Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

.గతసంచికలో ఏం జరిగిందంటే ..http://www.gotelugu.com/issue164/466/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

 ‘‘అవును. ధర్మతేజుల వారు రత్నగిరి గద్దెనెక్కు సమయమునకు నా తండ్రి అరుణ భట్టారకుడు ఆస్థాన వైద్యుడు.
‘‘అరుణ భట్టారకుడా....!’’
‘‘అవును. అరుణ భట్టారకుడే. ఇదే విషయమున హెచ్చరించినందుకు ఆస్థానమున హేళన జేసినారు. అవమానింప బడ్డారు. అవన్నీ గాలి వార్తలని కొట్టి పారేసినారు. ఆ అవమాన భారమును తట్టుకో లేక ఆస్థాన వైద్యునిగా తన పదవిని వదులుకొని మా స్వస్థలమగు సహ్యాద్రి మీది భీమ శంకర పల్లెకు వచ్చేసినారు.’’
‘‘ఎప్పుడో నా చిన్న వయసు నాటి మాట. అరుణ భట్టారకుల వారి పేరు వింటిని గాని చూడ లేదు. పల్లె లోని బామ్మ నీలవేణి...’’
‘‘నా జనకుని తల్లి గారు...’’
‘‘ఇంతకీ నీ జననీ జనకులు ఎక్కడ?’’
‘‘వారిపుడు లేరు ప్రభూ. అయిదేండ్ల క్రిందట ఒక పర్వ దినాన భీమా నదికి పుణ్య స్నానమునకు వెళ్ళిన వారు తిరిగి రానే లేదు. అకస్మాత్తుగా ఏర్పడిన వరదలకు నదిలో కొట్టుకు పోయినారు. వారి శరీరములు కూడ లభించలేదు.’’ రుద్ధ కంఠంతో పలికింది భద్రా దేవి.
‘‘అరరే... ఎంత పని జరిగినది. గతము గుర్తు చేసి నిను బాధ పెట్టితిని. క్షమించు భద్రా.’’ అన్నాడు ఆమె చేయి అందుకుంటూ ధనుంజయుడు.
‘‘అంతయు ముగిసి పోయినది. తలచుకొని బాధ పడిన ప్రయోజన మేమి? మూడు సంవత్సరముల క్రితం రాజ కుటుంబం సహ్యాద్రికి వచ్చినప్పుడు తొలి సారిగా మీ దర్శనమైనది. మిమ్ము జూచినది మొదలు నాలో మీ మీద ప్రేమ అంకురించినది. మిమ్ము జూడ మనసు తహ తహ లాడెడిది. మిమ్ము చూచుటకే తరచూ రత్న గిరికి వచ్చెడి దానను.
చంపా పురము సమీపమున మా తల్లి గారి సోదరి కుటుంబమున్నది. పిన్నమ్మ యింటికని బామ్మతో చెప్పివ వచ్చెడి దానను. పురుష వేషమున ఉందును గనుక రత్న గిరిలో నిరాటంకముగా సంచరిస్తూ మీరు రాజ వీధిన బోవునపుడు మిమ్ము గాంచి మురిసి పోయే దానిని. అలా సంచరించుట లోనే మీకు తెలియని అనేక విషయము నాకు తెలిసెడివి. బాహ్లీకుని కుట్రను గూర్చియు అటులనే తెలిసినది. చివరిగా రత్న గిరి వచ్చినప్పుడు మీరు దివ్య నాగ మణి కోసం బయలు దేరిన రహస్య సమాచారము తెలిసినది. మిమ్ము వెనక్కు రప్పించుటకు అశ్విక దళాన్ని పంపిన సమాచారము తెలిసి మీ కోసం మీ వెనకే ఆనాడు వచ్చితిని. నాడు దారిలో మిమ్ము వదిలి చంపా పురము పోయి అనారోగ్యముగా నున్న మా పిన్నమ్మను జూచి మందు లిచ్చి అట నుండి సహ్యాద్రికి వచ్చితి. మీ కొరకు తిరిగి బయలు దేరనుండగా మీరే అటు వచ్చుట సంతోషము కలిగించినది. మిగిలిన విషయము మీకు తెలిసినదే’’ అంటూ ముగించింది భద్రా దేవి.
‘‘ఆ దివ్య నాగ లోకపు నీలమణి అంగుళీకము ఏమైనది?’’
‘‘తెలియదు...’’ అంది భద్రా దేవి.
‘‘మీ వంశీయులు ఇంకను ఎచటెచట వున్నారు? ఎవరినయినా వారు కాపాడ గలిగినారా?’’ ఒకింత విరామం తరువాత అడిగాడు ధనుంజయుడు.
భద్రా దేవి భారంగా నిట్టూర్చింది.
‘‘ప్రస్తుతం చంద్ర వంశ రాజు పాలించు చాలా రాజ్యములందు మా వంశీకులు విస్తరించి వున్నారు ప్రభూ. వారిలో కొందరితో ఇప్పటికీ మాకు సంబంధములున్నవి. ఇక కాపాడు విషయమందురా` మా జనకునకు ఏర్పడిన అనుభవమే చాలా మందికి ఏర్పడినది. విన్న రాజన్యులు సురక్షితులు, వినని వారు నాగ రాజు శాపానికి గురై పుట్ట వ్రణంతో మరణించినారు. మరొక్క విషయం ఏమనగా మా వారి లోను అందరూ సమర్థులుగారు. సమర్థులు కొంత మందే. మిగిలిన వారు అరకొర విద్యతో మిగిలి పోయినారు. జాతకుని గ్రహబలం బాగున్నంత వరకు ఏ శాపము అతన్ని బాధించదు. గ్రహ దృష్టి వక్ర గతిని పట్టినప్పుడు శాపం బారిన పడక తప్పదు.
అయితే ఏ రాకుమారుడూ ఇంత వరకు నాగ లోకము పోయి దివ్య నాగ మణిని సంపాదించి తెచ్చిన సమాచారము లేదు. ఆ ప్రయత్నములో వున్న మీకు నేను సహకరించుట నా విధి కర్తవ్యము గూడ. మీరు విజయులయితే మా పూర్వ జేజి తాత గారు అగ్ని భట్టారకుల వారి ఆత్మ శాంతిస్తుంది. నా ప్రాణాధికమగు మీకును గొప్ప కీర్తి ప్రతిష్టలు ఒన గూడును. ఇందుకు నేను గర్వ పడుతున్నాను.’’ అంది.
‘‘అవును దేవి. నేనును గర్వ పడుచుంటిని. నీ వంటి మేధావి యగు సౌందర్య వతి నాకు తోడు దొరికినందుకు సతతము నేనును గర్వ పడుచునే వుందును.’’ అంటూ భద్రా దేవిని తిరిగి ఒడి చేర్చు కొని ముద్దాడాడు ధనుంజయుడు.
అదే సమయంలో`
ఉన్నట్టుండి ఒక్కసారిగా`
గుట్ట దిగువ నుండి వినవచ్చింది అలజడి ఒకటి. కేకలు అరుపులు. బండలు దొర్లుతున్నాయి. రాళ్ళు ఎగురుతున్నాయి. భూకంపం వచ్చినట్టు నేల అదురుతోంది. ఏమి జరుగుతుందో అర్థం గాక ఉలికి పడి లేచిన ధనుంజయ భద్రాదేవిలకు వెన్నెల కాంతిలో గుట్ట దిగువన మొదట ఏమీ కన్పించ లేదు.
********************************************
ఎండు కొమ్మ ఒకటి భుజాన వేసుకుని గాలిలో ఎగురుతూ కొండ గుట్టలను చుట్టి అప్రమత్తంగా కావలి తిరుగుతోంది భూతం ఘృతాచి.
భద్రా దేవికి వశమయ్యాక ఇక ఆమె ఆజ్ఞా బద్ధురాలు అది. గుట్ట పైకి ఏ ప్రాణి పోకుండా వేయి కళ్ళతో శోధించి గాలిస్తోంది.
రేయి రెండవ యామం నడుస్తోంది.
వెన్నెల కాంతిలో అడవి పులకిస్తోంది. ఎటు చూసినా నిశ్శబ్ధం రాజ్యం చేస్తోంది. చల్లటి గాలి తెరలు వీస్తూ ప్రశాంతంగా వుంది అంతటా. మండపం లోని ఇరువురూ ఇంకా నిద్ర పోకుండా ఏవో విషయాు ముచ్చటించు కొంటున్నారు. అటువంటి సమయంలో`
గుట్ట ముందు భాగాన`
పెద్ద కరి నాగమొకటి జర జర పాకుతూ గుట్ట పైకి పోతూండటం ఘృతాచి కంట బడింది.
ఏ మాత్రం మెరుపు లేని చిక్కటి కాటుక వంటి దేహంతో భీకరంగా వుందా కరి నాగు. తను కావలి ఉండ గానే ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా గుట్ట పైకి పోతున్న భుజంగాన్ని పసి గట్టగానే కోపంతో భగ్గు మంది భూతం ఘృతాచి.
‘‘ఆహాఁ... దుష్ట నాగమా! ఏమి నీ సాహసము. ఎట నుండి నీ రాక, ఎటకు నీ పోక! ఈ ఘృతాచి కావలి ఉండగానే కన్ను గప్పి గుట్ట పైకి పోదువా? నీ ఆగడమునకు కఠిన శిక్ష తప్పదు. నీ ఎముకలు చూర్ణము జేసెద. నీ శిరస్సు చిదిమి సంహరించెద. ఆగుము... అక్కడే ఆగుము..’’ అని హెచ్చరిస్తూ రివ్వున వెళ్ళి ఎండు కొమ్మతో ఆ పన్నగమును ఒక్క బాదు బాదింది. అయితే`
చివరి క్షణంలో ఘృతాచి రాకను గమనించిన ఆ ఫణి తృటిలో తప్పించుకుని పెద్ద పెద్ద బండల సందు లోకి దూరింది. అది చూసి మరింత మండి పడింది ఘృతాచి.
‘‘ఓహో... నా ముందరే నీ కుప్పి గంతులా ధూర్తుడా... ఎచటకు పోయెదవు? తప్పించుకు పోగలవా? చూచెద గాక...’’ అంటూ బండలను పక్కకు దొర్లించింది. అవి దడ దడ లాడుతూ పెద్దగా శబ్ధం చేస్తూ గుట్ట దిగువకు దొర్లాయి.
కాని అప్పుడు కూడ తప్పించుకుని ఎగువన పొదల్లోకి జారుకుందా పాము. దాంతో వళ్ళు మండి ఎండు కట్టెతో పొదని చిందర వందరగా బాదటం ఆరంభించింది ఘృతాచి. దాని తాకిడికి పొదలు చెదరి రాళ్ళు రప్ప గాల్లోకి ఎగర సాగాయి. అయినా తప్పించుకొని గుట్ట పైకి సాగి పోతూనే వుందా పాము. మరింత పైకి పాకక ముందే దాని తోకను దొరక పుచ్చుకుని వెనక్కి లాగింది భూతం. అంతే`
కస్సున పడగ విప్పి తలతిప్పి భూతాన్ని చూసిందా నాగం. నాల్కలు తోడుతూ భీకరంగా బుసలు కొట్టి ఎగిరి భూతం మీద పడి దాని ఒంటికి చుట్టుకుంది. రెండో చేత్తో దాని తలను ఒడిసి పట్టుకుంది భూతం. పెద్ద బంతిలా దొర్లుకుంటూ కొంత దూరం దిగువకు వెళ్ళాయి. ఇదే సమయంలో అలజడి గమనించిన ధనుంజయడు, భద్రా దేవి లేచి నిలబడి గుట్ట దిగువకు చూసారు.
మొదట వారి కేమీ కనబడ లేదు.
కొన్ని క్షణాల తర్వాత`
ఘృతాచి కొండ దిగువన ఎవరి తోనో పెనుగు లాడుతున్నట్టు గుర్తించారు. వాటి పోరాటానికి బండలు దొర్లుతున్నాయి. రాళ్ళు ఎగురుతున్నాయి. దుమ్ము ధూళి గాలిలో వ్యాపిస్తోంది. సాధారణ పాము అయితే తన చేతిలో ఎప్పుడో చచ్చేది. తను పట్టింది సాధారణ పాము గాదని శక్తి వంతమైన నాగమని గుర్తించింది భూతం ఘృతాచి. ఎలాగైనా దాన్ని అంతం చేయాలని శక్తివంచన లేకుండా పోరాడుతోంది. సర్పం తన శరీరాన్ని పెంచి తోకతో భూతాన్ని చుట్టి నేలకేసి కొడుతుంటే భూతం దాని తోక పట్టి తప్పించు కొని కసిగా గిర గిరా తిప్పుతోంది. అంతలో`
‘‘ఘృతాచి... ఎవరితో ఆ పోరాటము. పట్టి ఇటకు గొని రమ్ము.’’ అంటూ గుట్ట పై నుంచి భద్రా దేవి అరుపు వినబడింది. అంతే`
ఒక చేత్తో తోకను రెండో చేత్తో తను ఒడిసి పట్టి గాల్లో ఎగురుతూ గుట్ట పైకి వచ్చింది ఘృతాచి. దాని చేతుల్లో గింజు కొంటున్న భీకర సర్పాన్ని చూసి విభ్రాంతులయ్యారు ధనుంజయ, భద్రాదేవిలు.
‘‘ఈ దుష్ట సర్పము నా ఎరుక లేకయే గుట్ట పైకి వచ్చుచున్నది ఏలికా. దీనిని సంహరించుటకు అనుమతి ఒసంగుము. దీని తల త్రుంచి నెత్తురు త్రాగెద.’’ అంది ఘృతాచి.
అది సాధారణ సర్పము గాదని, ధనుంజయుని ప్రాణము హరించుటకు మరో ఘోర సర్పాన్ని నాగ రాజు అంపకం చేసి వుంటాడని గ్రహించింది భద్రా దేవి. ఆ సర్పం వికార రూపం జూస్తుంటే ధనుంజయుని ఒడలు జలదరిస్తోంది.
‘‘వలదు వలదు ఘృతాచి! దాన్ని సంహరింపవలదు. దాని విషయము నేను జూచుకొందును. దాన్ని ఇక్కడే విడిచి నీవు ఎప్పటి వలె కావలికి పొమ్ము’’ అంది.
వెంటనే సర్పాన్ని నేల మీద వదిలి గాల్లో ఎగురుతూ గుట్ట దిగువకు వెళ్ళి పోయింది ఘృతాచి. నేల బడిన మరు క్షణమే ఆ సర్పం అదృశ్యమై అక్కడ నల్లగా వికార రూపుడయిన ఒక ఆజాను బాహుడు ప్రత్యక్ష మయ్యాడు. నల్లటి దేహంతో సుమారు పధ్నాలుగు అడుగుల ఎత్తున్నాడు.
ఈలోపల సర్పం నేల బడిన మరు క్షణమే భద్రా దేవి అది ఎటూ బెసక్కుండా మంత్ర కట్టు కట్టింది. ఆమె అలా చేయటమే ఆ క్షణం ధనుంజయుని ప్రాణాలు కాపాడింది. లేకుంటే ఘృతాచి విడిచిన మరు క్షణమే అది ఎగిరి ధనుంజయుని మీద పడి కాటేసి వుండేది. మంత్ర ప్రభావంతో ఎటూ కదల లేక మనిషి రూపం ధరించిందా నాగం.
‘‘ఎవరు నీవు?’’ మండపం అరుగు మీదే నిల బడి సూటిగా ఆ వ్యక్తిని ప్రశ్నించింది భద్రా దేవి.
‘‘ఎవరా..! నన్నెవరని అడుగు చుంటివా... నీ దరినున్న ఆ రాకుమారుడు ధనుంజయుని ప్రాణము ఒక్క కాటుతో హరింప వచ్చిన వాడను. నా కరాళ దంష్టము గ్రక్కు విషాగ్నికి ఎలాంటి జీవి గాని ఒక లిప్త కాలమందే ప్రాణము విడువక తప్పదు. నా శక్తి నీకు తెలియదు.’’
‘‘ఓ నాగ లోక వాసీ! నీ బెదిరింపులకు భయ పడు వారిచట ఎవరును లేరు. బీరము పలుకుట ఆపుము. మహా వీరుడగు ధనుంజయుని జంపుట అంత సులువను కొంటివా? నీకు ముందు వచ్చిన అగ్ని సర్పము ఏమాయె? మాయావి సర్ప శీర్షుడు ఏమైనాడు? నీకును వారి గతి పట్టక ముందే నీ వివరము తెలుప వలె.’’
‘‘బీరములా... నావి బీరములా...’’ హుంకరించాడా వ్యక్తి.
‘‘శుష్క వాగ్ధానము` లబ్ధ ప్రసంగము బీరములనెడు అనవసరపు గొప్పు పొవు నైజము నాది కాదు. నేను మిత భాషిని. అయినను... ఒక ఆడపిల్లను అడ్డు పెట్టు కొని నాగ లోకము దనుక రానెంచిన ఈ రాకుమారుడు సిగ్గివలె. వీరుడికి తోడు అవసరమా...’’ రెచ్చ గొట్టే విధంగా మాట్లాడాడతను. అతడి ఉద్దేశం అర్థమై చిన్నగా నవ్వింది భద్రా దేవి.
‘‘నీవు మిత భాషివి గదా. అధిక ప్రసంగమేల? చాటున కాటు వేయ వచ్చిన నీకు లేని సిగ్గు మాకేల? నీ వివరము తెలుప భయమేల?’’
‘‘బాలికా... తెలియదు, నా గురించి మీకు తెలియదు.’’
‘‘తెలియ జెప్పమనే అడుగు చుంటిని గదా.’’
‘‘నీవు నాపై మంత్ర కట్టును విప్పి జూడుము. అప్పుడు జెప్పెద... తృటిలో మీ యిరువురి ప్రాణములు తీసెద.’’
‘‘నీవంతటి సమర్థుడవని నాకు తెలుసు గాని ఆలస్యమదియేల? నీ నామ ధేయ మేమి? నీకసలు నామ ధేయమున్నదా లేక నాగ రాజుకి ఎవరూ దొరకక నాగ లోక మందలి అనామకుడి వైన నిన్ను పంపించినాడా?’’ రెచ్చ గొట్టింది. దాంతో రోషం ముంచు కొచ్చి హుంకరించాడా వ్యక్తి.
‘‘ఆయ్‌... ఎంత మాటంటివి బాలికా... నేను అనామకుడినా. నన్నెవరనుకొంటివి? పేరు లేని బీరువు ననుకొంటివా? నేను నాగలోక ప్రముఖండ, మాత కద్రువ తనయుండ, తక్షక సొదరుండ, కర్కోటక నామథేయుండ.’’ అనరిచాడు.
అంత వరకు ప్రేక్షకునిలా చూస్తూ నిుచున్న ధనుంజయునికి కోపం హద్దు దాటింది. వెంటనే వింటిని సంధిస్తూ` ‘‘నీవు ఏ కుండవైన మాకేమిరా దూర్తా. ఈ క్షణమే నీ శిరమును ఖండించి మీ నాగ రేడుకి కానుక జేసెద.’’ అనరిచాడు.
ప్రమాదం గ్రహించి వెంటనే అతన్ని వారించింది భద్రా దేవి` ‘‘ప్రభూ! ఆవేశము వలదు. వచ్చినది శత్రువైనను వారి పెద్దరికాన్ని మనం గౌరవించ వలె. కురు సంగ్రామమున కురు పెద్దలు శత్రు పక్షాన వున్నను వారిని నమస్కార బాణముతో అర్జునులవారు గౌరవించ లేదా? వచ్చిన వాడు సామాన్యుడు గాదు. తక్షకుని సొదరుడు కర్కోటకుడు’’ అంటూ హెచ్చరించి, కర్కోటకుని జూచి వినయంగా` ‘‘పూజ్యు, పురాణ ప్రసిద్ధులు, మాతృవాక్య పరిపాకులు, మహా శక్తివంతులగు కర్కోటకుల వారికి సవినయంగా భద్రా దేవి ప్రణమిల్లుచున్నది’’ అంటూ మోకాళ్ళ మీద కూచుని ప్రణామం చేసింది. అంతే`
అంతటి కర్కోటకుడు కూడ`
భద్రా దేవి బుద్ధి చాతుర్యానికి వినయ విధేయతలకు పులకించి పోయాడు. ప్రసన్నుడయ్యాడు. వెనక ముందు ఆలోచించకుండా వెంటనే` ‘‘ధీర్ఘాయుష్మాన్‌ భవ. మనో భీష్ట సిద్ధిరస్తు. కళ్యాణ మస్తు. లెమ్ము బాలికా. నీ యెడల ప్రసన్నుడనైతి’’ అంటూ ఆశీర్వదించేసాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali