Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటిఫణిబాబు

 

ఈరోజుల్లో ఎక్కడచూసినా కాన్వెంటు చదువులే.  ఇదివరకటి రోజుల్లో మాతృభాష తెలుగుతోపాటు, ఇంగ్లీషూ, హిందీ కూడా నేర్పేవారు.  ఇంగ్లీషుకి పునాది, ఫస్ట్ ఫారం నుండీ ఉండేది. పైగా  స్కూల్లో చదివిన ఆరేళ్ళూ, ఆషామాషీగా కాదు. తెలుగు లో వ్యాకరణానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో, ఇంగ్లీషు గ్రామరు కీ అంతే.. ఈ రోజుల్లో తల్లితండ్రులకీ, విద్యార్ధులకీ ఓ దురభిప్రాయం ఉంది, మాతృభాష తెలుగులో చదవడం వలనే ఉద్యోగావకాశాలు తగ్గిపోతున్నాయేమో అనుకుని , ఈ కాన్వెంటు చదువులవెనక్కాల పడుతున్నారు.అలాగని ఇంగ్లీషులో ఏమైనా ఉద్దండులా అంటే అదీ లేదూ.



ఈ మధ్యన ఏదో పేపరులో చదివాను, ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారి సంఖ్య ఏడాదేడాదికీ తగ్గిపోతోందని. తగ్గకేం చేస్తుందీ? దానికి ముఖ్యకారణం ప్రభుత్వమే అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఉన్న పాఠశాలలని అభివృధ్ధి చేయడం పోయి,  ప్రెవేటు యాజమాన్యాలచేతుల్లో తాకట్టు పెట్టేశారు, కారణం, ఆ యాజమాన్యాలకన్నిటివెనకా, ఓ రాజకీయ నాయకుడుండమే. ఇంకో కారణం, ఈరోజుల్లో ఎవరిని చూసినా ఐఐటీ లో చేరాలీ, లేదా ఇంకో మెడిసిన్ లో చేరాలీ అని పరుగులెడుతూంటే, ఆ ప్రెవేటు యాజమాన్య విద్యా సంస్థలూ, వీటిని పూర్తిగా exploit  చేసేస్తున్నారు. 8 వ క్లాసుకొచ్చేసరికి అవేవో ఫౌండేషన్ కోర్సులపేరుచెప్పి, దండిగా డబ్బులు వసూలు చేయడం.

ఇది వరకటి రోజుల్లో   10, 12 క్లాసుల్లో నూటికి అరవై మార్కులొస్తే పెద్దమాట. అలాటిది ఈరోజుల్లో 90 నుంచి 99 దాకా వచ్చినా కావాల్సిన కాలేజీలో సీటు రావడం అనుమానమే. దానికి పెద్దగా కారణాలకోసం చూడక్కర్లేదు. వోటు బ్యాంకులకోసం, అడిగినవాళ్ళందరికీ  ఎడా పెడా కోటాలు. చివరకి జనరల్ కోటాలో మిగిలే సీట్లు జస్ట్ పది శాతం. దానికోసం, ఈ పోటీ అంతా.. తలతాకట్టు పెట్టైనా పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళలో చేర్పించడం, వాళ్ళమీద విపరీతమైన ఒత్తిడి తీసుకురావడం.. తల్లితండ్రులని నిరాశ పరిచినప్పుడు, ఏ ఆత్మహత్యలో చేసికోవడం.
   ప్రెవేటు కోచింగ్ క్లాసులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. గవర్నమెంటు ఆసుపత్రుల్లో డాక్టర్లకి ప్రెవేట్ ప్రాక్టీస్ ఉన్నట్టుగా, ఈ రోజుల్లో చాలామంది ఉపాధ్యాయులు ప్రభుత్వ స్కూళ్ళలో చెప్పాల్సిన పాఠాలు చెప్పడం తగ్గించి, తాము ఏ భార్యపేరునో నిర్వహించే కోచింగ్ క్లాసుల్లోనే పబ్బం గడుపుకోవడం. ఒకానొకప్పుడు ఉపాధ్యాయ వృత్తి కి ఎంతో గౌరవం ఉండేది,  “ బతకలేక బడిపంతులు “ అన్న సామెత విస్తారంగా ప్రచారం ఉన్నరోజుల్లో కూడా. ఆరోజుల్లో ఉపాధ్యాయులు ఓ ఏగాణీ కూడా ఆశించకుండా తమ శిష్యుల అభివృధ్ధినే పరమావధిగా పెట్టుకునేవారు. కానీ ఈరోజుల్లో డబ్బే ప్రధానం. ఆరోజుల్లోలాగ ఉపాధ్యాయులకీ, కాలేజీ అధ్యాపకులకీ అరా కొరా జీతాలా అంటే అదీకాదు. ప్రభుత్వాలు పుష్కలంగా జీతాలు పెంచారు. అయినా సరే, డబ్బంటే చేదెవరికీ? ఇచ్చేవాళ్ళుండగా పుచ్చుకునేవాళ్ళకి లోటేమిటీ?
 చిత్రం ఏమిటంటే పెద్దపెద్ద కబుర్లు చెప్పే మన నాయకుల పిల్లలెవరూమాత్రం, మన దేశంలో చదవకపోవడం. పోనీ దేశంలో చదివిన పిల్లలైనా ఉధ్ధరిస్తున్నారా అంటే, ఏ ఇంజనీరింగో పూర్తిచేసి,  పై చదువులకి విదేశాలకి చెక్కేయడం.. ప్రభుత్వం, వారిమీద పెట్టిన ఖర్చు ఎవడుతిన్నట్టూ ? వీటికి సాయం ఆ స్కాలర్ షిప్పులోటీ. ఎక్కడో నూటికీ కోటికీ ఏ పేదవిద్యార్ధికో ఇచ్చేవారు ఈ స్కాలర్ షిప్పులు.. ఈమధ్యనే, ప్రభుత్వం వీరు పైచదువులకి విదేశాలు వెళ్ళడానిక్కూడా సహాయం చేస్తారని. అంటే మనదేశంలో  విద్యావకాశాలు  అసలు లేనేలేవన్నట్టా ?
మన ప్రభుత్వం అదేదో  “ మేక్ ఇన్ ఇండియా “ అని మొదలెట్టారు. ఉండాల్సిన చదువులకే దిక్కులేకపోతే, ఇంక అర్ధం ఏముందీ?.  “ ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు,” . అలాటిది అసలు వెళ్ళడమే రచ్చకైతే ఇంక ఇల్లెక్కడుంటుందీ?

ఈ రోజుల్లో ప్రతీదానికీ ఓఎంట్రెన్సు పరీక్ష. వీటికి శిక్షణ ఇచ్చే కార్పొరేట్ కాలేజీలు, ఎవరికి వారే గొప్పలు చెప్పుకోవడం, మాకు 1- 10 స్తానాలొచ్చాయని. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి. ఇంక తల్లితండ్రులుకూడా ఎగబడ్డం తమ పిల్లల్ని చేర్పించడానికి. పోనీ ఇంత కష్టపడీ చదువుకుని ఓ ఇంజనీరింగు డిగ్రీ సంపాదిస్తే, వెంటనే ఉద్యోగాలొస్తాయా? అంతా దైవాధీనం. అదృష్టం బాగుంటే ఉద్యోగం, లేకపోతే రోడ్లు కొలవడం. అప్పుడెప్పుడో పేపర్లలో వచ్చింది—అదేదో ఓ బుల్లి ఉద్యోగానికి ఇంజనీర్లతో సహా లక్షల్లో అభ్యర్ధులుట.  ఈమాత్రందానికి అంత శ్రమ పడ్డం దేనికో అర్ధం అవదు. అసలు వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ప్రతీవాడూ ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి, డబ్బు సంపాదిద్దామనే కానీ, రెండుపూట్లా ముద్ద దిగే ఉద్యోగాలుకూడా ఉంటాయని గ్రహించకపోవడం. దానికి సాయం ప్రతీ  పేరెంటూ, తమ పిల్లలు ఇంజనీరింగు చేయకపోతే, వారి జన్మ వ్యర్ధమని పిల్లలకి నూరిపోయడం….

సర్వే జనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
sarasadarahaasam