Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

.గతసంచికలో ఏం జరిగిందంటే....http://www.gotelugu.com/issue164/467/telugu-serials/atulitabandham/atulitabandham/

 

“హలో, ఎవరు?” చాలా బిజీగా ఉన్న అమల ఫోన్ ఎత్తి అడిగింది కాజువల్ గా.

“నే...నేను... ఐశ్వర్యను...”

“ఓహ్... ఐశూ... నువ్వేనా? బాగున్నావామ్మా? ఏమిటి విశేషాలు?” ఆప్యాయంగా అమల అడుగుతూ ఉంటే ఐశ్వర్య మనసు అవ్యక్తమైన అనుభూతికి లోనయింది.

“బాగున్నాను... మీరు బాగున్నారా మేమ్?”

“మేమ్? ఉహు, అక్కా అని పిలవాలి నువ్వు... అవునూ ఒక్కసారి కూడా ఇంటికి రాలేదేమ్మా? రూప చాలా సార్లు అడిగింది నిన్ను... వేరే ట్యూటర్ ని పెట్టాం, చదువు సాగుతోంది కానీ, నీతో ఒకరకమైన అనుబంధం ఏర్పడిపోయింది దానికి...”

“తప్పకుండా వస్తాను అక్కా ఓ సారి... మరి... ఒక విషయం... కార్తీక్ వారం రోజులుగా ఇక్కడికి రావటం లేదు... అక్కడికి వచ్చారా?” బిడియంగా అడిగింది.

“కార్తీ ఇక్కడికీ రాలేదమ్మా... అత్తయ్య గారికి ఫోన్ చేసి అడుగుతాను... నీకేవిషయం తెలియజేస్తానులే... కొంచెం బిజీగా ఉన్నాను... ఉంటాను...” పెట్టేసింది అమల.

దీర్ఘంగా నిట్టూర్చింది ఐశ్వర్య.

***

రెండు రోజుల తర్వాత వచ్చాడు కార్తీక్. మాటల్లో తెలిసింది ఏమిటంటే అతను అఫీషియల్ టూర్ కి కాకుండా ఫ్రెండ్స్ (?) తో వెళ్ళాడని... చివరి రెండు రోజుల్లోనూ డాలీ కూడా అతన్ని జాయినైందనీ... రాత్రీ పగలూ తేడా లేక తాగేసినట్టు అతని ముఖం చెబుతోంది. తినటానికి కూడా ఓపిక లేనట్టు రాగానే వాష్ రూమ్ లోకి వెళ్లి వచ్చి బట్టలు మార్చుకుని మంచానికి అడ్డంగా పడిపోయాడు కార్తీక్.

అతన్ని అటువంటి పరిస్థితిలో చూసిన ఐశ్వర్యకు ఏం చేయాలో కూడా తెలియలేదు. దగ్గరకు వచ్చి పలకరించబోయింది.

“డోంట్ డిస్టర్బ్ మీ...అయామ్ ఇన్ హెవెన్...” మగతగా కలల్లో తేలిపోతున్నట్టు చెప్పేసి నిద్రలోకి జారుకున్నాడు. ఉవ్వెత్తున దుఃఖం పొంగుకు వచ్చింది ఐశ్వర్యకు. ఇదేనా తాము కలలు కన్న జీవితం? పెళ్లి వద్దని అనుకున్నారు కానీ ఇలా విచ్చలవిడి జీవితం గడపాలని తాను ఎన్నడూ అనుకోలేదు... ఒకరికి ఒకరై చివరి వరకూ ఒకే బాటలో సాగాలని, అలా సాగుతామని అనుకుంది తాను. కానీ వ్యసనాలకు లోనై, ఎంత మందితో అనుభవాలైతే అవి అంత గొప్ప అనుభవాలని అనుకుంటున్న కార్తీక్ దిగజారుడు జీవితాన్ని చూస్తుంటే, చాలా బాధగా అనిపించింది ఐశ్వర్యకు...

అతను ఇంట్లో ఉన్నంత సేపూ అతనికి ఏం కావాలో అమరుస్తూ ఉంటుంది...అతను చెప్పే కబుర్లను మంత్రముగ్ధయై వింటుంది... అతని స్పర్శను ఎంతో ఆనందిస్తుంది... అతనితో గడిపే ప్రతీ క్షణంలోనూ అమరానందాన్ని అనుభవిస్తుంది... మరి తనతో అతనికి ఇలాంటి అనుభూతులు కలగవా? తనతోనూ, రోజీతోనూ, డాలీ తోనూ ఒకేలా ఎంజాయ్ చేస్తాడా?  శృంగారం అనేది కేవలం రెండు శరీరాల మధ్యనేనా? మనసుతో దానికి పని లేదా? ఎవరితో పడితే వాళ్ళతో తిరగాటానికీ శారీరక సుఖాలు అనుభవించతానికీ మనం జంతువులం కాదు కదా... మనసున్న మనుషులం...  మనిషిని ఇష్టపడినప్పుడే మనసు స్పందించేది... స్పందన కలిగితేనే శృంగారంలో శిఖరారోహణ చేయగలిగేది... మరి ఈ మనిషికి ఇవేవీ లేవా?

ఆలోచనల్లోనే వంట ముగించి, కార్తీక్ ని లేపింది ఐశ్వర్య. బద్ధకంగా లేచి కూర్చుని నాలుగు మెతుకులు తిన్నాననిపించి, ఆమె భోజనం చేస్తూంటే పక్కన కూర్చున్నాడు.

“ఏమిటోయ్ ఐశూ ఈ మధ్యన లావు అయినట్టున్నావు...ఫిజిక్ మైంటైన్ చేయకపోతే ఎలాగా?” అన్నాడు ఆమె జబ్బను పట్టి చూస్తూ...

“ఏం నీకు నచ్చటం లేదా?”

“అబ్బే, నాకు నచ్చటం కోసం కాదు... నీకోసం నీవు మెయిన్ టైన్ చేసుకోవాలి కదా...”

“పోనీలే, నాజూకైన ఆడవాళ్ళు నీకు చాలా మంది ఉన్నట్టున్నారుగా, ఇంకెందుకూ బెంగ?” కచ్చగా అంది ఐశ్వర్య...

“ఓ, ఓ... కట్టుకున్న పెళ్ళాంలా మాట్లాడుతున్నావు...” గలగలా నవ్వాడు.

“హలో మిస్టర్.. కట్టుకోకపోయినా నేను పెళ్ళాం పాత్రనే పోషిస్తున్నాను...”

“అవునవును... నాకు ఆకలి వేసినప్పుడు తిండి పెడుతున్నావు... ఉదయమే టిఫిన్, కాఫీ ఇస్తున్నావు... ఇల్లు తీర్చి దిద్దుతున్నావు... నాకు కావలసినప్పుడు సుఖాన్ని కూడా ఇస్తున్నావు...కానీ నేనే నీకు తగిన వాడిని కాదు కదా ఐశూ... నేను నీకు ఏమీ ఇవ్వటం లేదు, నాకు తెలుసు...”

“నువ్వే అన్నీ ఇచ్చావు... ఎప్పటికీ ఇస్తూనే ఉంటానని అన్నావు... ఈ కొత్తజీవితానికి నాంది పలికావు... ఇప్పుడు నీ కొత్తజీవితానికి ద్వారాలు తెరిచావు... నీ స్వేచ్చను హరించటానికని కాదు కాని, నీ అలవాట్లను కొంచెం తగ్గించు కార్తీ... ఆరోగ్యానికి మంచిది కాదు... చిన్నపిల్లాడివి కాదు కదా, మంచీ చెడ్డా తెలిసినవాడివి...”

“అబ్బో... ఐశ్వర్య చాలా పెద్దది అయిపోయిందే?  సరే, నేను పడుకుంటాను నాకు నిద్ర వస్తోంది...”

“సరే కార్తీ...”

ఆ రాత్రి తన దగ్గరకు జరిగిన కార్తీక్ ని దూరంగా తోసేయాలని అనిపించినా, మనస్కరించక  అతని కోర్కెను తీర్చడానికి ఉద్యుక్తురాలయింది ఐశ్వర్య.
 

***

అత్తవారింట్లో కొత్త జీవితానికి అలవాటు పడిపోయింది మధుబాల. తిరిగి జాబ్ లో కూడా జాయిన్ అయింది.

ఉదయం ఐదున్నర – ఆరు మధ్య నిద్ర లేస్తుంది... ముఖ ప్రక్షాళన తో పాటుగానే స్నానాదికాలు కూడా ముగించుకుని వంటింట్లోకి వచ్చి, కాఫీ తాగేసి, వంటలో అత్తగారికి సాయం చేస్తుంది. మామగారి పూజకు తులసీ దళాలు, పెరట్లో పూచిన పూలతో సజ్జను సిద్ధం చేస్తుంది. ఏడు గంటలకు లేచిన వేణు ఏడున్నర వరకూ వ్యాయామాలు చేసి, పాలు తాగి, పేపర్ చదువుకుని, ఎనిమిదికల్లా రెడీ అయి, టిఫిన్ తినేసి, వెళ్ళిపోతాడు. మధుబాల ఆఫీస్ వేరే వైపు ఉండటం వలన ఆమె ఆటోలో వెళుతుంది. తానూ టిఫిన్ తినేసి, బాక్స్ లో లంచ్ సర్దుకుని తొమ్మిదికల్లా బయలుదేరిపోతుంది. సాయంత్రం ఇద్దరూ ఇంటికి వచ్చేసరికి ఆరున్నర అవుతుంది. కాఫీ తాగుతూ కాసేపు కబుర్లాడుకుని, సాయంత్రం వంట ప్రయత్నం లో పడుతుంది మధుబాల. సాధారణంగా అన్నాలు ఎవరూ తినరు రాత్రి పూట. అందుకని అందరికీ కలిపి ఒకే రకం టిఫిన్ తయారు చేసేస్తారు అత్తాకోడళ్ళు కలిసి. టిఫిన్ తిన్నాక, టీవీ చూసి ఎవరి పడకగదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు.

ఈ మధ్యకాలంలో మధుబాలకు చాలా గిల్టీగా అనిపిస్తోంది. ఐశ్వర్యను ఇంటికి రమ్మని పిలవలేదు ఇప్పటివరకూ... తానూ ఆమెను కలవటానికి వెళ్ళలేదు... ఫోన్ చేసి మాట్లాడే సమయమూ చిక్కటం లేదు... ఓ సారి వెళ్ళాలి అనుకుంది గట్టిగా...

అలా అనుకున్నా కాని, మరో నెలరోజుల వరకూ కుదరనే లేదు ఆమెకు.

***

వినత అంత స్వార్థంగా సురేఖ, వేణుగోపాల్ ఉండకపోయినా వేణు మరీ అంత సౌమ్యుడు కాదు. కోపం చాలా త్వరగా, తీవ్రంగా వస్తుంది. చాలా సార్లు కోపంలో తండ్రితో కూడా ఘర్షణ పడుతూ ఉంటాడు. తల్లితో మాట్లాడటం మానేస్తాడు... ఇవన్నీ చూసి మధుబాలకు చాల సిల్లీగా, చిరాగ్గా అనిపించింది భర్త ప్రవర్తన.

చిన్నపిల్లల్లా మాట్లాడుకోవటం మానేయడాలేమిటో అర్థం కాదు... అలాగే వినత మొండిది, స్వార్థపరురాలు అని అందరికీ తెలిసి మందలిస్తూనే ఉంటారు కానీ ఆమె ప్రభావం కూడా ఆ ఇంటి సభ్యుల మీద చాలా ఉన్నట్టు గమనించింది మధు. ఇంట్లో ఏ వస్తువు కొనాలన్నా ఆమెకి ఇష్టమైన బ్రాండ్ మాత్రమే కొనాలి. వినతకి ఇష్టం లేని బంధువులకు ఈ ఇంట్లో తావు లేదు... వాళ్ళతో సరియైన సంబంధ బాంధవ్యాలు ఎవ్వరూ పాటించరు.

ఐశ్వర్య మీద వినతకున్న వ్యతిరేక భావన తన భర్తకి కూడా ఉన్నదన్న విషయం తెలిసిన మధుబాల భయంతో వణికిపోయింది... వినతలా ఐశ్వర్యను తేలిక చేసి మాట్లాడకపోయినా, “చూడు మధూ... పెళ్ళికి ముందు కలిసి చదువుకున్నారు కాబట్టి, కలిసి హాస్టల్లో ఉండాల్సి వచ్చింది కాబట్టి తనతో స్నేహం చేసావు. అది కొనసాగించాల్సిన అవసరం ఏముంది? అందులోనూ అలాంటి జీవన విధానాన్ని ఎన్నుకున్న అమ్మాయిల మీద ఆట్టే సదభిప్రాయం ఉండదు ఎవరికీ... అంచేత తనని ఇంటికి పిలవకూ, నువ్వు వెళ్ళకూ...” అని చెప్పేసాడు.

“మీ స్నేహితుల విషయంలో నేను అలాంటి ఆంక్షలు పెట్టలేదు కదా...” అన్న మధుబాల రోష పూరితమైన ప్రశ్నకు అతని సమాధానం ఏమిటంటే, “ఈ ఇంట్లో ఎవరికీ స్నేహితులు ఉండరు. పరిచయస్తులూ కొలీగ్స్ మాత్రమే ఉంటారు... ఇంటి కోడలిగా ఆ విషయం గుర్తు పెట్టుకుని మసలుకోవాలి...:” అని మెత్తగా హెచ్చరించాడు.

ఈ సంభాషణ జరిగిన తరువాత తాను ఐశ్వర్యను ఒక్కసారైనా కలవలేకపోయినందుకు ఎంతో చింతించిన మధుబాల ఆ సాయంత్రమే ఆఫీస్ అయ్యాక ఐశ్వర్య దగ్గరకు వెళ్ళాలి అనుకుంది.

***

ఒకనాటి శుభోదయాన తన నిర్ణయం చెప్పేసాడు కార్తీక్. 

ఇక తాను ఐశ్వర్యతో కలిసి ఉండలేననీ, డాలీ ఇంటికి వెళ్ళిపోతున్నాననీ...

“నీ పిచ్చి గానీ కార్తీ, నువ్వు నాతో కలిసి ఉన్నది కొద్ది కాలం మాత్రమే... ఇప్పుడైనా మనమిద్దరం ఒక ఇంటికప్పు కింద కలిసి ఉన్నాం అంతే... నువ్వు నాతో కలిసి ఉండటం లేదు.... ఇప్పుడు ఫిజికల్ గా వేరు అవుతానంటావు. అలాగే కార్తీ, నీ ఇష్టం... నేనేం అనగలను?” నిర్లిప్తంగా చెప్పింది ఐశ్వర్య.

“పిచ్చిదానివీ అమాయకురాలివీ... నిన్ను ఎవరైనా మోసం చేస్తారని నా బెంగ... జాగ్రత్త ఐశూ... నా జీవితం ఇంతే ఇలాగే ఉంటుంది... నేనేం చేయలేను...”

“నా గురించి నీవు ఆదుర్దా పడటం చిత్రంగానే ఉన్నా చిన్న సంతోషం కూడా కలుగుతోంది కార్తీ... ఓకే, నీ సామానంతా సర్దుకో... వెళ్లి రా...” చెప్పేసింది ఐశ్వర్య.

“ఆరు నెలల అద్దె ముందుగానే కట్టేశాం... అందువలన నువ్వు దాని గురించి ఆలోచించకు... నీ ఆరోగ్యం జాగ్రత్త... ఎవరైనా మంచివాడు దొరికితే అంటే నాలాంటి వాడు కాక మనసున్న వాడు... ప్రపోజ్ చేస్తే ఒప్పుకో... సరేనా?” వెళ్ళబోతూ చెప్పాడు కార్తీక్.

అతను వెళ్ళగానే కుళ్ళి కుళ్ళి ఏడ్చింది ఐశ్వర్య. వైవాహిక బంధం లేకపోవచ్చు... మానసిక బంధం కూడా లేదా తమ మధ్య? ఇదేనా ప్రేమంటే??

***

మధుబాల, ఐశ్వర్య ఇంటికి చేరుతుండగానే చిరుచీకట్లు ముసురుకోసాగాయి. ఐశ్వర్య అపార్ట్మెంట్ తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. పక్కనే పిన్ని గారింటికి తాళం వేసి ఉంది. తలుపు తోస్తూ ‘ఐశూ...’ అని పిలిచింది మధు.

హాల్లో చీకటిగా ఉంది. బెడ్ రూమ్ లోంచి మూలుగు వినిపించింది.

 ‘అమ్మా... అమ్మా...నొప్పి అమ్మా... భరించలేకపోతున్నాను... అమ్మా...’

చేతిలోని బాగ్ ని సోఫా లోకి విసిరేసి, ఒక్క ఉదుటున బెడ్ రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ నేల మీద అస్తవ్యస్తంగా పడుకుని ఉంది ఐశ్వర్య.

“ఐశూ ఐశూ... ఏమైంది?” ఆమె తలను ఒడిలోకి తీసుకుంది మధుబాల.

“అమ్మా...విపరీతమైన కడుపు నొప్పి... అమ్మా...చాలా బ్లీడింగ్ మధూ... నొప్పి భరించలేక...అమ్మా...  ఇందాక పాక్కుంటూ వచ్చి బోల్ట్ తీసి పెట్టాను. నీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను... అబ్బా... మధూ... చచ్చిపోతానా? నాకేమీ తెలియటం లేదే నొప్పి తప్ప... అమ్మా...”

“వెంటనే డాక్టర్ దగ్గరకి వెళదాం... పిన్ని ఎక్కడికి వెళ్ళారు?”

“కాశీయాత్ర కి వెళ్ళారు... అబ్బా... మధూ.. ప్లీజ్ భరించలేక పోతున్నా... నన్ను హాస్పిటల్ కి....”

“ఒక్క నిమిషం ఉండు ఐశూ...” అంటూ పైకి వచ్చి ప్రసన్న వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళి విషయం చెప్పింది వాళ్ళమ్మతో. అప్పటికే ప్రసన్న బాబుతో అత్తారింటికి వెళ్ళిపోయింది.

“అరెరే అవునా అమ్మా? మా కారును, డ్రైవర్ ని ఇచ్చి పంపుతాను... నువ్వు తీసుకువెళ్లగలవా?” అందావిడ ఆదరంగా.

“అలాగే ఆంటీ, చాలా థాంక్స్ అండీ... పిన్ని గారు కూడా లేరు కదా సమయానికి... అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తోంది...”  అని, కావాల్సిన కొన్ని వస్తువులు సర్ది, ఆవిడ సహాయంతో ఐశ్వర్యను  లేవదీసింది. నిజానికి రక్తపు మడుగులో ఉంది ఐశ్వర్య.

‘అబార్షన్!’ అస్పష్టంగా గొణుక్కుంది తనలో తానే మధుబాల.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్