Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
veekshanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

పాండురంగ మాహాత్మ్యం 

పాండురంగ మాహాత్మ్యం కావ్యంలో ప్రథమాశ్వాసంలో కాశీపట్టణ వర్ణన చేస్తున్నాడు తెనాలి రామకృష్ణుడు.అగస్త్యమహర్షి కాశీపట్టణంలో వాసం చేస్తున్న దగ్గరినుండీ, ఆయన దక్షిణ దేశయాత్రతో ఈ కథ మొదలవుతుంది కనుక కాశీ పట్టణం గురించి చెప్పడం అవసరము, అందమైన ఘట్టము అయ్యింది.

పరిఖ నిజాశ్రయాంబుపరిపాటిఁ దలిర్పఁ, బదారువన్నె బం
గరువుననైన  రాజగృహకల్పన కర్ణిక గాఁగ, గంధసిం
ధురములు తేఁటులై మొరయఁ, దోరపుఁగొమ్మలు రేకులట్లుగా 
ధరయను కొల్నిలో మొలచు తామరపూవనఁ గోట మీటగున్           (చ)

కాశీభూమిని ఒక కొలనుగా, రాజప్రాసాదాన్ని ఒక తామరపూవుగా పోల్చడం జరిగింది కనుక, ఆ పోలికను కొనసాగిస్తున్నాడు. కోట చుట్టూ ఉన్న అగడ్త తనను చుట్టుకుని ఉన్న ఆశ్రయులు,'అస్మదీయులు' అనే నీటిలాగా ఉన్నది. పదహారువన్నెల బంగారం వలె మెరిసిపోతున్న రాజగృహం 'కర్ణిక'లాగా అంటే ఆ రాజగృహమనే తామరపూవు దుద్దులాగా ఉన్నది. తామరపూవుకు ముసురుకుని రొదజేసే తుమ్మెదలలాగా కోటలో అసంఖ్యాకంగా ఉన్న ఏనుగుల రొద ఉన్నది. కోటకొమ్మలు తామరపూవు రేకులలాగా ఉన్నాయి. ధర అనే కొలనులో మొలచిన మరపూవులాగా ఆ కోట యొక్క సౌందర్యము అతిశయిస్తున్నది. స్వతంత్ర భావాలే కాక పదాల కల్పన కూడా రామకృష్ణుని విలక్షణ శైలి. కొలనిలో అనకుండా 'కొల్ని'లో అన్నాడు.         

పురి రాకొమరుల కీర్త్యం
బరవాహిని భుజగపురికి బలువిడిఁ జని యం
దిరవుకొన నెడము చాలమి 
మరలిన తరి  బుగ్గలన నమరు సౌధంబుల్                (కం)

యిది చమత్కారమైన వర్ణన. రాయలకాలపు కవులలో, రాయలలో రామకృష్ణునిలో ఈ వినూత్న కల్పనలు ఎక్కువగా కనిపిస్తాయి. అంబరవాహిని అంటే ఆకాశగంగ.భుజగపురి అంటే నాగలోకం, అంటే పాతాళం. 'ఆ పట్టణపు రాకుమారుల కీర్తి' అనే ఆకాశ గంగ పాతాళానికి ప్రవేశించి, అక్కడ చోటు చాలక, మరలా వెనక్కు పోటు ఎత్తింది. అలా ప్రవాహం వెనక్కు తిరిగినప్పుడు పైనుండి వస్తున్న ప్రవాహంతో రాపిడి, ఒరవడి ఏర్పడి బుడగలు, నురగలు రావడం సహజం. ఆ రాకుమారుల కీర్తి అనే ఆకాశగంగ పాతాళంలో చోటుచాలక వెనక్కు తిరిగి పోటెత్తినపుడు మొలచిన బుడగలలాగా ఆ పట్టణంలోని సౌధాలు ఉన్నాయి.
|

నాకనదీ ప్రదీప్తపులినంబుల నింబుల నిల్చి సన్మునుల్ 
సైకతలింగ పూజనము సల్పు తరిన్ ఠవణించుఁ దత్పతా
కా కలకింకిణీరవము ఘంటలు వాగుట, ధూపధూమముల్ 
పైకొలుపున్ సమర్హగతిఁ బర్వెడు గుగ్గులుధూమ ధోరణిన్                         (ఉ) 

ఆ కోటల కొమ్మలకున్న జెండాలకున్న ఘంటలు మ్రోగుతుంటే గంగానదీ తీరములో ఇసుక తిన్నెలలో సన్మునులు సైకతలింగమును పూజించి ఘంట వాయిస్తున్నట్లుగా విత్రమైన ధ్వనులు విన్న అనుభూతి కలుగుతుంది. ఆ సైకతలింగానికి పూజలు చేసి ధూపము వేసినపుడు పైకెగసిన పొగలతో సమానంగా, అంతటి పవిత్రంగా,కోటలలో, సౌధాలలో వేసిన సాంబ్రాణి పొగలు పైకిలేస్తాయి. యిక్కడ సున్నితమైన ధ్వని ఏమిటంటే సైకతలింగానికి వేసిన ధూపపు పొగలవలె కోటలో, సౌధాలలో వేసిన గుగ్గులపు గల పవిత్రమైన పరీమళాలు ఉంటాయి, కోటలో, సౌధాలలో వేసిన బ్రాణి పొగలలాగా, ఉద్ధృతంగా, దట్టంగా, దిట్టంగా సైకతలింగపూజాధూపాలు ఉంటాయి. పట్టణవర్ణన నుండి పౌరుల వర్ణనకు మరలుతున్నాడు. వరుసగా నాలుగు వర్ణముల వారిని నాలుగు పద్యాలలో వర్ణిస్తున్నాడు.

చదువులపుట్టినిండ్లు, శమసంపద యిక్కలు, పుణ్యలక్ష్మికిన్ 
మొదటి దివాణముల్, సురసమూహమునాఁకటిపంట, లంచితా
భ్యుదయ నిసర్గబంధువులు, ప్రోడతనంబుల ఠాణముల్, పురిన్ 
బొదలెడి భూసురోత్తముల భూరిపవిత్ర శరీరవల్లరుల్                              (చ)

అక్కడి బ్రాహ్మణుల తీగలవంటి(!) పవిత్రములైన శరీరములు చదువులకు పుట్టినిళ్ళు.శమసంపదకు స్థానాలు. తీగలవంటి శరీరాలు అనడం అందగత్తెలవర్ణన కదా అని అనుమానం రావచ్చు. బలిసి, బొజ్జ, క్రొవ్వు పెరిగిన శరీరాలు కావు వారివి. వారు మితాహారులు, యతాహారులు, నియతాహారులు, తిండిబోతులు కారు అంటున్నాడు రామకృష్ణుడు సరసంగా. శమము అంటే అంతరింద్రియాలను అదుపులో ఉంచుకొనడం. అంటే ప్రధాన యింద్రియమైన, అంతరింద్రియమైన మనసును తమ అదుపులో ఉంచుకున్నవారు అక్కడి బ్రాహ్మణులు. పుణ్యలక్ష్మికి మొదటి కొలువు కూటములు.దేవతాసమూహాలకు ఆకటి పంటలు, ఆకలి తీర్చే పంటలు, అంటే యజ్ఞ యాగాది నిర్వహణలో మనసు కలవారు, దేవతలకు యజ్ఞ, యాగాదులలో యిచ్చే హవిస్సులే ఆహారం కనుక. అభ్యుదయానికి, శ్రేయస్సుకు దగ్గరి బంధువులు అక్కడి బ్రాహ్మణులు.  తెలివితేటలకు నెలవులు(ఠాణముల్) వారు.

పుట్టిననాఁటనుండియును బుణ్యులు, సత్ఫలమందునంతకున్
బట్టినకార్యమీశ్వరుఁడు పట్టిన నీని దృఢప్రతిజ్ఞు, లే
పట్టున ధర్మముల్విడని ప్రాజ్ఞులు, 'తద్'జ్ఞులపాలి వేలుపుం 
జెట్టులు, పోర నైదుపదిసేయని శూరులు, వీటిరాసుతుల్

ఆ పట్టణరాకుమారులు జన్మతహా, జన్మము మొదలుకొని పుణ్యాత్ములు. సత్ఫలములో,అంటే ఉత్తమ కార్యసాధనలో, వారు యముడిని చేత చిక్కించుకుని పట్టుకున్నా, వారి పనులను పరమశివుడు వచ్చి ఎదిరించి పట్టుబట్టినా విడిచిపెట్టని దృఢ ప్రతిజ్ఞులు.('సత్ఫలమందునంతకున్' అనే పదాలకు 'అంతేగాక, సత్ఫలముల విషయములో అని మహానుభావులైన పూర్వ పండితులు భావించారు, కానీ నాకు ఇలానే అనిపించింది) ఏ పరిస్థితిలోనూ ధర్మాన్ని విడువని ప్రాజ్ఞులు, తత్త్వజ్ఞుల పాలిటి కల్పవృక్షాలు, పోరాటంలో  లొంగి చేతులు జోడించనివారు ఆ పట్టణక్షత్రియ కుమారులు. ఐదు పది చేయడం అంటే  ఐదు వేళ్ళను యింకో ఐదు వేళ్ళతో జోడించడం, అంటే రెండుచేతులూ ఎత్తి మొక్కడం, శరణు వేడడం.

బలయు రత్నాకరములు సంచులుగఁ జేసి 
పొదివి నిధులెల్లఁ గొని సంచిమొదలు చేసి,
బేరమాడెడుపాటి యుదారలక్ష్మి 
బచ్చులప్పురినున్నారు పెచ్చుపెరిగి               (తే)

భూమి చుట్టూ ఉన్న సముద్రాలను సంచులుగా జేసి, నిధులను అన్నిటినీ, నవనిధులను పట్టి, సంచులలో మూటగట్టి, బేరాలు చేసే మహత్తర లక్ష్మీసంపన్నులైన వైశ్యులు(బచ్చులు)ఆ పట్టణంలో కుప్పలు తెప్పలుగా ఉన్నారు, ఒకరిద్దరు మాద్రమే కారు, ఎందరో శ్రీమంతులు లెక్కలేదు.

హర మౌళిహీర మచ్యుత 
చరణాబ్జ మరందధార, జాహ్నవి, లోకే
శ్వరి, తమసోదరి యౌనఁట,
పురివెలమల భాగ్యమహిమ పొగడఁగ వశమే!   (కం)

అక్కడి శూద్రుల(వెలమల) భాగ్యమహిమను పొగడడం ఎవరికైనా సాధ్యమా? శివుని శిగలోని రత్నము, విష్ణువు పదకమలముల మకరందధార, లోకేశ్వరి ఐన జాహ్నవి, అంటే, గంగ వారి సోదరి అట! 'పద్భ్యాగుం శూద్రో అజాయతా' అని పురుషసూక్తనిర్దేశం. పరమపురుషుని పాదములనుండి నాలుగవవర్ణంవారు, శూద్రులు ఉద్భవించారు అని. దానికి వారు కించపరచినట్లు భావించడం 
అమాయకత్వం. మిమ్మల్ని కించపరిచారు అగ్రవర్ణాలవారు అని వారిని మోసం చేసి, అబద్ధాలు చెప్పడం అజ్ఞానం, మూర్ఖత్వం, దుర్మార్గం. మానవుల పాదాలు కావు అవి. పరమాత్ముని పాదాలు. మానవులపాదాలు నిలబడడానికి ఆధారములు, కనుక అవి కూడా  అత్యంత ముఖ్యమైనవే. యిక దేవుని పాదాలు జీవులందరికీ పూజనీయాలు! ప్రథమంగా దేవుడి 'పాదాలకు' ప్రణామం చేస్తాము కానీ ముఖానికి, చేతులకు, తొడలకు కాదు, కనుక, అత్యంత పూజనీయమైన, గౌరవమైన, అతి ముఖ్యమైన స్థానం శ్రామికులైన శూద్రులది, 
భారతీయుల దృష్టిలో. 

గంగానది శ్రీమహావిష్ణువు పాదములనుండి ఉద్భవించింది. దేవాది దేవుడైన 'గోలోక బృందావన శ్రీకృష్ణపరమాత్మ పాదాలనుండి గంగ పుట్టింది అని వ్యాసులవారు తమ 'దేవీభాగవతం'లో చెప్పారు. కనుక శూద్రులు శివుని శిరోమణి కూడా ఐన గంగానదికి సోదరులన్నమాట. అంతటి పవిత్రమూర్తులు అక్కడి శూద్రులు అని అంటున్నాడు తెనాలి రామకృష్ణుడు.         

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు.
మరిన్ని శీర్షికలు
weekly horoscope 3rd june to 9th june