Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
beauty of rajasthan

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

 

 

 వేసవి కాలం మెల్లిగా వెళ్తోంది. ఇంక స్కూళ్ళూ , కాలేజీలూ తెరుస్తారు.  ఇదివకటి రోజుల్లో పరీక్షలైపోగానే శలవులిచ్చేసేవారు. ఆ శలవల్లోనే, పరిక్షపేపర్లు దిద్దడాలూ, ఫలితాలూ స్కూల్లో ఓ బోర్డుమీద పెట్టేవారు. ఓ విషయం చెప్పుకోవాలిలెండి, మరీ అధమాధముడయితే తప్ప, ప్రతీ వాడూ పై క్లాసులోకి వెళ్ళేవాడు. మరీ అత్తిసరు మార్కుల్లాంటివొస్తే, ఏదో మోడరేషన్ పేరుచెప్పి పై క్లాసులోకి తోసేసేవారు. ఉన్న నాలుగైదు సబ్జెక్టుల్లోనూ, దేనిలోనైనా కొద్దిగా తక్కువొచ్చినా, మిగిలిన మార్కుల  ప్రభావంతో గట్టెక్కేసేవారు. ఈ శలవల్లో, ఉపాధ్యాయులు పేపర్లు దిద్దే టైములో బలే తమాషాగా ఉండేది. కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలకి మార్కులు వేయించుకోడానికి, టీచర్ల ఇళ్ళచుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు..ఇవన్నీ ఓ ఎత్తూ, స్కూలుఫైనల్ పరీక్షలు మరో ఎత్తూనూ.  మారోజుల్లో SSLC  Board  కర్నూల్లో అనుకుంటా ఉండేది.. రాష్ట్రంలోని అన్ని పేపర్లూ, రాష్ట్రం మొత్తంమీది అన్ని స్కూళ్ళ ఉపాధ్యాయులకీ, దిద్దడానికి సద్దేవారు. అంటే, సాధారణంగా ఏ స్కూలు పేపరు ఏ చోటకెళ్ళిందో తెలిసేది కాదు.  ఆ పేపర్లు దిద్ది , ఓ  సైనుగుడ్డలో వాటిని పొందిగ్గా సద్ది, అటుపైన ఆ సైనుగుడ్డని సూదీదారంతో డబుల్ కుట్లు వేసి, రిజిస్ట్రీలో పంపేవారు. ఈ వివరాలన్నీ నాకెలా తెలుసా అంటే, మా ఇంటినిండా టీచర్లే.. మొత్తానికి ఏ శలవులాఖరికో ఫలితాలు వచ్చేవి. మళ్ళీ అదో పెద్ద సరదా. ఏ విశాలాంధ్ర పేపరులోనో రిజల్ట్స్ వచ్చేవి. మార్కులెలా వచ్చాయో తెలిసికోవాలంటే ఇంకో పదిరోజులో, పదిహేనురోజులో ఆగాల్సొచ్చేది.  SSLC  Book  అని ఒకటుండేది. దాంట్లో శ్రీ బి. వెంకటరమణప్పగారి  సంతకం స్టాంపుతో, మన మార్కులు వచ్చేవి. ఎంతచెప్పినా, ఓ 50 % వచ్చిందంటే గొప్పగా ఉండేది. ఆ  SSLC Book  అప్పటికీ, ఇప్పటికీ మన జన్మదిన దాఖలా. ఈరోజుల్లోలాగ  Birth Certificates  వగైరా ఉండేవి కావు. దాంట్లో వేసిన జన్మతిథే ఫైనల్.

మొత్తానికి SSLC  పాసయితే, ఊళ్ళోనే ఉండే కాలేజీ. ఎక్కడో తప్ప పైఊళ్ళకి పంపేవారుకాదు. పైగా ఆరోజుల్లో, ఇప్పటిలాగ కార్పొరేట్ స్కూళ్ళూ, కాలేజీలు ఉండేవి కావు. ఊళ్ళో ఉండే ఏ జమిందారుగారో, ఊరికి ఉపకారం చేద్దామని, సమృధ్ధిగా విరాళాలూ, భూదానం చేసి ఓ కాలేజీ మొదలెట్టేవారు. దాన్ని రాష్ట్రంలో ఉండే ఏ మూడు నాలుగు విశ్వవిద్యాలయాలకో అనుబంధం చేసేవారు. కాలేజీ పరీక్షలు ఆ విశ్వవిద్యాలయం వారు నిర్వహించి, డిగ్రీ ఇచ్చేవారు. కాలేజీ లెక్చెరర్స్ అయినా, స్కూలు ఉపాధ్యాయులైనా  ఓ బాధ్యతతో చెప్పేవారు. ఇప్పుడున్న కోచింగ్ క్లాసులూ, సింగినాదం ఉండేది కాదు.. సాధారణంగా క్లాసులో చెప్పేదే అర్ధమయేటట్టు చెప్పడం ఓ ప్రత్యేకత. అంతగా అర్ధం కాకపోయినా, మాస్టారింటికి  వెళ్ళి అడిగే చొరవా, చనువూ ఉండేది. మాతృభాష తెలుగుకి స్కూల్లోనూ, కాలేజీ మొదటి సంవత్సరంలోనూ కూడా పెద్దపీటే వేసేవారు.. కాలేజీకి వెళ్ళేదాకా సాధారణంగా నిక్కర్లే. కాలేజీకి వచ్చిన తరవాతే, చేతికో వాచీ, వేసికోడానికి ప్యాంటులూనూ. డిగ్రీ చేతికి వచ్చిన తరువాత, వారివారి ఆర్ధిక స్తోమతను బట్టి, ఏ పైచదువులు ఇంజనీరింగుకో, మెడిసిన్ కో ఏ విశాఖపట్నమో, కాకినాడో, గుంటూరో వెళ్ళేవారు. కారణం ఆ కాలేజీలు అక్కడే ఉండేవి కాబట్టి. మిగిలినవారు ఏ టీచర్ ట్రైనింగుకో వెళ్ళేవారు. మిగిలినవారంతా ఏ తాలూకాఫీసులోనో  ఉద్యోగాల్లో చేరేవారు. ఎక్కడో నూటికీ కోటికీ ఏ తెలివైనవారో విదేశాలకి వెళ్ళేవారు. ఆరోజుల్లో అలా వెళ్ళిన మన తెలుగువారే, అంచెలంచెలుగా ఎదిగి, ఇప్పుడు ఉన్నతస్థానాలు చేరుకుని, విదేశాల్లో వెలిగిపోతున్నారు. వాళ్ళూ పైచెప్పిన క్రమంలోనే చదువుకుని పైకొచ్చిన వారే. కానీ వారి పునాదులు గట్టివి.  చదువుని ఓ దేవతగా భావించి అభివృధ్ధిలోకి వచ్చారు. కాలేజీల్లోనూ అక్కడా, కొత్త విద్యార్దులని ragging  పేరుతో హింసించేవారు కాదు. అలాగని అసలు ఆ సరదాయే లేదనీ కాదు. సరదాగా వారిని ఆటపట్టించి కొత్త పోగొట్టేవారు. రాజకీయాలుండేవా అంటే ఉండేవే అని చెప్పుకోవాలి. కానీ అవన్నీ కులమతాలకి అతీతంగా ఉండేవి.  విద్యార్ధులకి ఓ హెడ్మాస్టారన్నా, ప్రిన్సిపాలుగారన్నా ఓ విధమైన భక్తీ గౌరవమూ ఉండేవి. కారణం వారి ప్రవర్తనే అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇప్పటివారికి ఆరోజుల్లో చదువులంటే , ఏదో వానాకాలం చదువుల్లెద్దూ అనే ఓ దురభిప్రాయం ఉంది. వాటన్నిటినీ వచ్చేవారం చూద్దాం…

సర్వేజనా సుఖినోభవంతూ.

మరిన్ని శీర్షికలు
veekshanam