Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

నానితో ఇంటర్వ్యూ

interview with nani
హీరో అవ్వ‌క‌పోతే... థియేట‌ర్ ద‌గ్గ‌ర టికెట్లు అమ్మేవాడ్ని - నాని

పేరు.. నాని. 
కానీ.. తీరు - సునామి.
చిన్న హీరో... అనుకొని లైట్ తీసుకోవ‌డానికి వీల్లేదు. భలే భ‌లే మ‌గాడివోయ్ లాంటి సినిమా వ‌దిలి - క‌ళ్లు బైర్లు క‌మ్మేలా చేయ‌గ‌ల‌డు. ప్ర‌యోగాత్మ‌కంలా అనిపించే క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయ‌డంలో నాని దిట్ట‌. అందుకే అత‌ని సినిమాలు కొత్త‌గా ఉంటాయి.. దాంతో పాటు కాసులూ రాల్తాయి. ల‌వ్ స్టోరీలు, కామెడీ క‌థ‌లు అన్నీ చేసేసిన నాని.. ఈసారి థ్రిల్ల‌ర్ క‌థ‌ని ఎంచుకొన్నాడు. అదే జెంటిల్ మెన్. ఈ సినిమాలో హీరో త‌నే.. విల‌న్ కూడా త‌నే. మ‌రి.. ఈ సినిమా గురించి నాని ఏమంటాడు?  అవ‌న్నీ ఓ చిన్న చిట్ చాట్ తో తెలుసుకొందాం.

* హాయ్ నాని..
- హాయ్‌..

* ఇంత‌కీ మీరు హీరోనా, విల‌నా?
- అది సినిమా  చూస్తే తెలుస్తుంది.  ఇప్పుడే చెప్పేస్తే అంత కిక్ ఉండ‌దు.

* జెంటిల్‌మెన్ అనే ప‌దానికి మీరిచ్చే అర్థం ఏంటి?
- బ‌య‌ట‌కు క‌నిపించేది కాదు... లోప‌ల గుణాన్ని బ‌ట్టి జ‌డ్జ్ చేయాల్సిన బిరుదు అది.

* రియ‌ల్ లైఫ్‌లో నాని ఎలాంటోడు..
- న‌న్న‌డిగితే మంచోడ‌నే చెప్తా క‌దా?  నిజానికి నేను మంచోడ్ని. ఎవ‌రినీ ప‌ల్లెత్తు మాట అన‌ను. ఒక వేళ అన్నా.. నేనే లోలోప‌ల బాధ‌ప‌డ‌తా. ఆ వెంట‌నే సారీ చెబుతా.  నా జీవితంలో ఇప్ప‌టి వ‌ర‌కూ విల‌న్ గా ప్ర‌వ‌ర్తించిన సంద‌ర్భం లేదు. 

* ఇంత‌కీ ఈ సినిమాకి ఈ పేరే ఎందుకు పెట్టాల‌నుకొన్న‌ట్టు..
- ఇదో గ‌మ్మ‌త్తైన క‌థ‌. టైటిల్‌లో క‌థేంటో తెలియ‌కూడ‌దు. అలాగ‌ని ఎవేగానీ ఉండ‌కూడ‌దు. అలాంటి టైటిల్ కోసం చాలా అన్వేషించాం. చివ‌రికి అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌... ఈసినిమాకి జెంటిల్‌మెన్ అనే టైటిల్ ఎందుకు పెట్ట‌కూడ‌దు? అన్నాడు. చివ‌రికి అదే పెట్టేశాం.

* మీరూ ఇంద్ర‌గంటి క‌లిస్తే.. ల‌వ్ కామెడీ ఆశిస్తామో...
- అవును.. అలాంటి సినిమానే ఆశిస్తార‌ని తెలుసు. మ‌ళ్లీ మేం క‌లిసి అష్టా చ‌మ్మాలాంటి సినిమా తీస్తే కిక్ ఏముంటుంది?  అందుకే జోన‌ర్ మార్చాం..

* ఇదేదో ఆబ్లికేష‌న్ మీద చేస్తున్న మూవీ అని జ‌నం మాట్లాడుకొంటున్నారు..
- నిజ‌మే... అది నా వ‌ర‌కూ వ‌చ్చింది. అయితే నేను ఆబ్లికేష‌న్‌పై చేసినా, ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ‌గారు ఆబ్లికేష‌న్ మీద సినిమాలు తీయ‌రు. ఇది నానికి బాగా సూట‌వుతుంది.. అనుకొన్న క‌థే నాకు చెప్తారు. నిజంగా ఇలాంటి క‌థ చేయ‌డం నా అదృష్టం.

* వ‌రుస‌గా మూడు హిట్లిచ్చారు... ఈ ద‌శ‌లో జెంటిల్‌మెన్ లాంటి సినిమా అవ‌స‌రమా.. అనే ప్ర‌శ్న ఎప్పుడైనా ఎదురైందా? 
- నాకు ఎద‌ర‌వ్వ‌లేదు. కానీ నా శ్రేయోభిలాషులు కొంత‌మంది `ఇప్పుడు నువ్వు మ‌రో స్టెప్ ఎక్కే సినిమాలు తీయాలి.. అలాంట‌ప్పుడు ఇలాంటి క‌థ‌లెందుకు` అన్నారు. కానీ న‌న్ను ఓ మెట్టు ఎక్కించే సినిమా ఇదే అవుతుంద‌ని నా న‌మ్మ‌కం. ఈసినిమా చూశాక వాళ్లూ ఇదే మాట అంటారు.

* అంత న‌మ్మ‌కం ఎవ‌రిపై?
- ఈ క‌థపై. నా పాత్ర‌పై. నిజంగా ఇప్ప‌టి వ‌ర‌కూ నేను పోషించిన పాత్ర‌ల్లో.. అతి క్లిష్ట‌మైన‌ది ఇదే. మ‌న తెలుగు సినిమాల్లో బ్లాక్ అండ్ వైట్‌... ఇలా రెండు ర‌కాల పాత్ర‌లే ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. గ్రే షేడ్స్ లో ఉండే పాత్ర‌లు దొర‌క‌డం అరుదు. ఆ అవ‌కాశం ఈ సినిమాతో ద‌క్కింది. ఈ సినిమా ఫ‌లితం ఎలాగున్నా స‌రే.. న‌టుడిగా నా ప్ర‌యాణంలో ఇదే నా బెస్ట్ సినిమా అవుతుంది.

*  వ‌రుస‌గా మూడు హిట్లు కొట్టారు.. క‌థల విష‌యంలో ఇంకా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారా?
- ఇప్పుడేదో హ్యాట్రిక్ కొట్టాను క‌దా అని జాగ్ర‌త్త ప‌డిపోవ‌డం కాదు.. క‌థ విష‌యంలో నేనెప్పుడూ జాగ్ర‌త్త‌గానే ఉంటా. పెద్ద ద‌ర్శ‌కుడు.. పెద్ద నిర్మాత‌, భారీ రెమ్యున‌రేష‌న్‌... ఇవ‌న్నీ చూసి టైమ్ట్ అయిపోను. అలాంట‌ప్పుడు కూడా మంచి క‌థ వ‌స్తే.. ఇవేం ఆలోచించ‌కుండా సినిమా ఒప్పుకొంటా.

* మ‌రి మ‌ధ్య‌లో పైసా, ఆహా క‌ల్యాణం లాంటి క‌థ‌లెందుకు ఒప్పుకొన్న‌ట్టు..
- ఆ క‌థ‌లంటే నాకు ఇప్ప‌టికీ ఇష్ట‌మే. పొర‌పాటు చేశాన‌ని ఇప్ప‌టికీ అనుకోవ‌డం లేదు. కొన్ని కథ‌లు వ‌ర్క‌వుట్ కావంతే. దానికి కార‌ణాలు వెత‌క్కూడ‌దు.

* మూడు హిట్ల త‌ర‌వాత పారితోషికం పెంచ‌లేదా?
- నేనెప్పుడూ నాకింత కావాల‌ని అడ‌గ‌లేదు. నా కెరీర్ గ్రాఫ్‌ని చూసి ప్రొడ్యూస‌ర్ ఓ అంకెకి ఫిక్స‌య్యే నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు. నేనూ.. ఇంకా ఎక్కువ అడ‌గ‌ను.

* కెరీర్‌లో ఇప్పుడు ఎలాంటి జోన్‌లో ఉన్న‌ట్టు?
- సేఫ్ జోన‌నే అనుకొంటున్నా. ఎందుకంటే ఇది వ‌ర‌కు న‌న్ను హీరోగా అంగీక‌రిస్తారా, లేదా? అనే కంగారు ఉండేది. ఇప్పుడు జ‌నం నేను హీరోగా ఒప్పుకొంటున్నారు.. అంటే సేఫే.

* ఒక‌వేళ హీరో కాక‌పోయి ఉంటే..
- థియేట‌ర్ల‌ద‌గ్గ‌ర టికెట్లు అమ్మేవాడ్నేమో.. ఎందుకంటే నాకు సినిమా అంటే అంతిష్టం.

* మ‌ల్టీస్టార‌ర్ కు సిద్ద‌మే..
- రెడీనే. కాక‌పోతే హీరోలంతా నా పాత్ర‌కు ఎంత స్పేస్‌?  అనేది ఆలోచించ‌కుండా సినిమాల్ని ఒప్పుకోవాలి. అప్పుడే మంచి క‌థ‌లొస్తాయి.

* ఒప్పుకొన్న సినిమాలేంటి?
- విరించి వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నా. దిల్‌రాజుగారి సినిమా ఒక‌టి చేయాలి. భ‌వ్య ఆర్ట్స్ లో ఓ సినిమా ఒప్పుకొన్నా.

* ఓకే.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ..   

-కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
NTR janata garage ready for release