Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో ఏం జరిగిందంటే .... http://www.gotelugu.com/issue165/469/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

‘‘కృతజ్ఞురాలిను స్వామీ’’ అంటూ లేచి నిలబడింది భద్రా దేవి.

‘‘అయితే ఆస్యమేల? నను బంధించి వుంచిన మంత్ర కట్టు విప్పుము. వచ్చిన పని ముగించు కొని పొయెద. మా రేడుకి మాటిచ్చి వచ్చితి ఈ యువ రాజుని కడ తేర్చి వత్తునని.’’ అనడిగాడు కర్కోటకుడు.

‘‘అదేమి మహాశయా... మా పట్ల ప్రసన్నుడవైతివి గదా!’’

‘‘అవును. నీ పట్ల మాత్రమే ప్రసన్నుడనైతి. యువ రాజు పట్ల గాదు.’’

‘‘బాగు బాగు. మీ గురించి తెలిసీ మిమ్ము నమ్ముట నా తప్పు.’’

‘‘ఆహాఁ! నా గురించి తెలియునా? ఏమి తెలియు?’’

‘‘ఇచ్చిన మాట తప్పు వారు, మోస కారి, కపటియని తెలియు.’’

‘‘ఏమంటివి? మాట తప్పితినా... కపటినా? ఈ నిందాలాపములేల?’’

‘‘నింద కాదు, సత్యమే. ఉత్తమురాలయిన సవతి వినతను ఓడించి తనను దాసిని చేసు కొనుటకు మీ తల్లి కద్రువకు తక్షకుండు నీవును సహకరించ లేదా? తల్లి దాస్య విముక్తికి గరుడుడు దేవతలతో పోరాడి అమృతము తెచ్చినది నిజము కాదా? తన మాట వినని తన సంతతి నాగులను గరుడులకు ఆహారం కమ్మని మీ తల్లి కద్రువ శపించినది నిజము కాదా? మీ తల్లి వారసత్వమే మీకును వచ్చినది. అందుకే ఇచ్చిన మాటను ఆశీర్వచనమును ఇంత లోనే మరచి మాటాడుచున్నారు.’’

‘‘వనితా... ఒక నాటి విషయము ఇప్పుడేల? అనవసరముగా నామీద నిందలేయకుము. ఇంతకూ నీవేమందువు? నేనేమి కపటము జేసినాను? నేనేమీ మాట తప్పితిని?’’

‘‘ఇప్పుడే గదా నను మనసారా ఆశీర్వదించినారు. మనోభీష్ట సిద్ధిరస్తు`కళ్యాణమస్తుయని. ఇంత లోనే మరచితిరా?’’

‘‘లేదు బాలికా! నా వచనము వృధా కాదు.’’

‘‘కాక ఏమగును? నా పక్కన యువరాజు ధనుంజయుల వారు లేకున్న మీ ఆశీర్వచనము ఎటుల ఫలించు?’’

‘‘అర్థము గాకున్నదే... ఏమి మీ సంబంధము?’’

‘‘ప్రణయ బంధము. నా మనోభీష్టము వీరిని పెండ్లియాడుట. వీరే నా ప్రియుడు, సఖుడు, నా ప్రాణము, నా సర్వస్వము. మా ప్రేమ ఫలించి వివాహము గాకున్న మీ వాక్కు ఎటుల ఫలియించు? వీరిని కడ తేర్చుటయన్న అది మీరు మాట తప్పుటయే గదా?’’

ఆ మాటలు విని ఒక్క సారిగా విభ్రాంతి చెందాడు కర్కోటకుడు. అప్పటి గ్గాని వారిద్దరూ ప్రేమికులని అర్థం గాలేదు. ఈ విషయం తెలీక ఆశీర్వదించేసాడు. తనను పొగిడి ముందు గానే ఆశీర్వాదం పొంది ఇరుకున బెట్టింది. ఇప్పుడు ధనుంజయుని కడ తేర్చుట యెట్లు?
తనను మాటలతో మభ్య పెట్టి ముందు కాళ్ళకు బంధం వేసిన భద్రా దేవి చాతుర్యమునకు ఒక ప్రక్క కోపము, మరో వంక నవ్వు కూడ వచ్చాయి. తీరా ఆశీర్వదించేసాడు. ఇప్పుడేమి చేయగలడు? ఆశీర్వదించాడు గాబట్టి ఆమె ప్రియ సఖుని అంతము చేయ జాలడు.
‘‘ఓహో... గొప్ప చిక్కే వచ్చినది గదా... నీ మంత్రం తోనే కాదు, మాటల తోనూ నను బంధించి నిస్సహాయుని జేసితివమ్మా. అయిననూ నిను మెచ్చితి. నీ వంటి శక్తి వంతురాలయిన ధీర వనిత పక్కనుండ ఈ అదృష్టవంతుడగు పూర్ణాయుష్కుని ఏ ఆపదా బాధింపదు. ధనుంజయా! నిను కడ తేర్చ వచ్చిన నన్ను మన్నించు.’’ అన్నాడు.

‘‘అంత మాట వలదు. మీరు పెద్దలు. ఇవే నా ప్రణామములు.’’ అంటూ అప్పుడు నమస్కరించాడు ధనుంజయుడు. ఇరువురినీ కలిపి దీవించి` ‘‘మీరు మీ లక్ష్యమున విజయులై సంతోషమున ఉందురు గాక... నేను పోయి వచ్చెద... కాని...’’ అంటూ ఆగి పోయాడు కర్కోటకుడు.

‘‘కాని... సందేహమేల? చెప్పండి’’ అంది భద్రా దేవి.

‘‘మా ప్రభువులకి మాట యిచ్చి వచ్చితి గాని ఇచట విఫలమైనది. ఏదో ఒక దానిని కాటు వేసి పోవలె... ఎచట కాటందుకోవలె వచింపుము.’’ అనడిగాడు కర్కోటకుడు.

‘‘దాని కింత ఆలోచనెందుకు? మంత్ర కట్టు విప్పెదను, ఈ గుట్ట వంచన నీటి చెలమ వద్ద రంభా వృక్షములున్నవి, ఒక దానిని కాటందు కొని పో వచ్చును.’’ అంటూ సూచించింది భద్రా దేవి.

‘‘రంభా వృక్షమా...?’’ అంటూ ఖిన్నుడై చూసాడు కర్కోటకుడు.

రంభా వృక్షమంటే అరటి చెట్టు.

రంభము అంటేనే అరటి. అరటి బోదె వంటి ఊరువు కలిగినది కాబట్టి అప్సర భామల్లో ఒకామెను రంభ అన్నారు. అలాగే నర నారాయణుల్లో సాక్షాత్తూ నారాయణుని ఊరువు నుంచి ఉద్భవించిన మహా సౌందర్యావతి కాబట్టి మరో అప్సర భామను ఊర్వశి అన్నారు. కావున`
భద్రా దేవి సూచించినట్టు తను అరటి చెట్టును కాటేస్తే ఏమవుతుందో కర్కోటకునికి తెలుసు. అరటి పీచులో తన కోరలు చిక్కు బడి తల వెనక్కు తీసుకో లేడు. ఈ లోన తన విషాగ్నికి అరటితో బాటు తనూ కాలి బూడిదయ్యే ప్రమాదం వుంది. భద్రా దేవి ముందు చూపును మెచ్చుకుంటూ`

‘‘తరుణీ! అభయ మిచ్చితి గదా. ఇంకనూ భయమేల? నా నుంచి మీకు ఏ ప్రమాదమూ ఘటిల్లదు. నను నమ్ము. నీ సూచన సరి కాదు. నా పెద్దరికమును గారవించి మరో మార్గము జెప్పుము.’’ అన్నాడు.

‘‘సరి... మంత్ర కట్టు విప్పుచున్నాను. ఈ గుట్ట దిగిన పిమ్మట మార్గమున ముందుగా నీకు ఏ మృగము ఎదురైన దానిని కాటందుకొని నాగ లోకము పోవచ్చును.’’ అంది భద్రా దేవి.

ఏదో మంత్రం పఠించి గాలిలో రెండు సార్లు వూదింది అంతే` అంత వరకు కర్కోటకుని బంధించి వుంచిన మంత్ర బంధం విడి పోయి స్వేచ్ఛ లభించింది.

కర్కోటకుడు చిరు నవ్వుతో ముందు కొచ్చి చేయెత్తి ఇరువురినీ ఆశీర్వదించాడు. పిమ్మట సర్ప రూపంగా మారి వేగంగా గుట్ట దిగువకు వెళ్లి పోయాడు.

ఆ విధంగా కర్కోటకుడు నిష్క్రమించాక భూతం ఘృతాచి కావలి తిరుగుతూండగా మిగిలిన రాత్రి ధనుంజయ భద్రా దేవిలు నిశ్చింతగా మండపం మీద నిద్ర పోయారు.

*************************************

అది నాగ లోక రాజ మందిరం.

నాగ రాజు మహా పద్ముడి అంత రంగిక సమావేశ మందిరం. అక్కడ నాగ రాజు ముందు తల వంచుకు నిల బడి వున్నాడు కర్కోటకుడు. రత్న గిరి యువ రాజు ధనుంజయుని జంపుటకు పోయి ఆ పని చేయ లేక మరలి వచ్చి తన అశక్తతను తెలియ జేసి తల వంచుకున్నాడు.
వింధ్యా సానువుల నుండి అంత క్రితమే నాగ లోకం చేరుకున్న కర్కోటకుడు నేరుగా రాజ దర్శనార్థం వచ్చాడు. ఆ సమయంలో కర్కోటకుని సోదరుడు తక్షకుడు అక్కడ వున్నాడు. ఇంకా నాగలకు పెద్ద వాసుకి, శంఖు పుత్రి తండ్రి శంఖచూడుడు, ఇంకా శంకుడు, మహా శంకుడు, గుళికుడు జిత్తుల మారిగా పేరు పొందిన మాయావి మహా గుళికుడు మొదలగు నాగ లోక ప్రముఖులంతా అక్కడే ఆసీనులయి వున్నారు.
నాగ రాజు వదనం గంభీరంగా వుంది.

అటు యిటు పచార్లు చేస్తున్నాడు.

కర్కోటకుడు కూడ విఫలుడై మరలి వచ్చుట అతనికి నమ్మ శక్యం గాకుండా వుంది. దివ్య నాగ మణి కోసం ధనుంజయుడు నాగ లోకం వరకు రాక ముందే అంతం చేయాలన్న తన లక్ష్యం నెర వేరేట్టు కన్పించటం లేదు. ఉన్నట్టుండి ఆగి అందరి వంక నిశితంగా చూసాడు.
‘‘ఇది యేమి విపరీతమో తెలియ కున్నది. ఒక మానవుని జంపు వీరుడే మన నాగ లోకమున కరవైనాడా? ఒకరు కాదు యిద్దరు కాదు, పోయిన వారు తిరిగి రాలేదు. కర్కోటకుడంతటి వాడే చేత గాక యిదో... రిక్త హస్తముల మరలి వచ్చి మన ముందు శిరము వంచి నిలుచున్నాడు. ఏమి చేయ వలె. ఇక ఉపేక్షించి లాభము లేదు. స్వయముగ నేనే వెడలి ఆ మానవాధముని మట్టు బెట్టి వచ్చెద.’’ అన్నాడు ఆవేశంగా.

‘‘తప్పు మహా పద్మా!’’ అంటూ నాగ రాజు మాటల్ని వెంటనే ఖండించాడు వృద్ధుడైన వాసుకి.

‘‘నీ అభిప్రాయము తప్పు. నీ పలుకులు సరి గాదు.’’ అన్నాడు తిరిగి తనే.నాగ లోకం లోని వృద్ధులలో ఒకడు, ప్రముఖడైన వాసుకి మాటలను గురు వాక్యంగా భావిస్తారంతా. ఎదిరించే సాహసం చేయరు. అయితే తను నాగ లోకాధి పతి గాబట్టి వాసుకి తనను తప్పు బట్టడం మహా పద్ముడికి నచ్చ లేదు.

‘‘ఏమంటిరి వాసుకి దేవా! నా అభిప్రాయము తప్పందురా? నా పలుకులు సరి కావా?’’ అనడిగాడు వెంటనే.

‘‘ముమ్మాటికీ కాదు మహా పద్మా. మానవుల పై ఈ తేలిక అభిప్రాయము ఏలాగున ఏర్పడినది నీకు? మానవాధమునిగ నీవు పరిగణించుట సరియా? మానవులలో మహనీయు ఎందరు లేరు?  నాడు ఉలూచి వరించి బబ్రు వాహనునికి జన్మ నిచ్చినది మానవ శ్రేష్టుడైన అర్జునుని వలన గాదా? వీరులను గౌరవించుట మన నాగ లోక సాంప్రదాయమే గదా. గతమున మన నాగ లోకమును దర్శించిన మానవ వీరుల గురించి మరచితివా? ధనుంజయుని రాక నీకు నచ్చనంత మాత్రమున అతడిని మానవాధముడని నిందించుట పాడి గాదు.’’ అంటూ హితోపదేశం చేసాడు వాసుకి.

ఆ హితవు నాగ రాజుకు రుచించ లేదు. అయిష్టంగా ముఖం ముడుచుకున్నాడు.

‘‘గతము గూర్చి చర్చ ఏటికి మహోదయా! మన చర్చ వర్త మానమును గూర్చి గదా!’’ అన్నాడు.

‘‘అయిన నేమి? వర్త మానమున సాంప్రదాయము మారినవా లేక చరిత్ర మాసి పోవునా. ఒక వీరుని చులకన జేసి వెడలి నీవునూ భంగ పడిన అది నీకు ఎంత అవమానమో వూహించితివా? అదియును గాక`

ధనుంజయుని వెంట అతని మిత్రుడైన బాలకుడు ఎవరో రక్షణగా వచ్చుచున్నాడని, అతడు శక్తివంతుడైన మంత్ర గాడని వింటి...’’

‘‘క్షమించండి మహోదయా’’ అంటూ వాసుకి మాటకు అడ్డు వచ్చాడు కర్కోటకుడు. ఏమిటన్నట్టు చూసాడు వాసుకి.

‘‘ధనుంజయుని మిత్రుడు బాలకుడు కాదు, పురుష వేషము లోని బాలిక. యుక్త వయస్సు తరుణి. అమిత సౌందర్య వతి. నేనామెను దగ్గరగా జూచితి, సంభాషించితి. మహా తెలివైనది.’’ అంటూ వివరించాడు. కర్కోటకుని మాటలకు ఒక్క సారిగా నివ్వెర పోయారంతా.
నాగ రాజు ఆశ్చర్యానికి అంతు లేదు.

నాగాల ఓజో క్షుద్ర విద్యా ప్రయోగాన్ని తిప్పి కొట్టినది ఒక యువతియా! అతివలకు అంతటి శక్తి ఎలా అబ్బినది? నాగ రాజే కాదు, అచటి ప్రముఖులందరి మది లోను ఇవే ఆలోచనలు సుడి తిరుగుతున్నాయి.

‘‘ఏమంటివి కర్కోటకా! అతడు అతడు కాదా? ఆమెయా? నిజముగా ఆమె యేనా?’’ నమ్మ లేనట్టు అడిగాడు నాగ రాజు.

‘‘నేను చెప్పునది నిజము ప్రభు. ఆ బాలిక పేరు భద్రా దేవి. మహా మేధావి, చురుకైనది. ఆమె మంత్ర శక్తికి తిరుగు లేదు. అగ్నికి వాయువు తోడైనట్టు భద్రా దేవి ధనుంజయుని చెంత ఉండగా అతడిని ఎవరూ ఏమీ చేయ జాలరు. ఆపైన వారిరువురు ప్రేమికులు. ఇది చాలదన్నట్టు వారికి రక్షణగా ఒక భూతము కావలి కాయు చున్నది. దాని పేరు ఘృతాచి. ఆ భూతం గుట్ట పైకి పోకుండా నన్న నిరోధించునపుడు జరిగిన యుద్ధంలో నాకు తగిలిన గాయములు ఇంకను బాధించు చున్నవి.’’ అంటూ తెలిపాడు కర్కోటకుడు.

ఆ మాటలు వింటూ ఒక్క సారిగా నిశ్శబ్ధమై పోయారంతా. ఒక ఆడపిల్లకు ఇంతటి మంత్ర శక్తి ఎలా సిద్ధించినది? తీవ్రంగా ఆలోచిస్తున్నాడు తక్షకుడు. ఏదో సందేహం ఏర్పడి ఒక్క సారి కనులు మూసు కొని అంతర్‌ దృష్టిలో భద్రా దేవి గురించి అవలోకించాడు. తిరిగి కళ్ళు తెరవ గానే` ‘‘ఇప్పుడు తెలిసినది. ఆమె సామాన్యురాలు కాదు’’ అన్నాడు.

‘‘అనగా అర్థమేమి?’’ వెంటనే అడిగాడు నాగ రాజు.

‘‘ఒకప్పుడు మహా మంత్ర వేత్త యగు అగ్నిభట్టారకుని వంశమున జన్మించినది ఆమె. తండ్రి అరుణ భట్టారకుడు’’ అంటూ భద్రాదేవి గురించిన వివరములు చెప్పాడు తక్షకుడు. అంతే కాదు, తన వంశ మూలమగు అగ్ని భట్టారకుని ఆశయ సాధన కోసం కంకణ బద్ధు రాలయి ధనుంజయుని వెన్నంటి వస్తున్నదని కూడ తెలియ జేసాడు.

సాలోచనగా తల పంకించాడు నాగ రాజు. ఆ చర్చ ఇంకా కొన సాగేదేమో గాని ఇంతలో నాగ రాణి కీర్తిమతి హడా వుడిగా ఆ మందిరంలో అడుగు పెట్టడంతో చర్చ అంతటితో ఆగి పోయింది.

రాణి కీర్తి మతి వస్తూనే కళ వళ పడుతూ భర్త నాగ రాజు వంక చూసింది` ‘‘ప్రభూ! మీ రాచ కార్యము పక్కన బెట్టి ఒక పరి గృహ విషయము జూచుట మంచిది’’ అంది.

‘‘ఏమంటివి దేవీ... గృహమున ఏమి జరిగినది?’’ వెంటనే అడిగాడు నాగ రాజు.

‘‘తమకు తెలియదా ప్రభూ? మన గారాల పట్టి ఉలూచీశ్వరి పది దినముల క్రిందట వింధ్యాటవికి విహారమునకు వెళ్ళినది. ఇంత వరకు తిరిగి రాలేదు. వెంట వెళ్ళిన చెలి కత్తియు నలుగురూ సంపంగి వన మందు సంచరిస్తున్నారని ఇప్పుడే తెలిసినది. వారితో యువరాణి లేదట. ఏమి జరిగినదో తెలియక కలవర పడుచుంటిని.’’ అంది కీర్తి మతి.

‘‘కలవరమేల దేవీ. మన ముద్దుల తనయ మదీయ వారసత్వమును, గుణమును పుణికి పుచ్చుకున్నది. ధైర్య సాహసములు ఆమె సొంతము. మానవుల వైపు కన్నెతి జూడదు.

అయిననూ ఆనాడే వన విహారమునకు వలదని వారించితిని. నీవే గదా ఈ తూరికి అనుమతించమని కోరితివి. ఇప్పుడీ ఆందోళన యేమిటి? ఏమి జరిగినదో చెలి కత్తెను బిలిపించి విచారించెదము గాక.’’ అంటూ అంత వరకు చర్చలో పాల్గొన్న పెద్దలందరినీ పంపించేసాడు నాగ రాజు.
అప్పటి కప్పుడు` ఉలూచీశ్వరి  చెలికత్తియను బిలుచుకు రమ్మని కొందరు రాజ భటులను సంపంగి వనానికి పంపించాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
kadali