Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atulitabandham

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోక యాగం

గతసంచికలో ఏం జరిగిందంటే .... http://www.gotelugu.com/issue166/472/telugu-serials/nagaloka-yagam/nagaloka-yagam/

 

తూర్పున బాల భానుడు తొంగి చూసే సమయానికి అశ్వాలు గరుడ, ఢాకినీలు వింధ్యా సానువుల్లోని మహా పథంలో ఉత్తరంగా చాలా దూరం వచ్చేసాయి. మరో యోజన దూరం ముందుకు పోతే వింధ్య పర్వతాలు దాటి హైహియ రాజ్య భూభాగంలో ప్రవేశిస్తాయి.

వేకువనే లేవగానే ముఖాలు కడుక్కుని మండపం నుండి బయలు దేరునపుడు భూతం ఘృతాచి విషయం వచ్చింది. భద్రా దేవి భూతాన్ని పిలిచి అడిగింది` ‘‘ఏమి! నీవు యిచటనే వుందువా? మాతో వత్తువా?’’ అని.

‘‘నేనిప్పుడు నీ యాజ్ఞా బద్ధు రాలిని తల్లీ. నేను మీ తోనే వత్తును. మీ ఆనతి నెర వేర్తును. కాని... నాకు రుధిరము.. మానవ రుధిరము కావలె.’’ అంది వినయంగా భూతం.

‘‘మాతో వచ్చిన నీకు కడుపార మానవ రుధిరము లభించదు. కాని అతి త్వరలోనే ఒక మహా సంగ్రామము ఘటిల్లనున్నది. ఆ సంగ్రామమందు నరుక్కు చచ్చే వీరుల రుధిరముతో నీకు గొప్ప విందు భోజనమే లభించ గలదు. అంత దనుక నీవు మృగముల రుధిరము త్రాగి మాతో ఉండ గలిగితే నా అభ్యంతరము లేదు. నీవును మాతో రావచ్చును’’ అంటూ సూచించింది భద్రా దేవి.

‘‘అటులనే తల్లీ. మీకు సాయ పడినటుల నుండు, అటులనే మహా సంగ్రామమున నా రుధిర దాహమును తీర గలదు. నేనును మీ వెంట వత్తును.’’ అంది భూతం.

ఆ భూతం తెచ్చిన చక్కటి ఫలములను ఆరగించి అశ్వాలనధిరోహించారు ధనుంజయ, భద్రాదేవిలు. భూతం ఘృతాచి అదృశ్య రూపాన మచ్చల గుర్రం మీది తోలు సంచిలో విశ్రాంతిగా పడుకుంది. అశ్వాలు గుట్ట దిగి పరుగు ఆరంభించాయి.

ఆ విధంగా సూర్యోదయ పూర్వమే ప్రయాణంలో వున్న ధనుంజయ భద్రాదేమలు సూర్యుడు తొంగి చూసే సమయానికి చాలా దూరం వింధ్య పర్వతాలను దాటేసారు. ఈ లోపల అటు నుంచి వస్తున్న వర్తకుల గుంపు ఒకటి ఎదురైంది. బాట సారులు కొందరు ఏవో శవాల గురించి ఆశ్చర్యంగా చర్చించు కొంటూ పోతూండటం కూడ విన్పించింది. ఆ శవాలు ఏమిటో ఎక్కడున్నాయో కూడ వివరాలు తెలీదు.

దిన కరుని అరుణ కిరణాల కాంతి వింధ్యాటవి అంతటా పరుచుకుంది. పక్షుల కిలకిలా రావాలు మృగాల అరుపులతో అడవంతా సందడిగా వుంది. పర్వత సానువులో ఎక్కడి నుంచో ఏనుగు ఫీుంకార రావం విన వస్తోంది. శీతల గాలులు ఆహ్లాద కరంగా వీస్తున్నాయి.

క్రమంగా`

వింధ్య సానువు చివరి పర్వత పంక్తిని కూడ దాటుతున్నాయి అశ్వాలు. అలా దాటు తూండగా ఎగువన కొంత దూరంలో బాట సారుల గుంపు ఒకటి ముక్కు మూసుకుని ఎడమ ప్రక్కగ చెట్టు కిందకు భయం భయంగా చూస్తూ బెదరి వడి వడిగా పరుగు తీసి వస్తూండటం చూసి ధనుంజయ భద్రా దేమలు ఆశ్చర్య పోయారు.

అంతకు ముందే ఎగువన వస్తూండగా శవాల గురించి విని వున్నారు గాబట్టి బాహుశ ఆ చెట్టు కిందే శవాలు     ఉండొచ్చని వూహించారు. ఆ వృక్షాన్ని సమీపించగానే అశ్వాలను నెమ్మదించారు. ఒకటి కాదు రెండు కాదు`

ఆరుగురు వ్యక్తుల శవాలు అక్కడ అడ్డ దిడ్డంగా పడి ఉబ్బి వున్నాయి. అక్కడ ఎలాంటి యుద్ధం గాని పోరాటం గాని జరిగిన గుర్తులు లేవు. వారి ఆయుధాలు ఒరల్లోనే వున్నాయి. శవాల వంటి మీద చిన్న గాయం కూడ కన్పించటం లేదు. కాని కాలి పోయినట్టు శవాన్నీ నల్లగా మాడి పోయి వున్నాయి. ఆశ్చర్య కరమగు విషయం ఏమంటే` అటవీ ప్రాంతం గాబట్టి శవం దొరికితే చాలు మృగాలు, పక్షులు పీక్కు తీనేస్తాయి. అలాంటిది ఒక్క ప్రాణి కూడ శవాలను ముట్టక పోవటం విస్మయం గొలుపుతోంది. ఇదే విషయం భద్రా దేవిని అడిగినపుడు ఆమె చెప్పిన సమాధానం ధనుంజయుని విస్మయానికి గురి చేసింది.

‘‘సందేహం లేదు ప్రభూ! వీరందరూ పాము కాటుతో మరణించారు. ఒకటి కాదు రెండు కాదు, అనేక విషనాగులు మూకుమ్మడిగా వీళ్ళ మీద దాడి చేసి వుండాలి. మృత దేహాలు భయంకర విష తుల్యం అయి పోయాయి. అందుకే పక్షులు గాని మృగాలు గాని శవాల జోలికి పోలేదు.’’ అంది.

తన మచ్చల గుర్రం దిగింది భద్రా దేవి. తనూ అశ్వం దిగాడు ధనుంజయుడు. శవాలు కుళ్ళటం మొదలై దుర్వాసన ఆరంభమైంది. బహుశ రెండు లేదా మూడు రోజుల క్రిందట వీళ్ళంతా మరణించి వుండాలనుకుంది భద్రా దేవి.

ముక్కుకు గుడ్డ చుట్టు కొని దుర్వాసన తగలకుండా గాలి వాటుకు ఎగువన నిల బడి శవాల్ని పరిశీలించారు. లెక్క పెట్టి నట్టు ఆరుగురు వున్నారు వాళ్ళు. భద్రా దేవి తీవ్రంగా ఆలోచిస్తోంది. సహ్యాద్రి మీద దాడి చేసింది ఆరుగురు, మాళవ సరి హద్దు వద్ద కాపు వేసి భల్లాతకుడికి చిక్కిన వాళ్ళు ఆరుగురు. ఇప్పుడిక్కడ చచ్చి పడున్న వాళ్ళు ఆరుగురు. వీళ్ళు మూడో బృందం కాదు గదా!

భద్రా దేవి ఒక పొడవాటి కొయ్య ముక్కను అందుకొని శవాలకు మరింత దగ్గరగా వెళ్ళింది. కొయ్యతో లేపి వాళ్ళ చేతి మణి కట్టును పరిశీలించింది. శవాలు నల్లగా మాడి పోయినా మణి కట్టు మీది రెక్కలు విప్పిన డేగ గుర్తును గమనించగానే భద్రా దేవి సందేహం తీరి పోయింది. ధనుంజయుడు కూడ చూసాడు. ఆనుమానంతో చుట్టూ చూసింది భద్రా దేవి. బాటసాయి ఎవరో మేతలేక ఛస్తాయని జాలి పడి హతుల తాలూకు అశ్వాల బంధనాలు త్రెంచినట్టున్నారు. అవి సమీపం లోనే తిరుగాడుతూ పచ్చిక మేస్తున్నాయి. అవి రత్నగిరి రాజ చిహ్నం కలిగి వున్నందున వాటిని తీసుకు పోవటానికి భయ పడి వుంటారు. అదియును గాక ఆ ప్రదేశం సర్ప భూమి గావచ్చునన్న భయంతో వేగిరం ముందుకు సాగి పోయి వుంటారు.

హతులంతా ఉప సైన్యాధక్షుడు బాహ్లీకుని సొంత గూఢచార విభాగానికి చెందిన వారు. సందేహమే లేదు. వీళ్ళు వింధ్యాటవిలో ఎక్కడో ధనుంజయుని కోసం కాపు వేసి వుంటారని ముందుగా వూహించిందే. అయినప్పటికీ వాళ్ళు ఇక్కడే ఎదురు చూస్తుండటం విష సర్పాలు దాడి చేసి వీళ్ళని హత మార్చటం అర్థం గాకుండా వుంది. అవి ఎందుకీ పని చేసాయి? ఏమి జరిగి వుంటుందని ఆలోచిస్తున్న భద్రా దేవి పెదవుల మీద ఉన్నట్టుండి నెల వంకలా మెరిసింది ఒక చిరు నవ్వు.

‘‘ఏమైనది భద్రా! ఆ దరహాసమేటికి? వీరంతా బాహ్లీకుని మనుషుని అర్థమైనది గాని వీళ్ళ మరణము కడు విచిత్రముగ నున్నది.’’ అనడిగాడు ధనుంజయుడు.

భద్రా దేవి ముసి ముసిగా నవ్వింది.

‘‘ఇందులో విచిత్రమేమియు లేదులే ప్రభూ!’’ అంటూ తన అశ్వం వైపు దారి తీసింది.

‘‘ఇది విచిత్రము కాదందువా?’’ ఆమెను అనుసరిస్తూ అడిగాడు.

‘‘కాదంటిని గదా. మీకు కావలసిన వారే మీ మేలు కోరి మీ శత్రువును హత మార్చి వుందురు.’’

‘‘ఏమి ఈ వింత! ఇచట నాకు కావలసిన వారు ఎవరున్నారని?’’

‘‘ఉండియే వుంటారు. తిన బోతూ రుచి అడుగనేల? బయలు దేరండి.’’ అంటూ తన మచ్చల గుర్రాన్ని అధిరోహించి కళ్ళాలు అందుకుంది భద్రా దేవి.

ధనుంజయుడు తన శ్వేతాశ్వం గరుడ నధిరోహించి కళ్ళాలు అందుకుని అశ్వాన్ని అదిలించాడు. ఎంత యోచించినా భద్రా దేవి మాటలు అతనికి అర్థం కావటం లేదు. ఈ లోప సుమారు పది దినాలుగా ఎవరి కోసమైతే అచట బాట పక్కన పూ పొదలో ఎదురు చూస్తున్నారో ఆ ధనుంజయుని దూరంగా వుండగానే గుర్తించారు నాగ లోక యువ రాణి ఉలూచీశ్వరి, శంఖు పుత్రి యిరువురూ. చెట్టు వద్ద ఆగటం కూడ చూసారు. ఉలూచీశ్వరి ఆనందానికి హద్దు లేదు.

ధనుంజయుని గుర్తించారు గాని పక్కన మచ్చల గుర్రం మీది పురుష వేషంలో భద్రా దేవి ఎవరో అర్థం కాలేదు. అతడెవరో బాలకుడనుకున్నారు. ధనుంజయుడు ఒంటరిగా ఉంటేనే ఉలూచీశ్వరి అతన్ని కలుసుకో గలదు. పక్కన మరో పురుషుడుండగా ఎలా ముందుకెళ్ళేది.

‘‘అత్తా! ఇప్పుడేమి చేయ వలె?’’ అంటూ బేలగా తనను అడుగుతున్న ఉూచీశ్వరిని చూసి నవ్వింది శంఖు పుత్రి.

‘‘ఈ సంకోచమేలనమ్మ ఉలూచి. ప్రేమికులకు సిగ్గు భయము ఉండవంటారు గదా. అవి నిన్ను వదిలినట్టు లేదే. ఎదురు చూసిన శుభ ఘడియలు రాగానే ఇలా బెదురు యేల?’’ అంది

‘‘ఇది బెదురు కాదులే అత్తా. ధనుంజయుల వారి పక్కన మరో పురుషుడున్నాడు. వారి ముందుకెలా పోగలను?’’ అంది ఉలూచీశ్వరి.

‘‘నీవు పోనవసరము లేదు. జగదేక సుందరివి నిన్ను వెతుకుచూ తనే వచ్చును. ఏదో విధముగ ఆ బాలకుడ్ని నేను ఆపెదను. నీవు త్వరితముగ కొంత దూరము ఎగవకు పొమ్ము. బాట పక్కనున్న పొన్న చెట్టు క్రింద అతడి రాక కోసం ఎదురు చూడుము. పొమ్ము.’’ అంది శంఖు పుత్రి. వెంటనే ఉలూచీశ్వరి తన సహజ రూపమైన శ్వేత నాగుగా మారి బిర బిరా ఎగువకు వెళ్ళి పోయింది. ఇక ధనుంజుయునికి ఎదురు వెళ్ళుటకు ఇటు బయలు దేరింది శంఖు పుత్రి.

*****************************

అశ్వాలు జముగా పరుగు తీస్తున్నాయి.

తన సంశయం తీరక ఉక్కిరి బిక్కిరవుతున్న ధనుంజయుడు భద్రా దేవి వంక చూసాడు. ‘‘దేవీ! యోచన యందు నీయంత చురుకు దనము నాకు లేదు గాని ఆ శవాల గుట్టు విప్పవా? నాకు కావలసిన వారే ఆ పని జేసి నారన? ఎవరు వారు?’’ అనడిగాడు.

ముసి ముసిగా నవ్వింది భద్రా దేవి.

దిన కరుని పసిడి కిరణాలకు మరింత శోభాయమానంగా ప్రకాశిస్తోంది ఆమె ముఖారవిందం. ఆమె పగడాల అధరాల మీద మురిపించే దర హాసమునకు మరింత ఉడుక్కున్నాడు ధనుంజయుడు.

‘‘ఆ నవ్వునకర్థమేమి? నాకు చెప్ప కూడదా?’’ అనడిగాడు.

‘‘చెప్పుటకేమున్నది ప్రభూ! మీ హృదయ రాణి ఉలూచీశ్వరిని మరచితిరా?’’ అంది.

‘‘అది యేమి పరిహాసము. నీవు మాత్రము నా హృదయ రాణివి గాదా? అయినను పరిచయమే లేని ఆమె ప్రస్తావన ఇప్పుడేల?’’

‘‘ఇప్పుడు పరిచయమగునులే.’’

‘‘ఇప్పుడా... అసంభవము గదా. ఎక్కడో ఢాకినీ వనమున ఆమెను గాంచితి. ఆమె ఈ వింధ్యాటవికేల వచ్చును.’’ 

‘‘ఏమి? రాకూడదా? నేను రాలేదా? వలచిన వనిత జంట కోరి ఎంతటి దూరమైనను రాగలదు. ఎంతటి సాహసమైనను వెను దీయదు. నా అంచనా తప్పదు ప్రభు. ఆమె మనకు సమీపం లోనే వున్నది...’’

అప్పటి గ్గాని భద్రా దేవి అభిప్రాయం ఏమిటో ధనుంజయునికి అర్థం కాలేదు. సంభ్రమాశ్చర్యాలకు గురై పరిసరాల మీద దృష్టి సారించాడు. ‘‘అంటే... ఆ గూఢ చార బృందం ఆరుగుర్నీ ఉలూచీశ్వరి పరి మార్చి వుంటుందంటావా?’’ అనడిగాడు.

‘‘అవును ప్రభు. మీ రాక కోసం ఆమె కూడ ఈ పరిసరాలలోనే నిరీక్షిస్తుండగా ఆ ముష్కరుల్ని గమనించి ఉంటుంది. వారు మీకు శత్రువులని గ్రహించి అంతం జేసి వుండును.’’

‘‘నీ మాటలు నిక్కమైనచో ఏదీ... ఎక్కడా ఆమె కనబడదే.’’ అంటూ ఎద్దేవా చేసాడు ధనుంజయుడు. ఇంతలో`

ఎగువన తమకు ఎదురు వస్తున్న ఒక వృద్ధు రాలిని చూసారు ఇరువురూ. చూడ గానే విస్మయం చెందారు. ఎందుకంటే` కొన్ని లిప్తల క్రితం వరకు నిర్మానుష్యంగా వున్న బాట మీదకు ఇప్పటి కప్పుడు ఆ పండు ముసలి ఎప్పుడు ఎలా వచ్చిందో అర్థం కాలేదు. క్రమంగా ఆమె తమను సమీపిస్తోంది.

శతాధిక వృద్ధురాలామె. తను ముగ్గు బుట్టలా పండి పోయింది.

నడుం వంగి పోయింది.

చేతి కర్ర ఆధారంగా వంగి నడుస్తోంది.

అయినా చక్కని ముదురాకు పచ్చ చీర ధరించింది. నుదుట కుంకుమ బొట్టు, చేతులకు గాజులు, వంటి మీద నగలు ఆమెకు వింత కళను ఆపాదిస్తున్నాయి. బోసి నోరు తాటిస్తూ కళ్ళకు చేయి అడ్డం పెట్టుకుని అశ్వాల మీది ఇరువురినీ చూస్తోంది.

ఎవరా ముదుసలి?

ఆమెకు భయమే లేదా?

వంటి మీద మణి మయ ఆ భూషణాదులతో ఒక చేయి నడుం మీద ఉంచు కుని ఒక చేత్తో కర్ర తాటిస్తూ నిర్భయంగా బాట మీద వస్తోంది. వెంట ఎవరూ లేరు. తమ కళ్ళను తామే నమ్మ లేనట్టు ఆమెనే చూస్తున్నారు. కాని ఆ వృద్ధు రాలి చూపు పురుష వేషంలోని భద్రా దేవి మీదే వున్నాయి. అలాగే ధనుంజయునీ చూస్తోంది.

ఎక్కడో ` నాగాల ఓజో క్షుద్ర విద్యా ప్రయోగ మందు ధూమ నాళికలో ధనుంజయుని జూసింది. ఇప్పుడు ఎదురుగా ప్రత్యక్షంగా చూస్తోంది. ద్వి శతాధిక వయస్కురాలయిన తనకే మరులూరిస్తున్న సుందరాకారుడు ధనుంజయుడు. ఇక ఉలూచీశ్వరి తొలి చూపు లోనే ఇతడ్ని వరించుటలో ఆశ్చర్యం ఏమున్నది? అనుకుంది వృద్ధ నారి రూపం లోని శంఖు పుత్రి.

అశ్వాలు తనను సమీపించటంతో `

ఉన్నట్టుంటి తన చేతి కర్రను`

మచ్చల గుర్రానికి అడ్డంగా చాస్తూ`

బాట మధ్యకు వచ్చేసింది.

‘‘ఇదిగో మనవడా! ఆగుమురా తండ్రీ. నీ కొరకు నేను వచ్చుచుండ నీవేమిరా నను జూడనట్టు పోతుంటివి. ఆగుము.’’ అంటూ బోసి నోరు తాటిస్తూ అరిచింది.

కళ్ళాలు బిగించి`

అశ్వాలు నిలిపారు ధనుంజయ, భద్రా దేవిలు. నిజం గానే అపర్ణుడిగా తిరిగే భద్రా దేవికి ఆ వృద్ధురాలు తెలుసేమో అనుకున్నాడు ధనుంజయుడు. మొదట భద్రా దేవికీ అర్థం కాలేదు. తర్వాత ఏదో సందేహం వచ్చి ధనుంజయుని వంక చూసింది.

‘‘అపర్ణా! ఈమె నీకు పరియస్థు రాలేనా?’’ అనడిగాడు ధనుంజయుడు.

‘‘అవును ప్రభూ! ఎవరో అనుకుంటిగాని ఈమె నాకు బాగుగా పరిచయమున్న బామ్మ గారే’’ అంది భద్రా దేవి.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్