Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే...http://www.gotelugu.com/issue165/471/telugu-serials/atulitabandham/atulitabandham/

రెండవ రోజు మధ్యాహ్నానికి వాడిపోయిన ముఖంతో, నలిగిపోయిన బట్టలతో, రేగిపోయిన జుట్టుతో ఇంట్లోకి అడుగుపెట్టింది మధుబాల.
సుగుణమ్మ ముఖంలో కోపచ్చాయలు. వేణూ కూడా ఇంట్లోనే ఉన్నాడు. మధుబాలను చూడగానే తిరస్కారంగా ముఖం తిప్పుకున్నాడు. మామగారు ఇంట్లో లేరు.

మధుబాల మౌనంగా తన బెడ్ రూమ్ లోని స్నానాల గదిలోకి వెళ్లి స్నానం చేసి, ఇస్త్రీ చేసిన కాటన్ చీర కట్టుకుని బయటకు వచ్చింది.
టీవీ చూస్తున్న వేణుగోపాల్ “మధూ, నీకు బుద్ధి ఉందా అసలు?”  అని అడిగాడు కోపంగా.

“అది... అసలు ఏం జరిగింది అంటే... వివరంగా చెబుతాను వేణూ... ప్లీజ్, కోపం వద్దు...” అతని ఎదురుగా కూర్చుని జరిగింది చెప్పింది.

“ఆ పరిస్థితులలో ఐశూని వదిలి ఎలా రాగలను? తన వాళ్ళు ఎవ్వరూ లేరు అక్కడ... హాస్పిటల్ కి తీసుకువెళితే ఇన్ పేషెంట్ గా జాయిన్ చేసుకున్నారు. అప్పటికే దానికి చాలా రక్తం పోయింది. అప్పటికప్పుడు రక్తం ఎక్కించాలి అన్నారు. బ్లడ్ బ్యాంకు లో దొరకలేదు. ఎవరికో ఫోన్ చేస్తే డోనర్ ని పంపించే సరికే ఆలస్యం అయింది. తనతో పాటుగా పక్కనే ఉండాల్సి వచ్చింది... మీకు ఫోన్ చేసాను రెండు సార్లు... రెండు సార్లూ స్విచ్ ఆఫ్ వచ్చింది... నా ఫోన్ లో తర్వాత ఛార్జ్ అయిపోయింది. అదీ గాక అటూ ఇటూ తిరగడం... చాలా హడావుడి రాత్రంతా... నిద్దర లేదు అసలు... మిడ్ నైట్ దాటాక దానికి నిద్ర పట్టింది. అప్పుడే నేనూ కాస్త కునుకు తీశాను...ఉదయం ట్రీట్మెంట్... అన్నీ అయేసరికి ఈ వేళ అయింది... అయామ్ వెరీ సారీ వేణూ...”

“ఆవిడని చూడటానికి వెళ్ళటం ఓ తప్పు... అదీ నాకు చెప్పకుండా... రాత్రంతా ఎక్కడో ఉండిపోవటం మరో తప్పు... అయినింటి కోడలు అడ్డమైన వాళ్ళ కోసం ఇలా తిరగటం ఎవ్వరూ సహించరు! అది గుర్తు పెట్టుకో మధూ...” తీక్షణంగా అన్నాడు వేణుగోపాల్.

“తను నాకు స్నేహితురాలు... అడ్డమైన మనిషీ కాదు...” గొంతు రుద్ధమౌతూ ఉండగా ఉక్రోషంగా అంది మధుబాల.

“ఎందుకు కాదు? ప్రపంచమంతా ఓ తీరుగా ఉంటే, డిఫరెంట్ గా ఉండి ఏదో సాధించేద్దామని కొత్త జీవన విధానం మొదలుపెట్టింది అడ్డగోలుగా... అలాంటి మనిషిని ఎవరైనా గౌరవంగా చూస్తారా మధూ? ఓకే, తనకి కష్టం వచ్చింది... మరి పక్కనే ఉండే ఆవిడగారి బాయ్ ఫ్రెండ్... లేదా కంపానియన్... ఆ కార్తీక్ గారు ఎక్కడ? కనీస స్నేహధర్మాన్ని నిర్వర్తించాలి కదా ఆయనగారు?” వ్యంగ్యంగా అన్నాడు వేణు.
“ఐశ్వర్య చాలా దురదృష్టవంతురాలు వేణు... ఇంతకన్నా నేనేమీ చెప్పలేను... నాకు కొంచెం విశ్రాంతి కావాలి... కాసేపు పడుకోవచ్చునా?”
“భోజనం చేసి వచ్చి పడుకో... అమ్మకి వివరంగా విషయాలన్నీ చెప్పు. అమ్మా, నాన్న ఇద్దరూ కోపంగానే ఉన్నారు. రాత్రి సర్ది చెప్పలేక చచ్చాను నేను...” మెల్లగానే చెప్పాడు వేణు.

“చూడు, మనం ఉమ్మడికుటుంబం లో ఉన్నాం... అందరికీ అనుగుణంగా మసలుకోవాలి... నిన్న జరిగింది రిపీట్ కానీయకు... ప్లీజ్... నాకు కోపం రానీయకు... నేను కూడా కంట్రోల్ చేసుకోలేను... మన మధ్య ఎడం రావటం కూడా భరించలేను మధూ... ఆల్రెడీ నీ మీద వినతకి కోపం,  అసూయ అని తెలుసు కదా... దానికి ఎందుకు ఛాన్స్ ఇస్తావు? వద్దురా... ఎవ్వరూ వద్దు... మనం ఒకరికొకరం మిగలాలి అంటే నువ్వు కొన్ని బంధాలు తెంచుకోవాలి... ముఖ్యంగా ఐశ్వర్యతో అనుబంధం...”

తల వంచుకుని నిస్సహాయంగా కన్నీళ్లు కార్చింది మధుబాల.

“వాస్తవాన్ని చెప్పాను నేను... నీకు నచ్చినా నచ్చకున్నా సరే... వెళ్ళు, భోజనం చేసి రా...”

కళ్ళు తుడుచుకుని, వంటగదిలోకి వెళ్ళి అత్తగారికి జరిగింది అంతా చెప్పింది మధుబాల.

“సారీ అత్తయ్యా, ఎలాంటి సమాచారం లేకుండా నేను అక్కడ ఉండిపోవటం తప్పే కానీ, పరిస్థితి అలాంటిది...” అంది.

“సరేలేమ్మా... ఆడపిల్ల, పక్కన ఎవ్వరూ లేరని అన్నావుగా... నీవు చేయాల్సిందే చేసావులే... కాకపోతే మీ మామగారికి మాట రానీయకు... రా భోజనం చేద్దువు... అన్నం తినేసి, హాయిగా పడుకో... మనసు కుదుటపడుతుంది...” మధుబాల తల నిమిరింది సుగుణమ్మ.

***

కళ్ళముందు తెల్లని దూది గుహలు... ఆ గుహలలో తాను ఎక్కడికో జారిపోతోంది... ఆధారం లేదు... ఎవ్వరూ పట్టుకోవటం లేదు... ప్రచండ వేగంతో జారిపోతోంది...

“అమ్మా అమ్మా... ప్లీజ్ అమ్మా... నన్ను పట్టుకోవా... భయమేస్తోంది... పడిపోతున్నాను... అమ్మా... నన్ను గట్టిగా పట్టుకో...” పలవరిస్తూ చేయి  ఎత్తింది ఐశ్వర్య.  ఆ చేతిని ఎవరో పట్టుకున్నారు...

“స్పృహ వస్తోంది... భయం లేదు... ఆమెకి ఏమీ కాదు...” ఎవరో బహుశా డాక్టర్ కాబోలు చెబుతున్నారు... తనను పట్టుకున్న చేయిని తానూ గట్టిగా పట్టుకుంది ఐశ్వర్య...

“అమ్మా బుజ్జీ...” తన తల్లి గొంతు లీలగా వినిపిస్తోంది...

“అమ్మా, అమ్మా... నువ్వు వచ్చావా? నాకు దాహం వేస్తోంది... కొంచెం నీళ్ళు...”

“అయ్యో ఆ అమ్మాయికి ఇప్పుడు నీళ్ళు ఇవ్వకండి... వాంతులు అవుతాయి... డ్రిప్స్ ఇస్తున్నాం కదా... లేకపోతే ఒక్క రెండు చెంచాల మంచి నీళ్ళు పోయండి...” నర్స్ చెబుతోంది.

పెదాలు రెండు చుక్కల నీళ్ళతో తడిసాయి... నాలుకతో వాటిని చప్పరిస్తూ... కనులు తెరవబోయింది... మళ్ళీ మంచు గుహలు... అగాధాలు... జారిపోతోంది... జారిపోతోంది.... ఆ... మగత... నిద్ర...

మళ్ళీ ఐశ్వర్యకు మెలకువ వచ్చేసరికి గదిలో దీపం వెలుగుతోంది. అతి కష్టం మీద కనులు విప్పి చూసింది. మంచం పక్కనే కుర్చీలో కూర్చున్న తల్లి కనిపించింది. ఐశ్వర్య కళ్ళు తెరవగానే ఆ కన్నతల్లి ముఖం విప్పారింది.

“అమ్మా... బుజ్జీ... లేచావా? ఎలా ఉందిరా?? ఎలా ఉంది నీకు...” ఆ అమాయకపు తల్లి కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి...

“అమ్మా, నువ్వు ఎప్పుడు వచ్చావు? అసలు నీకు ఎలా తెలిసింది?” చాలా కాలం తర్వాత కనబడిన తల్లి చేతిని గట్టిగా పట్టుకుంది ఐశ్వర్య.

“నీ ఫ్రెండు మధుబాల హాస్పిటల్ వాళ్లకి మా నెంబర్ ఇచ్చి ఫోన్ చేయించింది రాత్రి... వెంటనే బయలుదేరి ఈరోజు మధ్యాహ్నం వచ్చేసాం... మధు మేము వచ్చాకే తన ఇంటికి వెళ్ళింది తల్లీ....”

“అమ్మా... నాకు నాకు...” పొట్ట తడుముకుని భోరున ఏడవసాగింది ఐశ్వర్య...

“ఛ, ఊరుకోమ్మా... పోనీలే...ఏమీ కాలేదుగా ఇప్పుడు? నువ్వు మాకు దక్కావు అంతే చాలు...” ఐశ్వర్య కళ్ళు తుడుస్తూ అంది అలిమేలమ్మ.

“కాదమ్మా... ఎన్నెన్నో కలలు కన్నాను అమ్మను కావాలని... ఇదిగో ఇలా అయిపోయింది...”

“ఎందుకురా బాధ? ఎంతో మంచి జరుగుతుందిలే ముందు ముందు... తీసుకున్న దేవుడే తిరిగి మంచి ఫలాలు ఇస్తాడు...” దూరమైన కార్తీక్ ని తలచుకుంటూ భారంగా నిట్టూర్చింది ఐశ్వర్య.

“నాన్న ఎలా ఉన్నారు?”

“ఆయన కూడా వచ్చాడు. బయట కూర్చున్నాడు... పంపించనా నేను వెళ్లి?”

“అమ్మా... నువ్వు కాసేపు ఉండు... తర్వాత ఆయన్ని పిలుద్దువు గాన్లే... నీకు నా మీద కోపంగా లేదామ్మా?”

“కోపమెందుకు బుజ్జీ?”

“అదేనే, నా ఇష్టం వచ్చినట్టు  మీకు చెప్పకుండా... కార్తీక్ తో... నాన్నగారు కోపంగా ఉత్తరం కూడా రాసారు...”

“ఒక వయసు వచ్చాక పిల్లల మీద పెద్దలు తమ ఇష్టాలు రుద్దకూడదు... అలాని వాళ్ళు తప్పు మార్గం లో వెళుతూ ఉంటే చూస్తూ కూడా ఊరుకోకూడదు... నీ విషయంలో ఆయన ఉత్తరం రాసి ఊరుకున్నారు కానీ తనలో తానే  ఎంతో మథన పడటం నాకు తెలుసు. నా ప్రాణం కొట్టుకు పోయేది తల్లీ... నేను నీ దగ్గరకు రావాలని చాలా ప్రయత్నించాను... కానీ వీలు కాలేదు... పరిస్థితులు...” చెప్పింది అలమేలమ్మ.
“అమ్మా... నువ్వు నాక్కావాలమ్మా... మూర్ఖత్వం ఎక్కువై నీ గురించి పట్టించుకోలేక పోయాను... స్వచ్ఛమైన ప్రేమకు ఇన్నాళ్ళూ దూరమయ్యాను. అమ్మా, మధూ కూడా నీలాంటి అమ్మ మనసున్నదేనే... అది నిన్న రాకుంటే నా  పరిస్థితి ఏమిటి అమ్మా? దేవుడు పంపినట్టే నా దగ్గరకు వచ్చింది మధు...” దుఃఖం సుళ్ళు తిరిగింది ఐశ్వర్య కంఠంలో.

“అవునమ్మా, ఆ బంగారు తల్లి నూరేళ్ళూ పసుపు కుంకాలతో, పిల్లా పాపలతో వర్థిల్లాలి...” మనస్ఫూర్తిగా దీవించింది అలిమేలమ్మ.
తిరుపతయ్య లోపలికి వచ్చి కూతురి తల మీద చేయి వేసి నిమిరాడు...

“బుజ్జి తల్లీ, ఎలా అయిపోయావమ్మా...”

“నాన్నా... నన్ను క్షమించు...” దీనంగా పలికింది ఐశ్వర్య.

“జరిగిందేదో జరిగిపోయింది... రేపు నిన్ను డిశ్చార్జ్ చేస్తారట... మనింటికి వెళదాం తల్లీ... కొన్నాళ్ళుండి మళ్ళీ జాబ్ లో జాయిన్ అవుదువు లే...”

“సరే నాన్నా...” అలసట గా కళ్ళు మూసుకుంది ఐశ్వర్య.

***

“డియర్ మధూ...

నీకు ఎలా థాంక్స్ చెప్పాలో కూడా తెలియటం లేదు మధూ... సరియైన సమయంలో వచ్చి, నన్ను ఆస్పత్రిలో చేర్పించి, నా ప్రాణాన్ని కాపాడావు. అంతే కాకుండా అమ్మా నాన్నలకు కబురు చేసి, మళ్ళీ వాళ్ళ దగ్గరకు నన్ను చేర్చావు. నీ ప్రేమ, స్నేహం దొరకటం నా పూర్వ జన్మ సుకృతం తప్ప మరేమీ కాదే...

ఇక్కడ అమ్మ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది... శారీరకంగా కన్నా మానసికంగా మరింత బలహీనంగా ఉన్నాను మధూ... కోలుకోవటానికి కొద్దిగా సమయం పడుతుంది.  ఒక రెండు వారాలు ఇక్కడే ఉండి వస్తాను.

ఎందుకు మధూ, ఇలా జరిగింది? సహజీవనం అంటే పెళ్ళి కాకుండా ఎప్పటికీ కలిసే ఉంటామని అనుకున్నాను. మా ప్రేమ అంత బలమైనది అని భావించాను. కానీ చూసావా కార్తీక్ ఎంత అమానుషంగా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడో... ఇదే చాలని అనుకున్నాడా? నేను అతనికి సరైన ఆనందాన్ని ఇవ్వలేకపోయానా? ఏమీ అర్థం కావటం లేదు... పిచ్చి మనసు... నన్ను విడచి వెళ్ళినా అతన్నే ప్రేమిస్తోంది చూడు... దానికసలు బుద్ధి లేదు మరి...

మనసును రాయి చేసుకోవాలి... వేదనలకు అతీతంగా ఉండాలి... గట్టిగానే అనుకుంటున్నాను కానీ ప్రాక్టికల్ గా సాధ్యం కావటం లేదు. అయినా ప్రయత్నిస్తాను...

నువ్వెలా ఉన్నావు? జాగ్రత్త... రిప్లయ్ ఇస్తావు కదూ...

నీ ఐశూ...”

మెయిల్ చదివిన మధూ మనసంతా భారంగా అయింది. పోనీలే, ఈ సమయంలో అమ్మానాన్నల వాత్సల్యం దానికి చాలా అవసరం... వాళ్లకి కబురు చేసి తాను మంచి పనే చేసింది... అనుకుంది.

తన పరిస్థితి కూడా అంత బాగాలేదు. అత్తగారింట్లో రొటీన్ గా గడచిపోతోంది. మొన్న ఐశ్వర్య వైద్యానికని తమ జాయింట్ అకౌంట్ లోంచి యాభై వేలు హాస్పిటల్ వారికి అడ్వాన్స్ గా ఇచ్చింది. అది పెద్ద ఇష్యూ అయి కూర్చుంది. వేణు బాగా కేకలు వేసాడు. తానెంత ఖర్చు పెట్టుకున్నా ఫర్వాలేదట... ‘అలాంటి’ వారికి ఖర్చు పెట్టకూడదుట. ప్రతీ సారి అలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అంటుంటే  సభ్య సమాజంలో ‘అస్పృశ్యత ఎక్కడికి పోయింది?’ అనిపిస్తోంది తనకు. తాను నమ్మిన సిద్ధాంతాలకు లోబడి జీవిస్తోంది ఐశ్వర్య... ఎవరికీ హాని చేయటం లేదే... వీళ్ళకి ఎందుకంత చులకన?

ఒక్కో సారి తనకీ అనిపిస్తోంది ఈ యావజ్జీవ కారాగార శిక్ష లాంటి వివాహ జీవితం కన్నా అదే మంచిదేమో అని... పెళ్ళాం అంటే కట్టుకున్న బానిస... వాళ్ళు ఏం చెప్పినా నో అనకూడదు... వాళ్ళ చట్రం లోంచి బయటకు రాకూడదు... తను కష్టపడి సంపాదించిన డబ్బును కూడా తన ఇష్టానికి ఖర్చు పెట్టుకోకూడదు. తన భావాలకు విలువ లేదు... తనకి స్నేహాలు ఉండకూడదు... ఇంట్లోనే అటూ ఇటూ తిరుగుతూ, బయట నుంచి ఉద్యోగంలో కష్టపడి తెచ్చిన డబ్బును యజమాని చేతుల్లో పోస్తూ... హాయిగా కాలం గడిపివేయాలి... ఆడపడుచులూ, అత్తమామలు ఏమన్నా సర్దుకు పోవాలి... ఇలా ఉండగలిగితే, మనసును చంపేసుకోగలిగితే ప్రతీ భార్య జీవితమూ స్వర్గ ధామమే మరి!
“అమ్మాయ్ మధూ... తులసి మొక్కకి నీళ్ళు పోసావా?” అత్తగారి పిలుపుకు బరువుగా నిట్టూర్చి  మెయిల్ లోంచి లాగ్ అవుట్ అయి తన లాప్ టాప్ ను మూసేసి, లేచింది మధుబాల.

***

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్