగా తీసి దాన్ని భక్తిగా కళ్ళ కద్దు కొని కుమారుల వైపు చూస్తూ`

‘‘పుత్రులారా...! తక్షకుడు రెండు బంగారు సంచులతో పాటు ఇది నా చేతికి తొడిగాడు. కాల గమనంలో దీని సంగతే నేను ఏమరిచితిని.
ఇది అత్యంత విలువైన, అపూర్వమైన, అనన్య సామాన్యమైన, అనితర సాధ్యమైన నాగ లోకపు దివ్య నాగ నీలమణి...

నా పుత్రులయిన మీకు చివరి దశలో ఏమి యివ్వ లేక పోయాననే వేదన లేకుండా చేయ గలిగింది ఈ దివ్య నాగ లోకపు నీలమణి.
మీరిద్దరూ ఒకే ఇంటిలో అన్యోన్యముగా జీవించాలి, విడి పోకూడదు.  మీ భార్యలు మిమ్మల్ని తప్పక విడ దీయగరు. వారి పట్ల కడు జాగరూకులై ఉండ వలె. ఈ దివ్య నాగ లోకపు నీలమణి మీ ఇద్దరి ఉమ్మడి సొత్తు. దీన్ని ప్రతి నిత్యము పూజించాలి... సేవించాలి.. దీనికున్న శక్తులు అనన్య సామాన్యమైనవి, అసాధారణమైనవి.

దీన్ని ఆసరాగా తీసుకుని మంత్రిస్తే ఎంతటి విషమైనా తక్షణం హరించి పోవల్సిందే. అంతే కాదు, ఎలాంటి జబ్బులనైనా చిటికలో మాయం చేయగల మహత్తర శక్తి దీనికుంది.

మీ భార్యల మాటలు విని దీన్ని విడ గొట్టి చెరి సగం చేసు కోవాలని ప్రయత్నిస్తే ఇది నిరుపయోగంగా మారి పోతుంది.

ముందుగా దీన్ని శ్రద్ధా భక్తులతో పూజించి, సేవించి, స్పర్శించి శివ లింగం ముందుంచి నేను మీకు నేర్పిన సర్ప మంత్రమును మీ ఉపాధిగా చేసుకొని నిజాయితిగా జీవించండి...’’ అని కొద్ది ఘడియలాగి... ఆ నాగ లోకపు దివ్య నీల మణిని ఇద్దరికీ అందించాడాయన.
పుత్రు లిద్దరూ తమ తమ హస్తాల్ని చాపి దాన్ని అందుకొని కళ్ళ కద్దుకున్నారు.

చిక్కటి నిశ్శబ్ధం ఇప్పుడక్కడ...

చిన్నగా... అతి చిన్నగా... నెమ్మదిగా... అత్యంత నెమ్మదిగా అగ్నిభట్టారకుడు పెదాలు కదిలాయి...

‘‘ఓం నమో నారాయణనాయః’’ అంటూ అష్టాక్షరి మంత్రం జపించటం ఆరంభించారాయన.

తమ జనకునికి ఆఖరి ఘడియలు సమీపించాయని కుమారులకు అర్థమై పోయింది.

ఒకరు తులసాకు, మరొకరు కలశంలో మంచి నీరు తీసుకొచ్చారు వెంటనే. వణుకుతున్న జనకుని పెదాలమధ్య ఒక్కో చుక్కా పోయనారంభించారు. కొన్ని లిప్తల కాలం లోనే ఆ మహా మహుడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయాయి...
ఎన్నో ప్రశ్నలతో నిండి వున్న ధనుంజయుడ్ని చూస్తూ చెప్పటం ఆపింది.

భద్రా దేవి వినిపించిన విషయాల్ని అతి శ్రద్ధగా విన్నాడు యువరాజు ధనుంజయుడు. అయినప్పటికీ కొన్ని సందేహాలు ఇంకా మిగిలి పోయాయి.

‘‘అనగా... మీ వంశ మూల పురుషుడు నాటి అగ్ని భట్టారకుడనేగా?’’ అనడిగాడు.

‘‘అవును ప్రభూ!’’ అంది ప్రశాంతంగా భద్రా దేవి.

‘‘మీ వంశమున ప్రతి తరము తమ విద్యలతో బాటు ఈ గాధను కూడ ముందు తరానికి బోధిస్తూనే వున్నారా?’’

‘‘అవును ప్రభూ’’

‘‘నీవు ఎన్నో తరము?’’

‘‘ఏడవ తరము.’’

‘‘నీవు వచించిన ప్రకారము జూడ నా జనకునకు మారుగ నా జనని సింహాసన మందుండిన నా జనకునకు పుట్ట వ్రణము సంభవించెడిది కాదందువా?’’

‘‘నేను అనటం కాదు ప్రభూ, ఆనాడు నా జనకుని మాటలు ధర్మ తేజుల వారు ఆలకించి వున్న నేడు వారికీ వ్రణ బాధ మరణ యాతన వుండేడివి కాదు.’’

‘‘నీ తండ్రి గారా... అంటే....?’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్