Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే.... http://www.gotelugu.com/issue166/474/telugu-serials/atulitabandham/atulitabandham/

 

రోజులు గడచిపోతున్నాయి. మధు ఇంట్లోని పనులూ, ఆఫీసులోని పనులూ ఈ రెంటికీ సమన్వయము చేసుకోవటం అలవాటు చేసుకుంది. కానీ ఇంట్లో వాతావరణం చాలా తరచుగా పాడవుతోంది.  కొత్తలో ఉన్న తీయదనం తగ్గిపోయి వేణుకు తనకూ మధ్య బంధం యాంత్రికత లోకి దిగిపోతున్నట్టు అనిపిస్తోంది మధుబాలకు. 

నూటికి తొంభై శాతం మగవాళ్ళలాగానే అతనూ ఇంటిపని ఒక్కటి కూడా చేయడు. బహుశ: ఉమ్మడికుటుంబంలో ఉండటం వలన కూడా కావచ్చు... వంటపనిలో, ఇంటిపనిలో మధుబాల ఎంతగా అత్తగారికి సహాయం చేస్తున్నా, వినత వచ్చిందంటే మాత్రం అందరి మూడ్సూ ఆమెకి అనుగుణంగా మారిపోతాయి. అప్పటివరకూ సయోధ్యగా ఉన్న అత్తగారు కూడా  వినతకు ప్రాధ్యాన్యం ఇచ్చి, తనను అంతగా పట్టించుకోదన్న భావన ఒకటి రెండు సార్లు గమనించిన మీదట మధుబాలను బాధించసాగింది.  

నిజానికి సుగుణమ్మ మంచిదే... మధును కన్న కూతురిలాగానే చూసుకుంటుంది. కానీ కన్నకూతురు కాబట్టి వినత మాటలకే ప్రాధాన్యత... తానున్నంత సేపూ మధు గురించి కామెంట్ చేస్తూనే ఉంటుంది వినత. మొదట్లో వినతను ఖండించి మందలించే కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆమెతో కలసి మధును ఆట పట్టిస్తున్నట్టు నవ్వుతున్నారు. మామగారున్నప్పుడు మాత్రమే, ఆయనంటే ఉన్న భయభక్తుల వలన... వినత  తనతో  సామరస్యంగా ఉంటుంది అని గమనించింది మధుబాల.  ఒక్కోసారి నవ్వుతూనే మధుబాల కూడా వినతకు సరియైన సమాధానం ఇస్తూ ఉంటుంది. ఒక్కోసారి గొడవ ఎందుకని నిస్సహాయంగా ఊరుకుంటుంది.

ఇది ఇలా ఉండగా తన కొలీగ్స్ అంతా చేరుతూ ఉంటే, హై టెక్ సిటీ లోని ఒక అపార్ట్మెంట్ వెంచర్ లో జాయిన్ అయ్యాడు వేణుగోపాల్. తన దగ్గరున్న డబ్బంతా అటువైపు తరలించాడు. ఇంకాస్త డబ్బు కావలసి వచ్చినపుడు బ్యాంకు కు వెళ్ళి చూస్తే, ఐదు లక్షలు ఉండాల్సిన  తమ జాయింట్ ఎకౌంటు లో  కేవలం యాభై వేలు మాత్రమే ఉన్నాయని తెలిసి ఆగ్రహోదగ్రుడయ్యాడు.  

మధుబాల ఆఫీసునుంచి వచ్చాక, భోజనాలై గదిలోకి రాగానే గొడవ మొదలయింది. 

“ఎవరినడిగి తీసుకున్నావు అంత డబ్బు? కనీసం నాకు మాట మాత్రంగానైనా చెప్పాల్సిన అవసరం లేదా?” తీవ్రంగా ప్రశ్నించాడు భార్యను.
అయోమయంగా చూసింది మధుబాల. 

“అప్పట్లో మా నాన్నగారి వైద్యం కోసం కొన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. మా పొలం తనఖా పెట్టాడు మా అన్నయ్య. అది విడిపించటం కోసం నేను సాయం చేస్తానని అన్నాను. అందుకే అన్నయ్యకి ఆ డబ్బు పంపించాను. నేను పెళ్ళికి ముందే చెప్పాను కదండీ, మా వాళ్లకు చేదోడు వాదోడు గా ఉండాల్సి వస్తుంది అని...మొన్న నేను అన్నయ్యకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మీతో చెప్పాను. మీరు న్యూస్ పేపర్ చదువుతూ అంతగా పట్టించుకోలేదు.  అదీ గాక... మన అకౌంట్ లోని డబ్బు అంతా నా జీతం లో సేవ్ చేసినదే కదా...”
“అంటే? నీ జీతమైతే మాత్రం నువ్వు ఖర్చు పెట్టేసుకోవచ్చా? నాకో మాట మాత్రం చెప్పాల్సిన అవసరం లేదా?”

“అరె ఖర్చు పెట్టుకోలేదు మహానుభావా... మా అన్నకు అవసరానికి ఇచ్చాను... నేను వద్దన్నా రెండు సంవత్సరాలలో తిరిగి ఇస్తాడు వాడు. పైగా మీకు మాట చెప్పలేదని అనటం అన్యాయం... మీరు వినకపోతే నేనేం చేయను? మీకు పేపర్ సఖియ కళ్ళముందు  ఉంటే చాలు ఇంకెవరూ అక్కరలేదు, ఏ మాటా వినిపించదూ... నేనేం చేయను?” కొంచెం విసురుగానే జవాబు చెప్పింది మధుబాల.

“నాకేం తెలుసు నువ్వు మీ అన్నకే ఇచ్చావో, నీ స్నేహితురాలికే ఇచ్చావో?” పదునుగా వస్తున్నాయి వేణు మాటలు.

“అంటే? ఐశ్వర్యకి ఇచ్చాననా? దానికి అంత ఖర్మమేమీ పట్టలేదు... వాళ్ళమ్మా నాన్నలకి దానికి వైద్యం చేయించే తాహతు ఉంది లెండి...అప్పుడు ఎమర్జెన్సి వలన హాస్పిటల్లో నేను డబ్బు కట్టినా, పది రోజుల్లోనే వాళ్ళ నాన్నగారు పంపించేసారుగా....  నేను అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు... అయినా ఎందుకు మీకిప్పుడు డబ్బు?”

“నీకు చెప్పాలా?” చిరాగ్గా అడిగాడు.

“చెప్పాలి... నేను మీకు చెప్పలేదనే కదా ఇప్పుడు మీరు చిందులు వేసేది?”

“అర్జెంట్ గా నేను బిల్డర్ కి డబ్బు కట్టాలి...” బింకంగా చెప్పాడు వేణు.

“బిల్డర్ ఏమిటి?” అయోమయంగా చూసింది మధు.

“అదే... హైటెక్ సిటీలో ఫ్లాట్ తీసుకుంటున్నాను. ఇన్ కమ్ టాక్స్ బాధలు పడలేక... మనమిక్కడే ఉన్నా, అది రెంట్ కి ఇస్తే నెలకి పదిహేను ఇరవై వేలు ఆదాయం  గారంటీ... ఇప్పుడు అతనికి ఇవ్వాల్సిన  డబ్బు తక్కువ పడింది... నువ్వేమో నాకు చెప్పకుండా సొంత పెత్తనాలు చేసేస్తావు...”

“శభాష్... కొత్త ఇల్లు కొంటూ భార్యకి చెప్పకపోవటంలో తప్పేమీ లేదు... నేను కష్టపడి సంపాదించిన డబ్బు మా అన్నకి చేబదులుగా  ఇస్తే అది అపరాధం... ఏమి న్యాయమో ఇది...” ఉక్రోషంగా అన్న మధుబాల కళ్ళల్లో నీళ్ళు నిండాయి. గబుక్కున కొంగుతో తుడుచుకుంటూ తల తిప్పుకుంది...

“చేసిందంతా చేసి సిగ్గు లేకుండా ఏడుపు ఒకటి!” కోపంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు వేణుగోపాల్ చాలా మంది భర్తల్లానే. 
భర్త మాటకు సమాధానం ఇవ్వకుండా అప్పటికే రాత్రి పది దాటటంతో మౌనంగా పడుకుంది మధుబాల. 

***

మర్నాడు ఆఫీసు నుంచి రాగానే భర్తను నిలదీసింది మధుబాల.

“మా అన్నయ్యకు ఫోన్ చేసారా?”

“ఊ.. అదీ...” తడబడ్డాడు వేణుగోపాల్.

“అంటే నేను మీకు అబద్ధం చెప్పాననా? నిర్ధారణ చేసుకోవటానికి మా అన్నయ్యకు ఫోన్ చేసారా? పైగా డబ్బు తిరిగి ఎప్పుడు ఇస్తారని అడిగారట... ఇచ్చి ఇంకా వారమైనా కాలేదు...”దుఃఖం అడ్డుపడగా మధుబాల గొంతు పూడుకుపోయింది.

వేణు ఏమీ మాట్లాడలేదు.

“వాడు పొలం అమ్మేసి డబ్బిచ్చేస్తానని అంటున్నాడు. ఉన్న రెండెకరాలు అమ్మేస్తే వాడికి వచ్చే జీతంతో గడవటం కష్టం... నాన్నకి సరిగ్గా జీతం రావటం లేదు... పైగా రిటైర్ మెంట్ దగ్గర పడింది... మీరెందుకు అర్థం చేసుకోరు?”

“ఏం బాధ్యతంతా నీ ఒక్కదానికేనా? మీ అక్కలూ ఉన్నారు కదా?”

“మా అక్కలు నా అంత చదువుకోలేదు... ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించేంత సామర్థ్యం వాళ్లకి లేదు. పిల్లలతో, భర్తలతో వాళ్ళ బాధలు వాళ్లకి ఉన్నాయి. మొదటినుంచీ కుటుంబ బాధ్యతలు నేనే పంచుకున్నాను. మా నాన్న నన్ను మొగపిల్లాడిలా చదివించారు. ఈరోజు ఇలా ఉన్నానంటే అది ఆయన చలవే. అలాంటప్పుడు వాళ్ళ కష్టాలు పంచుకోవటంలో తప్పు ఏముంది?”

“మధూ.. నన్ను విసిగించకు... ఆడపిల్ల ఓ సారి పెళ్లి అయ్యాక అత్తింటి వారినే చూసుకోవాలి కానీ పుట్టింటి వాళ్ళంటూ ప్రాకులాడకూడదు...”

“అవును... మీ వినతలా అస్తమానూ పుట్టింటికి వచ్చి కానుకలు తీసుకుపోవాలి. మొన్న నేను కొత్త మిక్సీ కొనుక్కు వస్తే ఆవిడ మోజు పడిందని నన్ను ఒక్క మాటైనా అడక్కుండా తనకి ఇచ్చేసారు...”

“పుట్టింట్లో ఆడపిల్లకి ఆ హక్కు ఉంటుంది మధూ... నిన్నే చూస్తున్నాను మరీ ఇంత వ్యతిరేకంగా... పెళ్లి అయ్యాక మీ అన్న ఏం పెట్టాడు నీకు?”

“నేను వినతను కాను... అస్తమానూ పుట్టింటికి పరుగుతీసి వస్తువులన్నీ తెచ్చేసుకోవటానికి... పుట్టింటిలో హక్కే కాదు, బాధ్యత కూడా ఉండాలి ఆడపిల్లకి... ఏది ఏమైనా మీరు అన్నయ్యను అడగటం నాకు నచ్చలేదు...”

“నీకు నచ్చే పనులు మాత్రమే చేయలేను నేను... నా అవసరాలు నాకుంటాయి... అప్పుగా తీసుకున్నప్పుడు ఎప్పుడు తిరిగిస్తారని అడిగితే  తప్పు ఏమిటి?”

“అవతలి వాళ్ళు బాధ పడతారని మీరు క్షణమైనా ఆలోచించరా? పైగా నాకు తెలియకుండా మీరు అడిగారు అన్నయ్యను... రెండేళ్ళ తర్వాతే ఇస్తాడు... మరోసారి మీరు అన్నయ్యకు ఫోన్ చేయకండి...” ఖరాఖండీ గా చెప్పింది మధుబాల.

***

ఐశ్వర్య తిరిగి వచ్చి కొత్త ఉద్యోగంలో జాయిన్ అయింది. ప్రస్తుతానికి కార్తీక్ తో ఎలాంటి సమాచారమూ లేదు. ఆమె మనసు చాలా గాయపడింది. తల్లికావాలని తపించినంత సేపు కాలేదు... దురదృష్టం అంటే తనదే... చిక్కిపోయి, పాలిపోయిన ఐశ్వర్యను చూసి అన్నపూర్ణ మనసు నీరైపోయింది. ఐశ్వర్యను చేతుల్లోకి తీసుకుని, గాఢంగా గుండెకు హత్తుకుని తలపై ముద్దు పెట్టుకుంది.

“పిన్నీ... అంతా అయిపోయింది... నేను నమ్మిన సిద్ధాంతాలు అన్నీ మట్టిలో కొట్టుకుపోయాయి. ప్రేమంటే ఇలా క్షణంలో ఆవిరి అయిపోయే తేలికైన విషయమని నేను అనుకోలేదు పిన్నీ... కార్తీక్ నేను అక్కరలేదని వెళ్ళిపోయాడు... నా కడుపులోకి వచ్చిన బుజ్జి బాబు కూడా నేను వద్దని వెళ్ళిపోయాడు... నేను ఒంటరినైపోయాను పిన్నీ...” భోరుమని ఏడ్చింది ఐశ్వర్య.

తన కన్నతల్లి దగ్గరకూడా మనసు పరువలేని ఐశ్వర్య పిన్ని గారి దగ్గర మనసు తేలిక పడేలా ఏడ్చింది.

“అవునమ్మా, అప్పుడు మేము లేకపోవటంతో నీకు చాలా కష్టం, ఇబ్బంది వచ్చాయి...” తానూ కనులు తుడుచుకుంటూ అంది అన్నపూర్ణ.

“అమ్మా, ఐశూ, చిన్నపిల్లవి కావు కదమ్మా... చక్కగా చదువుకొని ఉద్యోగం చేస్తున్నావు... విజ్ఞతతో వ్యవహరించాలి. అయిందేదో అయిపోయింది. గతమొక కల అనుకుని మరచిపోయి, కొత్త జీవితం ప్రారంభించు తల్లీ...” అనునయంగా చెప్పాడు విశ్వనాథం.

“అంత కన్నా చేసేది కూడా ఏమీ లేదు కదా బాబాయ్, అలాగే చేస్తాను...” పేలవంగా నవ్వింది ఐశ్వర్య.

“తల్లీ, నువ్వు కోలుకునే వరకూ బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ ఇక్కడ చేసేయ్ అమ్మా, లంచ్ ఎలాగూ కాంటీన్ లోనే తింటావు కదా...” ఆప్యాయంగా అన్నది అన్నపూర్ణ.

“వద్దు పిన్నీ. వంట పని కూడా లేకపోతే నాకు పిచ్చి ఎక్కుతుంది... నేనే చేసుకుంటాను...”మృదువుగా తిరస్కరించింది ఐశ్వర్య. 
ఏమీ అనలేక ఊరుకున్నారు విశ్వనాథం దంపతులు. కానీ ప్రతీరోజూ ఐశ్వర్య దగ్గరకు వెళ్ళి ఎలా ఉన్నదో, తిన్నదో లేదో విచారించటం మానలేదు అన్నపూర్ణ.

***

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagaloka yagam