Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with samanta

ఈ సంచికలో >> సినిమా >>

అ ఆ.. చిత్ర సమీక్ష

aa..aaa...movie review

చిత్రం: అ ఆ 
తారాగణం: నితిన్‌, సమంత, అనుపమ పరమేశ్వరన్‌, రావు రమేష్‌, నదియ, నరేష్‌, ఈశ్వరిరావు, అనన్య, ప్రవీణ్‌, జయప్రకాష్‌, అవసరాల శ్రీనివాస్‌, గిరిబాబు, పోసాని కృష్ణమురళి, హరితేజ, శ్రీనివాసరెడ్డి అజయ్‌ తదితరులు 
సంగీతం: మిక్కీ జె మేయర్‌ 
ఛాయాగ్రహణం: నటరాజ్‌ సుబ్రహ్మణ్యం 
దర్శకత్వం: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ 
నిర్మాణం: హారిక హాసిని క్రియేషన్స్‌ 
నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ 
విడుదల తేదీ: 2 జూన్‌ 2016 

క్లుప్తంగా చెప్పాలంటే 

అమ్మ తనను ఆటబొమ్మలా మార్చేసిందనే ఆవేదనతో రగిలిపోయే అమ్మాయి అనసూయ రామలింగం (సమంత). ఆమె తల్లి మహాలక్ష్మి (నదియ). ఓసారి అనసూయ, తన తల్లి తనకు ఇష్టంలేని పెళ్ళి చేయాలనుకోవడంతో తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేస్తుంది. ఓసారి తన తల్లికి తెలియకుండా తన అత్తయ్య ఇంటికి వెళుతుంది అనసూయ. అక్కడే ఆమెకు ఆనంద్‌ విహారి (నితిన్‌) పరిచయమవుతాడు. అనసూయ అత్త కొడుకే ఈ ఆనంద్‌. ఆనంద్‌ కుటుంబానికి మహాలక్ష్మి అంటే గిట్టదు. ఆస్తులు అంతస్తుల అంతరం ఉండనే ఉంటుంది. కొన్నాళ్ళు అత్త ఇంట్లో ఉన్న అనసూయ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆమెకు పెళ్ళి కూడా కుదిర్చేస్తారు. మరి మన హీరో, అనసూయని దక్కించుకుంటాడా? రెండు కుటుంబాలూ ఒక్కటయ్యాయా? అన్నది తెరపై చూడాలి. 

మొత్తంగా చెప్పాలంటే 

ముందుగా చెప్పుకోవాల్సింది అనసూయ పాత్రలో నటించిన సమంత గురించే. ఆమె అద్భుతంగా నటించింది. కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చిందనడం అతిశయోక్తి కాదు. రొటీన్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కి భిన్నంగా మంచి నటనతో ఆకట్టుకుంది అనసూయ. చాలా అందంగా కూడా కనిపించింది. 

హీరో విషయానికొస్తే సినిమా సినిమాకీ మెచ్యూరిటీ లెవల్స్‌ పెంచేసుకుంటున్న నితిన్‌, ఈ సినిమాలో సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌తో సత్తా చాటాడు. సినిమాకి ఎంత అవసరమో అంత వరకు నటించి, దర్శకుడికి పూర్తిగా సహకరించాడు. తెరపై నితిన్‌కన్నా ఆనంద్‌ పాత్రే రిజిస్టర్‌ అవుతుందంటే పాత్రలో ఎంతగా ఒదిగిపోయాడో అర్థం చేసుకోవచ్చు. నితిన్‌కి నటుడిగా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది. కొత్తమ్మాయి అనుపమ పరమేశ్వరన్‌ బాగానే నటించింది. 

నదియాకి మరోసారి మంచి పాత్ర దక్కింది. తన పాత్రలో ఆమె బాగా చేసింది. నరేష్‌ బాగా చేశాడు. రావు రమేష్‌కి ఇంకోసారి మంచి పాత్ర దక్కగా, ఆ పాత్రకు న్యాయం చేశాడు షరామామూలుగానే. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా నటించి, మెప్పించారు. 
కథ మరీ కొత్తదేమీ కాదు కానీ కథనంతో దర్శకుడు తనదైన సత్తా చాటాడు. త్రివిక్రమ్‌ డైలాగుల గురించి కొత్తగా చెప్పేదేముంది? మాటలతో, కథనంతో సినిమా కథని అందంగా చెప్పాడు త్రివిక్రమ్‌. ఎడిటింగ్‌ బాగుంది. మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ చాలాబాగుంది. సినిమాకి చాలా చాలా రిచ్‌నెస్‌ ఇచ్చింది సినిమాటోగ్రఫీ. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. సినిమా చాలా చాలా రిచ్‌గా తెరకెక్కిందంటే నిర్మాత ఎక్కడా రాజీపడలేదనే కదా అర్థం. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి అదనపు బలాన్నిచ్చాయి. 
'అత్తారింటికి దారేది', 'సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి' చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని కట్టి పడేసిన ఈ చిత్రానికీ అలాంటి జోనర్‌నే ఎంచుకున్నాడు. మనింట్లో పాత్రలు కనిపిస్తాయి. మనల్ని మనం చూసుకుంటాం. ప్రతి పాత్రతోనూ, ప్రతి మాటతోనూ, ప్రతి సన్నివేశంతోనూ కట్టిపడేశాడు. సరదా సరదాగా సాగిపోతూనే, ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చాడు దర్శకుడు. ఫస్టాఫ్‌ సరదా సరాదాగా సాగిపోతుంది. సెకెండాఫ్‌లోనూ అదే వేగం కనిపిస్తుంది. అక్కడక్కడా స్లో అయ్యిందంటే కాస్త ఎమోషనల్‌ టచ్‌ ఉందనే తప్ప, సినిమాలో వేగం తగ్గిందని కాదు. త్రివిక్రమ్‌ సినిమాల్లో కనిపించే పంచ్‌ కామెడీ కొంచెం తగ్గినా, ఓవరాల్‌గా సినిమాకి అవసరమైనంత మేర డైలాగులతో ఆకట్టుకున్నాడు. క్లాస్‌ ఆడియన్స్‌ ఈ చిత్రానికి రాజపోషకులు. అలాగే మాస్‌ ఆడియన్స్‌ కూడా మెచ్చేలా అందమైన కళాఖండాన్ని త్రివిక్రమ్‌ ప్రేక్షకుల ముందుంచాడు. సినిమాకి జరిగిన పబ్లిసిటీ, రిలీజయ్యాక మౌత్‌ టాక్‌ ఇవన్నీ ప్లస్‌ పాయింట్లే. ఓవరాల్‌గా సినిమా అందర్నీ అలరిస్తుంది. 

అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

మరిన్ని సినిమా కబుర్లు
chaitu as comming class look