Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
veekshanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

పాండురంగమాహాత్మ్యము

ప్రథమాశ్వాసములో కాశీపట్టణ వర్ణన చేస్తున్నాడు తెనాలి రామకృష్ణుడు. కోటను వర్ణించడం ఐపోయింది. అక్కడి చతుర్వర్ణాల ప్రజలను వర్ణించాడు. అక్కడి చతురంగబలాలను వర్ణించాడు. యిక  అక్కడి సుందరీమణుల వర్ణన, వారకాంతల వర్ణన, అక్కడి
పంటచేల మహిమను క్లుప్తంగా రెండు పద్యాలలో చేస్తున్నాడు. ముందు అక్కడి వారకాంతల సౌందర్యాన్ని సీసాలోకెక్కిస్తున్నాడు!

మొలకచీఁకటి జలజల రాల్చఁగారాదె / నెరులు మించిన వీరి కురులయందు
కెరలించి యమృతంబు గిలకొట్టఁగా రాదె / ముద్దుచూపెడి వీరి మోవులందు
పచ్చిబంగారుకుప్పలు సేయఁగారాదె / గబ్బి మీరిన వీరి  గుబ్బలందు
పండువెన్నెలతేట బలియింపఁగారాదె / నగవుగుల్కెడు వీరి మొగములందు             (సీ)

నౌర!కరవాఁడిచూపుల యవఘళంబు
బాపురే! భూరికటితటి  భారమహిమ!
చాఁగు  మదమందగమనలక్షణములనఁగ
నేరుపుల మింతురప్పురి వారసతులు                                   (తే)  

వంకరలు తిరిగిన వారి కురులయందు నల్లని చీకటిని జలజలా రాల్చవచ్చు, వారి  కురులు విప్పితే రాలినపొడినే  చీకటి అంటారు! ముద్దైన వారి పెదవులయందు పెదవులుజేర్చి 'గిలకొడితే' అమృతం పుడుతుంది. అమృత ప్రవాహాలు వారి పెదవులలో. వారి మదించిన, ఘనమైన వక్షోజములను పచ్చిబంగారు కుప్పలు  జేయవచ్చు, బంగారు కుప్పల్లా ఉంటాయి వారి వక్షోజాలు. నవ్వులుచిలికే వారి ముఖములలో పండువెన్నెల పరీవాహాలు పోటెత్తుతూ ఉంటాయి. ఏమి  వాడి క్రీగంటిచూపుల ప్రసారం! ఏమి విశాలమైన జఘనసౌందర్యం! శహబాస్! ఏమి
మదించిన మందగమనం! అని పొగిడేట్లు నేర్పరితనంలో మించిపోతారు రతిక్రీడలో,   అక్కడి వారకాంతలు! చమత్కారంగా వారకాంతలను, 'వీరి' క్రీడలనూ కలిపి ధ్వనిగా రసప్రవాహం పారించాడు రామకృష్ణుడు.  వారికురులు విరజిమ్మిన చీకట్లలో, వారి పెదవులను గిలకొట్టి అమృతాన్ని పుట్టించే  రసికులుంటారు. మామూలు చుంబనం కాదు, ప్రౌఢలు, జాణలు నేర్పరులైన పురుషులు సాగించే క్రీడ కనుక ముద్దుల 'మథనం' జరిగి అమృతం పుడుతుంది, అక్కడ హాలాహలం ఉండదు, శృంగార కోలాహలమే తప్ప! పచ్చిబంగారు కుప్పల్లా, పసిడి దిబ్బలలా మెరిసి పోతూన్నఘన పీన పయోధరాలను చూసి మురిసిపోతూ ముచ్చటపడే రసికులుఉంటారు. వారి కిలకిలనవ్వుల తళతళ వెన్నెల ప్రవాహాలలో కొట్టుకుపోతూ, ఏమి పదునైన క్రీగంటి చూపులు, ఏమి జఘన వైశాల్యం, ఏమిమందమదగమన లక్షణాలు అని ఉబ్బితబ్బిబ్బై వీక్షణాలలో మునిగేవారిని క్షణాలలో  రంగంలోకి దించే మదనక్రీడలో నేర్పరులు అనడానికే నేర్పులలో మించిపోతారు అన్నాడు. క్రియా పాటవాన్నే నేర్పరితనము అంటారు గనుక!

మారుతాహతిరాలు నారికేళఫలాశి / నిడిపి జల్లించు పుండ్రేక్షు రసము
చిలుకపోటులచేతజిరిగిన సహకార /ఫలముల దొరగెడి పచ్చితేనె
చిక్రోడదంష్ట్రలు చెక్కు సుగంధి య / నంటిపండ్లను గారు నవ్యసుధయు
బాక వేగారంభపరిపాటి దమయంత / బగిలిన పనస క్రొంబండ్ల బేస                 (సీ)

మేకమై కాలువలు కట్టి యేక హేల
బరవ నందలి క్రియ్యూట పసిమితేట
బండునవ్వీట ముక్కారు బసిడిగారు
సరసధాన్యంబు మంచిరాజనపు జేలు                                (తే)

ఆ పట్టణమును ఆనుకుని పంటచేలు, కాలువలు ఉంటాయి. గట్లమీద పెద్ద పెద్ద  కొబ్బరి చెట్లు ఉంటాయి. మామిడి చెట్లు ఉంటాయి. చెరకు తోటలు ఉంటాయి. అరటి తోటలు ఉంటాయి. గట్లమీద పెరిగే కొబ్బరి చెట్లనుండి గాలికి రాలిన పెద్దపెద్ద కొబ్బరిబొండాలు క్రిందనున్న చెరకు గడలమీద పడుతాయి. ఆ దెబ్బకు చెరకు గడలు చీలి రసం ప్రవహిస్తుంది. మదరపండిన మామిడి పండ్లను చిలుకలు కొరుకుతాయి, దాంతో  మామిడి రసం ప్రవహిస్తుంది. ఉడతలుఅరటిపండ్ల చెక్కులను గీకి వలుస్తాయ్, దాంతో  అరటిపండ్ల రసం గుజ్జుగా పారుతుంది. పండి పండి తమంత తాముగా పగిలిన పనసపండ్ల  గుజ్జు ప్రవహిస్తుంది. ఈ మధుర ప్రవాహాలన్నీ ఒక్కటై ప్రవహించి, ఆ పంటచేలను సారవంతములుచేసి పుణ్యం కట్టుకోవడంతో ఆ ఊరి పంటచేలు ముక్కారు పంటలు పండించి, బంగారంవంటి ధాన్యాన్ని యిస్తాయి!

తెలతెలవార నొయ్యనరుదెంచి నిశాంత రతాంతతాంతలౌ
చెలువలకింపుగా మెలగి చెక్కులగూరిన చూర్ణకుంతలా
వళి సరళంబుగా జడిసి వాడినసెజ్జలమీది ప్రావిరుల్
దొలగ బ్రభాతవాయువులు దోచు బురిం బరిచారికాకృతిన్                        (చ)

తమ 'నేర్పరితనాన్ని'చూపి రాత్రి అంతా రతిక్రీడలో అలిసిపోయిన సుందరీమణులకు హాయి కలిగేట్లు, తెలతెలవారుతుండగా ప్రభాత వాయువులు వీస్తాయి. వారి చెక్కిళ్ళమీదికి జారిననొక్కుల నొక్కుల ముంగురులను సున్నితంగా పైకి తోస్తాయి, 'ఎంత  శ్రమపడ్డారే  పిచ్చితల్లులూ' అని లాలిస్తున్నట్లు. పడకలమీద నలిగి వడలిపోయిన'పాతపూలను' క్రిందికి త్రోసేస్తాయి, ఊడ్చినట్లు. పాతపూలను తోసేస్తాయి అని అంటున్నాడు చమత్కార  బ్రహ్మ, రామకృష్ణుడు, అంటే 'కొత్తపూలు' మళ్ళీ వస్తాయి అని ధ్వని, వారకాంతలు అని  ముందే అన్నాడు కనుక! యిలా ప్రభాత పవనాలు పరిచారికలలా సేవజేస్తాయి ఆ సుందరీమణులకు. యిటువంటి బహువిధ ప్రసిద్ధమైన వారణాసి (కాశి) పట్టణంలో తన  యిల్లాలితో కాపురం ఉన్న అగస్త్యుని కథతో ప్రథాన కథలో అసలైన కథను ముందుముందు  మొదలుబెట్టబోతున్నాడు.

(కొనసాగింపు వచ్చేవారం)

మరిన్ని శీర్షికలు
weekly horoscope 17th june to 23rd  june