Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali serial

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే...http://www.gotelugu.com/issue163/464/telugu-serials/atulitabandham/atulitabandham/

 

 “ఏమిటే ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉందీ? అన్నయ్య ఈరోజు రావాలేమో, ఇంకా రాలేదా?” సుడి  గాలిలా ఇంట్లోకి  ప్రవేశించిన వినత తల్లిని ప్రశ్నించింది.

“ష్ ! ఇద్దరూ మంచి నిద్రలో ఉన్నారు... ట్రైన్ నాలుగు గంటలు లేట్ గా వచ్చింది. బాగా అలసిపోయారు... రా, లోపలికి... అబ్బాయి వచ్చాడా?”

“ఊ... వాళ్ళమ్మని వదిలి ఆయన వస్తాడుటే నీ పిచ్చి గానీ... అయినా ఇదేమిటమ్మా, తిరుపతి దర్శనం, హనీమూన్ అంటే మరీ ఇన్ని రోజులా? మీ మెత్తదనం చూసీ...” వంటగదిలో బైఠాయించింది వినత.

“ఇది మరీ బావుందే, నీ అన్నయ్య మీద కూడానా అంత అసూయ?”

“నా పెళ్ళి అయిన వెంటనే ఆయన్ని ఢిల్లీ పంపించేసారే వాళ్ళ ఆఫీసు వాళ్ళు... నా హనీమూను మూడు నెలలు లేట్ గా అయింది... ఆ తర్వాత ఆ మహాతల్లి మంచాన పడింది... ఇక ఎక్కడికీ తీసుకువెళ్లటానికీ అతనికి ఖాళీయే లేదూ...” సాగదీసింది వినత...

“ఇదేమిటి అమ్మా, భలే ఘుమఘుమలాడిపోతోంది!” మూత పెట్టిన గిన్నె తీసి, “వావ్, చక్కెరపొంగలి! ఏమిటే ఈరోజు విశేషం? బాగా జీడిపప్పులు వేసావుగా, పచ్చకర్పూరం దట్టించావు...ఏదీ, ఆ బౌల్ అందుకో...” అంటూనే బౌల్ లో ఇంత వడ్డించుకుని, జీడిపప్పులు అన్నీ ఏరుకుని వేసుకుంది...

“ఇంట్లో తల్లి పరిస్థితి అలా ఉంటే సరదా ఎలా ఉంటుందే? నువ్వు కూడా బాధ్యత లేకుండా పనిమనిషి మీద వదిలి పెట్టకే ఆవిడని... అది పద్ధతి కాదు... ఇంతకీ ఎలా ఉన్నది ఆవిడ?” అన్నది సుగుణమ్మ.

“అమ్మా, ప్లీజ్... నా వల్ల కాదమ్మా ఆవిడకి సేవలు చేయటం... ఆ మాట మాత్రం చెప్పద్దు...” గట్టిగా అన్నది వినత.

“బాగా కుదిరిందా? అన్నయ్యకి ఇష్టమని చేసాను... వినతా... నీతో ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నానే... ఏం లేదు... ప్రతీ నెలా నువ్వు గుడ్ న్యూస్ చెబుతావేమోనని ఎదురు చూస్తాను... ఆ మాటే లేదు... ఓ సారి డాక్టర్ దగ్గరికి వెళదామా?” జంకుతూనే అన్నది సుగుణమ్మ.

“ఏమిటే నీ పిచ్చి? అప్పుడే పిల్లలా?? పుడతార్లే తొందర ఏముందీ?” తేలిగ్గా చప్పరించేసింది వినత.

“నీ పెళ్లై మూడేళ్ళు  దాటిందే... మరి మాకు తొందరగా ఉండదా?”

“సరి సర్లే... ఇంతకీ అన్నయ్య నాకేం తెచ్చాడే ఊరినుంచి చెప్పూ?”

“ఇంకా తెలియదే తల్లీ, పడుకున్నారుగా, లేచాక ఇస్తారులే... మధ్యాహ్నం భోజనంలోకి గోంగూర పచ్చడి, మజ్జిగపులుసూ, అరటికాయ వేపుడూ చేసాను... ఇంకేదైనా కూర చేయనా నీకోసం?”

“ఉహు...మధ్యాహ్నానికి మాత్రం గారెలు వండు... తిని చాలా రోజులైంది...అవునూ... అన్నయ్య గోంగూర తినడు కదే, ఎవరికోసం ఆ స్పెషలు?”

“మధుబాలకి ఇష్టమట...”

“ఓహో... కోడలు గారు పవళిస్తే అత్తగారు ఆమెకిష్టమైన స్పెషల్స్ చేస్తూ బిజీ... ఆహాహా, నువ్వేం అత్తగారివే, ఆమెగారికి వంటమనిషివి కానీ...”

“ఛీ, ఏమిటే ఆ మాటలు? కోడల్ని కూడా కూతురిలా చూసుకోవాలని అన్నారు... నీకు ఇష్టమైనవి చేసి పెట్టనా? నువ్వు మరీనే...”

“అవునమ్మా, ఆవిడకి చులకనైపోతే కానీ తెలియదులే ఎందుకు చెబుతున్నానో...సరే, నేను వెళ్లి టీవీ చూస్తా... వీళ్ళు తొందరగా లేస్తే బాగుండును...” వినత మాట పూర్తికాకుండానే మధుబాల వచ్చింది అక్కడికి, తలస్నానం చేసి, ఇస్త్రీ చీర కట్టుకుని.

“హాయ్ వినతా, బాగున్నావా? ఎంత సేపైంది వచ్చి?” అంది నవ్వుతూ...

“ఇప్పుడే పదినిమిషాలు... బాగా జరిగిందా మీ ట్రిప్ ?”

“హా చాలా బాగా అయింది... ఎలా ఉన్నారు మీ అత్తగారు? మా అన్నయ్యా??”

“బాగానే ఉన్నార్లే... అన్నయ్య ఇంకా లేవలేదా?”

“లేదు వినతా... కొద్దిగా జ్వరం వచ్చింది ఆయనకి... టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు... లేస్తారు, ఓ పావుగంటలో... అత్తయ్యా, ఆయనకి మధ్యాహ్నం అన్నం పెట్టవద్దు... బ్రెడ్, పాలు ఇద్దాము...”

“అలాగే మధూ... బ్రెడ్ తెప్పిస్తాను... తిరగటం వలన, అలసట వలన అయి ఉంటుంది... జలుబు కూడా ఉన్నట్టుంది  కదా...”

“అవును అత్తయ్యా... విక్స్ రాసుకున్నారు... అయినా తగ్గలేదు...”

“ సరే, సొంఠీ మిరియాలూ కలిపి కషాయం కాచిస్తా...”

“మధూ, ఇంతకీ షాపింగ్ బాగా చేసావా?” ఉత్సుకత తో అడిగింది వినత.

“అదేమిటే పేరు పెట్టి పిలుస్తావు? వదినా అని పిలవాలి...” సరిచేయబోయింది సుగుణమ్మ.

“ఇంచుమించుగా ఒకే వయసు కదే... వదినా అని పిలవాలనిపించదు...”

“ఫర్వాలేదులే అత్తయ్యా... పెద్దగా షాపింగ్ అంటూ ఏమీ చేయలేదు వినతా... కంచిలో చీరలు కొన్నాం, మైసూర్ లో అగరువత్తులు, ఊటీలో అందరికీ స్వెట్టర్లూ, షాల్స్  ఇవే...” నవ్వింది మధుబాల.

“అత్తయ్యా, కూరలు తరిగివ్వనా?” అని అడిగింది.

“వంట అయిపోయింది మధూ... నీకు వీలుంటే నాలుగు గారెలు వేసిస్తావా? ఇప్పుడే కాదు, భోజనాల టైముకి వేస్తే చాలు... పిండి ఫ్రిజ్ లో ఉంది...” చెప్పింది సుగుణమ్మ...

“సరే అత్తయ్యా...”

ఇంతలో లేచి వచ్చాడు వేణు...

“ఏంటిరా జ్వరమొచ్చిందటా?” అతని నుదుటిమీద చేయివేసి చూసింది వినత.

“అవును కొద్దిగా... విన్నూ, ఎలా ఉన్నావే? బావ బాగున్నాడా?” ఆప్యాయంగా అడిగాడు వేణు.

“అరే వేణూ, ఈరోజు టీ, కాఫీ లేదు నీకు...ఓన్లీ కషాయం... తయారు చేస్తున్నా...” కల్వంలో మిరియాలు నూరుతూ చెప్పింది సుగుణమ్మ...

“కెవ్... వద్దే అమ్మా, అర్భకుడికి అంత శిక్షా?” భయం నటించాడు వేణు.

మధుబాల లోపలినుంచి చీరల పాకెట్లు తీసుకువచ్చి, వినత ముందు పెట్టింది.

“ఇదిగో ఈ ఆకుపచ్చ రంగు చీర  అత్తయ్యగారికి... ఈ ఆరెంజ్ కలర్ చీర వదినగారికి... ఈ నీలంరంగు చీర నీకు...” అన్నీ తెరిచి చూపించింది మధుబాల.

“ఓ... మరి ఈ పాకెట్?” తెరచి చూసింది వినత. నెమలి కంఠం రంగు చీరకు గోరంచు జరీ ఉన్న చీర అది. చీరంతా చిన్న డిజైన్ తో బుటా ఉంది...

“అది... అది... నా ఫ్రెండ్ కోసం తీసుకున్నాను వినతా...” సంశయంగా చెప్పింది మధుబాల ఆ చీరను పొరపాటుగా ఈ చీరలతో కలిపి ఉంచినందుకూ, గదిలోనే వదిలి రానందుకు చింతిస్తూ...

“ఈ నీలం రంగు చీర ఆవిడకి ఇచ్చేయ్... ఈ చీర నేను తీసుకుంటా...”

“సారీ వినతా... ఈ చీర తనకోసమే సెలెక్ట్ చేసాను... నీకోసం మళ్ళీ వేరే చీర ఈ రంగులో తీసుకుంటాగా?” నచ్చజెప్పబోయింది మధుబాల.

“ఓహో, ఆడపడుచు కన్నా ఎక్కువైన ఆ స్నేహితురాలు ఎవరమ్మా? పెళ్ళి కాకుండానే కాపురం చేస్తున్న ఆ ఐశ్వర్యేనా?” వ్యంగ్యంగా అంది వినత.

“వినతా...ప్లీజ్...” వారించబోయింది మధుబాల.

“ఏమ్మా, నిజమే కదా నేనన్నది? అసలు అలాంటి స్నేహాలేమిటి మధూ నీకు? పైగా ఆవిడగారికి బహుమతులు కూడానూ...” ఈసడించినట్టే అన్నది వినత.

మధుబాల ముఖం ఎర్రబడిపోయింది... ఓవైపు దుఃఖం వచ్చేస్తోంది... నిస్సహాయంగా భర్త వైపు చూసింది.

“చీర కోసం ఇంత గొడవ ఎందుకూ? మధూ, వినతకి అదడిగిన చీరిచ్చేయ్...” క్లుప్తంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేణుగోపాల్.

మధుబాల హృదయం విలవిలలాడి పోయింది... అంటే ఐశ్వర్యను వినత ఏమీ అనకుండా ఉండాలంటే ఆ చీరను ఇచ్చేస్తే ఇక  గొడవ చేయదు... లేకపోతే ఇల్లుపీకి పందిరేస్తుంది... ఎంత అవమానం ఇది తనకు?

“వినతా... ఐశ్వర్య పర్సనల్ విషయం అది... అది మనం మాట్లాడుకోవటం అంత అవసరమా?” వినత కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నది మధుబాల.

“అంటే, అలాంటిదాన్ని నువ్వు సమర్థిస్తున్నావన్న మాట...”

“కాదు, అది ఆమె వ్యక్తిగతవిషయం అని చెబుతున్నాను. ఆమెను మంచి స్నేహితురాలిగా చూడాలి, ఆమె అభిప్రాయాలను గౌరవించాలి... అంతే కాని... ఇంకో విషయం వినతా... పెళ్ళి విషయంలో మా ఇద్దరి అభిప్రాయాలు వేరు కాబట్టే, నేను వివాహం చేసుకున్నాను... ఆమెకి కొన్ని కారణాల వలన ఆ బంధం ఇష్టం లేదు కనుక ఆమె చేసుకోలేదు...”

“సరేలే అయిందేదో అయింది... ఇక ముందు ఆమెతో స్నేహం చేయటం కానీ, ఆమెను ఇక్కడికి పిలవటం కానీ చేయకు... మా పరువు పోతుంది...” నెమలి కంఠం రంగు చీరను తీసి కవర్లో పెట్టుకొని, “అమ్మా, నేను వెళుతున్నా... గారెలు వచ్చే వారం చేద్దువులే...” అంటూ మధుబాల వైపు కళ్ళెగరేసి విజయగర్వంతో చూసి, బయటకు నడిచింది వినత.

అలా వెళ్ళిపోతున్న వినత వైపు మ్రాన్పడిపోయి చూస్తూ ఉండిపోయింది మధుబాల. ఆమె మనసంతా వికలమైపోయింది...

***

“ఏమిటి భోజనం చేసి వస్తానన్నావుగా, అప్పుడే వచ్చేసావా? మీ అన్నయ్యా వాళ్ళు వచ్చారా ఊరినుంచి?” ఆశ్చర్యంగా అడిగాడు పవన్.

“ఆహా, వచ్చేసాను... ఇదిగో ఇది చూడు!” చేతిలోని చీర పాకెట్ అతని చేతిలో పెట్టింది వినత.

“చీరా, చాలా బాగుంది... మీ వదిన గిఫ్టా?” అన్నాడు నవ్వుతూ...

“మా వదిన వేరే ఫ్రెండ్ కి ఇవ్వాలనుకున్న గిఫ్ట్... నేను కొట్టేసా...” గర్వంగా నవ్వింది.

“ఛ! అదేమిటి విన్నూ? నీకేం తక్కువ, అలా తెచ్చేసుకోవటానికి? తప్పు కదూ?” మందలింపుగా అన్నాడు పవన్.

“లేకపోతే ఇంత అందమైన చీరను అదెవత్తో తల మాసిందానికి ఇస్తానంటుందా? పైగా అదో కారెక్టర్ లెస్ లేడీ పవన్...”

“ఛీ, ఏమ్మాట్లాడుతున్నావు వినతా... ఒకమ్మాయి గురించి అందులోనూ మీ వదిన స్నేహితురాలి గురించి అలా మాట్లాడటానికి నీకు సభ్యత, సంస్కారం లేవా?” తీక్షణంగా చూసాడు పవన్.

“ఎందుకూ? ఉత్తముడిని ఉత్తముడు అంటాము, బిచ్చగాడిని బిచ్చగాడు అంటాము... చెడిపోయిన వాళ్ళను మంచివాళ్ళు అనము కదా... ఆ ఐశ్వర్య గురించి మొన్ననే  తెలిసింది...  ఎవరితోనో పెళ్ళి కాకుండా సహజీవనం చేస్తోందిట. అతన్ని పెళ్ళికి కూడా తీసుకువచ్చింది కదా పెద్ద గొప్పగా? అలాంటి వాళ్ళతో మా వదినకు స్నేహం ఏమిటి చెప్పండి? అందుకే ఆ స్నేహం వదిలేయమని కూడా గట్టిగా చెప్పి వచ్చాను...”

“ఒక బంధాన్ని వదిలేయమని చెప్పటానికి నువ్వెవరు వినతా? కొంచెమైనా బుద్ధి లేదు నీకు... ఆ అమ్మాయి వ్యక్తిగతానికి, వాళ్ళిద్దరి స్నేహానికీ ఏమాత్రం సంబంధం లేదు...”

“ఈవిడ గారూ అదే చెప్పార్లెండి ! అయినా సరే, అలాంటి వాళ్ళతో కలిసి తిరిగితే మన పరువేం కావాలి చెప్పండి? అవును పవన్... మనం కూడా టూర్ వెళదాం, ప్లాన్ చేయండి... ప్లీజ్...”

“అమ్మను అలా విడచిపెట్టి ఎలా వెళ్ళగలం చెప్పు విన్నూ... వచ్చే సెప్టెంబర్ లో మా అక్క అమెరికా నుంచి వస్తుంది కదా, అప్పుడు వెళదాం లే...”

“నువ్వెప్పుడూ ఇంతేగా... ఏదో వంక చెబుతావు... మీ అమ్మను చూసుకోవటానికి మనిషి ఉంది కదా... ఒక్క పదిరోజులు మనం లేకపోతే ఏమౌతుందేం?” కోపం వస్తే ఏకవచనమే వినతకు.

“నువ్వెలాగూ బాధ్యతను ఫీల్ అవవు... కొడుకుగా నన్నైనా ఫీలవనీ... ఎలాగూ నీ ఎంజాయ్ మెంట్లు నీకున్నాయిగా?”

“ఊ.. ఈ పట్టు చీరకు డిజైనర్ బ్లౌజ్ వెంటనే కుట్టించాలి... మాచింగ్ సెట్ కొనుక్కోవాలి... ఆదివారం మా ఫ్రెండ్ కిట్టీ పార్టీకి కట్టేసుకుంటా...అంతే...”

“ఈ ఆదివారం మా ఫ్రెండ్ ఇంట్లో లంచ్ ఉంది కదా విన్నూ?”

“ఫ్రెండ్? ఓ ఆ బ్యాంకు క్లర్క్ రాఘవ ఇంట్లోనా? అలాంటి వాళ్ళు మీకు ఫ్రెండ్స్ ఏమిటి పవన్? మన స్థాయి వాళ్ళైతే లంచ్ లైనా డిన్నర్లైనా ఓకే కానీ... ఉహు, నేను రాను... మీరు వెళ్ళి వచ్చేయండి... అయినా నా ప్రోగ్రాము నాకుంది. అది మానే ప్రసక్తే లేదు...నేను అర్జెంట్ గా ఫోన్ చేసుకోవాలి...” అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది వినత.

నెత్తి కొట్టుకున్నాడు పవన్.

***

తెల్లారగానే ఐశ్వర్య ఆశ అడియాస అయిపోయింది... బాత్ రూమ్ కి వెళ్ళి వచ్చి నిరాశగా కూర్చుంది. ఈ నెల కూడా వచ్చేసింది, కాస్త ఆలస్యంగా... ఇక ‘అమ్మా’ అని పిలిపించుకునే భాగ్యం ఎప్పటికి? దీర్ఘమైన నిట్టూర్పు వెలువడింది ఆమె కంఠంలోనుంచి...

ఇంతలో హాల్లోంచి లాండ్ లైన్ ఫోన్ మ్రోగసాగింది.

ఎప్పుడైనా కార్తీక్ చేస్తూ ఉంటాడు ఈ నంబర్ కి... అందుకే గబుక్కున పరుగు పెట్టింది...

ఫోన్ ఎత్తగానే అవతలినుంచి ఓ లేడీ వాయిస్ హస్కీగా... “కార్తీక్ ఉన్నాడా?” అంటూ...

“టూర్ వెళ్ళాడు... మీరు?”

“ఎక్కడికి వెళ్ళాడో, ఎవరితో వెళ్ళాడో కూడా తెలుసు నాకు... అతని మొబైల్ ఫోన్ స్విచాఫ్ వస్తోంది... అందుకే దీనికి చేశా... అయామ్ మిస్ డాలీ... ఐ థింక్ యు వార్ మిస్ ఐశ్వర్య... యామై రైట్?” నవ్విందామె.

“యస్... ఏ... ఏమైనా చెప్పాలా కార్తీక్ కి?” మెల్లగా అడిగింది ఐశ్వర్య...

“నీ దగ్గరకు రాగానే మొబైల్ ఛార్జ్ చేసుకోమను యార్...అది చాలు... బై...” డిస్కనెక్ట్ చేసింది...

రిసీవర్ పెట్టేసి అలాగే కూర్చుంది ఐశ్వర్య.

***

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagaloka yagam